దర్శక దిగ్విజయుడు | Special story on director kodi ramakrishna | Sakshi
Sakshi News home page

దర్శక దిగ్విజయుడు

Published Sat, Feb 23 2019 1:57 AM | Last Updated on Sat, Feb 23 2019 2:04 AM

Special story on director kodi ramakrishna - Sakshi

శిష్యగణంగా ఉండటం అంటే ఏమిటో, శిష్యగుణం కలిగి ఉండటం  అంటే ఏమిటో తెలిసిన చివరి తరం ప్రతినిధి నిష్క్రమించాడు. ఇళ్లల్లోని కథలు కనిపెట్టి, ఇంటి మనుషుల పాత్రలను సానబట్టి  డ్రామా పండించడం నేర్చిన నేటివ్‌ స్టోరీ టెల్లర్‌ వీడ్కోలు తీసుకున్నాడు. చెడు చేసే పెద్ద మనుషులను, దుష్ట రాజకీయవేత్తలను  పదే పదే చూపించి జాగ్రత్త సుమా అని హెచ్చరించిన  మేలుకొలుపు దివిటీధారి మరలి వెళ్లిపోయాడు. ఎందరో నటులకు జీవితం ఇచ్చి, ఎందరో నటులకు డైలాగ్‌ ఇచ్చి,  ఎందరో నిర్మాతలకు సినీ జీవితం ఇచ్చి ఒకటి కాదు రెండు కాదు  వందకు పైగా సినిమాలు తీసి కూడా నిరాడంబరంగా ఉండే  ఒక సాంకేతిక విశిష్టుడు చివరి ఊపిరి వదిలాడు. విద్య ప్రదర్శించేవాడు కాదు, విద్యను కొనసాగించేవాడే విజేత అని  నూటికి పైగా సినిమాలు తీసి కూడా సూపర్‌ హిట్లు ఇచ్చి నిలిచిన  దర్శక దిగ్విజయుడు అంబరాన క్లాప్, కట్‌ చెప్పడానికి  తలకు తెల్ల చేతిరుమాలు కట్టుకుని అమర సోపానాలపై కాలు మోపాడు. వెలిగే రెండు దీపపు సమ్మెల నడుమ  కోడి రామకృష్ణ టైటిల్‌ పడటం ఆనవాయితీ. ఇవాళ తన శిరస్సు వద్ద అఖండ కీర్తి దీపాన్ని వదిలి  ఆయన అశరీర ఆయువు పొందాడు.

పని రావాలంటే ముందు గురువు ఉండాలి. గురువు దగ్గర నేరుగా పని చేయవచ్చు. గురువును శిలగా ప్రతిష్టించుకుని కూడా నేర్చుకోవచ్చు. కాని గురువు ఉండటం మాత్రం తప్పనిసరి అని గ్రహించి గురుశుశ్రుష ద్వారా పని నేర్చుకుని సినిమా పరిశ్రమలో గురువు మెచ్చిన శిష్యుడిగా నిలిచిన దర్శకుడు కోడి రామకృష్ణ. దర్శకుల కర్మాగారం వంటి దాసరి నారాయణరావు వద్ద శిష్యులుగా పనిచేసిన బృందంలో కోడి రామకృష్ణ ముఖ్యుడు. దాసరి ‘స్వర్గం–నరకం’ తీస్తున్నప్పుడే ఆ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశాడు కోడి రామకృష్ణ. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో నటించాడు కూడా. దర్శకుడిగా పని నేర్చుకోవడం అంటే కథలో పాల్గొనడం, స్క్రిప్ట్‌ను కాపీ చేయగలగడం, అవసరమైతే సొంతగా రాయగలడం, కంటిన్యుటీ, నటీనటులకు డైలాగ్‌ చెప్పడం... ఈ పనులన్నీ కోడి రామకృష్ణ చురుగ్గా నేర్చుకున్నాడు. దాసరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు– ‘నా శిష్యులందరూ నేను తర్వాత తీయబోయే ఒక్కో సినిమాకు అసిస్టెంట్లుగా బుక్‌ అవుతూ ఉండేవారు. ఒక్క కోడి రామకృష్ణ మాత్రం రెండు సినిమాలకు అసిస్టెంట్‌గా బుక్‌ అయ్యేవాడు. అంత చురుగ్గా ఉండేవాడు’ అన్నారాయన. ఇండస్ట్రీలో గొప్ప గొప్ప నిర్మాతలందరూ చాకుల్లాంటి కొత్త కుర్రాళ్లను సరిగ్గా పట్టడం తెలిసినవారే. దాసరిని గుర్తించిన నిర్మాత కె.రాఘవే కోడి రామకృష్ణను కూడా గుర్తించాడు. కథ తయారు చేసుకో.. దర్శకుడిగా అవకాశం ఇస్తా అని చెప్పాడు. అలా కోడి రామకృష్ణ చేసిన తొలి సినిమాయే ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’. ఇందులో చిరంజీవి హీరో. చిత్రమేమిటంటే ఆ సినిమా తొలి రోజు ముహూర్తం షాట్‌కు కెమెరా రన్‌ కాలేదు. సెంటిