Kodi Ramakrishna
-
కోడి రామకృష్ణ తల'కట్టు' వెనుక కారణం ఇదే..!
-
సినిమా కోసం భానుమతి గారి ఇంటికి వెళ్లే కానీ ..!
-
కోడి రామకృష్ణ తన జన్మస్థలం గురించి గొప్ప మాటలు
-
తండ్రి చనిపోయిన చూడడానికి పోలేదు నేను ఎందుకంటే : కోడి రామకృష్ణ
-
సినిమాలో ఆసక్తి విషయాలు చెప్పిన కోడి రామకృష్ణ
-
చిరంజీవి, ఎన్టీఆర్ గురించి దర్శకుడు కోడి రామకృష్ణ
-
సుమన్‌కి నటకేసరి
శతాధిక చిత్ర దర్శకులు దివంగత కోడి రామకృష్ణ జయంతి వేడుకలు వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందించారు. నటుడు సుమన్‌కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘కోడి రామకృష్ణగారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడమే ఈ పురస్కారాల ముఖ్యోద్దేశం’’ అన్నారు నిర్వాహకులు టి. రామ సత్యనారాయణ, వీబీజీ రాజు, కొత్త వెంకటేశ్వరరావు. దర్శకులు కార్తీక్ వర్మ దండు, రామ్ అబ్బరాజు, వెంకట్ పెదిరెడ్ల, రచయిత భాను తదితరులు పురస్కారాలు అందుకున్నారు. కోడి రామకృష్ణ కుమార్తె, నిర్మాత కోడి దివ్య పాల్గొన్నారు. -
ఘనంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్.. సుమన్‌కు జీవనసాఫల్య పురస్కారం
కోడిరామకృష్ణ.. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించారు. లెజండరీ దర్శకుడు కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను అందజేశారు. హీరో సుమన్‌కు కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. 'మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు. అయితే అయన లేకున్నా ఆయనతో ఏ విధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియజేయాలని అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తున్న రామ సత్యనారాయణ గ్రేట్' అని పేర్కొన్నారు. నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమయ్యాను. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చిదిద్దారు. యం.యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ' అని తెలిపారు. -
అందుకే డైరెక్షన్ చేయకూడదనుకున్నాను: కోడి రామకృష్ణ కూతురు
‘‘నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. నాన్న (కోడి రామకృష్ణ) ద్వారా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. మా ఆయన కూడా డైరెక్షన్ చేయమని ప్రోత్సహించారు. ఇంతలో నాన్న దూరమయ్యారు. దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు నాన్న. అటువంటిది నేను డైరెక్షన్ చేసి ఆయన పేరు చెడగొట్టకూడదని నా నిర్ణయం మార్చుకున్నాను’’ అని నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. నేడు (జూలై 8) కోడి దివ్య దీప్తి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఉన్నప్పుడే కిరణ్‌తో సినిమా చేద్దామని కథలు విన్నాను. ‘మనం పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్‌పై కనపడేలా చెయ్యాలి తప్ప వృథా చేయకూడదు’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఆ మాటలు మనసులో పెట్టుకొని ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చేస్తున్నాను. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 10న పాలకొల్లులో విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 9న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. నాకు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలంటే ఇష్టం. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. నా తర్వాతి సినిమా ఏంటనేది త్వరలో చెబుతాను’’ అన్నారు. -
కోడి రామకృష్ణ: ‘దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు’
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకునిగా తొలి అడుగు వేశారు. తరంగిణిలో రైలు చేత పాట పాడించారు. అమ్మోరులో గ్రాఫిక్స్‌ను పరిచయం చేశారు. అరుంధతిలో జేజమ్మను ప్రతిష్ఠించారు.. మానవ సంబంధాలు, దైవభక్తి, ఆధునిక గ్రాఫిక్స్... అన్నిటినీ తెలుగు వెండి తెర మీద ప్రదర్శించిన కోడి రామకృష్ణ... ఇంటి దగ్గర ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా స్నేహంగా ఉండేవారంటున్నారు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య.. కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా నాన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్‌లు రాసి ఇచ్చేవారట, పెయింటింగ్స్, మంచి మంచి స్కెచ్‌లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా బయటి వాళ్లకు పెయింటింగ్స్ వేసిన సందర్భాలున్నాయని నాన్న చెబుతుండేవారు. పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అమ్మ వాళ్లది తెనాలి. తాత (ఎ. సుభాష్) గారు సినిమాలు నిర్మించాలనే ఆసక్తితో మద్రాసు వచ్చి, ‘భారత్ బంద్’ చిత్రం నిర్మించారు. అమ్మ పేరు పద్మ. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో ఇష్టం లేకుండానే అమ్మ నటించింది. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకు న్నారు. సన్నిహితులతా కలిసి అమ్మవాళ్ల నాన్నను ఒప్పించారు. నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో అమ్మను వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక నాన్నే ఇంటి బాధ్యత తీసుకు న్నారు. నాన్నకు మేం ఇద్దరు ఆడపిల్లలం. చెల్లి పేరు ప్రవల్లిక. నేను బిబిఏ, చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్ కూడా చేశాను. నన్ను ‘దీపమ్మా’ అని, చెల్లిని ‘చిన్నీ’ అని పిలిచేవారు. ఇద్దరూ ఆడపిల్లలేనా అని ఎవరైనా అంటే నాన్నకు నచ్చేది కాదు. స్నేహితునిలా ఉండేవారు.. సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో, ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక, మమ్మల్ని కార్లో బీచ్‌కి తీసుకువెళ్లి, ఐస్‌క్రీమ్ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చేసేవారు. చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్క రోజు కూడా కోప్పడలేదు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్‌గా ఉండాలి అని నాన్నతో అన్నప్పుడు, అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేస్తుంటే, ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు. కథ ఎలా ఉంది అని అడిగేవారు.. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్‌కి ఇతర దేశాలకు మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు. ఇల్లు, షూటింగ్ అంతే. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. ఇంటి భోజనమే ఇష్టపడేవారు. అది కూడా చాలా మితంగా తినేవారు. దాసరిగారితో అనుబంధం... నానమ్మ వాళ్లు నాన్న సినిమాలలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు. మద్రాసులో దాసరి గారిని కలిస్తే, ఆయన డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నారు. ఆ ప్రకారమే డిగ్రీ పూర్తి చేశాక, దాసరిగారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారు కన్ను మూయటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన పోయినప్పుడు తట్టుకోలేక పోయారు. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు. నేను వచ్చేశాను... నా పెళ్లి కుదిరిన తరవాత, నేను అత్తవారింటికి వెళ్లిపోతానన్న దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు. నాన్నను ఓదార్చవలసి వచ్చింది. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. నాన్నకు బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాం. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, మా అమ్మ నరసమ్మ మళ్లీ పుట్టింది అని పాపాయిని ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచారు. భక్తి ఎక్కువ.. నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆరు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్లో ఉండేవారు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకున్నాకే టిఫిన్ తినేవారు. వినాయక చవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్ కొన్నారు. అప్పుడు కూడా నిర్మాత గురించే... వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యి, స్పృహలోకి వచ్చిన వెంటనే, ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్ చేశారు. నాన్న అంత్యక్రియలు స్వయంగా నేనే చేశాను. కంటిన్యూ చేస్తున్నాను.. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం చేస్తున్నాను. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసినవారు, నాన్న అభిమానులు ఉన్నారు. -
టాలీవుడ్లోకి కోడి రామకృష్ణ కూతురు ఎంట్రీ.. హీరో ఎవరంటే..
లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంటిమెంట్ – భక్తికి గ్రాఫిక్స్ జోడించి ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడాయన. అమ్మోరు, దేవి, అరుంధతి చిత్రాలు ఆ కోవలోకి వచ్చినవే. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలు రూపొందించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసురాలు సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. తొలి చిత్రానికి గాను కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు దివ్య అవకాశం ఇచ్చారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. KODI RAMAKRISHNA presents ! Kodi RamaKrishna's elder daughter @kodidivya announces her new production @KodiDivyaaEnt 's venturing into Production with @KiranAbbavaram 's #KA5 💥 A #ManiSharma Musical 🎹 Directed by #KaarthikShankar 🎬 pic.twitter.com/dgfnUkrFRg — Haricharan Pudipeddi (@pudiharicharan) July 15, 2021 -
నాన్న పేరు గుర్తుండిపోయేలా....
సినిమాని కాచి వడపోసిన వారు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలు తీసి గురువును(దాసరి నారాయణరావు) మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి శనివారం (22న). ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు దీప్తి, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది మా కోరిక. అందుకే ఆయన పేరుతో సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు తీస్తాం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా పాలకొల్లులో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నై వెళ్లి దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలందరితో పని చేశారు. తమిళ, హిందీ, కన్నడ, మల యాళ చిత్రాలకూ దర్శకత్వం వహించా రాయన. ఆయన దర్శకత్వంలో చివ రిగా వచ్చిన చిత్రం ‘అరుంధతి’. -
కోడి రామకృష్ణ కుమార్తె వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు
-
గొల్లపూడి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
-
గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని ఆయన అన్నారు. 'ఆ మధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ‘ఐలవ్యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టీ.నగర్లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహ నటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాత నుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరంజీవి అన్నారు. -
దిబ్బరొట్టె.. వదిలితే ఒట్టే
కాగితం కంటే పల్చగా.. నాన్‌స్టిక్ పెనంలో నూనె వేయకుండా కాల్చే తెల్ల దోసెలు తినడానికి అలవాటు పడిన వారికి పాలకొల్లు దిబ్బరొట్టె గురించి చెబితే కడుపు నిండిపోతుందేమో. ఇంత మందాన, ఎర్రగా కాలిన ఆ దిబ్బ రొట్టె రుచే వేరు. బొగ్గుల కుంపటిపై పాత కాలం మూకుడు పెట్టి.. అందులో పిండివేసి.. దానిపై మూతవేసి.. ఆపైన ఎర్రటి నిప్పులు వేసి దోరగా కాల్చే మినప రొట్టెను ఓసారి రుచి చూస్తే.. లొట్టలేసుకుని మరీ తినాల్సిందే. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి పాలకొల్లు పేరు చెప్పగానే గుర్తొచ్చేది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరా రామలింగేశ్వరస్వామి క్షేత్రం. ఈ ప్రాంతం ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మస్థానం. నిప్పులపై కాల్చే మినప దిబ్బరొట్టెకూ పాలకొల్లు ప్రసిద్ధి. దీనిని ఒక్కసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. ఇతర జిల్లాల నుంచి పాలకొల్లు వచ్చే ప్రతి ఒక్కరూ ‘పాలకొల్లు దిబ్బరొట్టె దొరికేదెక్కడ’ అని అడ్రస్ అడిగి మరీ వెళ్లి తింటుంటారు. పట్టణంలోని మారుతి థియేటర్ క్యాంటీన్లో కాల్చే దిబ్బరొట్టె గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. చింతామణి చట్నీ (శనగ పిండిని ఉడికించి.. తాలింపు వేసిన చట్నీ)తో ఆ రొట్టెను తింటే నాలుక చిమచిమలాడాల్సిందే. ఇలా కాలుస్తారు.. ముందుగా బొగ్గుల పొయ్యి (కుంపటి)లో బొగ్గులను వేసి నిప్పు రాజేస్తారు. దానిపై పాత కాలం నాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేస్తారు. ఆ తరువాత రవ్వ కలిపిన మినప పిండిని వేసి దానిపై మూత పెడతారు. ఆ మూతపై మరికొన్ని నిప్పులు వేసి రొట్టెల్ని కాలుస్తారు. ఒక్కో రొట్టె కాలడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. వారంతా రుచిచూశారు.. పాలకొల్లు వచ్చిన ఏ సినిమా నటుడైనా మారుతీ హాల్ క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. ఈ థియేటర్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు చెందినది. ఆయన పాలకొల్లులో ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున సినిమా నటులు హాజరయ్యేవారు. వారంతా ఇక్కడి దిబ్బరొట్టెను లొట్టలేసుకుని తినేవారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ధవళ సత్యం, రవిరాజా పినిశెట్టి వంటి వారంతా ఈ దిబ్బరొట్టె రుచి చూసిన వారే. నిత్యం 500 రొట్టెలకు పైనే.. ప్రతిరోజూ ఇక్కడ సుమారు 30 కేజీలు మినప్పప్పు నానబెడతారు. రోజుకు 500 రొట్టెలు పైనే అమ్ముతుంటారు. ఒక్కో రొట్టె ధర రూ.30. సగం రొట్టె ధర రూ.15. బొగ్గుల పొయ్యి (నిప్పుల కుంపటి) పైనే వీటిని కాలుస్తారు. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకూ ఎప్పుడు చూసినా 20 పొయ్యిలపై వీటిని కాలుస్తూనే ఉంటారు. రొట్టె తినాలంటే నిప్పులపై కాలేవరకూ కనీసం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. సెల్ఫ్ సర్వీస్ కావడం వల్ల ఈ క్యాంటీన్‌కు వచ్చే ప్రముఖులు, సామాన్యులు సైతం కార్లలోను, రోడ్డుపైనే నిలబడి భుజిస్తుంటారు. ఇప్పుడు పాలకొల్లులో వివిధ ప్రాంతాల్లో దిబ్బరొట్టె తయారు చేసే హోటళ్లు వెలిశాయి. అయితే, మారుతీ క్యాంటీన్లో వేసే దిబ్బరొట్టెకు ఉన్నంత గుర్తింపు వీటికి దక్కలేదు. ఆరు దశాబ్దాల చరిత్ర మారుతి థియేటర్ నిర్మించి 60 సంవత్సరాలు దాటింది. అప్పటినుంచీ ఇక్కడ దిబ్బరొట్టె ప్రాముఖ్యత సంతరించుకుంది. మా చిన్నతనంలో రొట్టెను నాలుగు ముక్కలు చేసి అమ్మేవారు. ఈ క్యాంటీన్‌ను 8 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాను. ఇక్కడి రొట్టెకు గల ప్రాముఖ్యత దృష్ట్యా దిబ్బరొట్టెల్ని వేస్తూనే ఉన్నాం. – మట్టా విజయభాస్కర్, క్యాంటీన్ యజమాని -
కోడి రామకృష్ణ కుమార్తె నిశ్చితార్ధ వేడుక
-
కోడి–సినీమా జీవనాడి
కోడి రామకృష్ణతో నా జ్ఞాపకాలు బహుశా అనితర సాధ్యమైనవి. కోడి నా దగ్గరికి వచ్చేనాటికి (1981) హైస్కూలు ఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలాగ ఉండేవాడు (ఫొటో). ‘ఇతనా కొత్త దర్శకుడు!’ అని మనసు కాస్సేపు శంకించిన మాట వాస్తవం. చాలా మొహ మాటస్తుడు. ఎప్పుడూ ఎవరినీ నొప్పించని మన స్తత్వం. అలాంటి ఆలోచన వస్తే తనే అక్కడి నుంచి తొలగిపోతాడు. ఆ రోజుల్లో నాకు బోలెడంత తీరిక. కొన్ని నెలలపాటు పొద్దున్నే వచ్చి రాత్రి నేను అమృతం సేవించి భోజనం చేసేదాకా కూర్చునేవాడు. ఏం చేసేవాడు? ఏదో చేసేవాడు– పిల్లలతో కబుర్లు చెప్తూనో, మరేదో. నా పనిపాటల్లో నవ్వుతూ పాలు పంచుకునేవాడు. నాకు కడప బదిలీ అయితే ఎన్నోసార్లు నాతో వచ్చాడు. నేను రేడియోలో ఆఫీసర్ని. ప్రతీ ఆదివారం చెన్నైలో బొంబాయి మైలు ఎక్కి సెకెండు క్లాసు కంపార్టుమెంటులో ఇద్దరం గుమ్మందగ్గర బయటికి కాళ్లు జాపుకు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాతో అప్పుడప్పుడు కథా చర్చ. జరపకపోతే అడిగేవాడు కాదు. నన్ను ఇబ్బంది పెట్టని ఒక్క కారణంగానే– సరదాగా– అలవోకగా– ఆడుతూ పాడుతూ రెండు కథలు రెడీ చేశాం. కథ ఎవరివో ఒప్పించాలని కాదు. మేం ఒప్పుకోవాలని. (ఆ రెండు కథలూ చరిత్ర. రెండో కథ– ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిస్తే– ‘తరంగిణి’ తేలికగా సంవత్సరం నడిచింది) రెండో కథ, మొదటి కథ కావడానికి కారణం– ‘తరంగిణి’ చేయడానికి దర్శకుడి వెన్ను ముదరాలని భావించాం కనుక. రామకృష్ణ మెదడు పాదరసం. అతని గురువు గారి దగ్గర పుణికి పుచ్చుకున్న గొప్ప లక్షణం– నటుడికి ప్రత్యేకతనివ్వగల పాత్రీకరణ పుష్టి. ఇది చాలామంది దర్శకులకి లేదు. ప్రయత్నించినా రాదు. ఇందులో నిష్ణాతుల పేర్లు రెండు చాలు– సత్యజిత్ రే, మణిరత్నం. మొదటి చిత్రం రిలీజు నాటికే అతను స్టార్ డైరెక్టర్. నేను స్టార్‌ని. మరెందరో కొత్త నటు లకి– టైలర్ కృష్ణ, అశోక్ కుమార్ లాంటి వారికి ప్రాణం పోశాడు. కొత్త ఆలోచన వస్తే చుట్టూ అమోఘంగా అల్లు కునే అందమైన సాలెగూడు అతని మెదడు. కెమెరా ముందు నటుడి దమ్ముని గుర్తుపడితే– రామకృష్ణ గోమతేశ్వరుడయిపోతాడు. పూచిక పుల్లని పవిత్ర మైన దర్బని చేస్తాడు. కాగా, వ్యక్తిగా రామకృష్ణ బ్రతక నేర్చినవాడు. చాలామందికి తెలియదు. అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. లేకపోతే అతని ప్రతిభకీ, తొలి నాళ్లలో అతనికి వచ్చిన అవకాశాలకీ ఆకాశంలో ఉండవలసినవాడు. తన పరిధిలో ‘తను’ ముఖ్యం. దానిని సంపాదించుకోడు. ఆ ‘పరిధి’ని తన హక్కుగా చేసుకుంటాడు. అదీ అతని Creative Volcano. అతను దర్శకుడిగా స్థిరపడటానికి బేషరతుగా నా వాటాని పుంజుకుంటూనే నేను నటుడిగా స్థిరపడ టానికి అతని వాటాని బంగారు పళ్లెంలో పెట్టి సమ ర్పిస్తాను. తన చుట్టూ ఎప్పుడూ ముసురుకునే నా కొడుకుల్లో శ్రీనివాస్‌ని దర్శకత్వ విభాగంలోకి లాగి నవాడు కోడి. మొదటి రోజుల్లో ‘వాసూ గారూ’ అనే వాడు ఆ కుర్రాడిని. నేను కోప్పడితే పద్ధతి మార్చు కున్నాడు. అతని శిష్యుడు గురువుగారికంటే పాతికేళ్లు ముందే వెళ్లిపోయాడు. అందమైన ఆలోచనకి వెండితెరమీద రేంజ్‌ని ఇవ్వగల పనివాడు. నేను రాసిన డైలాగుల్ని నాకంటే బాగా అలంకరించుకున్న దర్శకుడు. కానీ ప్రతిభని ఏనాడూ తలకెత్తుకోడు. నేనూ, మా ఆవిడన్నా భక్తి. ‘ఇంట్లో రామయ్య...’కి 30 పైగా సెన్సార్ కట్స్ వస్తే జ్వరంతో తేనాంపేటలో చిన్న గదిలో దుప్పటి కప్పుకు పడుకున్న అతన్ని నేనూ మా ఆవిడా వెళ్లి లేపి ధైర్యం చెప్పాం. ఏం సినీమా అది! అప్పటికి పది సినీమాలు తీసినంతగా దర్శకుడిలో ‘పదును’ సంధించిన ఇట్ఛ్చ్టజీఠ్ఛి Vౌ ఛ్చిnౌ అది. అందులో లేచిన పెద్ద లావా సెల– ‘దటీజ్ సుబ్బారావ్!’ రాత్రిళ్లు షూటింగులూ, అకాల భోజనాలతో ఆరోగ్యాన్ని ఎక్కువగా దుబారా చేసుకున్నవాడు. మరికొంతకాలం ఉంటే తెలుగు చలన చిత్ర రంగంలో సమగ్రమైన దర్శకత్వ ప్రతిభకి, తనదైన బాణీకి విలాసంగా నిలిచేవాడు. చిన్నవాడు. అతనికి నేను నివాళి అర్పించేరోజు వస్తుందని అనుకోలేదు. పదికాలాలపాటు ఉండవల సినవాడు. పదికాలాలు నిలిచే మౌలిక కృషికి తోట మాలి. మృత్యువుకి ఓ దుర్మార్గం ఉంది. మన్నికయిన ప్రతిభకి అర్ధంతరంగా ముగింపురాసి చేతులు దులు పుకుంటుంది. మృత్యువుకి లొంగకపోతే రామకృష్ణ తెలుగు సినీమాకి కొండంత ఉపకారం చేయగల దక్షత, దమ్ము ఉన్నవాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!
-
బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మరోసారి తన తెలుగు ప్రావీణ్యంతో ఆయన వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయనికి నివాళులర్పించిన బాలయ్య.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. అయితే గతంలో తన సోదరుడు నందమూరి హరికృష్ణ మరణంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యానన్న బాలయ్య.. ఇప్పుడు కోడిరామకృష్ణ మరణం ఏకంగా యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చరాల్లో ముంచెత్తిందని వ్యాఖ్యానించారు. హరికృష్ణ మృతిపై చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో దుమారం సృష్టించగా.. తాజా వ్యాఖ్యలు బాలయ్యను మరింత అబాసుపాలు చేస్తున్నాయి. ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఏంటి బాలయ్య అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘లోకేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఇప్పుడు అర్థమైంది.. అన్ని మేనమామ పోలికలే’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. (చదవండి: బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్!) ఇంతకీ బాలయ్య ఏమన్నాడంటే.. ‘కోడి రామకృష్ణ మనతో లేరనే సంగతి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. భూమి మీద చాలమంది పుడ్తారు గిడ్తారు. మరణాణంతరం శాశ్వతంగా అందరి గుండెల్లో నిలిచిపోతారో.. అటువంటి జన్మకు ఓ పరిపక్వత.. ఓ సార్థకం. ఆ కోవకు చెందిన వారే కోడి రామకృష్ణ. ఆయన లేరన్నది నమ్మలేక పోతున్నాం. ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమలో తీర్చనది.’ అని భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి : మహానాయకుడి పరిస్థితి మరీ దారుణం) చదవండి: వైరల్: బుల్బుల్ బాలయ్య..! -
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు
-
‘ఏనాడు ఆయనలో గర్వం చూడలేదు’
శుక్రవారం మరణించిన టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ మృతదేహానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణతో పాటు దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, జగపతిబాబు, సంగీత దర్శకుడు కోటి లాంటి వారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 100కు పైగా చిత్రాలను తెరకెక్కించినా కోడి రామకృష్ణలో ఏనాడు గర్వం చూడలేదన్నారు రాఘవేంద్ర రావు. దాసరి గారి తరువాత అత్యథిక చిత్రాలకు డైరెక్ట్ చేసిన దర్శకుల జాబితాలో కోడి రామకృష్ణ ముందుంటారని, గురువు బాటలోనే ఆయన కూడా ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. -
దర్శక దిగ్గజానికి పలువురి నివాళి
-
గోదావరివాసులను కలచి వేసిన ‘కోడి రామకృష్ణ’ మరణవార్త
చిత్రాల దర్శకుడు ఆయన. ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’గా తొలి చిత్రంతో గుర్తింపు సాధించారు. ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మామయ్య’, ‘ముద్దుల మేనల్లుడు’లను తెలుగు తెరకు పరిచయం చేయడమే కాదు.. ‘శ్రీనివాస కల్యాణం’ను ‘పెళ్లి పందిరి’లో ‘భలేదంపతుల’ సాక్షిగా.. ఎలా జరిపించాలో కూడా తీసి చూపించారాయన. ‘మధురానగరి’లో ‘చిలకపచ్చ కాపురాలు’ ఉంటాయని చెప్పారు. ‘పెళ్లి’లో ‘తలంబ్రాలు’ విశిష్టతను వివరిస్తూ ‘పుట్టింటికి రా’ చెల్లి అని ఆహ్వానం పలకడమూ ఆయనకే చెల్లింది. ‘20వ శతాబ్దం’లో తనదైన మార్కు చూపించాలని ‘అంకుశం’తో అదరగొట్టి.. ‘ఆహుతి’తో ఆకట్టుకుంటూ దర్శకత్వంలో ఆయనకు ఉన్న పవర్ చూపారు. ‘దేవీ’ దీవెనలతో ‘అమ్మోరు’ ఆశీస్సులతో ‘అంజి’ అని ‘పిలిస్తే పలుకుతా’ అని అందరి హృదయాలోనూ ‘మా పల్లెల్లో గోపాలుడు’ అని అనిపించుకున్నారు. ‘స్టేషన్ మాస్టర్’లోనే కాదు.. ‘రిక్షావోడు’లోనూ సత్తా ఉంటుందని చెప్పగలిగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అని గట్టిగా చెప్పడమే కాదు..‘మా ఆవిడ కలెక్టర్’ అంటూ మహిళా ప్రేక్షకులకు దగ్గరైన ‘దేవీపుత్రుడు’ ఆయన. ‘దొంగాట’ను ఆడించడమే కాదు.. అజాత ‘శత్రువు’గాను సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవుళ్లు’ సాక్షిగా ‘అరుంధతి’ని తెరంగేట్రం చేసిన ఘనత ఆయనదే. ఆయనే ప్రముఖ శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. శుక్రవారం ఆయన మృతి చెందడం ‘తూర్పు’వాసులను కలచివేసింది. ఈనేపథ్యంలో జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం కల్చరల్: శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరన్న వార్త విన్న గోదావరి శోకసంద్రమైంది. తెలుగు సినీరంగంలో ఎన్నో వినూత్న చిత్రాలకు సారధ్యం వహించిన కోడి రామకృష్ణ అనేక హిట్ సినిమాలకు ఈ జిల్లాలో ప్రాణప్రతిష్ట చేశారు. గోదావరికి ‘అద్దరిన’ ఉన్న పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణకు చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉండేది. పాలకొల్లులో లలిత కళాంజలి సంస్థ ద్వారా నాటకాలను ప్రదర్శించేవారు. దాసరి ప్రోత్సాహం దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు కోడి రామకృష్ణలోని టాలెంట్‌ను గుర్తించారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రానికి కోడి రామకృష్ణను సహాయదర్శకుడిగా ఎంపిక చేశారు. స్వర్గం–నరకం చిత్రంలో ఒక పాత్రను పోషించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో అమ్మోరు, ఆలయ శిఖరం, జైలు పక్షి, దేవి, పెళ్లాం చెబితే వినాలి, పోలీస్ లాకప్, భారత్ బంద్, మంగమ్మగారి మనుమడు, మా పల్లె గోపాలుడు, ముద్దుల మామయ్య, శ్రీనివాస కల్యాణం మొదలైన సినిమాల షూటింగ్ కొంతభాగం జిల్లాలోనే జరిగింది. సందేశాత్మక చిత్రాలను వినోదంతో మేళవించి, జనరంజకం చేయడం ఆయన బాణీగా నిలిచిపోయింది. ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య పాత్రలో గొల్లపూడి మారుతీ రావుతో అద్భుతమైన శాడిస్టు పాత్రను కోడి రామకృష్ణ ధరింపజేశారు. రాయవరంతో అనుబంధం రాయవరం (మండపేట): ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణకు రాయవరంతో అనుబంధం ఉంది. కోడి రామకృష్ణ 1998 ఏప్రిల్ 27న రాయవరంలోని సాయితేజా విద్యానికేతన్ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో రామచంద్రపురం, కోటిపల్లిలో ‘పెళ్లికానుక’ సినిమా షూటింగ్‌ను నిర్వహించారు. షూటింగ్ నుంచి వార్షికోత్సవానికి వచ్చిన కోడి రామకృష్ణ రాయవరంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రముఖ సినీ రచయత పైడిపాలతో కలిసి కోడి రామకృష్ణ రాయవరం వచ్చారు. సినీ నటుడు జగపతిబాబుతో కలిసి కోడి రామకృష్ణ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. కోడి రామకృష్ణ మంచి స్నేహశీలి అని సాయితేజా విద్యానికేతన్ కరస్పాండెంట్ కర్రి సూర్యనారాయణరెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1984లో సినిమా షూటింగ్ సందర్శంగా హీరో బాలకృష్ణ, నర్సరీ అధినేత పల్ల వెంకన్నలతో దర్శకుడు కోడి రామకృష్ణ ఆయన మరణం తీరని లోటు కాకినాడ రూరల్: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం అకాలమరణంతో కాకినాడకు చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత కోకా సాయిప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణతో ఆయనకున్న పరిచయాన్ని ఇలా వివరించారు. ‘‘1994లో మద్రాస్ రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మిం టెక్నాలజీ డైరెక్షన్ డిపార్టుమెంట్లో శిక్షణ తీసుకున్న అనంతరం నేను ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణను హెదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆశ బారెడు, ఆస్తిమూరెడు సినిమా షూటింగ్ సమయంలో రామకృష్ణను కలిశాను. మరుక్షణం నాకు దర్శకత్వంలో అన్నిశాఖల్లో తర్ఫీదు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అది ఆయన గొప్పతనం అనారోగ్యంగా ఉన్న కోడి రామకృష్ణను పలకరించేందుకు 2018లో హైదరాబాద్ ఫిల్మినగర్‌లో కోడిరామకృష్ణ స్వగృహంలో కలిశాను. 24 ఏళ్ల తరువాత కలిసి గతంలో జరిగిన పరిచయాన్ని గుర్తుచేస్తే అంతే ఆత్మీయంగా పలకరించడం నేను మరచిపోలేని మధురానుభూతిగా భావిస్తున్నా. ఎలాంటి వారినైనా ఎంతో ఆత్మీయం పలకరిస్తూ తనదైన శైలిలో మనసులో నిలుపుకొనేంత ప్రేమను పంచడం కోడి రామకృష్ణ కే దక్కుతుంది. అటువంటి మహోన్నత వ్యక్తి మనకుదూరం అవ్వడం సినీలోకానికి తీరని లోటు.’’ అని తెలిపారు. గొప్ప దర్శకుడిని కోల్పోయాం :రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజ్‌కుమార్ కొత్తపేట: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతితో గొప్ప తెలుగు సినీ దర్శకుడిని కోల్పోయామని ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్ అన్నారు. ఆయనతో తనకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయని, అనేక సందర్భాల్లో, అనేక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నానని తెలిపారు. ఆయన మృతి ఒక్క తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమలకు తీరని లోటన్నారు. అతికొద్దిమంది దర్శక దిగ్గజాల్లో కోడి రామకృష్ణ ఒకరని, ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు సూపర్, డూపర్ హిట్ కాగా ఆయా సినిమాల్లో నటించిన ప్రధాన, సహాయ నటులకు సైతం మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. అలాగే ఎంతో మంది నూతన నటులకు ఆయన అవకాశాలు కల్పించి, ప్రోత్సహించారన్నారు. వారు నేడు గొప్ప నటులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారన్నారు. రామకృష్ణ తనకు మంచి వ్యక్తిగత మిత్రుడని, ఆయన లేరంటే ఎంతో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నామన్నారు. కడియం నర్సరీలతో అనుబంధం కడియం: శతచిత్రాల దర్శకుడిగా తనదైన శైలిలో కోడి రామకృష్ణ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సిని షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందిన కడియం పల్ల వెంకన్న నర్సరీలో 1984లో బాల కృష్ణ హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి మనవడు సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణతో స్థానిక నర్సరీ రైతులకు ఎంతో పరిచయం ఏర్పడింది. ఇక్కడి రైతులను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని స్థానిక రైతులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నర్సరీ అధినేత పల్లవెంకన్న తోపాటు పలువురు నర్సరీ రైతులు దర్శకుడు రామకృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, సినీ రంగానికి ఆయన లేని లోటు తీరనిదన్నారు. -
ఇంట్లో రామయ్య.. ఇక లేరయ్య
పశ్చిమగోదావరి, పాలకొల్లు టౌన్/పాలకొల్లు అర్బన్: కళామతల్లి ముద్దు బిడ్డ, క్షీరపురి ఆణిముత్యం, ప్రముఖ సినీ డైరెక్టర్ కోడి రామకృష్ణ శుక్రవారం తుది శ్వాస విడిచారు. దీంతో జిల్లా శోకసంద్రమైంది. పేదరికంలో పుట్టిన కోడి రామృష్ణ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. పట్టణంలోని ఎంఎంకేఎన్ మునిసిపల్ హైస్కూల్ సెకండరీ ఫోరం చదివి, ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి కుంచె చేత పట్టి బ్యానర్లు రాసేవారు. బాల్యంలోనే ముఖానికి రంగు పూసుకుని ఎన్నో నాటకాలు స్వయంగా రచించి, ప్రదర్శించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద శిష్యరికం చేసి వంద సినిమాలకు దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు కోడి నరసింహులు–చిట్టెమ్మ దంపతులకు రామకృష్ణ మొదటి సంతానం. ఆయన సోదరులు లక్ష్మణరావు సినీ కెమెరామెన్‌గానూ మరో సోదరుడు వెంకన్న ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసి ఇటీవల మృతిచెందారు. సినీ రంగ ప్రవేశం కోడి రామకృష్ణ 1975లో ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. అప్పట్లో అతని మిత్రబృందంతో కలిసి నాటికలు ప్రదర్శిస్తూ లలిత కళాంజలి నాటక సమాజాన్ని స్థాపించారు. ఆ బ్యానర్‌పై అనేక పరిషత్‌ల్లో నాటకాలు ప్రదర్శించి బహుమతులు అందుకున్నారు. ‘రథచక్రాలు, రేపు సెలవు’ తదితర నాటకాలు ఆయన స్వీయ రచనలు కాగా, ‘సుడిగుండాలు’లో ఏకపాత్ర ద్వారా ప్రజల్ని మెప్పించారు. సినీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య ‘పల్లెపడుచు’ నాటకాన్ని కమర్షియల్ నాటకంగా ప్రదర్శించేవారు. ఈ నాటకంలో కోడి రామకృష్ణ బాల నటుడిగా రంగస్థలం ప్రవేశం చేసి గోపి పాత్రలో నటించారు. సినిమారంగంపై మమకారంతో మద్రాసు వెళ్లి పాలకొల్లుకి చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. 1983లో ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య సినిమాకి దర్శకత్వం వహించి బంపర్ హిట్ కొట్టారు. వందకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. లలిత కళాంజలి వ్యవస్థాపకుడిగా.. పుట్టిన గడ్డపై మమకారం, కళలపై తనకున్న అభిరుచి కారణంగా 1983లో లలిత కళాంజలి నాటక అకాడమీని స్థాపించారు. దక్షిణ భారత స్థాయిలో నాటక పోటీలు ఏకధాటిగా 33 సంవత్సరాలు నిర్వహించారు. సినీ ప్రముఖులను పాలకొల్లు తీసుకువచ్చి ఏటా సత్కరించేవారు. ఇలా సత్కారం పొందిన వారిలో దాసరి నారాయణరావు, డి రామానాయుడు, కృష్ణ, జయసుధ, జయప్రద, డా.మోహన్‌బాబు తదితరులున్నారు. ఎంత ఎదిగినా.. లలిత కళాంజలి నాటక అకాడమీ ఆధ్వర్యంలో దర్శకుడు కోడి రామకృష్ణ, అతని స్నేహితులు, ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘మా ఇంటికి రండి’ సినిమాను సుమారు 20 ఏళ్ల క్రితం పాలకొల్లు, పోడూరు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ సినిమా నిర్మాతగా వాకాడ అప్పారావు, సినీ హీరోగా కోడి రామకృష్ణ నటించారు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన గాదిరాజు సుబ్బారావు, తాళాబత్తుల వసంతరావు, లక్కింశెట్టి నాగేశ్వరరావు, సారిక రామచంద్రరావు, హనుమాన్రెడ్డిలకు ఆ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య, చిలక పచ్చకాపురం, పుట్టింటికి రా చెల్లీ తదితర సినిమాలను పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని.. కోడి రామకృష్ణ కళాశాలలో చదివే రోజుల్లో కల్చరల్ డిపార్టుమెంట్‌కి సెక్రటరీగా పనిచేశారు. ఆ రోజుల్లో జై ఆంధ్ర ఉద్యమం జోరుగా సాగింది. ఆ సమయంలో కోడి రామకృష్ణ జై ఆంధ్ర ఉద్యమంలో పాలు పంచుకుని జైలు జీవితం గడిపారు. రామకృష్ణ మృతి.. తీరని లోటు దెందులూరు: శత చిత్రాల దర్శకుడు, జిల్లా వాసి కోడి రామకృష్ణ ఆకస్మిక మరణం బాధించిందని ఉషా సంస్థల అధినేత డాక్టర్ వీవీ బాలకృష్ణారావు, అన్నపూర్ణ సినీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎంపీపీ కొడాలి ఆంజనేయ చౌదరి తెలిపారు. కొవ్వలిలో ఆయన మాట్లాడుతూ అందరితో నవ్వుతూ మంచిగా ఉండే రామకృష్ణ ఆకస్మిక మరణం వ్యక్తిగతంగా తమకు, చిత్రపరిశ్రమకు తీరని నష్టమన్నారు. అనేక సాంఘిక, పౌరాణిక, రాజకీయ, విభిన్న చిత్రాలతో రామకృష్ణ తనదైన శైలిలో ముద్రవేశారన్నారు. సత్యసాయిబాబా సినిమా పూర్తికాకుండానే.. జంగారెడ్డిగూడెం రూరల్: కోడి రామకృష్ణ మృతి జంగారెడ్డిగూడెం మండల ప్రాంత ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో కరాటం రాంబాబు నిర్మిస్తోన్న శ్రీ సత్యసాయిబాబా సినిమాకు సంబంధించి అనేక సన్నివేశాల చిత్రీకరణ 2012లో జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని 150 సంవత్సరాల పురాతన లోగిలిలో జరిపారు. ఈ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఆయన ఆ సినిమాలో నటించే అవకాశం కూడా ఇచ్చారు. వారంతా ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. కోడి రామకృష్ణతో కలిసి నటించా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నాటక పరిషత్‌లు నిర్వహించే వాడిని. ఆ సమయంలో కోడి రామకృష్ణతో కలిసి నాటకం ఆడా. అలాగే దాసరి నారాయణరావుకి రామకృష్ణను పరిచయం చేసినవారిలో నేను ఒకర్ని. సినిమా రంగంలో బిజీ జీవితాన్ని గడుపుతూ కూడా రామకృష్ణ ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఆ సమయంలో రామకృష్ణతో ఎక్కువ అనుబంధం ఉండేది.– వంగా నరసింహరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నా షెడ్డుకు వచ్చి టీ తాగేవారు పాలకొల్లు పట్టణంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌కి ఎదురుగా నా కారు మెకానిక్ షెడ్డు ఉంది. లలిల కళాంజలి నాటకోత్సవాల్లో భాగంగా ఏటా నా కారు షెడ్డు వద్దకు వచ్చి కూర్చునేవారు. ఓ టీ తాగి సేద తీరేవారు. అదే పరిచయంతో మద్రాసు వెళ్తే ఎంతో ఆప్యాయంగా సకల మర్యాదలు చేసేవారు. ఆయనతో ఉన్న స్నేహంతో నా కుమారుడ్ని సినిమా రంగానికి పంపించా. రామకృష్ణ మృతి చాలా బాధ కలిగించింది. – ఏకుల బాబూ రాజేంద్రప్రసాద్, స్నేహితుడు అరమరికలు లేకుండా ఆదరించేవారు పుట్టింటికి రా చెల్లీ సినిమాకి కోడిరామకృష్ణ గారితో కలిసి 22 రోజులు పనిచేశాను. పాలకొల్లు అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆ అభిమానంతో మమ్మల్ని చాలా బాగా ఆదరించేవారు. చిన్న, పెద్ద తేడా లేకుండాఅందర్నీ ఆప్యాయంగా, కలుపుగోలుతనంగా పలకరించేవారు. ఆయన మృతి ఎంతో బాధ కలిగించింది.– వంటపాటి నాగరాజు, జూనియర్ ఆర్టిస్ట్ సఫ్లై దారుడు సత్య సాయిబాబా సినిమా ఆగిపోయింది శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటు. శ్రీ సత్యసాయిబాబా జీవిత చరిత్ర నేను నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ప్రారంభించాను. దాదాపు 60 శాతం చిత్ర నిర్మాణం పూర్తయ్యింది. కొద్ది నెలలుగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. రామకృష్ణ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.– కరాటం రాంబాబు, సినీ నిర్మాత -
దర్శక దిగ్విజయుడు
శిష్యగణంగా ఉండటం అంటే ఏమిటో, శిష్యగుణం కలిగి ఉండటం అంటే ఏమిటో తెలిసిన చివరి తరం ప్రతినిధి నిష్క్రమించాడు. ఇళ్లల్లోని కథలు కనిపెట్టి, ఇంటి మనుషుల పాత్రలను సానబట్టి డ్రామా పండించడం నేర్చిన నేటివ్ స్టోరీ టెల్లర్ వీడ్కోలు తీసుకున్నాడు. చెడు చేసే పెద్ద మనుషులను, దుష్ట రాజకీయవేత్తలను పదే పదే చూపించి జాగ్రత్త సుమా అని హెచ్చరించిన మేలుకొలుపు దివిటీధారి మరలి వెళ్లిపోయాడు. ఎందరో నటులకు జీవితం ఇచ్చి, ఎందరో నటులకు డైలాగ్ ఇచ్చి, ఎందరో నిర్మాతలకు సినీ జీవితం ఇచ్చి ఒకటి కాదు రెండు కాదు వందకు పైగా సినిమాలు తీసి కూడా నిరాడంబరంగా ఉండే ఒక సాంకేతిక విశిష్టుడు చివరి ఊపిరి వదిలాడు. విద్య ప్రదర్శించేవాడు కాదు, విద్యను కొనసాగించేవాడే విజేత అని నూటికి పైగా సినిమాలు తీసి కూడా సూపర్ హిట్లు ఇచ్చి నిలిచిన దర్శక దిగ్విజయుడు అంబరాన క్లాప్, కట్ చెప్పడానికి తలకు తెల్ల చేతిరుమాలు కట్టుకుని అమర సోపానాలపై కాలు మోపాడు. వెలిగే రెండు దీపపు సమ్మెల నడుమ కోడి రామకృష్ణ టైటిల్ పడటం ఆనవాయితీ. ఇవాళ తన శిరస్సు వద్ద అఖండ కీర్తి దీపాన్ని వదిలి ఆయన అశరీర ఆయువు పొందాడు. పని రావాలంటే ముందు గురువు ఉండాలి. గురువు దగ్గర నేరుగా పని చేయవచ్చు. గురువును శిలగా ప్రతిష్టించుకుని కూడా నేర్చుకోవచ్చు. కాని గురువు ఉండటం మాత్రం తప్పనిసరి అని గ్రహించి గురుశుశ్రుష ద్వారా పని నేర్చుకుని సినిమా పరిశ్రమలో గురువు మెచ్చిన శిష్యుడిగా నిలిచిన దర్శకుడు కోడి రామకృష్ణ. దర్శకుల కర్మాగారం వంటి దాసరి నారాయణరావు వద్ద శిష్యులుగా పనిచేసిన బృందంలో కోడి రామకృష్ణ ముఖ్యుడు. దాసరి ‘స్వర్గం–నరకం’ తీస్తున్నప్పుడే ఆ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశాడు కోడి రామకృష్ణ. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో నటించాడు కూడా. దర్శకుడిగా పని నేర్చుకోవడం అంటే కథలో పాల్గొనడం, స్క్రిప్ట్‌ను కాపీ చేయగలగడం, అవసరమైతే సొంతగా రాయగలడం, కంటిన్యుటీ, నటీనటులకు డైలాగ్ చెప్పడం... ఈ పనులన్నీ కోడి రామకృష్ణ చురుగ్గా నేర్చుకున్నాడు. దాసరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు– ‘నా శిష్యులందరూ నేను తర్వాత తీయబోయే ఒక్కో సినిమాకు అసిస్టెంట్లుగా బుక్ అవుతూ ఉండేవారు. ఒక్క కోడి రామకృష్ణ మాత్రం రెండు సినిమాలకు అసిస్టెంట్‌గా బుక్ అయ్యేవాడు. అంత చురుగ్గా ఉండేవాడు’ అన్నారాయన. ఇండస్ట్రీలో గొప్ప గొప్ప నిర్మాతలందరూ చాకుల్లాంటి కొత్త కుర్రాళ్లను సరిగ్గా పట్టడం తెలిసినవారే. దాసరిని గుర్తించిన నిర్మాత కె.రాఘవే కోడి రామకృష్ణను కూడా గుర్తించాడు. కథ తయారు చేసుకో.. దర్శకుడిగా అవకాశం ఇస్తా అని చెప్పాడు. అలా కోడి రామకృష్ణ చేసిన తొలి సినిమాయే ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’. ఇందులో చిరంజీవి హీరో. చిత్రమేమిటంటే ఆ సినిమా తొలి రోజు ముహూర్తం షాట్‌కు కెమెరా రన్ కాలేదు. సెంటిమెంట్ల పుట్ట అయిన సినిమా ఇండస్ట్రీలో ఇంతకు మించి దుశ్శకునం లేదు. యూనిట్లో అందరూ కోడి రామకృష్ణను జాలిగా చూశారు. ఇంకొకరైతే అప్పుడే కుదేలయ్యేవారేగాని కోడి రామకృష్ణ ధైర్యంగా నిలబడి మరుసటి రోజూ సినిమాను మొదలెట్టాడు. అంతేనా? చివరి ఊపిరి విడిచే వరకూ కెమెరాను రన్ చేస్తూనే ఉన్నాడు. అచ్చొచ్చిన నెల్లూరు జిల్లా కోడి రామకృష్ణది పాలకొల్లు అని అందరికీ తెలుసు. కాని ఆయనకు అచ్చొచ్చిన జిల్లా మాత్రం నెల్లూరు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు నిర్మాతలు కోడి రామకృష్ణ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. వారు ఒకరు ఎస్.గోపాల్‌రెడ్డి. మరొకరు మల్లెమాల (ఎమ్మెస్ రెడ్డి) లేదా వారి అబ్బాయి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి. ‘భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ ప్రారంభించి మొదట డబ్బింగ్ సినిమాలు చేసి ఆ తర్వాత నేరుగా సినిమాలు తీయడానికి సిద్ధపడిన ఎస్.గోపాల్‌రెడ్డి కోడి రామకృష్ణకు ‘ముక్కుపుడక’ తీసే అవకాశం ఇచ్చారు. ఇది తమిళ రీమేక్. తమిళంలో దర్శకుడు మణివణ్ణన్ తీసిన ఆ సినిమాను తెలుగులో కోడి రామకృష్ణ ఇక్కడి నేటివిటీకి తగ్గ మార్పులు చేసి తమిళంలో కంటే తెలుగులోనే బాగుంది అన్నట్టు తీశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆడవాళ్లు క్యూ కట్టి మరీ ఆ సినిమా చూశారు. భార్య భౌతిక సౌందర్యం కంటే ఆత్మిక సౌందర్యం చూడటం ముఖ్యం అని చెప్పిన ఆ సినిమాతో కోడి రామకృష్ణ తన స్థానం స్థిరపరుచుకున్నాడు. ఆ తర్వాత భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్ కింద ‘మంగమ్మగారి మనవడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మన్నెంలో మొనగాడు’, ‘మువ్వ గోపాలుడు’, ‘మురళీ కృష్ణుడు’, ‘మధురానగరిలో’, ‘అల్లరి పిల్ల’ తదితర సినిమాలు తీసి దానిని హిట్ బేనర్‌గా నిలిపి తాను హిట్ డైరెక్టర్‌గా కొనసాగాడు. కలెక్షన్లకు ‘స్పాట్’ పెట్టిన అంకుశం కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రయాణంలో మరో ముఖ్య మజిలీ ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్ బేనర్ కింద శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి సినిమాలు తీయడం. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ పెద్ద హిట్ అయ్యాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘అంకుశం’ చరిత్ర సృష్టించడమే కాదు రాజశేఖర్‌కు ఒక జీవితకాల స్థిరత్వం సినిమా ఇండస్ట్రీలో తెచ్చి పెట్టింది. గమనించి చూస్తే ‘అంకుశం’ హిందీ క్లాసిక్ ‘జంజీర్’ కథతో పోలి ఉన్నప్పటికీ ‘జంజీర్’లో నల్ల బజారు బ్యాక్‌గ్రౌండ్‌ను ‘అంకుశం’లో రాజకీయాల బ్యాక్‌గ్రౌండ్‌గా మార్చడంలో కోడి రామకృష్ణ ప్రతిభ కనిపిస్తుంది. అధికార పక్షం, ప్రతిపక్షం రాజకీయాలు, కుట్రలు, అందుకు రౌడీయిజాన్ని వాడుకోవడం ఇవన్నీ అప్పటి సమకాలీన రాజకీయాలతో ప్రేక్షకులు పోల్చుకునేలా కోడి రామకృష్ణ సినిమా తీయడంతో ప్రేక్షకులు పదే పదే ఈ సినిమాను చూశారు. ఇందులోనే విలన్ రామిరెడ్డి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన చెప్పిన ‘స్పాట్ పెడ్తా’ డైలాగ్ ఇప్పటికీ సగటు ప్రేక్షకుడి నోట్లో నానుతూనే ఉంది. నిర్మాత ఎం.ఎస్.రెడ్డి ఈ సినిమాలో డౌన్ టు ఎర్త్‌గా ఉండే ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించడం కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే మెగాస్టార్ చిరంజీవి హిందీలో దీని రీమేక్‌లో నటించాడు. ఆ తర్వాత కోడి రామకృష్ణ–శ్యామ్ ప్రసాద్ రెడ్డి కలిసి ‘అమ్మోరు’, ‘అంజి’, ‘అరుంధతి’ సినిమాలు చేశారు. చిన్న సినిమాల పెద్ద దర్శకుడు కోడి రామకృష్ణ కెరీర్ ఊపు మీద ఉన్నప్పుడు ఆయనతో సమాంతరంగా సినిమాలు తీస్తున్న మరో దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి. అయితే కోదండరామిరెడ్డి కమర్షియల్ కథాంశాలను ఎక్కువగా ఎంచుకుంటుంటే ఏదో ఒక మెసేజ్ ఉండే కుటుంబ కథలు, చిన్న సినిమాలు కోడి రామకృష్ణ ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఆర్టిస్ట్‌లను బట్టి, నిర్మాతను బట్టి, బడ్జెట్‌ను బట్టి కథలు సిద్ధం చేసుకుని సినిమాలు అప్పటికప్పుడు వేగంగా తీయడంలో ఆయన సిద్ధహస్తం సాధించాడు. ‘మా ఇంటికి రండి’, ‘మూ డిళ్ల ముచ్చట’, ‘ఇంటి దొంగ’, ‘స్టేషన్ మాస్టర్’, ‘పెళ్లాం చెబితే వినాలి’, ‘మా ఊరి మహారాజు’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘పెళ్లి’, ‘ఆవిడే శ్యామల’, ‘పుట్టింటికి రా చెల్లి’... ఇవన్నీ కోడి రామకృష్ణ పండించిన ఫ్యామిలీ డ్రామాలు. హిట్ కోసం ఎదురు చూస్తున్న జయభేరి ఆర్ట్స్‌కు ‘పెళ్లాం చెబితే వినాలి’ వంటి భారీ హిట్ ఇచ్చి డబ్బులు వచ్చేలా చేశాడాయన. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావుకు ‘పెళ్లి’ సినిమా ఘన విజయం మంచి లాభాలు తెచ్చి పెట్టింది. స్త్రీ, కుటుంబమూ లేనిదే సమాజము లేదు. కనుక కథలో ఆ రెండు అంశాలు ఉంటే దానితో ఐడెంటిఫై అయ్యే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది అని గ్రహించిన దర్శకుడాయన. అందుకే మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ నుంచి ‘అరుంధతి’ దాకా ఆయన స్త్రీ అంశ ఉండేలా చూసుకుంటూనే సినిమాలు తీశాడు. ఎం.ఎస్. రాజుతో శత్రువు తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన సంస్థ సుమంత్ ఆర్ట్ పిక్చర్స్ నిలదొక్కుకోవడానికి కోడి రామకృష్ణ ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. నిర్మాత ఎం.ఎస్.రాజు సుమంత్ ప్రొడక్షన్ బేనర్ మీద కోడి రామకృష్ణ దర్శకత్వంలో తీసిన తొలి సినిమా ‘శత్రువు’ భారీ విజయం నమోదు చేసింది. వెంకటేశ్, విజయశాంతి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. అప్పటికే విజయశాంతికి ‘లేడీ అమితాబ్’ ఇమేజ్ రావడంతో ఆమెను డ్యూయల్ రోల్‌గా పెట్టి కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే ‘పోలీస్ లాకప్’ తీశాడు ఎం.ఎస్.రాజు. అది కూడా భారీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్గా ఎం.ఎస్.రాజు తీసిన ‘స్ట్రీట్ ఫైటర్’ ఘోర పరాజయం పొందింది. ఎం.ఎస్.రాజుకు తీవ్ర నష్టాలు తెచ్చి పెట్టింది. ఆ బేనర్‌ను తిరిగి ‘దేవి’ హిట్‌తో కోలుకునేలా చేశాడు కోడి రామకృష్ణ. అదే బేనర్‌పై వెంకటేశ్‌తో ‘దేవీపుత్రుడు’ తీశాడాయన. పొలిటికల్ సినిమాల పండితుడు కోడి రామకృష్ణకు రాజకీయాలపై ఆసక్తి మెండు. రాజకీయ నాయకులే కాదు నిజజీవిత రౌడీలు కూడా ఆయనకు పరిచయం. వారి పాత్రలను సినిమాల్లో వాడేవాడాయన. ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘20వ శతాబ్దం’, ‘భారత్‌బంద్’, ‘రాజధాని’... ఇవన్నీ రాజకీయ కథాంశంతో ఆయన తీసిన సినిమాలు. వీటిలో ‘భారత్‌బంద్’ సంచలనం సృష్టించింది. 1990లలో దేశవ్యాప్తంగా బంద్‌లు విపరీతంగా నడిచేవి. వీటిని విమర్శిస్తూ రాజకీయ నాయకుల స్వార్థానికి ఈ బంద్‌లు ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ సినిమాలో చూపించాడాయన. స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ఆద్యుడు తెలుగు సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తీయడం ‘అమ్మోరు’ సినిమాతో మొదలైంది. 1995 నాటికి సాంకేతికంగా పెద్ద ఏర్పాట్లు లేకపోయినా ‘అమ్మోరు’లో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి సహకారం వల్ల అవసరమైన స్పెషల్ ఎఫెక్ట్స్ సృష్టించి ప్రేక్షకులను థ్రిల్ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఆ తర్వాత ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’ సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రాముఖ్యం పెంచుకుంటూ వెళ్లాడు. ‘అరుంధతి’లో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ఆ సినిమా కలెక్షన్లే చెప్పాయి. అలుపెరుగని యాత్రికుడు ఇవాళ్టి దర్శకులు సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారు. పది సినిమాలకే కెరీర్ ముగిసిపోయే స్థితికి చేరుకుంటున్నారు. అలాంటిది కోడి రామకృష్ణ 100కు పైగా సినిమాలు తీయడమంటే ఎప్పటికప్పుడు కథలను, కథాంశాలను మెరుగు పరుచుకుంటూ వెళ్లడమే కారణం. ఆయన కామెడీలు తీశాడు. ఫ్యామిలీ డ్రామా తీశాడు. సోషియో ఫ్యాంటసీ తీశాడు. జేమ్స్‌బాండ్ ఫిల్మ్స్ తీశాడు. పొలిటికల్ సబ్జెక్ట్స్ తీశాడు. ఏది తీసినా ప్రేక్షకుడు సీట్లో కూచోగలిగేలా తీశాడు. కోడి రామకృష్ణ సక్సెస్ రేట్ ఎక్కువ. ఆయన ఇచ్చిన సూపర్ హిట్స్, హిట్స్, యావరేజ్ సినిమాలతో పోల్చితే ఫెయిల్యూర్‌గా నిలిచిన సినిమాల సంఖ్య పరిగణనలోకి రాదు. సినిమా విద్యను అభ్యసించకపోయినా, హాలీవుడ్ సినిమాల వంటి వాటి ప్రభావం ఏమీ లేకపోయినా కేవలం దేశీయమైన తెలివితేటలతో, సృజనతో, కామన్‌సెన్స్‌తో ఆయన సినిమాలు తీసి ప్రేక్షకుల అభిమానం పొందాడు. ఆయన స్ఫూర్తి తప్పక కొనసాగుతుంది.ఆయన ప్రభావం రాబోవు తరాల మీద తప్పక ఉంటుంది. బాలకృష్ణ కెరీర్‌కు మలుపు ‘మంగమ్మ గారి మనవడు’ బాలకృష్ణ సోలో హీరోగా 1983లో ‘సాహసమే జీవితం’ సినిమాతో ప్రేక్షకుల మధ్యకు వచ్చాడు. కాని ఆ సినిమా విజయవంతం కాలేదు. ‘డిస్కో డాన్సర్’ ఆధారంగా తీసిన ‘డిస్కో కింగ్’ కూడా బాక్సాఫీస్ దగ్గర వీగిపోయింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘జననీ జన్మభూమి’ పరిస్థితి కూడా అంతే. కెరీర్ మంచి హిట్‌ను డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ హిట్ ఇచ్చి బాలకృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు కోడి రామకృష్ణ. ‘మంగమ్మగారి మనవడు’ (1994) బాలకృష్ణ తొలి సూపర్ హిట్‌గా నిలిచింది. నిజానికి ఇది తమిళంలో భారతీరాజా తీసిన సినిమా. కాని యథాతథంగా చూస్తే తెలుగు ప్రేక్షకులు చూడరని కోడి రామకృష్ణ మార్పులు చేశారు. పల్లె పదాలు, సామెతలు దట్టించారు. వై.విజయ వంటి వ్యాంప్ పాత్రలు కల్పించారు. దాంతో సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా మళ్లీ బాలకృష్ణకు సరైన హిట్ పడలేదు. ‘కత్తుల కొండయ్య’, ‘భలే తమ్ముడు’, ‘నిప్పులాంటి మనిషి’, ‘పట్టాభిషేకం’ వంటి సినిమాల తర్వాత బాలకృష్ణకు ‘ముద్దుల కృష్ణయ్య’తో తిరిగి మరో పెద్ద హిట్ ఇచ్చాడు కోడి రామకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతి పెద్ద హిట్ ‘ముద్దుల మావయ్య’. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఎస్.గోపాల్‌రెడ్డి ప్రారంభించిన జానపద చిత్రం కొన్ని షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయింది. ఆ సినిమా ప్రభావం నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మీద పడిందని అంటారు. విమర్శ ఎదుర్కొన్న పల్లె శృంగారం కోడి రామకృష్ణ సినిమాల్లో ఒక దశలో డబుల్ మీనింగ్ డైలాగులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ‘మంగమ్మ గారి మనవడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘ముద్దుల కృష్ణయ్య’ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు శ్రుతిమించాయనే విమర్శ వచ్చింది. ‘ముద్దుల కృష్ణయ్య’ను బూతుల కృష్ణయ్య అని విమర్శకులు వాత వేశారు. ఆ సంగతి ఎలా ఉన్నా కొత్త కొత్త ఊతపదాలు పాత్రలకు పెట్టి హిట్ కొట్టడంలో కోడి రామకృష్ణ నేర్పరి. ‘తలంబ్రాలు’ సినిమాలో రాజశేఖర్ చెప్పిన ‘మటాష్’ డైలాగ్ ఇప్పటికీ వాడుకలో ఉంది. ‘శత్రువు’లో కోట శ్రీనివాసరావు చీటికి మాటికి ‘థ్యాంక్స్’ అంటూ ఉండటం కొత్త మేనరిజమ్. ‘అరుంధతి’లో ‘వదల బొమ్మాళీ వదల’ కూడా చాలా పెద్ద హిట్టే. తిరిగి పని చేయని మేజిక్ కోడి రామకృష్ణ– చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’ సూపర్ డూపర్ హిట్. అయితే ఆ మేజిక్ రిపీట్ కాలేదనే చెప్పాలి. వారి కాంబినేషన్లో ఆ తర్వాత ‘సింహపురి సింహం’, ‘గూఢచారి నం.1’, ‘రిక్షావోడు’, ‘అంజి’ వచ్చాయి. అయితే అన్నీ కూడా ఆ స్థాయి కలెక్షన్లు సాధించలేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇతర హీరోలు కూడా ఆయనతో పని చేయలేదు. ఎందరో నటులకు కెరీర్ ప్రదాత కోడి రామకృష్ణకు నాటక రంగంతో పరిచయం ఉంది. అందువల్ల ఎవరు డైలాగ్ బాగా చెప్పగలరో ఎవరు ఎలా డైలాగ్ చెప్తే హిట్ అవుతారో ఆయనకు తెలుసు. కోడి రామకృష్ణ తన కెరీర్లో ఎందరో నటులకు బ్రేక్ ఇచ్చారు. చాలామందిని పరిచయం చేశారు. రాజశేఖర్‌కు యాంగ్రీ యంగ్ హీరో ఇమేజ్ను ‘అంకుశం’తో ఇచ్చారాయన. వై.విజయను ‘పులుసు’ పాత్రతో ప్రేక్షకులకు ఫెమిలియర్ చేశారు. హాస్యనటుడు బాబూమోహన్‌కు ‘అంకుశం’లో ‘పాయే’ డైలాగ్ ఇచ్చి హిట్ చేసింది ఆయనే. విలన్ రామిరెడ్డిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. కాస్ట్యూమ్స్ రంగంలో బిజీగా ఉన్న కృష్ణను ‘భారత్‌బంద్’లో విలన్‌గా మార్చి నటుడుగా ఆయనను చాలా బిజీ స్థాయికి తీసుకెళ్లాడు కోడి రామకృష్ణ. నిర్మాత అశోక్ కుమార్‌ను నటుడుగా మార్చాడు. ఎన్.టి.ఆర్ సోదరుని కుమారుడైన కల్యాణ చక్రవర్తిని హీరోగా నిలబెట్టింది కోడి రామకృష్ణే. నటుడు అర్జున్ను ‘మా పల్లెలో గోపాలుడు’ హిట్‌తో తెలుగు రంగంలో స్థిరపడేలా చేశాడాయన. నటుడు గొల్లపూడి మారుతీరావును ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో సినిమా రంగానికి నటుడుగా పరిచయం చేశాడు. ఆహుతి ప్రసాద్‌ను ‘ఆహుతి’లో ఇంట్రడ్యూస్ చేశాడు. నటుడు చిన్నాకు ఉన్న సీరియస్ ఇమేజ్ను మార్చి అతడు కామెడీ చేయగలడని ‘మధురానగరిలో’, ‘అల్లరి పిల్ల’ సినిమాలతో నిరూపించాడాయన. వినోద్ కుమార్, భానుచందర్, సుమన్‌ల కెరీర్ కోడి రామకృష్ణ సినిమాల వల్ల స్థిరపడింది. – సాక్షి ఫ్యామిలీ -
ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్
‘‘నాన్నగారికి వివక్ష ఉండేది కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అనేవారు. అందుకే తన ఇద్దరి కూతుళ్లకు లేనిపోని ఆంక్షలు పెట్టలేదు. ‘మీరెలా ఉండాలను కుంటున్నారో అలా ఉండండి. అయితే ఏ పని చేసినా నిజాయతీగా చేయండి. పద్ధతిగా ఉండండి’ అనేవారు. నాన్నగారు వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆయన లేని లోటు మాకు ఎప్పటికీ తెలుస్తుంది’’ అన్నారు దివ్య దీప్తి. కోడి రామకృష్ణ, పద్మశ్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి దివ్య దీప్తి, రెండో కుమార్తె ప్రవల్లిక. ‘సాక్షి’తో దివ్య దీప్తి ప్రత్యేకంగా మాట్లాడారు. మీ నాన్నగారిని ఆస్పత్రిలో ఎప్పుడు చేర్చారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉండేది? రెండు మూడు రోజుల క్రితం చేర్చాం. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ‘ఇట్స్ ఓకే. ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి వెళ్లిపోవచ్చు’ అంటుండేవారు. నాన్నగారికి విల్ పవర్ చాలా ఎక్కువ. అందుకే ఫస్ట్ టైమ్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా త్వరగా కోలుకున్నారు. ఏ ఇయర్లో హార్ట్ ఎటాక్ వచ్చింది? 2012లో. అప్పుడు బైపాస్ చేశారు. అయితే తనకో పెద్ద ఆపరేషన్ జరిగిందనే ఫీలింగ్ ఉండేది కాదు. చాలా కూల్‌గా త్వరగా కోలుకున్నారు. కొంత కాలంగా çసరిగ్గా నడవలేకపోతున్నారు పెరాలసిస్ అని ఇండస్ట్రీలో కొందరు అంటుంటారు... పెరాలసిస్ (పక్షవాతం) లాంటిది ఏమీ లేదండి. నాన్న కాళ్ళకి చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. కర్ర సాయంతో నడవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఎవరో ఒకరిని సాయంగా పట్టుకొని నడిచేవారు. ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారు? అమ్మ, చెల్లి నాతోనే మాట్లాడారు. మాతో మాట్లాడిన తర్వాతే వెంటిలేటర్లోకి వెళ్లారు. ఇలా జరుగుతుందనే డౌట్ లాంటిదేమైనా మీ నాన్నగారికి? అస్సలు లేదు. ఏం ఫర్వాలేదు.. ఇంటికెళ్లిపోతాం అని ధైర్యం చెప్పారు. మీరు ఎదిగే టైమ్‌లో మీ నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. మీరు బాగా మిస్సయ్యేవారేమో? నాకు బాగా గుర్తు. సాయంత్రం ఫ్లైట్‌కి వచ్చి మమ్మల్ని చూసి, కాసేపు టైమ్ స్పెండ్ చేసి మళ్లీ నైట్ ఫ్లైట్‌కి వెళ్ళిపోయేవారు. ఎప్పుడూ నాలుగైదు సినిమాలతో బిజీ. సినిమాలంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. వేరే వ్యాపకం ఏమీ ఉండేది కాదు. పిల్లలకు ఏం కావాలో చూసుకో అని అమ్మతో అనేవారు. మాకు మాత్రం ‘ఎవరితో ఒక్క మాట అనిపించుకోకుండా ఉండాలి. హ్యాపీగా ఉండండి. సాదాసీదాగా ఉండాలి. పెద్దవాళ్లను గౌరవించాలి. చిన్నవాళ్లతో చక్కగా మాట్లాడాలి’ అని చెప్పేవారు. షూటింగ్ లొకేషన్స్‌కి మిమ్మల్ని, మీ చెల్లెల్ని తీసుకువెళ్లేవారా? అప్పట్లో ఇండస్ట్రీ చెన్నైలో ఉండేదా? మీ ఇద్దరూ అక్కడే పుట్టారా? మేం అక్కడే పుట్టాం. కొన్నేళ్లు అక్కడే చదువుకున్నాం కూడా. షూటింగ్స్ అన్నీ కూడా చెన్నైలో ఎక్కువగా జరిగేవి. మేం స్కూల్ అయిపోయిన వెంటనే షూటింగ్ స్పాట్‌కి వెళ్లిపోయేవాళ్లం. హాలిడే అయితే సెట్లోనే గడిపేవాళ్లం. ఎప్పటివరకూ చెన్నైలో ఉన్నారు? 2001 వరకూ చెన్నైలోనే ఉండేవాళ్లం. ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాన్నగారు ఇక్కడ ఉండేవారు. ఆయన్ను చాలా మిస్ అయిపోతున్నాం అని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పుడు కూడా మమ్మల్ని షిఫ్ట్ అవ్వొద్దన్నారు. ఎందుకంటే ఆయనకు చెన్నై అంటే చాలా ఇష్టం. 100 సినిమాలకు పైగా చేశాను. ఇంక రెస్ట్ తీసుకుంటా అని అనేవారా? నెవ్వర్. ఆయన కోరిక ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా ‘యాక్షన్ అని చెబుతూ చచ్చిపోవాలి’ అని. ఆ విషయాన్ని మాతో చాలాసార్లు చెప్పేవారు. లాస్ట్ టు ఇయర్స్ కూడా సినిమాలు చేయడం లేదని ఫీల్ అయ్యేవాళ్లు. స్ట్రెయిన్ అవ్వకూడదు డాడీ అని చెప్పేవాళ్లం. అయినా వినేవారు కాదు. సినిమాలు చేయకుండా ఇంట్లో ఉండటం ఆయనకు నచ్చేది కాదు. మీ నాన్నగారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. దర్శకుడిగా ఆయన ఎలా ఫీల్ అయేవారు? నాన్నగారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. తనకేం అయినా ఫర్వాలేదు. చెడ్డ పేరొచ్చినా ఏం ఫర్వాలేదు.. నిర్మాతకు మాత్రం నష్టం రాకూడనుకునేవారు. ఆ ఫిలాసఫీ చాలా గొప్పది. నాన్నగారిలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. ఎవరొచ్చినా... స్థాయితో సంబంధం లేకుండా లేచి నిలబడి రిసీవ్ చేసుకునేవారు. ఇక తన గురువు (దాసరి నారాయణరావు) గారి ముందు కూర్చునే విధానంలో చాలా వినయం కనిపించేది. ‘అంజి’ సినిమాకి ఎక్కువ టైమ్ పట్టినప్పుడు ఆయన బాధపడేవారా? ఆయనకు ఆ టెన్షన్ ఎప్పుడూ లేదు. నిర్మాతకు నష్టం రాకూడదు. లాభాల్లోనే ఉండాలని మాత్రం అనుకునేవారు. కూతుళ్ల పెళ్లి గురించి ఆయనకు కలలేమైనా ఉండేదా? ఆయనకు అవేం తెలియదు. ఇంటి బాధ్యతలన్నీ అమ్మకు అప్పజెప్పారు. ఆయనకు సినిమా తప్ప వేరే లోకం ఏమీ లేదు. ఇంట్లో ఏం జరుగుతుంది? అని అడిగేవారు కాదు. అన్నీ మా ఇష్టం అనేవారు. పిల్లలకు ఏది ఇష్టమైతే అదే చెయ్యమని అమ్మతో అనేవారు. అలాగని ఆయనకు కుటుంబం అంటే నిర్లక్ష్యం కాదు. మా అమ్మగారి మీద ఆయనకు భరోసా ఎక్కువ. మీరు మీ నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉందా? ఆయన మీకిచ్చిన గిఫ్ట్? ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్. ఎవరితోనూ ఒక్క మాట కూడా అనిపించుకోకుండా ఉండండి అనేవారు. మేం అలా ఉండడమే ఆయనకు మేం ఇచ్చే గిఫ్ట్. నేను సినిమా డైరెక్ట్ చేయాలని ఆయనకు ఉండేది. నాన్నగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశారా? 2002 నుంచి 2007 వరకూ నాన్నగారి సినిమాలకు వర్క్ చేశాను. ఆ టైమ్‌లో డైరెక్షన్ గురించి చాలా నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత బిజీ అవ్వడంతో కుదర్లేదు. దర్శకురాలిగా ఇండస్ట్రీకి ఎప్పుడు రావాలనుకుంటున్నారు? వచ్చే ఏడాదిలో రావాలనుకుంటున్నా. ఈ మధ్యనే ఓ కంపెనీ స్టార్ట్ చేశాం. అలాగే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇప్పుడు ఇలా జరిగింది. త్వరలోనే కచ్చితంగా వస్తాను. కొత్త సినిమాల కోసం కోడి రామకృష్ణగారు కథలేమైనా రాశారా? వాటిని మీరు సినిమాగా మలిచే అవకాశం ఉందా? ఈ రెండు మూడేళ్లలో చేయాలని 3 స్క్రిప్ట్‌లు రెడీ చేశారు. అయితే నాన్నగారు ఈ కథలకు ఇచ్చినంత ట్రీట్మెంట్ నేనివ్వగలుగుతానో? లేదో? ఆ కథలకు న్యాయం చెయ్యగలననే నమ్మకం కుదిరితే సినిమా చేస్తాను. లేకపోతే టచ్ చేయను. నాన్నగారికి తీరని కోరిక ఏమైనా ఉందా? కోరిక లాంటిది ఏం లేదు. కానీ రెండేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు. ఆ వెలితికి ఆయనకు ఉన్నట్లుగా అనిపించేది. మధ్యలో రెండు సినిమాలు ఆగిపోయినట్టున్నాయి ‘పుట్టపర్తి సాయి బాబా’ సినిమా మొత్తం అయిపోయింది. అది ప్రొడక్షన్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. ఇంకో సినిమా ఓపెనింగ్ జరిగింది. లక్ష్మీరాయ్‌తో ఆ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఓపెనింగ్ రోజే హార్ట్ ఎటాక్ రావడంతో ఆ సినిమా కొనసాగలేదు. మీకు ఘనంగా పెళ్లి చేశారు. మీ చెల్లెలి పెళ్లి గురించి కూడా ఆలోచిస్తుండేవారా? ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేసి, భారం తీర్చేసుకోవాలనే టైప్ కాదు. మంచి అబ్బాయి దొరకాలి, అతని మీద నమ్మకం కుదరాలి. అప్పుడే పెళ్లి. నాకు అలానే మంచి సంబంధం చూసి చేశారు. చెల్లెలికి కూడా అలా కుదిరితే చేయాలనుకున్నారు. కూతుళ్లను బరువనుకోలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు అని గర్వంగా చెప్పుకునేవారు. ఆయనకు నేనెప్పుడూ కనబడుతుండాలి. అందుకే డాడీ దగ్గరే ఉంటున్నాను. నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు? అన్నీ ఇష్టమే. ప్రతి సినిమా చూస్తాను. ఫ్యామిలీని తీసుకు వెళ్లేవారా? సినిమాలకు ఆయన సినిమాలు ఆయన చూడరు. మేమే చూసి ఎలా ఉందో చెప్పేవాళ్లం. ముఖ్యంగా ఎలా ఉంది? అని అమ్మను అడిగేవారు. మేం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లం. డి.జి. భవాని నా కోసం పాత్రనే మార్చారు ‘‘కోడి రామకృష్ణగారు చనిపోయారన్న వార్త విన్న వెంటనే షాక్ అయ్యాను. నమ్మలేకుండా ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యనే ఏదో ఇంటర్వ్యూలో కెరీర్ గురించి మాట్లాడుతూ కోడి రామకృష్ణగారి గురించి మాట్లాడాను. ‘మంగమ్మగారి మనవడు’ సినిమాలో ఆర్టిస్ట్‌గా నాకు చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో చేసిన ‘మా పల్లెలో గోపాలుడు’లో చేసిన ‘పులుసు’ పాత్ర చాలా పాపులర్ అయింది. ఇప్పటికీ ఆ పాత్రను గుర్తు చేసేవాళ్లు ఉన్నారు. ఆ సినిమా 365 రోజులాడింది. అంతకుముందు తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశాన. తెలుగులోనూ 15 సినిమాలు వరకూ చేశా. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘మంగమ్మగారి మనవడు’. ‘పులుసు’ పాత్రతో నా కెరీర్ పీక్‌కి వెళ్ళిపోయింది. వెయ్యి సినిమాల వరకూ చేశాను. కోడి రామకృష్ణగారితో చేసిన సినిమాలు ఎంతో తృప్తికరమైనవి. చక్కటి పాత్రలు ఇచ్చారు. తెలుగు భాషలో ఉన్న అన్ని యాసలు ఆయన సినిమాలో మాట్లాడాను. స్వతహాగా నేను తెలుగు అమ్మాయినే అయినప్పటికీ చిన్నప్పుడే చెన్నైలో సెటిల్ అవ్వడం వల్ల తెలుగులో ఇన్ని యాసలుంటాయా? అనుకున్నాను. గ్లామర్ పాత్రల నుంచి తల్లి పాత్ర వరకు అన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. చాలా బాధగా ఉంది (చెమర్చిన కళ్లతో కాసేపు మౌనం). మా అమ్మాయి, వాళ్ల అమ్మాయి కలసి చదువుకున్నారు. కొన్ని కమిట్మెంట్స్ వల్ల కోడి రామకృష్ణగారి భౌతిక కాయాన్ని సందర్శించలేకపోయాను. ఇవి పూర్తి కాగానే వెంటనే వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలుస్తాను. ఆర్టిస్టులను బంగారం లాగా చూసుకుంటారు ఆయన. డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నా కెరీర్లో గుర్తుండిపోయే దర్శకుడు. ప్యాకప్ చెప్పేవరకూ భోజనం చేయరు ఆయన. మేం బ్రేక్‌లో తిన్నా కూడా ఆయన ప్యాకప్ చెప్పాకే తింటారు. పనిమీద శ్రద్ధ అలాంటిది. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ‘ఇంటి దొంగ’ సినిమాలో నా పాత్రను ప్రెగ్నెంట్‌గా మార్చారు. అలా ఎవరుంటారు? ఆర్టిస్ట్ మీద అభిమానంతో అలా చేశారు. నిజానికి నేను ‘అరుంధతి’ కూడా చేయాలి. కుదర్లేదు. మూడు నెలల క్రితం మాట్లాడాను. ఈ మధ్య కలవాలనుకున్నాను. మళ్లీ మేం కలిసి సినిమా చేస్తామనుకున్నాను. ఈ లోపే ఘోరం జరిగిపోయింది. చిత్రసీమ గొప్ప దర్శకుడుని కోల్పోయింది. -
నివాళి
కోడి రామకృష్ణ మరణవార్త యావత్ తెలుగు చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. వంద చిత్రాలకు పైగా తెరకెక్కించిన ఆయన మరణం తీరని లోటు అని çపలువురు చిత్రరంగ ప్రముఖులు పేర్కొన్నారు. ►నాకు అత్యంత ఆత్మీయులు ప్రముఖ దర్శకులు శ్రీకోడిరామకృష్ణగారి మరణం బాధాకరం. తెలుగు సినిమా ఒక మంచి దర్శకుణ్ని కోల్పోయింది. తెరపై ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి దర్శకులు కన్నుమూయడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయనతో నేను కూడా కొన్ని సినిమాలకు పనిచేసే గౌరవం దక్కింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మంచు మోహన్‌బాబు ►శతాధిక చిత్రాల దర్శకునిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించిన సీనియర్ దర్శకులు కోడిరామకృష్ణగారు. భావోద్వేగభరిత చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో కోడిరామకృష్ణగారు ముందు వరుసలో ఉంటారు. అలాగే వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ట్రెండ్‌కు తగ్గట్లు గ్రాఫిక్స్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనతో కలిసి మంగమ్మగారి మనవడు, ముద్దులక్రిష్ణయ్య, ముద్దులమావయ్య, ముద్దులమేనల్లుడు, భారతంలో బాలచంద్రుడు, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు చిత్రాలకు పనిచేశాను. ఇలాంటి గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు. బాలకృష్ణ ►కోడిరామకృష్ణగారు దర్శకునిగా విభిన్నమైన చిత్రాలతో తనదైన ముద్రవేశారు. నేను ఆయన దర్శకత్వంలో శత్రువు, దేవీపుత్రుడు సినిమాలు చేశాను. శత్రువు సినిమాకు ఆయనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అందరినీ మెప్పించారు. ఎంతో అంకితభావం ఉన్న దర్శకులు. అలాంటి ఓ దర్శకుడిని కోల్పోవడం బాధాకరం. కోడిరామకృష్ణగారు లేని లోటు తీర్చలేనిది. వెంకటేష్ ►కోడిరామకృష్ణగారు కన్నుమూశారనే వార్త నన్నెంతగానో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. శ్రీకాంత్ ►వందకుపైగా చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకులు శ్రీ కోడి రామకృష్ణగారు ఇటీవల అస్వస్థతకు లోనయ్యారని తెలిసింది. తిరిగి కోలుకుంటారని అనుకున్నాను. కానీ ఆయన మృతి చెందారని తెలిసిఆవేదనకు లోనయ్యాను. రామకృష్ణగారి తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో అన్నయ్య చిరంజీవి కథానాయకుడు. నాటి నుంచి విభిన్న చిత్రాలు అందించిన ఆయన విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సినిమాలు రూపొందించడంలోనూ తనదైన శైలిని చూపించారు. వారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. పవన్ కల్యాణ్ ►దర్శకులు కోడిరామకృష్ణగారి మరణవార్త విని కలత చెందాను. తెలుగు చలన చిత్రసీమ ప్రగతికి ఆయనఎంతో కృషి చేశారు. చిత్ర పరిశ్రమ ఆయన్ను ఎప్పటికీ మర్చిపోదు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మహేశ్‌బాబు ►తెలుగు చలనచిత్ర పరిశ్రమ లెజెండ్‌ని కోల్పోయింది. ఆయనను మిస్ అవుతున్నాం. కోడిరామకృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలి. ఎన్టీఆర్ ►కొత్త దర్శకులకు కోడిరామకృష్ణగారి చిత్రాలు నిఘంటువుల్లా ఉపయోగపడతాయి. అలాంటి ఓ దిగ్దర్శకుడిని కోల్పోవడం తెలుగు సినిమాకు తీరని నష్టం గోపీచంద్ ►మిమ్మల్ని కోల్పోయాము. కానీ మీరు దర్శకత్వం వహించిన అద్భుతమైన చిత్రాలు, మీ సృజనాత్మకత, మీ ప్రతిభ మిమ్మల్ని మాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. సీనియర్ నరేశ్ ►తెలుగు చిత్రపరిశ్రమకు దర్శకులు కోడిరామకృష్ణ ఒక పిల్లర్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.మా నాన్నగారికి మంచి మిత్రులు. వ్యక్తిగతంగా కూడా మా కుటుంబానికి తీరని లోటు. అల్లరి నరేశ్ ►ఒక లెజండ్ని కోల్పోయాం. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం సార్. నాని ►కోడి రామకృష్ణగారిలాంటి దర్శకులు అరుదుగా పుడుతుంటారు. తెలుగు చలన చిత్రపరిశ్రమ ఓ గొప్ప దర్శకుణ్ణి కోల్పోయింది. ఆయన మరణవార్త నన్నెంతో బాధించింది. శర్వానంద్ ►కోడిరామకృష్ణగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. నితిన్ ►కష్టపడేతత్వానికి, సంచలనాలకి పర్యాయపదం కోడి రామకృష్ణగారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో నేను సంగీత దర్శకునిగా పరిచయం అయ్యాను. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచే ఉంటారు. దేవిశ్రీప్రసాద్ ►సార్.. వంద చిత్రాలకు పైగా చేసిన దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు. ‘మాస్టర్ పీస్’ అనదగ్గ చిత్రాలను అందించారు. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ చాలా నిరాడంబరంగా ఉండేవారు. చాలా డౌన్ టు ఎర్త్. మీరు లేరనే నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. మీరు ఇండస్ట్రీకి చేసిన కృషికి ధన్యవాదాలు. ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలను ఇచ్చారు. నటి అనుష్క ►‘అంకుశం, అమ్మోరు, అరుంధతి, శత్రువు, పెళ్లి’ చిత్రాల్లో గొప్ప స్క్రీన్ ప్లే ఉంది. మంచి పాత్రలను సృష్టించిన లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణగారు. ఇండియన్ సినిమాకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకం. దర్శకుడు క్రిష్ ►కోడిరామకృష్ణగారి మరణం తీవ్రంగా బాధించింది. ఆయన తీసిన అద్భుతమైన చిత్రాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. దర్శకుడు కొరటాల శివ ►కోడి రామకృష్ణగారు సినిమా గ్రంథాలయం. ఓ గొప్ప దర్శకులు ఇక లేరు అని తెలియగానే ఎంతో బాధపడ్డాను. దర్శకుడు బోయపాటి శ్రీను ►ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఆప్తుడు. నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణగారు ఇక లేరు అనడం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన తెరపై ఎన్నో అద్భుతాలను సృష్టించారు. కోడి రామకృష్ణగారి హఠాన్మరణం నన్ను తీవ్రవేదనకు గురి చేసింది. ఆయన మరణం బాధాకరం. కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ►నాకు ఆయన పాలకొల్లులో థియేటర్స్‌లో సినిమా ఆడుతుందని పబ్లిసిటీ ఇస్తూ తిరిగే ఒక వ్యక్తిగా, సినిమాల్లో లైఫ్ ప్రారంభించిన ఒక ఆర్టిస్టుగా, ఆ తర్వాత దాసరి నారాయణరావుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఆ తర్వాత చిరంజీవిగారితో అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడిగా.. ఇలా ఆయన జర్నీ మొత్తం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పాలకొల్లు నుంచి వచ్చినవారిలో ఇటీవల దాసరి నారాయణరావుగారు దూరమయ్యారు. ఇప్పుడు కోడి రామకృష్ణ. బాధపడాల్సిన విషయం ఇది. వారి సతీమణి పద్మగారు నాకు బాగా తెలుసు. ఇక లాభం లేదని మొన్న డాక్టర్స్ నాతో చెప్పినప్పుడు ఆమెతో చెప్పలేక వారి అమ్మాయిలకు చెప్పాను నేను. ఆ మంచి మనిషి ఇప్పుడు లేడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అల్లు అరవింద్ ►దర్శకులు కోడిరామకృష్ణ ఇండస్ట్రీలో అందరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా, కలుపుగోలుగా ఉండేవారు. ఏ పనిలో అయినా ముందుండి ఉత్సాహంతో చురుగ్గా పాల్గొనేవారు. నాకు ఆత్మీయులు. మా దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో ‘దొంగాట’ లాంటి శతదినోత్సవ చిత్రాన్ని అందించారు. నేను ఎప్పుడు కలిసినా ‘ఏం డైరెక్టర్‌గారూ అనగానే... చంపేద్దాం గురువుగారు’ అనేవారు. వ్యక్తిగతంగా మంచి మిత్రుణ్ణి కోల్పోయాను. ప్రముఖ నిర్మాత, నిర్మాత మండలి అధ్యక్షులు కేఎల్ నారాయణ ►పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు. ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు కోడి రామకృష్ణగారు. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను నిర్మాత కేఎస్ రామారావు ►నా చిన్న గురువుగారిని, పెద్ద అన్నయ్యని, రక్తానికి అందని అనుబంధాన్ని పోగొట్టుకున్నాను, ఇక ఆ దేవుడిలోనే కోడి రామకృష్ణను చూసుకుంటాను. రచయిత తోటపల్లి మధు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ మాట అంటుంటే బాధగా ఉంది ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణగారు ఇక లేరు అన్న మాట విన్నప్పుడు హృదయం కలచి వేసింది. ఇది నిజమా? కాదా? అనే సందిగ్ధం. నిజమే అని తెలుసుకుని చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా ఇద్దరి పరిచయం ఈనాటి కాదు. దాదాపు 38 ఏళ్ల నాటి పరిచయం. నిన్న మొన్నటివరకు మా ఇంట్లో ఏ శుభకార్యం జరగినా సరే సెల్ఫోన్లో సంక్షిప్త సందేశాలతో శుభాకాంక్షలు తెలియజేస్తుండేవారు. అలాగే వారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నేనూ అలాగే చేసేవాడిని. అలా ఇప్పటికీ మా మధ్య చక్కని స్నేహం కొనసాగుతోంది. ఆయన మొదటి సినిమా ‘ఇంట్లోరామయ్య.. వీధిలో క్రిష్ణయ్య’ నాతోనే. ఆ సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నాను. అప్పుడు ఓ కుటుంబ కథాచిత్రం చేద్దామని నిర్మాత కె. రాఘవ నా దగ్గరకు వచ్చినప్పుడు మొదట చేయలేను అని చెప్పాను. నేను చిరంజీవిగారిని కన్విన్స్ చేసుకుంటానని కోడి రామకృష్ణగారు మా ఇంటికి వచ్చారు. కథ చెప్పారు. బాగా నచ్చింది. ఈ సినిమా వదులుకోకూడదని, చేస్తున్నామని అప్పటికప్పుడే ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన చాలా సంతోషించారు. దాదాపు 500 రోజులు ఆడిన సినిమాగా ఆ సినిమా నాకో అరుదైన రికార్డుని తీసుకువచ్చింది. అలా ఆ సినిమాతో మా ఇద్దరి అనుబంధం ఆరంభమైంది. ఆ తర్వాత ‘అంజి’ వరకూ ఐదారు సినిమాలకు పైన చేయడం జరిగింది నాతోనే కాదు ఆయన ఎవరితో సినిమాలు చేసిని డిఫరెంట్ జోనర్లో చేస్తుండేవారు. ‘గూఢచారి నం 1’ లాంటి జేమ్స్‌బాండ్ సినిమా దగ్గర్నుంచి, విప్లవాత్మక సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, గ్రాఫిక్స్ సినిమాలు, భక్తి సినిమాలు చేసి వావ్ అనిపించారు. దాసరి నారాయణరావుగారి తర్వాత అన్ని సినిమాలు చేసిన అరుదైన రికార్డు ఆయనది. దాసరిగారికి దరిదాపుల్లో నేనూ ఉన్నాను అంటూ రామకృష్ణగారు దాదాపు 125పైగా చిత్రాలు చేసి ఆయన తన సత్తాను చాటుకున్నారు. దాసరిగారు గర్వించే శిష్యుల్లో ఒకరిగా ఉండటం ఒక గొప్ప ఘనత. ఆయనకు ఎప్పుడు పని.. పని.. పని. తలకు ఆ రుమాలు కట్టినప్పటినుంచి తీసేవరకు పని తప్ప ఆయనకు వేరే ధ్యాస ఉండదు. పని తప్ప వేరే ధ్యాస లేని దర్శకుడు కాబట్టే ఈ రోజు మనమందరం గొప్పగా చెప్పుకుంటున్నాం. నేను హిందీ పరిశ్రమలో ప్రవేశించాలనుకున్నప్పుడు... ఏదైనా రీమేక్ చేస్తే బాగుండు అనిపించింది. అలాంటి సమయంలో నాకు తోచిన సినిమా ‘అంకుశం’. అది నాకు చాలా ఇష్టమైన సినిమా. పవర్ఫుల్ స్టోరీ. అదే ‘ప్రతిబంద్’గా చేశాం. నాకు మంచి పేరు వచ్చింది. ఆయనతో నా ప్రతి సినిమా ఓ అనుభూతి. కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ఆయనకు పెళ్లికాక ముందు తన లవ్‌స్టోరీ కోసం ‘మీ సలహాలు కావాలని అడిగేవారు’. ‘ఆలయ శిఖరం’ సినిమా టైమ్‌లో పద్మగారిని లవ్ చేస్తున్న విషయం చెప్పారు. ఆ మధ్య కాలంలో కోడి రామకృష్ణగారిని ఓ ఫంక్షన్లో చూసినప్పుడు... సరిగా నడవ లేకుండా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలకపోవడం చాలా సంతోషం కలిగించింది. ఎప్పుడూ ఆయనకు ఉండే ఊతపదం... ‘చంపేద్దాం గురువుగారు’. ఇప్పుడు ఆ మాట అంటుంటే బాధగా ఉంది. ఆయన ఇక లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చిరంజీవి -
అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయింది
మీ బాల్యంలోని కొన్ని తీపి గుర్తులు పంచుకుంటారా? కోడి రామకృష్ణ: మాది పాలకొల్లు. నాన్న కోడి నరసింహమూర్తి, అమ్మ చిట్టెమ్మ. మా వీధిలో అందరూ నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే... నేను పుట్టాకే మా వీధిలో అందరికీ పిల్లలు పుట్టారట. దాంతో నేనంటే అందరికీ ఎంత సెంటిమెంట్ అంటే.. నెల పొడుపు రోజున చంద్రుడు కనిపించగానే.. చూసినవారందరూ కళ్లు మూసుకొని.. ‘పెద్దబాబూ.. రాముడూ..’ అని పెద్దగా అరిచేవారు. నేనెళ్లి.. ఒక్కొక్కర్నీ తాకేవాణ్ణి. అప్పుడు కళ్లు తెరిచి నా వైపు చూసేవారు. అంత సెంటిమెంట్! అలాగే మా వీధిలో ఓ బ్రాహ్మలావిడ ఉండేది. వారి ఎదురింట్లో శిరోమణి అనే ఆవిడ ఉండేది. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఈవిడ శిరోమణిని తెగ తిడుతుండేది. ఓరోజు అనుకోకుండా శిరోమణి చనిపోయింది. ఆమె చావు తర్వాత కూడా ఈవిడ శిరోమణి పిల్లల్ని కూడా చీటికిమాటికీ తిట్టేది. ఓ రోజు ఉన్నట్లుండి బ్రాహ్మలావిడ వింతగా కోడిమాంసం కావాలని గోల గోల. బ్రాహ్మణ స్త్రీ చికెన్ అడగడమేంటని వీధంతా వింతగా చెప్పుకోవడం మొదలెట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, శిరోమణి దెయ్యమై.. ఆ బ్రాహ్మలావిడను పట్టిందట. ఆ శిరోమణి అమ్మకు బాగా పరిచయం. దాంతో అమ్మ వెళ్లి.. ‘శిరోమణి.. ఏంటే ఇదంతా..’ అంది. ‘ఇది నా పిల్లల్ని తిట్టిందక్కా.. దీంతో కోడిమాంసం తినిపించేదాకా వదల్ను’ అంది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో చెప్పి చూశారు. కానీ శిరోమణి ఆత్మ మాత్రం శాంతించడంలా. ‘మాంసం తేవాల్సిందే. దీంతో తినిపించాల్సిందే.. లేకపోతే నా పిల్లల్ని తిడుతుందా’ అని ఊగిపోతోంది. అప్పుడొచ్చాడు నాన్న. ‘ఏంటి?’ అనడిగితే.. విషయం చెప్పారు. సరాసరి ఆమె ముందుకెళ్లాడు. నాన్నను చూడగానే.. ఆమె కర్టెన్ చాటున దాక్కుంది. ‘ఏంటే ఇదంతా.. బ్రాహ్మలు కదా.. అలా చేయొచ్చా?’ అన్నాడు నాన్న. ‘ఏంటి బావగారూ మీరూ అలా మాట్లాడతారు. ఇది నన్ను తిట్టిందండీ... ఇప్పుడు నా పిల్లల మీద పడింది. అందుకే.. చికెన్ తినిపించేదాకా వదల్ను’ అంది ఏడుస్తూ... ‘తప్పే.. అలా చేయడం పాపమే. వెళ్లిపో.. నీ పిల్లల్ని నేను చూసుకుంటా. నాపై నమ్మకం ఉంటే వెళ్లిపో’ అని నాన్న అన్నారు. ఎట్టకేలకు శాంతించిందామె. చూస్తున్న నాకు ఇదంతా వింతగా అనిపించింది. చనిపోయాక కూడా నాన్నపై గౌరవం తగ్గకపోవడం గ్రేట్ అనిపించింది. దెయ్యాలు, భూతాలు నిజమని చెప్పను కానీ, మా వీధి సెంటిమెంట్లు అలా ఉండేవి. అమ్మానాన్నలతో మీ అనుబంధం? కోడి రామకృష్ణ: మా అమ్మానాన్నలకు నేను తొలిసంతానం. నా లైఫ్‌లో నేను చూసిన తొలి హీరో నాన్న. ఆయన రిటైర్డ్ మేజర్. మా నాన్న ఎంత చండశాసనుడో అంత అమాయకుడు కూడా. అప్పట్లోనే సినిమాల్లో వేషాలిప్పిస్తాం, సినిమాలు తీస్తాం అంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్‌లు మా ఊళ్లో తిరుగుతుండేవి. వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, వాళ్లందరితో కూల్డ్రింకులు తాగించి, నా ఫొటోలు చూపిస్తుండేవారు నాన్న. నేను స్కూల్నుంచి వచ్చేసరికి వారందరూ వరండాలో కూర్చొని ఉండేవారు. వాళ్లను చూసి సైలెంట్‌గా ఇంట్లోకెళ్లేవాణ్ణి. నా వెనకే నాన్న వచ్చేవాడు. ‘వాళ్లు సినిమా తీస్తారంటరా. నీ గురించి చెప్పాను. నీ ఫొటోలు కూడా చూపించాను’ అని గుసగుసగా చెప్పేవారు. ‘అయ్యో నాన్నా, వాళ్లు దొంగలు. వృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావ్. వాళ్లను పంపించేయ్’ అని మందలింపుగా చెప్పేవాణ్ణి. నిజం తెలుసుకొని వాళ్లను తరిమేసేవారు. ‘మనింట్లో డిగ్రీ చదివిన వాళ్లు లేరు. నువ్వు చదవాలి’ అని ఒకరోజు నాన్న నాతో అన్నారు. ‘మీ కోసం డిగ్రీ చదువుతాను. అయితే.. మధ్యలో ఎక్కడైనా తప్పితే మాత్రం అక్కడే ఆపేస్తా’ అని ఫిటింగ్ పెట్టాను. ‘నువ్వు తప్పవ్. నీపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు నాన్న. మేం నాటకం రిహార్సల్స్‌లో ఉండగా పీయూసీ రిజల్ట్స్ వచ్చాయి. నా నంబర్ పేపర్లో లేదు. తప్పాను. ఇక చదవనవసరం లేదు. నిర్ణయం తీసేసుకొని, ఇంటికెళ్లాను. అక్కడి పరిస్థితి చూడగానే షాక్. ఇరుగుపొరుగు వాళ్లకు నాన్న స్వీట్స్ పంచుతున్నారు. ‘ఓరి నాయనో.. ఈయన పేపర్ చూడలేదులా ఉంది..’ అనుకుంటూ ఆయన ముందుకెళ్లాను. నన్ను చూడగానే, ‘ఏయ్.. డిగ్రీ కూడా ఇలాగే పాసవ్వాలి. లేకపోతే చంపేస్తా’ అన్నారు ప్రౌడ్‌గా. నాకేమో అయోమయం! ఇంతలో మా తమ్ముడొచ్చి ‘నువ్వు సెకండ్‌క్లాస్‌లో పాసయ్యావ్రా’ అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను థర్డ్ క్లాస్‌లో మాత్రమే చూశానని, సెకండ్ క్లాస్‌లో చూడలేదని. కాలేజ్ టైమ్‌లో ప్రేమకథ ఏమైనా నడిపారా? కోడి రామకృష్ణ: మీరు అడిగారు కాబట్టి గుర్తున్న ఓ సంఘటన చెబుతాను. కాలేజ్ టైమ్‌లో నాకు ఓ స్టడీరూమ్ ఉండేది. నేను బొమ్మలు బాగా వేసేవాణ్ణి. అందుకే... సైన్స్ రికార్డ్స్‌లో బొమ్మలు గీయించుకోవడానికి అమ్మాయిలు నా రూమ్కొచ్చేవారు. అందరూ లవ్లీగా ఉండేవారు. ఆ అమ్మాయిల్లో ‘5 నంబర్ గోల్డ్’ అనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తన రోల్ నంబర్ 5. ఇంటి పేరేమో ‘బంగారు’. అందుకే ‘5 నంబర్ గోల్డ్’ అని పిలిచేవాళ్లం. అసలు పేరు గుర్తులేదు. నాతో బొమ్మలు గీయించుకోవడానికి తనూ వచ్చేది. ఇంతమంది ఆడపిల్లలు నా దగ్గరకొస్తుంటే.. జెలసీగా ఫీలయ్యేవారు కూడా ఉంటారు కదా. ఎవడో వెళ్లి ‘5 నంబర్ గోల్డ్’ వాళ్ల అన్నయ్యకు చెప్పాడు ‘మీ చెల్లెలు రామకృష్ణతో క్లోజ్‌గా ఉంటోంది’ అని. నేను కాలేజ్‌కి వెళ్లే దారిలో వాళ్లన్నయ్య కాపు కాశాడు. నన్ను ఆపాడు. ‘జాగ్రత్త ఏమనుకున్నావో! ఏంటి? మా చెల్లితో మాట్లాడుతున్నావంట’ అన్నాడు సీరియస్‌గా. ‘మాట్లాడితే ఏమైంది’ అన్నాను. ‘మీ ఇద్దరూ దగ్గరగా ఉంటున్నారట’ అని సణిగాడు. ‘దగ్గరగా ఉంటే ఏమైందిరా?’ అని నేను దీటుగా ప్రశ్నించా. ‘సరేలే... నీ నాటకంలో నాకూ వేషం ఇస్తావా?’ అని అడిగాడు నింపాదిగా. ‘ఇస్తాలే’ అని మాటిచ్చాను. నా కాలేజ్ రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో. సినిమాపై మీ తొలి అడుగులు ఎలా పడ్డాయి? కోడి రామకృష్ణ: చిన్నప్పట్నుంచీ పెయింటింగ్ అంటే ఇష్టం. అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్లో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను. గోడల మీద వాటర్ పెయింటింగ్ బోర్డ్స్ రాసేవాణ్ణి. అలాగే.. ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా. సినిమా హాళ్లకు ‘పొగత్రాగరాదు’, ‘నిశ్శబ్దం’, ‘ముందు సీట్లపై కాళ్లు పెట్టరాదు’.. ఇలా రకరకాల స్లయిడ్స్ ఫ్రీగా చేసిచ్చేవాణ్ణి. ఆ స్లయిడ్స్కి ఓ మూల ‘కోడి రామకృష్ణ’ అని నా పేరు రాసుకునేవాణ్ణి. తెరపై నా పేరు చూసుకోడానికే థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడే. అలాగే.. చిన్నప్పట్నుంచీ నాటకాల పిచ్చి. ట్రూప్ నాటకాల స్థాయికి చేరా. పరిషత్తులకు కూడా వెళ్లేవాళ్లం. దాదాపు వందకు పైగానే నాటకాలు రాసి, ప్రదర్శించాను. అల్లు రామలింగయ్యగార్కి అప్పట్లో నాటకం ట్రూప్ ఉండేది. ‘ఆడది’ అనే కమర్షియల్ నాటకం ఆడుతూ ఉండేవారు. ఆ నాటకంలో నేనే హీరో. లింగయ్యగారు దర్శకుడు. ఇదిలావుంటే.. టి.నాగేశ్వరరావుగారనీ... పెయింటింగ్‌లో నా గురువు. ఆయన దగ్గర నేను లితోలకు వర్క్ చేసేవాణ్ణి. ఆయనకు ఓ ఫొటో స్టూడియో కూడా ఉంది. అక్కడ నా ఫొటోలు తీసి... ‘కొత్త హీరో కావాలి’ అనే ప్రకటన పేపర్లలో కనిపిస్తే పంపించేరు. ఆ టైమ్‌లోనే మా ఊళ్లో ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా దర్శకుడికి అదే తొలిసినిమా. ఏ వీధిలో చూసినా ఆ సినిమా డిస్కషనే. ఆ సినిమా చూశాక అనిపించింది... ‘యాక్టర్ అయితే... ఒక్క పాత్రనే చెప్పచ్చు. అదే డైరెక్టరయితే.. ఎన్నో పాత్రల్ని చెప్పొచ్చు’ అని. నాలో డైరెక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన ఆ సినిమానే ‘తాతా మనవడు’. ఆ డైరెక్టరే మా గురువుగారు దాసరి నారాయణరావు. ఆ తర్వాత దాసరి గారి దగ్గరే అసిస్టెంట్‌గా చేరారు? ఆయన్ను ఎలా కలిశారు? కోడి రామకృష్ణ: ఆయన చదివిన స్కూల్లోనే నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఫారం.. ఆయనేమో ఇంటర్ సెకండియర్. ‘నేను నా స్కూల్’ అనే నాటికను గురువుగారు స్వయంగా రాసి మా స్కూల్లో ప్రదర్శించారు. గ్రీన్‌రూమ్‌లో వాళ్లు మేకప్‌లు చేసుకుంటుంటే... మేమందరం కిటికీల్లోంచి చూసేవాళ్లం. ఆ రోజుల్లో సుబ్బరాయశాస్త్రిగారని మా స్కౌట్ మాస్టారు ‘పంచవర్ష ప్రణాళికలు’ అనే నాటికను రాశారు. దాన్ని గురువుగారు డైరెక్ట్ చేసి నటించారు. ఢిల్లీలో ఆ నాటికను ప్రదర్శిస్తే.. నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా గురువుగారినీ ఆయన ట్రూప్‌ని పాలకొల్లులో లారీపై ఊరేగించారు. ‘తాతా మనవడు’ సూపర్‌హిట్ అయినప్పుడు ఆ సినిమా యాభైరోజుల పండగ సందర్భంగా గురువుగారు నేరుగా పాలకొల్లు వస్తున్నారనే సంగతి తెలిసింది. అప్పట్లో స్టూడెంట్ లీడర్ని నేనే. నాకేమో.. ఎలాగైనా గురువుగారిని కలిసి అవకాశం అడగాలనుంది. గురువుగారు, కె.రాఘవగారు, ఎస్వీ రంగారావుగారు ఇలా... అందరూ వచ్చారు. నేనెళ్లి ధైర్యంగా గురువుగార్ని కలిశాను. ‘మీ దగ్గర సహాయకునిగా చేరాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వండి సార్’ అని ప్రాధేయపడ్డాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ‘బీకాం చదువుతున్నాను సార్’ అని చెప్పాను. అయితే.. ‘పూర్తి చేసి రా’ అన్నారు. గురువుగారి మాట ప్రకారం బీకాం పూర్తి చేసి చెన్నయ్ రైలెక్కాను. నిజానికి నేను పాలకొల్లులో ఉన్నప్పుడే.. కాకినాడలో ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్ జరిగింది. గురువుగారు వచ్చారని తెలిసి... కాకినాడ వెళ్లాను. నన్ను చూడగానే.. ఓ కేరక్టర్ ఇచ్చేశారు గురువుగారు. శారదగారికి అందులో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరిలో నేనొకణ్ణి. మా కాంబినేషన్ సీన్స్ తీసేసి, మద్రాస్ వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ మాత్రం మిగిలి ఉంది. దాన్ని మద్రాస్‌లోని శివాజీ గార్డెన్స్‌లో తీస్తున్నారు. నేను చేసిన పాత్రకు ఓ డూప్‌ని ఏర్పాటు చేశారు. కానీ అతగాడు సెట్ కావడం లేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో నేను మద్రాసు వెళ్లి, గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్‌లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే.. ఆ యూనిట్‌కి ఆనందం ఆగలేదు. భలే వచ్చావయ్యా... అంటూ గబగబా.. కాస్ట్యూమ్స్ తొడిగేశారు. మేకప్ వేసేశారు. నాపై క్లాప్ కొడుతుండగా గురువుగారొచ్చారు. ‘అరే... ఎప్పుడొచ్చావ్. నీక్యారెక్టర్ పెద్దటెన్షనే పెట్టింది. భలే వచ్చావే. ఇక్కడకు రాగానే.. మొహానికి రంగేయించుకున్నావ్. క్లాప్ కొట్టించుకున్నావ్. అదృష్టవంతుడవయ్యా. ఇకనుంచి నువ్వు నాతోనే ఉంటావ్’ అని మాటిచ్చేశారు. ఆ రోజే ఆయన కారెక్కాను. అప్పట్నుంచి కారుల్లో తిరుగుతూనే ఉన్నాను. అవునూ.. తలకు గుడ్డ కట్టుకుంటారెందుకని? కోడి రామకృష్ణ: ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ని మద్రాస్ కోవలం బీచ్‌లో చేస్తున్నాం. నాకు గుర్తు అది మే నెల. విపరీతమైన ఎండలు. ఆ టైమ్‌లో మోకా రామారావుగారని ఎన్టీఆర్‌గారి కాస్ట్యూమర్. ‘మా పల్లెలో గోపాలుడు’కి కూడా కాస్ట్యూమర్ ఆయనే. ఓ మధ్యాహ్నం ఆయన నా దగ్గరకొచ్చి ‘మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది. ఎండలో అది బాగా ఎక్స్పోజ్ అయిపోతోంది’ అని తన బాక్స్‌లోంచి ఓ జేబు రుమాల తీసి నా నుదుటికి కట్టాడు. ఆ రోజు మొత్తం ఆ రుమాల అలాగే ఉంది. రెండోరోజు ఆయనే వచ్చి, ‘నాకు తెలిసి చాలామంది ఇలా కట్టుకున్నారు కానీ... మీకు మ్యాచ్ అయినట్లు ఎవరికీ కాలేదు’ అని చెప్పి, ఓ టర్కీటవల్‌తో ప్రత్యేకంగా నా నుదురు కొలత ప్రకారం ఓ బ్యాండ్‌లా చేయించి, నాకిస్తే... కట్టుకున్నాను. అది చూసిన ప్రతివారూ బాగుంది అన్నారు. చివరకు బాలచందర్‌గారు కూడా. ఓ సారి ఆయన మా సెట్‌కి వచ్చారు. నన్ను చూసి ‘ఓసారి అద్దంలో చూసుకో’ అన్నారు. చూసుకుంటే.. నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలి ఉంది. దాని కారణంగా అందంగా కనిపిస్తున్నాను. అప్పుడన్నాడాయన.. ‘ఇది ఈ జన్మది కాదయ్యా... కచ్చితంగా పూర్వజన్మదే. అందుకే నీకు అంత బాగా అతికింది’ అని. అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయిపోయింది. నిజంగా ఇది విచిత్రమే. మొదటినుంచి సెంటిమెంట్లను నేను బాగా నమ్ముతాను. ‘అంకుశం’కి పాతికేళ్లు నిండిన సందర్భంలో కోడి రామకృష్ణ చెప్పిన కొన్ని విశేషాలు... ‘అంకుశం’కి ముందు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి సంస్థలో ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ చేశా. రెండూ సూపర్హిట్లే. మా కాంబినేషన్లో మూడో సినిమా కాబట్టి, అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కథ చేయాలని ఒకటే ఆలోచన. చిన్నప్పటి నుంచీ పోలీసులంటే అభిమానం. అసలు ఆ వృత్తి అంటేనే నాకు గౌరవం. వారిపై నాటకాలు కూడా రాశా. అందుకే.. ఒక పోలీస్ కథను ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నా మస్తిష్కంలో మెదిలింది. ఆ ఆలోచనే రెడ్డి గారితో చెప్పాను. ఆయన ‘చూస్తారంటారా?’ అన్నారు. కచ్చితంగా చూస్తారని నమ్మకంగా చెప్పా. పోలీసు కథంటే సెన్సార్ సమస్యలొస్తాయేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ‘సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చాను. అలా ‘అంకుశం’ కథ మొదలైంది. ఒక రాజకీయ నేత రోడ్ మీద ఆగితే... కూల్‌డ్రింక్ అందించేవారు కోకొల్లలు. కానీ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ, నిరంతరం ఎండలో నిలబడి వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్న ఒక పోలీస్‌కు మంచినీళ్ళివ్వడానికి ఒక్కడూ ముందుకు రాడు. మొదటి నుంచీ పోలీసంటే సమాజంలో చిన్న చూపు. దీన్ని ప్రశ్నిస్తూ, పోలీసు వ్యవస్థ గౌరవం పెంచాలనిపించింది. ఆ కసితోనే ముందు విజయ్ పాత్ర సృష్టించా. ఆ పాత్ర రాసుకున్న దగ్గర నుంచీ నా మనసులో మెదిలిన రూపం రాజశేఖరే. ఈ సినిమా గురించి చెప్పగానే... రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ప్రాణం పెట్టి చేస్తా సార్’ అన్నాడు. అన్నట్లుగానే సిన్సియర్‌గా చేశాడు. ►కథానాయకుని పాత్ర ఎలివేట్ అవ్వాలంటే, ప్రతినాయకుడు శక్తిమంతంగా ఉండాలి. రౌడీలను అతి సమీపంలో నుంచి చూసిన అనుభవం నాది. ఆ అనుభవాలను రంగరించే నీలకంఠం పాత్రను సృష్టించాను. ఆ పాత్రను ఎవరితో చేయించాలి? అన్వేషణ మొదలైంది. ఓ రోజు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి బంధువుల ఇంటికెళ్లాం. అక్కడ కనిపించాడు ఓ వ్యక్తి. రెడ్డిగారి బంధువు. అటూ ఇటూ తిరుగుతుంటే అతణ్ణే గమనిస్తూ కూర్చున్నా. వివరాలు తెలుసుకున్నా. పేరు రామిరెడ్డి. చదువుకుంటున్నాడు అని తెలిసింది. ఓ రోజు తనకు చెప్పకుండానే మేకప్ టెస్ట్ చేశాం. ‘ఏంటి ఇదంతా’ అని కంగారు పడ్డాడు. ఒప్పుకునేలా కనిపించలేదు. ఎమ్మెస్రెడ్డిగారితో చెప్పించాం. ‘చేయ్. విలన్ పాత్ర. బాగుంది. మంచి పేరొస్తుంది. సిగ్గెందుకు. నేను చేయడంలా?’ అని ఆయన గట్టిగా చెప్పడంతో ఒప్పుకున్నాడు. ►సంగీత దర్శకుడు సత్యం గారి చివరి సినిమా ‘అంకుశం’. ఓ పాట మిగిలుండగానే కన్నుమూశారాయన. నేపథ్యగీతం. ఎవరితో చేయించాలా అనుకుంటుండగా, రచయిత రాజశ్రీ ముందుకొచ్చారు. ►‘అంకుశం’ విడుదలయ్యాక ఓ రోజు నేను, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డిగారు ట్యాంక్‌బండ్ దగ్గర నిలబడ్డాం. అది నో పార్కింగ్ ప్లేస్. దాంతో ఇద్దరు పోలీసులు మా దగ్గరకొచ్చి, ‘ఫైన్ కట్టండి’ అన్నారు. దాంతో వారితో వాదన మొదలైంది. ఉన్నట్లుండి నాలుగు జీపులు వచ్చి అక్కడ ఆగాయి. అందులో నుంచి పోలీస్ ఉన్నతాధికారులు దిగారు. మమ్మల్ని చూసి పరుగుపరుగున మా వద్దకొచ్చారు. ‘ఆయన ఎవరనుకున్నారు? కోడి రామకృష్ణగారు. సెల్యూట్ కొట్టండి’ అని గద్దించారు. ‘మా పోలీసుల గౌరవాన్ని పెంచిన మనుషులు మీరు. మా వాళ్లు ఇలా ప్రవర్తించినందుకు సారీ సార్’ అన్నారు. తర్వాత ఓ ప్రభుత్వ వేడుకకు నన్ను అతిథిగా పిలిచి, పోలీస్ లాఠీ బహుమతిగా ఇచ్చారు. ఆ క్షణంలో ఎంత సంతృప్తి ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ ఆ లాఠీ నా దగ్గరే భద్రంగా ఉంది. ►‘అంకుశం’ 20 పైచిలుకు కేంద్రాల్లో వందరోజులాడింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో ఏడాది ఆడింది. ఆ రోజుల్లో బాగా వసూలు చేసిందా సినిమా. తమిళ, మలయాళాల్లోకి అనువదిస్తే, అక్కడ కూడా విజయం సాధించిందీ సినిమా. ఆ పాత్ర మీదున్న ప్రేమతో చిరంజీవి గారు హిందీలో ‘ప్రతిబం«ద్’గా చేసి, విజయం సాధించారు. నా కెరీర్లో ‘అంకుశం’ ఓ విలువైన రత్నం. ఇలాంటి మంచి సినిమాను నాతో చేయించిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్. -
కోడి రామకృష్ణ పార్దివదేహానికి ప్రముఖుల నివాళులు
-
ఆయన మొదటి సినిమా నాతోనే
-
కోడి రామకృష్ణ పార్దివదేహానికి విజయచందర్ నివాళులు
-
కోడి రామకృష్ణ అపూర్వ చిత్రాలు
-
‘కోడి రామకృష్ణ మరణం తీరని లోటు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణగారు అనారోగ్యంతో కన్నుమూయడం ఎంతో బాధాకరమన్న హీరో బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. శతాధిక దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు చిత్ర సీమకు అందించారని పేర్కొన్నారు. ఎమోషనల్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో కోడి రామకృష్ణగారు ముందు వరుసలో ఉంటారని తెలిపారు. అలాగే ఆయన వైవిధ్యమైన చిత్రాలను కూడా అందించారన్నారు. ట్రెండ్‌కు తగినట్లు గ్రాపిక్స్ చిత్రాలను కూడా అద్భుతంగా తెరకెక్కించారని.. ఆయనతో కలిసి మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, భారతంలో బాలచంద్రుడు, మువ్వ గోపాలుడు, బాలగోపాలుడు చిత్రాలకు పనిచేశానని గర్తు చేసుకున్నారు. ఇలాంటి గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ( ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత ) ఆయన మృతిపై స్పందించిన ప్రముఖులు.. ప్రముఖ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన తెలుగు చిత్ర సీమకు ఎనలేని కృషి చేశారు. ప్రధానంగా కుటుంబ కథా చిత్రాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు చిత్ర సీమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది మిమ్మల్ని మిస్ అవుతున్నాము - జూ.ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - కళ్యాణ్ రామ్ నాలాంటి ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. ఆయన మరణవార్త విని షాక్‌కు గురయ్యాను - అనిల్ రావిపూడి కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినీరంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. - కేసీఆర్ ఆయన మరణం చాలా బాధాకరం. ఆయన తెలుగు సినిమాకు చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- మహేష్ బాబు మహోన్నత వ్యక్తిని కోల్పోయాను. నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు. చిత్రసీమ గొప్పదర్శకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- దేవీ శ్రీ ప్రసాద్ నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామకృష్ణ గారి మరణం బాధాకరం. తెలుగు సినిమా ఓ మంచి దర్శకున్ని కోల్పోయింది. తెరపై ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి దర్శకుడు కన్నుమూయడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరనిలోటు. ఆయనతో నేను కూడా కొన్ని సినిమాలకు పని చేసే గౌరవం దక్కింది. శ్రీ కోడి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను- మంచు మోహన్ బాబు ఆయన మరణం ఎంతో బాధాకరం. అంకితభావం కలిగిన దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమ మరో లెజెండ్‌ను కోల్పోయింది- శ్రీనువైట్ల ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- రానా హీరోలను, విలన్లను, విజువల్ ఎఫెక్ట్స్‌ను, భక్తిరస చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. తెలుగు చిత్ర సీమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది- మెహర్ రమేష్ ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- సాయి ధరమ్ తేజ్ నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారికి నమస్కారాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- బ్రహ్మాజి ఆయన తరంలో ఆయన కూలెస్ట్. ఓ లెజెండ్‌ను కోల్పోయాం. మీరెప్పటికీ గుర్తుంటారు సర్- నాని లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నాము సర్- మారుతి కోడి రామకృష్ణ గారి మరణం తీరని లోటు. చిత్రసీమకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది. అరుంధతి, అమ్మోరు, మంగమ్మగారి మనవడు, అంకుశం లాంటి సినిమాలతో తన మార్క్ వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు బలం చేకూరాలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి- లక్ష్మీ మంచు కోడి రామకృష్ణ మరణం తీరని లోటు. ఆయనతో నాకు ముప్పై ఏళ్ల అనుబంధం ఉంది. పని పట్ల ఎప్పుడూ అంకిత భావంతో ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి- చిరంజీవి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- శ్యాంప్రసాద్ రెడ్డి ఆయన మరణవార్త విని తీవ్ర వేదనకు లోనయ్యాను. తెలుగు సినిమా ఓ మంచి దర్శకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను- నిర్మాత, రాజ్యసభ సభ్యులు డా. టి. సుబ్బరామిరెడ్డి కోడి రామకృష్ణ గారు ఓ సినీ లైబ్రరీ. ఆయన ఇక లేరు అనే విషయం తెలియగానే ఎంతో బాధపడ్డాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- బోయపాటి శ్రీను -
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం.. తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. ఆయన మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలి భిన్నమని అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలను చూస్తే తెలుస్తుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 2016లో కన్నడ చిత్రమైన ‘నాగహారవు’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా. చిరంజీవికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన కోడి రామకృష్ణను పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు. సుమన్, అర్జున్, భానుచందర్‌లాంటి హీరోలను తెరకు పరిచయం చేశారు. మధ్య తరగతి కుటుంబాల నేపథ్యాన్ని ఆధారంగా ఆయన అనేక చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగానే కాకుండా.. నటుడిగాను మెప్పించారు. ఆయన దర్శకత్వంలో చివరగా వచ్చిన సూపర్‌హిట్ చిత్రం అరుంధతి. అద్భుత గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. కోడి రామకృష్ణ అపూర్వ చిత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ కోడి రామకృష్ణ
-
దెయ్యం కథ చెబితే!
శివ, సుప్రియ, ఆరోహి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దెయ్యం చెప్పిన కథ’. ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో పెనాక దయాకర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ను దర్శకుడు కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టైటిల్ బాగుంది. దెయ్యం కథ చెప్పడం అనేది చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం తీసుకొచ్చే సక్సెస్‌తో ప్రదీప్, దయాకర్ రెడ్డి మరిన్ని సినిమాలు చేయాలి’’ అన్నారు. దయాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి హారర్ మూవీ. వెరైటీ డైలాగులు, పంచ్‌లతో పాటు కామెడీ ఉంటుంది. ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ‘‘కోడి రామకృష్ణగారు మా సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రదీప్. ఈ చిత్రానికి సంగీతం: నవీన్, కెమెరా అండ్ ఎడిటింగ్: క్షేత్ర క్రియేటివ్ ఆర్ట్స్. -
దాసరి సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్‌గా లయన్ ఎ. విజయ్‌కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు. -
దేవీ కెరీర్ బెస్ట్ అన్న గురూజీ
రంగస్థలం సినిమాకు పనిచేసి ప్రతీ ఒక్కరూ ప్రశంసల వర్షంలో తడిపోతున్నారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ సమంత, దర్శకుడు సుకుమార్‌లతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే తాజాగా తనకు వచ్చిన ఓ మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రంగస్థలం సినిమా చూసిన సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ప్రశంసిస్తూ మెసేజ్ చేశారు. ‘నీ సంగీతంతో తెలుగు చలనచిత్ర రంగస్థలం మీద ఓ భారీ విజయాన్ని నమోదు చేశావు. గర్వంగా ఉంది’ అంటూ దేవీ శ్రీకి మెసేజ్ చేశారు కోడి రామకృష్ణ. తనకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన కోడి రామకృష్ణను దేవీ శ్రీ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన ప్రశంసించటంతో దేవీ శ్రీ ఆనందానికి అవధుల్లేవు. అందుకే వెంటనే కృతజ్ఞతలు అంటూ కోడి రామకృష్ణ రిప్లయ్ ఇచ్చిన దేవీ ఆ మెసేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Feel so Blessed to get this message frm d Great Director, SRI KODI RAMA KRISHNA GARU, who introduced me as a Music Director ! Thank U soo much for this wholehearted Love Filled message Dearest Uncle !! 🎹🎹🎹🎵🎵🎵🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️ Wil Cherish this forever !! 🎹🎹 pic.twitter.com/BX4yFpYANM — DEVI SRI PRASAD (@ThisIsDSP) 6 April 2018 -
అందుకే ఆయన దేవుడయ్యారు!
పుట్టపర్తి సాయిబాబా జీవిత కథతో రూపొందుతున్న సినిమా ‘శ్రీ సత్యసాయి బాబా’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో కరాటం రాంబాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ప్రశాంతి నిలయం సెట్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. వచ్చే నెల 10తో ఈ షెడ్యూల్ ముగుస్తుందని నిర్మాత తెలిపారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘మనలో ఒకరిగా, మనతోనే తిరుగుతూ సమజానికి ఏ విధంగా మంచి చేయొచ్చని ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి పుట్టపర్తి సాయిబాబా. అందుకే, ఆయన దేవుడు అయ్యారు. భక్తుల కోసమే కాదు.. భక్తులు కానివాళ్లకూ ఈ కథ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సత్యసాయిగా మలయాళ నటుడు శ్రీజిత్ విజయ్, తల్లిదండ్రులుగా జయప్రద, శరత్‌బాబు నటిస్తున్నారు. సినిమాలో 14 పాటలనూ జొన్నవిత్తుల రాశారు. ఇళయరాజాగారు అద్భుతమైన స్వరాలు ఇచ్చారు. మంగళంపల్లి బాల మురళీకృష్ణగారు చివరి పాట పాడిన చిత్రమిదే. ఆ పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు కరాటం రాంబాబు. కెమేరా: వాసు. -
జయసుధ, కోడి రామకృష్ణ అధ్యక్షతన కమిటీలు
విజయవాడ: ఏపీ నంది, టీవీ అవార్డుల ఎంపికకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీలు ఏర్పాటుచేసింది. 2012,2013 సంవత్సరాలకు కమిటీలు ప్రకటించింది. 2012 నంది సినిమా అవార్డులకు గాను ప్రముఖ నటి జయసుధను చైర్‌పర్సన్‌గా నియమించగా ఇందులో సభ్యులుగా గుణ్ణం గంగరాజు, మహర్షి రాఘవ, ఢిల్లీ రాజేశ్వరి, నందితారెడ్డి, చంటి అడ్డాల సహా 13మందితో కమిటీ వేశారు. అలాగే 2012 టీవీ అవార్డుల కోసం జీవీ నారాయణ నేతృత్వంలో 13మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 2013 సినిమా, టీవీ అవార్డుల ఎంపిక కోసం కూడా కమిటీ వేశారు. 2013 నంది సినిమా అవార్డుల కోసం వేసిన కమిటీ చైర్మన్ గా కోడి రామకష్ణ వ్యవహరించనుండగా శివపార్వతీ, రవిబాబు, శేఖర్ కమ్ముల, చంద్ర సిద్ధార్థ సహా 13 మంది ఈ కమిటీలో పని చేయనున్నారు. అలాగే, 2013 టీవీ అవార్డుల ఎంపిక కోసం కవిత చైర్మన్ గా 13మంది సభ్యులతో కమిటీ వేశారు. -
అప్పుడది దేవుడు లేని గుడితో సమానం!
‘‘ఏ సినిమానైనా గ్రాఫిక్స్ లేకుండా తీయొచ్చు. కానీ, ఒకప్పుడు కన్నీళ్లున్న సినిమాలు చూసిన జనం ఇప్పుడు ‘అవతార్’, ‘టైటానిక్’లు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు మంచి కథతో పాటు అదనపు హంగులు (గ్రాఫిక్స్) కోరుకుంటున్నాడు. అందుకే టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పు డు అప్డేట్ అవుతుంటాను’’ అని కోడి రామకృష్ణ అన్నారు. ‘అమ్మోరు’, ‘అంజి’, ‘అరుంధతి’ సినిమాలతో గ్రాఫిక్స్ పరంగా టాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుడీయన. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నాగభరణం’ ఈ నెల 14న విడుదల కానుంది. సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించిన ఈ సినిమాలో రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ - ‘‘ఓ పాము కథ ఇది. గత జన్మలో తీరని కోరికలను ఈ జన్మలో ఎలా తీర్చుకుందనేది సినిమా. తన ఆశయాన్ని సాధించలేని స్థితిలో ఆమె ఆరాధ్య దైవం శివుడు ఓ శక్తిని సృష్టించి పంపిస్తాడు. ఆ శక్తి విష్ణువర్ధన్ పాత్ర రూపంలో వస్తుంది. ఆ ఐడియా నిర్మాత సాజీద్దే. గ్రాఫిక్స్ లేకుండా ఈ సినిమా తీయాలనుకున్నా. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో సాజీద్ ఖర్చుకు వెనుకాడలేదు. గ్రాఫిక్స్ పేరుతో ఎంత ఖర్చుపెట్టినా నిర్మాతకు నష్టం కలగకుండా దర్శకుడు మినిమమ్ గ్యారెంటీ చూసుకోవాలి. మనం ఏం తీస్తున్నామనేది కూడా దర్శక-నిర్మాతలకు అవగాహన ఉండాలి. నిర్మాత సెట్లో లేకపోతే అది దేవుడి లేని గుడితో సమానం. నా విజయాలకు కారణం నిర్మాతలే. ఇప్పటివరకూ నా సినిమాలన్నీ మిగతా భాషల్లో అనువాదమయ్యాయి. కన్నడలో తీసిన ఈ సినిమా తెలుగులో అనువాదమైంది. మల్కాపురం శివకుమార్ 600 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అన్నారు. త్వరలో మా అమ్మాయి దీపు దర్శకురాలిగా పరిచయం కానుందని చెప్పారాయన. -
క్రియేటివిటీ కంటే కథే ముఖ్యం - దర్శకుడు కోడి రామకృష్ణ
‘‘ ఒక సినిమా తీయాలంటే దర్శకుడి క్రియేటివిటీ ఒక్కటే సరిపోదు. ఒక మంచి కథ ఉండాలి. ఆ కథను ఇష్టపడే, సినిమా అంటే ప్యాషన్ ఉండే నిర్మాత కావాలి. అప్పుడే ఆ సినిమా బాగా వస్తుంది’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన ఆయన తాజాగా కన్నడంలో తెరకెక్కించిన చిత్రం ‘నాగభరణం’. జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించారు. గురుకిరణ్ పాటలు స్వరపరిచారు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటుడు సాయికుమార్, బిగ్ సీడీని తెలంగాణ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పాటల సీడీని దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘కన్నడ స్టార్ విష్ణువర్ధన్‌గారు నాకు మంచి ఫ్రెండ్. మీతో ఓ సినిమా చేస్తానని ఆయనకు కథ వినిపించా. ‘బాగుంది. రెండు నెలల్లో డేట్స్ ఇస్తా’ అన్నారు. నేను స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్ వె ళ్లి వచ్చేలోగా ఆయన చనిపోయారు. అది నా దురదృష్టం. ఈ చిత్రం క్లయిమాక్స్‌లో గ్రాఫిక్స్‌లో విష్ణువర్ధన్‌గారిని చూపిద్దామని సాజిద్ నాకు చెప్పారు. దీంతో మకుట సంస్థ విజువల్ ఎఫెక్ట్స్‌లో ఆయన్ను తెరపై చూపించాం’’ అని చెప్పారు. ‘‘నాగదేవత ముఖ్య పాత్రలో ఇటీవల సినిమాలు రాలేదు. ‘నాగభరణం’ ఆ తరహా చిత్రం. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఈ చిత్రం హక్కులు కొన్నా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ నెల 14న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని మల్కాపురం శివకుమార్ అన్నారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిరిధర్, సురేశ్ కొండేటి, బీఏ రాజు, చిత్ర సహనిర్మాత సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
జన్మజన్మల నాగబంధం
పూర్వజన్మలో కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతలను ఓ యువతి మరు జన్మలో ఏవిధంగా సొంతం చేసుకోగలిగింది? నాగభరణంతో ఆమెకున్న సంబంధం ఏమిటి? అనే కథాంశంతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాగభరణం’. రమ్య ప్రధాన పాత్రధారి. జయంతి లాల్ గాడా సమర్పణలో సాజిద్ ఖురేషి, దవల్ గాడా, సోహైల్ అన్సారీ నిర్మించారు. తెలంగాణ, ఏపీ పంపిణీ హక్కులను దక్కించుకున్న మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ‘‘ఓ కీలక పాత్ర కోసం స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా సృష్టించడం జరిగింది. ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సృష్టిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నా యి.’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సలావుద్దీన్ యూసఫ్, షబ్బీర్ హుస్సేన్. -
నాగభరణం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
-
నాగభరణం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో గ్రాఫికల్ వండర్స్ తెరకెక్కించాలంటే దర్శకుడిగా రాజమౌళి పేరునే సూచిస్తారు. అయితే రాజమౌళి కన్నా ముందే తెలుగు సినిమాకు అద్భుతమైన గ్రాఫిక్స్‌ను పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అమ్మోరు సినిమాతో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ చూపించిన కోడి, అంజి సినిమా గ్రాఫిక్స్‌కు జాతీయ అవార్డ్‌ను కూడా సాధించాడు. తాజాగా మరో గ్రాఫికల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఏడేళ్ల క్రితం మరణించిన కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ హీరోగా ఓ సినిమాను రూపొందించాడు కోడి రామకృష్ణ. చనిపోయిన విష్ణువర్దన్ తెర మీద చూపించేందుకు. 450 మంది గ్రాఫిక్ ఆర్టిస్ట్‌లు రెండేళ్ల పాటు శ్రమించారు. సాండల్‌వుడ్ గ్లామర్ బ్యూటి రమ్య, సాయికుమార్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో గ్రాఫిక్స్, సాహస సింహ విష్ణువర్దన్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. -
పూర్వజన్మ కథ!
‘‘కోడి రామకృష్ణగారితో నా అనుబంధం 30ఏళ్లు. మేమిద్దరం కలిసి చాలా చిత్రాలు చేశాం. ఆయనతో ఇప్పటికీ సినిమాలు చేయాలనుకుంటున్నా. సోషియో ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాలు నాకు బాగా ఇష్టం. ఇటువంటి చిత్రాలే సాధారణ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. మకుట కంపెనీ వారు ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ చేస్తుండటం గర్వకారణం. టీజర్ చూస్తుంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలుస్తోంది’’ అని నిర్మాత శ్యాం ప్రసాద్‌రెడ్డి అన్నారు. దిగంత్, రమ్య జంటగా కన్నడ స్టార్ విష్ణువర్థన్ (విజువల్ ఎఫెక్ట్స్ రూపంలో) ప్రత్యేక పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించిన చిత్రం ‘నాగభరణం’. ఈ చిత్రం టీజర్‌ను శ్యాం ప్రసాద్‌రెడ్డి విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘పూర్వజన్మకు సంబంధించిన కథ ఇది. ఓ అమ్మాయి పూర్వజన్మలో కోల్పోయిన ఎమోషన్స్‌ని ఈ జన్మలో పాము రూపంలో ఎలా తీర్చుకుంది? అన్నదే కథ’’ అన్నారు. ‘‘కోడి రామకృష్ణ నిర్మాతల దర్శకుడు. ఈ చిత్రం సాజిద్ ఖురేషికి మంచి పేరు, డబ్బు తీసుకు రావాలి. టీజర్ బాగుంది’’ అని నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ అన్నారు. మకట గ్రాఫిక్స్ దొరబాబు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలావుద్దీన్ యూసఫ్. -
సత్యసాయిగా మళయాల నటుడు
చనిపోయిన విష్ణువర్ధన్ హీరోగా నాగరాహువు సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే నాగరాహువు షూటింగ్ పూర్తి చేసిన కోడి రామకృష్ణ, ఆ సినిమాతో పాటు సత్య సాయిబాబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను కూడా చాలా వరకు పూర్తి చేశాడు. చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమాకు నిర్మాత దొరకటం, తరువాత నటీనటులను ఎంపిక చేయటం ఆలస్యం కావటంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ముందుగా మళయాల నటుడు దిలీప్‌ను సత్యసాయి పాత్రకు ఎంపిక చేసినా.. అతడి స్టార్ ఇమేజ్ దృష్ట్యా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానంతో విరమించుకున్నాడు. ఫైనల్‌గా మరో మళయాల నటుడు శ్రీజిత్ విజయ్ను బాబా పాత్రకు ఎంపిక చేసిన కోడి రామకృష్ణ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడు. సత్య సాయిబాబ భక్తుల సహకారంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరో ఐదు నెలల షూటింగ్ మిగిలి ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2017 మొదట్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు బాబాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నందున ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సత్యసాయిగా మళయాల నటుడు
చనిపోయిన విష్ణువర్ధన్ హీరోగా నాగరాహువు సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే నాగరాహువు షూటింగ్ పూర్తి చేసిన కోడి రామకృష్ణ, ఆ సినిమాతో పాటు సత్య సాయిబాబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను కూడా చాలా వరకు పూర్తి చేశాడు. చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమాకు నిర్మాత దొరకటం, తరువాత నటీనటులను ఎంపిక చేయటం ఆలస్యం కావటంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ముందుగా మళయాల నటుడు దిలీప్‌ను సత్యసాయి పాత్రకు ఎంపిక చేసినా.. అతడి స్టార్ ఇమేజ్ దృష్ట్యా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానంతో విరమించుకున్నాడు. ఫైనల్‌గా మరో మళయాల నటుడు శ్రీజిత్ విజయ్ను బాబా పాత్రకు ఎంపిక చేసిన కోడి రామకృష్ణ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడు. సత్య సాయిబాబ భక్తుల సహకారంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరో ఐదు నెలల షూటింగ్ మిగిలి ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2017 మొదట్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు బాబాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నందున ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- కోడి రామకృష్ణ
-
నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది: వరుణ్ సందేశ్
‘‘వరుణ్ సందేశ్ చేసే సినిమాలన్నీ బాగుంటాయి. మనింటి కుర్రాడిలా అందరికీ కనెక్ట్ అవుతాడు. అందుకే, తనంటే ఇష్టం. ‘అరుంధతి’లో నటించిన అరవింద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. నల్లపాటి వంశీమోహన్ సమర్పణలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఖుద్దూస్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ‘అల్లరి’ నరేశ్ సీడీని ఆవిష్కరించి, భీమనేని శ్రీనివాసరావుకి ఇచ్చారు. ఈ వేడుకలో దశరథ్, మెహర్ రమేశ్, శివబాలాజీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ పాత్ర వినూత్నంగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రం’’ అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో కొన్ని నిరాశపరిచాయి. కానీ, ఈ సినిమా మంచి ఫలితాన్నిస్తుందనే నమ్మకం ఉంది. నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది’’ అని చెప్పారు. యువతరానికి కావల్సిన అంశాలతో రూపొందిన చిత్రం ఇదని నిర్మాత తెలిపారు. -
ఆహుతి ప్రసాద్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
-
‘జై హింద్ 2’ఆడియో ఆవిష్కరణ
-
అనుష్క అరుంధతి-2 కు అంతా సిద్ధం
-
పోలీసులు నన్ను అతిథిగా పిలిచి,లాఠీ బహుమతిగా ఇచ్చారు!
వ్యవస్థలో మార్పు తెచ్చే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ‘అంకుశం’. సమాజంలో పోలీస్‌పై గౌరవాన్ని పెంచిన సినిమా ఇది. అలాగే... పోలీసుల్లో నిజాయితీని నింపిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు ముందు పోలీస్ కథలెన్ని వచ్చినా... ‘అంకుశం’ ప్రత్యేకం. ఈ సినిమా విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా ‘అంకుశం’ దర్శకుడు కోడి రామకృష్ణ జ్ఞాపకాలు... ‘అంకుశం’కి పాతికేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నా. ఎందుకంటే, అది కేవలం డబ్బు కోసం చేసిన సినిమా కాదు. ఆదర్శంతో తీసిన సినిమా. అందుకే నాకు ప్రత్యేక అభిమానం. ‘అంకుశం’కి ముందు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి సంస్థలో ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ చేశా. రెండూ సూపర్హిట్లే. మా కాంబినేషన్లో మూడో సినిమా కాబట్టి, అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కథ చేయాలని ఒకటే ఆలోచన. చిన్నప్పటి నుంచీ పోలీసులంటే అభిమానం. అసలు ఆ వృత్తి అంటేనే నాకు గౌరవం. వారిపై నాటకాలు కూడా రాశా. అందుకే.. ఒక పోలీస్ కథను ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నా మస్తిష్కంలో మెదిలింది. ఆ ఆలోచనే రెడ్డి గారితో చెప్పాను. ఆయన ‘చూస్తారంటారా?’ అన్నారు. కచ్చితంగా చూస్తారని నమ్మకంగా చెప్పా. పోలీసు కథంటే సెన్సార్ సమస్యలొస్తాయేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ‘సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చాను. అలా ‘అంకుశం’ కథ మొదలైంది. ఒక రాజకీయ నేత రోడ్ మీద ఆగితే... కూల్‌డ్రింక్ అందించేవారు కోకొల్లలు. కానీ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ, నిరంతరం ఎండలో నిలబడి వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్న ఒక పోలీస్‌కు మంచినీళ్ళివ్వడానికి ఒక్కడూ ముందుకు రాడు. మొదటి నుంచీ పోలీసంటే సమాజంలో చిన్న చూపు. దీన్ని ప్రశ్నిస్తూ, పోలీసు వ్యవస్థ గౌరవం పెంచాలనిపించింది. ఆ కసితోనే ముందు విజయ్ పాత్ర సృష్టించా. ఆ పాత్ర రాసుకున్న దగ్గర నుంచీ నా మనసులో మెదిలిన రూపం రాజశేఖరే. నిజానికి నా రెండో సినిమా ‘తరంగణి’కే అతణ్ణి తీసుకుందామనుకున్నా. అయితే అప్పుడాయన భారతీరాజా సినిమా చేస్తున్నాడు. తెలుగు సినిమా చేయడానికి భారతీరాజా ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రకు భానుచందర్‌ను తీసుకున్నా. రాజశేఖర్ గొప్ప నటుడు. సరైన పాత్ర దొరికితే... దానికోసం ఎంత స్ట్రగులైనా అనుభవిస్తాడు. ఈ సినిమా గురించి చెప్పగానే... రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ప్రాణం పెట్టి చేస్తా సార్’ అన్నాడు. అన్నట్లుగానే సిన్సియర్‌గా చేశాడు. కథానాయకుని పాత్ర ఎలివేట్ అవ్వాలంటే, ప్రతినాయకుడు శక్తిమంతంగా ఉండాలి. అందుకే విలన్ పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టా. రౌడీలను అతి సమీపంలో నుంచి చూసిన అనుభవం నాది. ఆ అనుభవాలను రంగరించే నీలకంఠం పాత్రను సృష్టించాను. ఆ పాత్రను ఎవరితో చేయించాలి? అన్వేషణ మొదలైంది. చాలామందిని చూశాను. కానీ... కంటికి ఆనడం లేదు. ఓ రోజు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి బంధువుల ఇంటికెళ్లాం. అక్కడ కనిపించాడు ఓ వ్యక్తి. రెడ్డిగారి బంధువు. అటూ ఇటూ తిరుగుతుంటే అతణ్ణే గమనిస్తూ కూర్చున్నా. వివరాలు తెలుసుకున్నా. పేరు రామిరెడ్డి. చదువుకుంటున్నాడు అని తెలిసింది. ఓ రోజు తనకు చెప్పకుండానే మేకప్ టెస్ట్ చేశాం. ‘ఏంటి ఇదంతా’ అని కంగారు పడ్డాడు. ఒప్పుకునేలా కనిపించలేదు. ఎమ్మెస్రెడ్డిగారితో చెప్పించాం. ‘చేయ్. విలన్ పాత్ర బాగుంది. మంచి పేరొస్తుంది. సిగ్గెందుకు. నేను చేయడంలా?’ అని ఆయన గట్టిగా చెప్పడంతో ఒప్పుకున్నాడు. చార్మినార్ ముందు తన్నుకుంటూ తీసుకెళ్లే సీన్ రామిరెడ్డిపై మేం తీసిన తొలి షాట్. పాపం రాజశేఖర్ నిజంగానే లాఠీ విరిగేలా కొట్టాడు. కానీ... పాత్ర కోసం అతను తన్నులు తిన్నాడు. అదీ గొప్పతనం. ఆ సన్నివేశం నిజం అద్భుతంగా పండింది. కానీ... ఆ సీన్ తర్వాత రామిరెడ్డి మళ్లీ కనిపించలేదు. ఏంటని ఆరా తీస్తే, ‘నేను చేయను. నన్ను గుడ్డలూడదీసి మరీ తంతారంట కదా... అని నా గాళ్ఫ్రెండ్సందరూ వెక్కిరిస్తున్నా’రన్నాడు. ‘ఇప్పుడు వెక్కిరించినవారే... రేపు జేజేలు కొడతారు. నీకెందుకు నువ్ చేయ్’ అని నచ్చజెప్పాం. ఆ సినిమా విడుదలైన తర్వాత రాత్రికి రాత్రి ఎమ్మెస్రెడ్డిగారు, రామిరెడ్డి స్టార్స్ అయిపోయారు. సంగీత దర్శకుడు సత్యం గారి చివరి సినిమా ‘అంకుశం’. ఓ పాట మిగిలుండగానే కన్నుమూశారాయన. నేపథ్యగీతం. ఎవరితో చేయించాలా అనుకుంటుండగా, రచయిత రాజశ్రీ ముందుకొచ్చారు. ‘అంకుశం’ విడుదలయ్యాక ఓ రోజు నేను, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డిగారు ట్యాంక్‌బండ్ దగ్గర నిలబడ్డాం. అది నో పార్కింగ్ ప్లేస్. దాంతో ఇద్దరు పోలీసులు మా దగ్గరకొచ్చి, ‘ఫైన్ కట్టండి’ అన్నారు. దాంతో వారితో వాదన మొదలైంది. ఉన్నట్లుండి నాలుగు జీపులు వచ్చి అక్కడ ఆగాయి. అందులో నుంచి పోలీస్ ఉన్నతాధికారులు దిగారు. మమ్మల్ని చూసి పరుగుపరుగున మా వద్దకొచ్చారు. ‘ఆయన ఎవరనుకున్నారు? కోడి రామకృష్ణగారు. సెల్యూట్ కొట్టండి’ అని గద్దించారు. ‘మా పోలీసుల గౌరవాన్ని పెంచిన మనుషులు మీరు. మా వాళ్లు ఇలా ప్రవర్తించినందుకు సారీ సార్’ అన్నారు. తర్వాత ఓ ప్రభుత్వ వేడుకకు నన్ను అతిథిగా పిలిచి, పోలీస్ లాఠీ బహుమతిగా ఇచ్చారు. ఆ క్షణంలో ఎంత సంతృప్తి ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ ఆ లాఠీ నా దగ్గరే భద్రంగా ఉంది. ‘అంకుశం’ 20 పైచిలుకు కేంద్రాల్లో వందరోజులాడింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో ఏడాది ఆడింది. ఆ రోజుల్లో బాగా వసూలు చేసిందా సినిమా. తమిళ, మలయాళాల్లోకి అనువదిస్తే, అక్కడ కూడా విజయం సాధించిందీ సినిమా. ఆ పాత్ర మీదున్న ప్రేమతో చిరంజీవి గారు హిందీలో ‘ప్రతిబంధ్’గా చేసి, విజయం సాధించారు. నా కెరీర్లో ‘అంకుశం’ ఓ విలువైన రత్నం. ఇలాంటి మంచి సినిమాను నాతో చేయించిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్. మల్లెమాల గారి స్టయిలంటే నాకిష్టం. ఆయన మాట్లాడే తీరు సునిశితంగా, గమ్మత్తుగా ఉంటుంది. ఆయన లాంటి వ్యక్తి ఓ బడిపంతులైతే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన నుంచే ‘అంకుశం’లో సీఎం పాత్ర పుట్టింది. ఈ మాటే చెప్పి, ‘మీరే ఈ పాత్ర చేయా’లన్నాను. ముందు తటపటాయించినా.. తర్వాత సరే అన్నారు. -
దాసరి చేతుల మీదుగా కె . రాఘవకు ఘనసన్మానం
-
అవతారం మూవీ వర్కింగ్ స్టిల్స్
-
అవతారం మూవీ వర్కింగ్ స్టిల్స్
-
దర్శకుడు బీరం మస్తాన్‌రావు కన్నుమూత
సీనియర్ దర్శకుడు బీరం మస్తాన్‌రావు(70) మంగళవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు. కృష్ణ, శ్రీదేవి నటించిన ‘బుర్రిపాలెం బుల్లోడు’తో దర్శకునిగా పరిచయమైన ఆయన... ఎన్టీఆర్‌తో ‘ప్రేమ సింహాసనం’ చేశారు. అటుపై విప్లవ శంఖం, తల్లి గోదావరి మొదలగు ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. చంద్రమోహన్, జయశ్రీ జంటగా నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. పలు టీవీ సీరియళ్లను కూడా తెరకెక్కించిన మస్తాన్‌రావు, కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ‘రైల్వే కూలీ’లో విలన్‌గా చేశారు. త్వరలో విడుదల కానున్న ‘యామినీ చంద్రశేఖర్’ చిత్రంలో కూడా ఆయన నటించారు. మస్తాన్‌రావు తొలి భార్య నవీనలక్ష్మి 2005లో కన్నుమూశారు. దీంతో చిన్ననాటి స్నేహితురాలైన దేవీని మస్తాన్‌రావు ద్వితీయ వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో స్థిరపడిన బీరం మస్తాన్‌రావు రెండు నెలల క్రితం చెన్నై వెళ్లారు. అక్కినేని అంత్యక్రియలను టీవీలో చూస్తూ బాధతో గుండెపోటుకు గురయ్యారని,ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆసుపత్రిలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం ఉదయం చెన్నైలో శ్మశాన వాటికలో జరగనున్నాయి. -
అవతారం
సైన్స్‌లో జరిగే పరిణామాల కారణంగా ఒక గ్రహం భూమికి చేరువగా జరిగితే ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవతారం’. ఎం. కవిత సమర్పణలో అరుంధతి ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఎం. యుగంధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి, భానుప్రియ, రిషి ముఖ్య తారలు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సరికొత్త కథను కొత్త కోణంలో కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అమ్మోరు, అరుంధతి సాంకేతికంగా అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం టెక్నికల్‌గా మరో మెట్టు పైనే ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి అనుకున్న బడ్జెట్‌కన్నా ఎక్కువైంది. సినిమా నిర్మాణానికి కూడా ఎక్కువ సమయం పట్టింది. ఆలస్యం అయినా సినిమా అద్భుతంగా రావడంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కోడి రామకృష్ణ. -
గతాన్ని ఇష్టపడినవాడే..భవిష్యత్తుని మలుచుకోగలడు!
అరుంధతి, అంజి, అమ్మోరు... ఎలాంటి మనిషి ఈయన? అంటే?! దేవి, దేవుళ్లు, దేవీపుత్రుడు... ఏమీ స్పెషల్‌గా అనిపించడం లేదా? అన్నీ స్పెషలే కదా! అవన్నీ స్పెషలే. కోడి రామకృష్ణలో స్పెషలేమిటని? సెంటిమెంట్లు ఎక్కువలా ఉంది. పూర్వజన్మలపై మక్కువలా ఉంది. రెండూ కరెక్టే. మొదటిది ఇంకా కరెక్టు! రామకృష్ణ జననం పెద్ద సెంటిమెంటు. దాసరిగారి కారెక్కడం సెంటిమెంటు. చిరంజీవి పెట్టిన పరీక్ష సెంటిమెంటు. తలకు చుట్టుకున్న తుండుగుడ్డ సెంటిమెంటు. దేవతలపైనే కాదు, మనుషుల మీదా సినిమాలు తీశారు రామకృష్ణ. ఈ ఏడాది మరో రెండుమూడు రాబోతున్నాయి. మనుషులవా? దేవతలవా? ఏవైనా కావచ్చు. ఏడాదికొక్కటైనా సినిమా తియ్యాలన్న సెంటిమెంట్ అయనకుందో లేదో కానీ... ఆయన చిత్రం ఏడాదికొక్కటైనా రిలీజ్ అయితే బాగుంటుందనుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. కోడి లైఫ్‌లో కొత్త సినిమా కనిపిస్తుంది. మీ జీవితాన్ని ఓ పుస్తకం అనుకుంటే.. దానిలో పేజీలన్నీ దాదాపు అందరూ చదివినవే. మీకు తెలిసి చదవని పేజీలు ఏమైనా ఉన్నాయా? కోడి రామకృష్ణ: ఎందుకుండవ్.. ఉంటాయి. నాన్న జ్ఞాపకాలు, అమ్మ ఉత్తరాలు, స్కూల్‌డేస్‌లో తోటి విద్యార్థుల ఫిర్యాదులు, ఊళ్లో వేసిన నాటకాలు.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో. అలా అయితే... కొన్ని చెప్పండి? ముందు మీ బాల్యం. కోడి రామకృష్ణ: మాది పాలకొల్లు. నాన్న పేరు కోడి నరసింహమూర్తి, అమ్మపేరు చిట్టెమ్మ. మా అమ్మానాన్నలకు నేనంటే చాలా ఇష్టం. మా వీధిలో అందరూ నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే... నేను పుట్టాకే మా వీధిలో అందరికీ పిల్లలు పుట్టారట. దాంతో నేనంటే అందరికీ పెద్ద సెంటిమెంట్. ఎంత సెంటిమెంట్ అంటే.. నెల పొడుపు రోజున సాయంత్రం చంద్రుడు కనిపించగానే.. చూసినవారందరూ ఒక్కసారిగా కళ్లు మూసుకొని.. ‘పెద్దబాబూ.. రాముడూ..’ అని పెద్దగా అరిచేవారు. నేనెళ్లి.. ఒక్కొక్కర్నీ తాకేవాణ్ణి. అప్పుడు కళ్లు తెరిచి నా వైపు చూసేవారు. అంత సెంటిమెంట్! మా వీధిలో సెంటిమెంట్లు ఏ రేంజ్లో ఉండేవో చెప్పడానికి ఓ సరదా ఇన్సిడెంట్ చెబుతా. మా వీధిలో ఓ బ్రాహ్మలావిడ ఉండేది. వారి ఎదురింట్లో శిరోమణి అనే ఆవిడ ఉండేది. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఈవిడ శిరోమణిని తెగ తిడుతుండేది. ఓరోజు అనుకోకుండా శిరోమణి చనిపోయింది. ఆమె చావు తర్వాత కూడా ఈవిడ గొడవ మానలేదు. శిరోమణి పిల్లల్ని కూడా చీటికిమాటికీ తిట్టేది. ఓ రోజు ఉన్నట్లుండి బ్రాహ్మలావిడ వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది. కోడిమాంసం కావాలని గోల గోల. బ్రాహ్మణస్త్రీ చికెన్ అడగడమేంటని వీధంతా వింతగా చెప్పుకోవడం మొదలెట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, శిరోమణి దెయ్యమై.. ఆ బ్రాహ్మలావిడను పట్టిందట. ఆ శిరోమణి అమ్మకు బాగా పరిచయం. దాంతో అమ్మ వెళ్లి.. ‘శిరోమణి.. ఏంటే ఇదంతా..’ అంది. ‘ఇది నా పిల్లల్ని తిట్టిందక్కా.. దీంతో కోడిమాంసం తినిపించేదాకా వదల్ను’ అని బ్రాహ్మలామె. నాకేమో అంతా వింతగా ఉంది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో చెప్పి చూశారు. కానీ శిరోమణి ఆత్మ మాత్రం శాంతించడంలా. ‘మాంసం తేవాల్సిందే. దీంతో తినిపించాల్సిందే.. లేకపోతే నా పిల్లల్ని తిడుతుందా’ అని ఊగిపోతోంది. అప్పుడొచ్చాడు నాన్న. ‘ఏంటి?’ అనడిగితే.. విషయం చెప్పారు. సరాసరి ఆమె ముందుకెళ్లాడు. నాన్నను చూడగానే.. ఆమె కర్టెన్ చాటున దాక్కుంది. ‘ఏంటే ఇదంతా.. బ్రాహ్మలు కదా.. అలా చేయొచ్చా?’ అన్నాడు నాన్న. ‘ఏంటి బావగారూ మీరూ అలా మాట్లాడతారు. ఇది నన్ను తిట్టిందండీ... ఇప్పుడు నా పిల్లలమీద పడింది. అందుకే.. చికెన్ తినిపించేదాకా వదల్ను’ అంది ఏడుస్తూ... ‘తప్పే.. అలా చేయడం పాపమే. వెళ్లిపో.. నీ పిల్లల్ని నేను చూసుకుంటా. నాపై నమ్మకం ఉంటే వెళ్లిపో’ అని నాన్నా... ‘ఇది నా పిల్లల్ని తిట్టింది బావగారూ..’ అని ఆమె... ‘తిడితే చావగొడదాం సరేనా..’ అని నాన్న. ఎట్టకేలకు శాంతించిందామె. ‘ఓ అరటిపండు పెట్టండి వెళతా’ అంది. అమృతపాణీ తెప్పించి నాన్నే స్వయంగా వలిచి పెట్టారు. ఆ క్షణంలో నాన్న కళ్లలో నీళ్లు చూశా. ఆ పండు తినగానే.. ఆమెకు స్పృహ తప్పింది. చూస్తున్న నాకు ఇదంతా వింతగా అనిపించింది. చనిపోయాక కూడా నాన్నపై గౌరవం తగ్గకపోవడం గ్రేట్ అనిపించింది. దెయ్యాలు, భూతాలు నిజమని చెప్పను కానీ, మా వీధి సెంటిమెంట్లు అలా ఉండేవి. అమ్మానాన్నలతో మీ అనుబంధం? కోడి రామకృష్ణ: మా అమ్మానాన్నలకు నేను తొలిసంతానం. నా లైఫ్‌లో నేను చూసిన తొలి హీరో నాన్న. ఆయన రిటైర్డ్ మేజర్. మా నాన్న ఎంత చండశాసనుడో అంత అమాయకుడు కూడా. అప్పట్లోనే సినిమాల్లో వేషాలిప్పిస్తాం, సినిమాలు తీస్తాం అంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్‌లు మా ఊళ్లో తిరుగుతుండేవి. వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, వాళ్లందరితో కూల్డ్రింకులు తాగించి, నా ఫొటోలు చూపిస్తుండేవారు నాన్న. నేను స్కూల్నుంచి వచ్చేసరికి వారందరూ వరండాలో కూర్చొని ఉండేవారు. వాళ్లను చూసి సెలైంట్‌గా ఇంట్లోకెళ్లేవాణ్ణి. నా వెనకే నాన్న వచ్చేవాడు. ‘వాళ్లు సినిమా తీస్తారంటరా. నీ గురించి చెప్పాను. నీ ఫొటోలు కూడా చూపించాను’ అని గుసగుసగా చెప్పేవారు. ‘అయ్యో నాన్నా, వాళ్లు దొంగలు. వృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావ్. వాళ్లను పంపించేయ్’ అని మందలింపుగా చెప్పేవాణ్ణి. నిజం తెలుసుకొని వాళ్లను తరిమేసేవారు. ‘మనింట్లో డిగ్రీ చదివిన వాళ్లు లేరు. నువ్వు చదవాలి’ అని ఒకరోజు నాన్న నాతో అన్నారు. ‘మీ కోసం డిగ్రీ చదువుతాను. అయితే.. మధ్యలో ఎక్కడైనా తప్పితే మాత్రం అక్కడే ఆపేస్తా’ అని ఫిటింగ్ పెట్టాను. ‘నువ్వు తప్పవ్. నీపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు నాన్న. మేం నాటకం రిహార్సల్స్‌లో ఉండగా పీయూసీ రిజల్ట్స్ వచ్చాయి. నా నంబర్ పేపర్లో లేదు. తప్పాను. ఇక చదవనవసరం లేదు. నిర్ణయం తీసేసుకొని, ఇంటికెళ్లాను. అక్కడి పరిస్థితి చూడగానే షాక్. ఇరుగుపొరుగు వాళ్లకు నాన్న స్వీట్స్ పంచుతున్నారు. ‘ఓరి నాయనో.. ఈయన పేపర్ చూడలేదులా ఉంది..’ అనుకుంటూ ఆయన ముందుకెళ్లాను. నన్ను చూడగానే, ‘ఏయ్.. డిగ్రీ కూడా ఇలాగే పాసవ్వాలి. లేకపోతే చంపేస్తా’ అన్నారు ప్రౌడ్‌గా. నాకేమో అయోమయం! ఇంతలో మా తమ్ముడొచ్చి ‘నువ్వు సెకండ్‌క్లాస్‌లో పాసయ్యావ్రా’ అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను థర్డ్ క్లాస్‌లో మాత్రమే చూశానని, సెకండ్ క్లాస్‌లో చూడలేదని. కాలేజ్ టైమ్‌లో ప్రేమకథ ఏమైనా నడిపారా? కోడి రామకృష్ణ: అప్పట్లో మాకు ఆత్మీయత తెలుసు, అందం తెలుసు. మా ఆలోచనలు అంతవరకే. పరిధులు దాటేవి కావు. మీరు అడిగారు కాబట్టి గుర్తున్న ఓ సంఘటన చెబుతాను. కాలేజ్ టైమ్‌లో నాకు ఓ స్టడీరూమ్ ఉండేది. నేను బొమ్మలు బాగా వేసేవాణ్ణి. అందుకే... సైన్స్ రికార్డ్స్‌లో బొమ్మలు గీయించుకోవడానికి అమ్మాయిలు నా రూమ్కొచ్చేవారు. అందరూ లవ్లీగా ఉండేవారు. ఆ అమ్మాయిల్లో ‘5 నంబర్ గోల్డ్’ అనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తన రోల్ నంబర్ 5. ఇంటిపేరేమో ‘బంగారు’. అందుకే ‘5 నంబర్ గోల్డ్’ అని పిలిచేవాళ్లం. అసలు పేరు గుర్తులేదు. నాతో బొమ్మలు గీయించుకోవడానికి తానూ వచ్చేది. ఇంతమంది ఆడపిల్లలు నా దగ్గరకొస్తుంటే.. జెలసీగా ఫీలయ్యేవారు కూడా ఉంటారు కదా. ఎవడో వెళ్లి ‘5 నంబర్ గోల్డ్’ వాళ్ల అన్నయ్యకు చెప్పాడు ‘మీ చెల్లెలు రామకృష్ణతో క్లోజ్‌గా ఉంటోంది’ అని. నేను కాలేజ్‌కి వెళ్లే దారిలో వాళ్లన్నయ్య కాపు కాశాడు. నన్ను ఆపాడు. ‘జాగ్రత్త ఏమనుకున్నావో! ఏంటి? మా చెల్లితో మాట్లాడుతున్నావంట’ అన్నాడు సీరియస్‌గా. ‘మాట్లాడితే ఏమైంది’ అన్నాను. ‘మీ ఇద్దరూ దగ్గరగా ఉంటున్నారట’ అని సణిగాడు. ‘దగ్గరగా ఉంటే ఏమైందిరా?’ అని నేను దీటుగా ప్రశ్నించా. ‘సరేలే... నీ నాటకంలో నాకూ వేషం ఇస్తావా?’ అని అడిగాడు నింపాదిగా. ‘ఇస్తాలే’ అని మాటిచ్చాను. నా కాలేజ్ రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో. సినిమాపై మీ తొలి అడుగులు ఎలా పడ్డాయి? కోడి రామకృష్ణ: చిన్నప్పట్నుంచీ పెయింటింగ్ అంటే ఇష్టం. అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్లో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను. గోడల మీద వాటర్ పెయింటింగ్ బోర్డ్స్ రాసేవాణ్ణి. అలాగే.. ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా. సినిమా హాళ్లకు ‘పొగత్రాగరాదు’, ‘నిశ్శబ్దం’, ‘ముందు సీట్లపై కాళ్లు పెట్టరాదు’.. ఇలా రకరకాల స్లయిడ్స్ ఫ్రీగా చేసిచ్చేవాణ్ణి. ఆ స్లయిడ్స్కి ఓ మూల ‘కోడి రామకృష్ణ’ అని నా పేరు రాసుకునేవాణ్ణి. తెరపై నా పేరు చూసుకోడానికే థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ప్రొజెక్టర్ దగ్గర నిలబడి, నా స్లయిడ్ పడేదాకా ఉండి, తెరపై నా పేరును చూసుకొని అప్పుడు షాప్‌కి వెళ్లేవాణ్ణి. సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడే. అలాగే.. చిన్నప్పట్నుంచీ నాటకాల పిచ్చి. పసుపు, కుంకుమ, బొగ్గు, పౌడర్లతో మేకప్ చేసుకొని... వీధి మధ్యలో ఓ నులక మంచాన్ని నిలబెట్టి, దానికో తెరకట్టి పిల్లలందరం నాటకాలు వేసేవాళ్లం. రైటర్ని, డెరైక్టర్ని, హీరోని నేనే. మా వీధిలో కొన్ని కుటుంబాల్లో జరిగిన సంఘటనల్నే స్ఫూర్తిగా తీసుకొని కథల్ని, పాత్రల్ని సృష్టించేసేవాణ్ణి. లైవ్‌లో డైలాగులు చెప్పించేసేవాణ్ణి. తర్వాత ట్రూప్ నాటకాల స్థాయికి చేరా. పరిషత్తులకు కూడా వెళ్లేవాళ్లం. దాదాపు వందకు పైగానే నాటకాలు రాసి, ప్రదర్శించాను. నా ఫ్రెండ్ లైఫ్‌ని ప్రేరణగా తీసుకొని రాసిన ‘రేపు సెలవు’ నాటిక నాకు మంచి పేరు తెచ్చింది. అల్లు రామలింగయ్యగార్కి అప్పట్లో నాటకం ట్రూప్ ఉండేది. ‘ఆడది’ అనే కమర్షియల్ నాటకం ఆడుతూ ఉండేవారు. ఆ నాటకంలో నేనే హీరో. లింగయ్యగారు దర్శకుడు. ఇదిలావుంటే.. టి.నాగేశ్వరరావుగారనీ... పెయింటింగ్‌లో నా గురువు. ఆయన దగ్గర నేను లితోలకు వర్క్ చేసేవాణ్ణి. ఆయనకు ఓ ఫొటో స్టూడియో కూడా ఉంది. అక్కడ నా ఫొటోలు తీసి... ‘కొత్త హీరో కావాలి’ అనే ప్రకటన పేపర్లలో కనిపిస్తే పంపించేరు. నాకూ ఫస్ట్‌లో ఆర్టిస్ట్ అవ్వాలనే ఉండేది. అలాంటి టైమ్‌లోనే మా ఊళ్లో ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా దర్శకుడికి అదే తొలి సినిమా. ఏ వీధిలో చూసినా ఆ సినిమా డిస్కషనే. ఆ సినిమా సంచలనం చూశాక అనిపించింది... ‘యాక్టర్ అయితే... ఒక్క పాత్రనే చెప్పచ్చు. అదే డెరైక్టరయితే.. ఎన్నో పాత్రల్ని చెప్పొచ్చు’ అని. నాలో డెరైక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన ఆ సినిమానే ‘తాతా మనవడు’. ఆ డెరైక్టరే మా గురువుగారు దాసరి నారాయణరావు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. ఇదే నా ఆలోచన. మరి ఎలా కలిశారు? కోడి రామకృష్ణ: గురువుగార్ని నా చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నాను. ఆయన చదివిన స్కూల్లోనే నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఫారం.. ఆయనేమో ఇంటర్ సెకండియర్. ‘నేను నా స్కూల్’ అనే నాటికను గురువుగారు స్వయంగా రాసి మా స్కూల్లో ప్రదర్శించారు. గ్రీన్ రూమ్‌లో వాళ్లు మేకప్‌లు చేసుకుంటుంటే... మేమందరం కిటికీల్లోంచి చూసేవాళ్లం. ఆ రోజుల్లో సుబ్బరాయశాస్త్రిగారని మా స్కౌట్ మాస్టారు ‘పంచవర్ష ప్రణాళికలు’ అనే నాటికను రాశారు. దాన్ని గురువుగారు డెరైక్ట్ చేసి నటించారు. ఢిల్లీలో ఆ నాటికను ప్రదర్శిస్తే.. నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా గురువుగారినీ ఆయన ట్రూప్‌ని పాలకొల్లులో లారీపై ఊరేగించారు. ఆర్టిస్ట్ అయితే క్రేజ్ ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది. ‘తాతా మనవడు’ సూపర్‌హిట్ అయినప్పుడు... అదంతా నా అదృష్టమే అనుకున్నా. ఆ సినిమా యాభై రోజుల పండుగ సందర్భంగా గురువుగారు నేరుగా పాలకొల్లే వస్తున్నారనే సంగతి తెలిసింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే ‘జై ఆంధ్ర’ ఉద్యమం నడుస్తోంది. పైగా ‘తాతామనవడు’ రిలీజైన థియేటర్ వాళ్లకు, మా స్టూడెంట్లకు పడదు. అలాంటి వేడి వాతావరణంలో ఫంక్షన్. ఎలాగైనా ఫంక్షన్ పాడుచేయాలని స్టూడెంట్లందరూ కంకణం కట్టుకున్నారు. పైగా అప్పట్లో స్టూడెంట్ లీడర్ని నేనే.నాకేమో.. ఎలాగైనా గురువుగారిని కలిసి అవకాశం అడగాలనుంది. తోటి విద్యార్థులేమో.. ఫంక్షన్ పాడు చేయాలంటున్నారు. ఇక నేను అందర్నీ రిక్వెస్ట్ చేసుకున్నా. ‘గురువుగారు వస్తున్నారు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. అవకాశం అడగాలి. మళ్లీ ఇలాంటి అవకాశం రాదు.. ప్లీజ్’ అని బతిమాలుకున్నాను. దాంతో ఓ షరతుపై వాళ్లు ఒప్పుకున్నారు. అదేంటంటే... ‘మేం థియేటర్‌కి వస్తాం. నేల టికెట్లో కూర్చుంటాం. ఆ థియేటర్ ఓనర్గాడు.. ఎక్కువ తక్కువగా మాట్లాడితే మాత్రం కొట్టేస్తాం. అందుకు నువ్వు ‘ఓకే’ అయితే.. మేమూ ‘ఓకే’ అని. నాకేమో టెన్షన్. గురువుగారు, కె.రాఘవగారు, ఎస్వీ రంగారావుగారు ఇలా... అందరూ వచ్చారు. నేనెళ్లి ధైర్యంగా గురువుగార్ని కలిశాను. ‘మీ దగ్గర సహాయకునిగా చేరాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వండి సార్’ అని ప్రాధేయపడ్డాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ‘బీకాం చదువుతున్నాను సార్’ అని చెప్పాను. అయితే.. ‘పూర్తి చేసి రా’ అన్నారు. సన్మానపత్రం రాసి స్వయంగా చదివాను. అంతా ప్రశాంతంగా జరిగిపోతోంది అనుకుంటుండగా... ఆ థియేటర్ ఓనర్ మైక్‌లో మాట్లాడ్డం మొదలెట్టాడు. ‘పాలకొల్లుకే పేరు తెచ్చిపెట్టారు దాసరి. యువతరం దాసరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయనలా ఎదగాలి. అంతే కానీ... మీలా కుక్కల్లా, పందుల్లా వీధుల్లో తిరగడం కాదు కుర్రాళ్లు చేయాల్సింది’ అనేశాడు. ఇంకేముంది? వాతావరణం రణరంగాన్నే తలపించింది. ఏదిఏమైనా గురువుగారి మాట ప్రకారం బీకాం పూర్తి చేసి చెన్నయ్ రెలైక్కాను. వెళ్లగానే దాసరిగారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? కోడి రామకృష్ణ: ఆయన రిసీవింగ్ గమ్మత్తుగా జరిగింది. నేను పాలకొల్లులో ఉన్నప్పుడే.. కాకినాడలో ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్ జరిగింది. గురువుగారు వచ్చారని తెలిసి... కాకినాడ వెళ్లాను. నన్ను చూడగానే.. ఓ కేరక్టర్ ఇచ్చేశారు గురువుగారు. శారదగారికి అందులో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరిలో నేనొకణ్ణి. మా కాంబినేషన్ సీన్స్ తీసేసి, మద్రాస్ వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ మాత్రం మిగిలి ఉంది. దాన్ని మద్రాస్‌లోని శివాజీ గార్డెన్స్‌లో తీస్తున్నారు. నేను చేసిన పాత్రకు ఓ డూప్‌ని ఏర్పాటు చేశారు. కానీ అతగాడు సెట్ కావడం లేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో నేను మద్రాసు వచ్చి, గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్‌లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే.. ఆ యూనిట్‌కి ఆనందం ఆగలేదు. భలే వచ్చావయ్యా... అంటూ గబగబా.. కాస్ట్యూమ్స్ తొడిగేశారు. మేకప్ వేసేశారు. నాపై క్లాప్ కొడుతుండగా గురువుగారొచ్చారు. ‘అరే... ఎప్పుడొచ్చావ్. నీక్యారెక్టర్ పెద్దటెన్షనే పెట్టింది. భలే వచ్చావే. ఇక్కడకు రాగానే.. మొహానికి రంగేయించుకున్నావ్. క్లాప్ కొట్టించుకున్నావ్. అదృష్టవంతుడవయ్యా. ఇకనుంచి నువ్వు నాతోనే ఉంటావ్’ అని మాటిచ్చేశారు. ఆ రోజే ఆయన కారెక్కాను. అప్పట్నుంచి కారుల్లో తిరుగుతూనే ఉన్నాను. మీ తొలిచిత్రం ఇంట్లో ‘రామయ్య-వీధిలో కృష్ణయ్య’ విషయంలో ఏమైనా టెన్షన్ పడ్డారా? కోడి రామకృష్ణ: ఆ కథను నిర్మాత కె.రాఘవగారికి, చిరంజీవిగారికి చెప్పి, ఒప్పించే విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను. అయితే... విపరీతంగా టెన్షన్ పడ్డ సంఘటన ఒకటుంది. ఆ సినిమా షూటింగ్‌ని గోదావరి ఒడ్డున ప్లాన్ చేశాం. చిరంజీవి.. బోట్లో కూర్చొని కమలాపండు తింటున్నారు. నేనేమో నది ఒడ్డున ఇసుకలో కూర్చున్నాను. చిరంజీవిగారు కమలా పండు తొనలు వొలుస్తూ... ‘రామకృష్ణా.. ఈ తొన నీపై విసురుతున్నా.. నువ్వు దాన్ని నోటితో క్యాచ్ చేయాలి. పట్టుకుంటే... సినిమా హిట్. మిస్ చేశావా.. సినిమా ఫ్లాప్’ అన్నారు. తొలి సినిమా. పైగా నాకు సెంటిమెంట్లు ఎక్కువ. ‘సార్... ఇది అన్యాయం’ అని మొత్తుకుంటున్నా ఆయన వినలేదు. తొనను విసిరారు. ఆ తొనను ప్రాణాలను సైతం పణంగా పెట్టి నోటితో క్యాచ్ పట్టుకున్నాను. ఆ తొనను నేను పట్టుకున్న తీరు గుర్తొస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. చిరంజీవిగారు ఇప్పటికీ అంటుంటారు. ‘భలే పట్టుకున్నావ్ రామకృష్ణా.. అప్పుడు ఏదో అనేశాను కానీ.. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది.. నువ్వెంత టెన్షన్ పడ్డావో’ అని. ‘మంగమ్మగారి మనవడు’లో భానుమతిని మంగమ్మగా తీసుకోవడం మీ ఆలోచనేనా? కోడి రామకృష్ణ: అవును. ఆ ఆలోచన నాదే. అప్పటికి భార్గవ్ ఆర్ట్స్ బేనర్లో ‘ముక్కుపుడక’ సినిమా చేశాను. అది పెద్ద హిట్. రెండోసినిమా బాలకృష్ణతో చేద్దాం అన్నారు గోపాలరెడ్డి. కొంతమంది భయపెట్టారు. ‘ఎందుకు హీరోలతో తీయడం. ‘ముక్కుపుడక’లా మంచి కథల్తో వెళ్లొచ్చు కదా..’ అని. కానీ మొండిధైర్యంతో బాలయ్యతో వెళ్లాం. మంగమ్మ పాత్ర కథకు కీలకం. అందుకే భానుమతిగారైతే... కరెక్ట్ అని చెప్పాను. ఆమెతో తలనొప్పి అని, నచ్చకపోతే మధ్యలో వెళ్లిపోతుందని, పైగా మర్యాద లేకుండా మాట్లాడుతుందని ఏవేవో చెప్పారు. అవేమీ లెక్క చేయకుండా గోపాలరెడ్డిగారు, నేను భానుమతిగారిని కలిశాం. ‘మన్వాసనే’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామని, అందులో కాంతిమతి చేసిన పాత్రను తమరు చేయాలని చెప్పాను. భానుమతిగారితో కంపేర్ చేస్తే.. కాంతిమతి చాలా చిన్ననటి. ఆమె పాత్రకు భానుమతిగార్ని అడిగేసరికి ఆమె మొహంలో రంగులు మారాయి. ‘కాంతిమతి పాత్ర నేను చేయాలా?’ అన్నారు సీరియస్‌గా. ‘అమ్మా... పాత్రను మీకు తగ్గట్టుగా డెవలప్ చేశాం. మీరు చేస్తే తప్ప ఈ ప్రాజెక్ట్‌కి నిండుదనం రాదు’ అని బతిమాలాను. ఎలాగో ఒప్పుకున్నారు. ‘అది సరేకానీ... నిన్ను ఏమని పిలవాలయ్యా... మా వారిపేరు నీ పేరు ఒకటే. నిన్ను పేరు పెట్టి పిలవలేను. అందుకే ‘డెరైక్టర్’ అని పిలుస్తా సరేనా’ అన్నారు. అలాగేనమ్మా అన్నాను. ఆ విధంగా ‘మంగమ్మగారి మనవడు’ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ అందులో హీరో అంటే భానుమతి ఎలా రియాక్టయ్యారు? కోడి రామకృష్ణ: ఎనీఆర్గారంటే భానుమతిగారికీ అభిమానమే. ‘భానుమతిగారు కారు దిగగానే.. ముందు నువ్వే వెళ్లి డోర్ తీయ్’ అని ఎన్టీఆర్‌గారే బాలయ్యకు చెప్పారట. తండ్రి మాట ప్రకారం భానుమతిగారి కారు ఆగగానే.. స్వయంగా బాలయ్యే వెళ్లి డోర్ తీశారు. ఆ క్షణం భానుమతిగారిలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘మీ నాన్నలోని సంస్కారం మొత్తం నీలో ఉందిరా అబ్బాయ్’ అని పొంగిపోయారు. ఆమె ఎంత బోళామనిషో చెప్పడానికి ఇంకో ఇన్సిడెంట్ చెబుతాను. ‘మంగమ్మగారి మనవడు’లో కొన్ని డైలాగుల్ని కాస్త ఘాటుగానే రాశారు గణేశ్‌పాత్రో. భానుమతిగారిపై తొలి షాట్. ‘బావగారొచ్చారని బట్టలేసుకోకుండా నిలబడిందంట.. నీ లాంటి భయంగల బల్లి’ అనేది డైలాగ్. అది చదివి.. మరీ డైలాగు ఇంత ఘాటుగా ఉంటే ఎలాగురా.. నేను చెప్పను’ అనేశారు. ‘అమ్మా.. ప్లీజ్’ అని బతిమాలినా వినలేదు. ‘కొంచెం సరళంగా మార్చుకొని చెబుతా’ అన్నారు. సరే... అని ‘యాక్షన్’ చెప్పా... అంతకు ముందు చదివి ఉన్న డైలాగునే ఠకీమని చెప్పేశారు. ఆ సినిమా తీసింది ఓ పల్లెటూరిలో. దాంతో భానుమతిగారిని చూడటానికి తండోపతండాలుగా జనాలొచ్చేశారు. భానుమతిగారు ఈ డైలాగ్ చెప్పగానే... విజిల్సూ, కేకలు. ‘చూశారా.. మీరు మచ్చుకు ఒక్క డైలాగు చెబితేనే రెస్పాన్స్ ఎలా ఉందో. అదే ఇందులోని డైలాగులన్నీ ఇదే మూడ్‌తో చెప్పారంటే, స్పందన ఎలా ఉంటుందో అర్థంచేసుకోండి’ అన్నాను. ‘అంతేనంటావా.. సరే చెప్పేద్దాం’ అన్నారు. ఇక అప్పట్నుంచి ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగుల్నే చెప్పారు. అంతటి బోళా మనిషి ఆమె. భానుమతిగారితో చేయగలగడం నేను చేసుకున్న అదృష్టం. మంగమ్మగారి మనవడు, ముద్దులకృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమామయ్య.. ఈ చిత్రాల్ని పక్కనపెట్టి బాలకృష్ణ కెరీర్‌ని ఊహించలేం. ఉన్నట్టుండి ఇద్దరూ ఎందుకు బ్రేకయ్యారు? కోడి రామకృష్ణ: మేం బ్రేక్ అవలేదండీ... అన్నీ కుదిరితే మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. ‘భార్గవ్ ఆర్ట్స్’లో బాలయ్యతో నిజంగా గొప్ప సినిమాలే తీశాను. ఎస్.గోపాల్రెడ్డిగారిక్కూడా బాలయ్య అంటే అమితమైన అభిమానం. ‘మంగమ్మగారి మనవడు’ తర్వాత ఆయన టాప్‌స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్టే.. బాలయ్యతో ఏ సినిమా తీసినా.. అడక్కుండానే పారితోషికం పెంచేసేవారు గోపాల్‌రెడ్డి. ‘ముద్దులమావయ్య’ తర్వాత బాలయ్య దాదాపు నంబర్‌వన్ అయ్యారు. ఆయన పారితోషికం కూడా చాలా పెరిగిపోయింది. ‘ఇప్పుడు బాలయ్యతో మనం సినిమా తీస్తే... మనకోసం ఆయన పారితోషికం తగ్గించుకోవాలి. అలాంటి పరిస్థితి నా బాలయ్యకు రాకూడదు. ఆ స్థాయి పారితోషికం ఇచ్చే స్థాయికి మనం చేరుకున్నాకే సినిమా తీద్దాం’ అన్నారు గోపాల్‌రెడ్డి. అందుకే మళ్లీ భార్గవ్ ఆర్ట్స్‌లో మా ముగ్గురి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. మీ కాంబినేషన్లో ఓ జానపదం మొదలై, మధ్యలో ఆగిపోయింది. దానివిషయంలో గొడవలు జరిగాయని టాక్? కోడి రామకృష్ణ: అలాంటిదేం లేదు.. మేం ముగ్గురం పరస్పరం అభిమానించుకునేవాళ్లమే. కొందరు మధ్యవర్తుల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్తయింది. రెడ్డిగారు బతికుంటే..పూర్తి చేసేవాళ్లం. మీ నిర్మాతలు.. మరొకరితో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. కారణం? కోడి రామకృష్ణ: ప్రొడ్యూసర్‌కు తెలియకుండా నేను ఏదీ చేయను. నిర్మాత అభిరుచికి తగ్గట్టే కథల్ని ఎంచుకుంటాను. అభిరుచి లేని వ్యక్తులతో పనిచేయను. నా సినిమాల్లో కచ్చితంగా నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కోరుకుంటాను. ‘మీరు చూసిన పాత సినిమాల్లో మీకు బాగా నచ్చిన కథ ఏంటి? వాటిల్లో ఒక కథను ఎంచుకొని సినిమా తీయాల్సి వస్తే... ఏ కథను ఎంచుకుంటారు? అని మురారి గారిని అడిగాను. ‘ఆత్మీయులు సినిమా కథంటే ఇష్టం. దాన్ని మళ్లీ తీయాలని ఉంది’ అని చెప్పారు. వెంటనే ఆ రాత్రి ఆత్మీయులు సినిమా చూసి, ‘శ్రీనివాసకల్యాణం’ కథ చేశాను. ఇలా తొలినుంచి నిర్మాతను బట్టే నడుచుకుంటున్నా. అమ్మోరు, అరుంధతి సినిమాలను కూడా శ్యామ్ అభిరుచికి తగ్గట్టే తీసిపెట్టాను. ‘దేవి’ చేసినా, ‘దేవుళ్లు’ చేసినా అన్నీ నిర్మాతల అభిరుచికి తగ్గట్టే ఉంటాయి. సినిమా రషెస్ చూసి.. ‘మనం అనుకున్నదానికంటే సినిమా బాగా తీశారండీ..’ అని నిర్మాత అన్నప్పుడే నేను దర్శకునిగా సక్సెస్ సాధించినట్లు. నా సినిమా నిర్మాతకు నచ్చాలి. తర్వాతే జనాలకి. తలకు గుడ్డ కట్టుకుంటారు. చేతికి దారాలు. ఎందుకని? కోడి రామకృష్ణ: ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ని మద్రాస్ కొవలం బీచ్‌లో చేస్తున్నాం. నాకు గుర్తు అది మే నెల. విపరీతమైన ఎండలు. ఆ టైమ్‌లో మోకా రామారావుగారని ఎన్టీఆర్‌గారి కాస్ట్యూమర్. ‘మా పల్లెలో గోపాలుడు’కి కూడా కాస్ట్యూమర్ ఆయనే. ఓ మధ్యాహ్నం ఆయన నా దగ్గరకొచ్చి ‘మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది. ఎండలో అది బాగా ఎక్స్పోజ్ అయిపోతోంది’ అని తన బాక్స్‌లోంచి ఓ జేబు రుమాల తీసి నా నుదుటికి కట్టాడు. ఆ రోజు మొత్తం ఆ రుమాల అలాగే ఉంది. రెండోరోజు ఆయనే వచ్చి, ‘సార్ మీకు కట్టాక అనిపిస్తోంది. ఇది ఇప్పటిది కాదు.. ప్రీవియస్ బర్త్ది. నాకు తెలిసి చాలామంది ఇలా కట్టుకున్నారు కానీ... మీకు మ్యాచ్ అయినట్లు ఎవరికీ కాలేదు’ అని చెప్పి, ఓ టర్కీటవల్‌తో ప్రత్యేకంగా నా నుదురు కొలత ప్రకారం ఓ బ్యాండ్‌లా చేయించి, నాకిస్తే... కట్టుకున్నాను. అది చూసిన ప్రతివారూ బాగుంది అన్నారు. చివరకు బాలచందర్‌గారు కూడా. ఓ సారి ఆయన మా సెట్‌కి వచ్చారు. నన్ను చూసి ‘ఓసారి అద్దంలో చూసుకో’ అన్నారు. చూసుకుంటే.. నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలి ఉంది. దాని కారణంగా అందంగా కనిపిస్తున్నాను. అప్పుడన్నాడాయన.. ‘ఇది ఈ జన్మది కాదయ్యా... కచ్చితంగా పూర్వజన్మదే. అందుకే నీకు అంతబాగా అతికింది’ అని. అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయిపోయింది. నా ఫ్రెండ్సందరూ ఆస్ట్రాలజర్స్. వారందరూ ప్రతినెలా కొన్ని తాళ్లు, ఉంగరాలు పంపిస్తుంటారు. అవి కట్టుకోకపోయినా, ఉంగరాలు తొడుక్కోకపోయినా వాళ్లూరుకోరు. అందుకే వారికోసం అవన్నీ కట్టుకుంటా. ఒకవేళ అవన్నీ తీసేసినా... యాదృచ్ఛికంగా ఎవరో ఒకరు వచ్చి కట్టి వెళుతుంటారు. నిజంగా ఇది విచిత్రమే. సెంటిమెంట్లను నేను బాగా నమ్ముతాను. ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసుంటారు? కోడి రామకృష్ణ: అంకె ఎవరికీ చెప్పలేదు. మీకే చెబుతున్నా. ప్రస్తుతం అర్జున్‌తో చేస్తున్న సినిమా, అవతారం, పుట్టపర్తి సాయిబాబా చిత్రాలను మినహాయిస్తే... ఇప్పటికి 138 అయ్యాయి. ‘వందవ సినిమా ఫలానా’ అని చెప్పుకోవడం నాకిష్టంలేదు. అందుకే ఎవరికీ చెప్పలేదు. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అని ఓ సినిమా చేయబోతున్నాను. వెరైటీ కాన్సెప్ట్. ఆంజనేయుడు, నలుగురు పిల్లలు కథ ఇది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లబోతోంది. త్వరలోనే గురువుగార్ని క్రాస్ చేయబోతున్నారన్నమాట? కోడి రామకృష్ణ: ఆ మాటనకండి. ఆయనెక్కడ... నేనెక్కడ! - బుర్రా నరసింహ మీతో మాట్లాడుతుంటే అర్థమవుతోంది... మీరు గతాన్ని బాగా ఇష్టపడతారని..! కోడి రామకృష్ణ: గతాన్ని ఇష్టపడినవాడు మాత్రమే భవిష్యత్తుని అందంగా మలచుకోగలడు. నా సినిమా కథలన్నీ నా జీవితంలో ఎదురైన అనుభవాలు, అనుభూతులే. మీకో విషయం తెలుసా? నా కెరీర్ ప్రారంభంలో మా అమ్మరాసిన ఉత్తరాలు ఇప్పటికే నేను చదువుతుంటాను. ‘పెద్దోడా... నిన్ను ఓసారి నానమ్మ చూడాలంటోంది రా, అమ్మమ్మావాళ్లు మొన్న ఇంటికొచ్చి వెళ్లారు. నిన్ను పదే పదే అడిగారు. మామయ్య వాళ్లు నిన్ను చూడ్డానికి వస్తాం అంటున్నారు’ అంటూ మా ఇంటి విషయాలన్నీ ఉత్తరాల్లో రాసేది. ఆ ఉత్తరాలు తీసి అప్పుడప్పుడు చదువుతుంటాను. అవి చదివినప్పుడల్లా... ఆ కేరక్టర్లన్నీ మళ్లీ నా దగ్గరకు వచ్చి వెళుతుంటాయి. నన్ను పలకరిస్తుంటాయి. మీకోవిషయం తెలుసా? వాళ్లల్లో ఎవరూ బతికిలేరు. చివరకు మా అమ్మతో సహా. 150 సినిమాలు తీసిన దాసరి నుంచి 138 సినిమాలు తీసిన కోడి రామకృష్ణ లాంటి గ్రేట్ డెరైక్టర్ బయటకొచ్చారు. మరి మీ నుంచి గొప్ప దర్శకులు రాకపోవడానికి కారణం? కోడి రామకృష్ణ: గ్రేట్ డెరైక్టర్ అనిపించుకోవాలంటే... పట్టుదల అవసరం. పరిశీలనాత్మక దృష్టి అవసరం. నేను ఇరవైనాలుగ్గంటలూ గురువుగార్నే అబ్జర్వ్ చేస్తుండేవాణ్ణి. అదే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గురువుగారిలా నేను కూడా నాటకరంగం నుంచే వచ్చినవాణ్ణి. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది. పైగా మా భావాలను ధైర్యంగా మా గురువుగారికి చెప్పేవాళ్లం. అప్పట్లో గురువుగారి షూటింగ్‌లు రోజుకు నాలుగైదు జరుగుతుండేవి. ఓసారి స్క్రిప్ట్‌లో ఓ సన్నివేశం తృప్తిగా రాకపోవడంతో దాన్ని షూట్ చేయకుండా పక్కన పెట్టేశారు గురువుగారు. నేను ఆ సన్నివేశం గురించి అర్ధరాత్రి దాకా ఆలోచించి, అందులో ఓ చిన్న ఛేంజ్ చేసి, ఆ అర్ధరాత్రే గురువుగారి రూమ్ తలుపు తట్టాను. పద్మగారు తలుపు తీశారు. ‘ఏంటి రామకృష్ణ?’ అనడిగారు. ‘రేపు తీయబోయే సీన్ గురించి గురువుగారితో మాట్లాడాలి’ అన్నాను. ‘ఆయనతో పని చేసి ఆ పిచ్చి మీకూ తగులుకుంది. అర్ధరాత్రుళ్లు కూడా సినిమాల గోలేంట్రా’అని మందలించి, లోపలికి పంపించారు. ఆ టైమ్‌లో నేను రావడం చూసి ఎవరికైనా ఏమైనా జరిగిందేమోనని గురువుగారు కంగారు పడిపోయారు. ‘ఏంటి రామకృష్ణా..’ అన్నారు కంగారుగా. సీన్ గురించి చెప్పాను. ‘చాలా బాగుంది’ అని అభినందించారు. అయితే.. తెల్లారితే ఆ సీన్ తీయాలి. దానికి ఓ ముసలి మాస్టారు, 40 మంది పిల్లలు అవసరం. మాస్టారి పాత్రకు మా డెరైక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే దుర్గా నాగేశ్వరరావుగారిని తీసుకున్నాం. 40 మంది పిల్లల కోసం ఆ రాత్రి మొత్తం ఊరంతా తిరిగి, తెల్లారేసరికి 40 మంది పిల్లల్ని పోగు చేశాను. ఒక సహాయ దర్శకుణ్ణి అయ్యుండి, సినిమా కోసం అంత కష్టపడేవాణ్ణి. అంతగా ఆలోచించేవాణ్ణి. సినిమాను అంతగా ప్రేమించేవాణ్ణి. పైగా ‘ఇగో’ అంటే తెలీని గొప్ప గురువు మాకు దొరికారు. ‘స్వర్గం-నరకం’ ఎడిటింగ్ టైమ్‌లో అనుకుంటా... గురువుగారు ఓ డైలాగ్ చెప్పారు. మేం పగలపడి నవ్వాం. ‘ఏమయ్యా.. మీ గురువు... దర్శకుడిగా ఫెయిలైపోయాడనుకో.. డైలాగులు రాస్కునైనా బతకొచ్చు కదా’ అన్నారు. అంతగా కలిసిపోయేవారాయన. నా శిష్యులతో కూడా నేనూ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తా. ఒక మనిషి పైకి రావాలంటే.. ప్రతిభ, అదృష్టంతో పాటు పదిమంది సహకారం కూడా అవసరం. -
సరికొత్త అవతారం
భక్తిరసాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో కోడిరామకృష్ణది ఓ ప్రత్యేక శైలి. అమ్మోరు, దేవుళ్లు, త్రినేత్రం... చిత్రాలే అందుకు నిదర్శనాలు. త్వరలో ఆయన నిర్దేశకత్వంలో రాబోతున్న మరో డివోషనల్ మూవీ ‘అవతారం’. ఎం.యుగంధర్‌రెడ్డి నిర్మాత. కన్నడ నటి రాధిక ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. డిసెంబర్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి కోడి రామకృష్ణ మాట్లాడుతూ -‘‘సెంటిమెంట్‌కీ దుష్టశక్తికీ మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ. త్వరలో ఓ గ్రహం భూమిని ఢీకొట్టబోతోందన్న భయం ప్రజానీకానికి ఉంది. దానికి ప్రీ క్లైమాక్స్‌గా తీసుకొని అల్లిన కథే ‘అవతారం’. నన్ను కూడా ఎంతో ఇన్స్పైర్ చేసిన కథ ఇది. ఇందులో గ్రాఫిక్స్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. సినిమా సరికొత్త రీతిలో ఉంటుంది’’ అని తెలిపారు. రిషి కథానాయకునిగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీవెంకట్, సంగీతం: ఘంటాడి కృష్ణ, నిర్మాణ సహకారం: ఎన్.సతీష్‌కుమార్‌రెడ్డి, సమర్పణ: ఎం.కవిత.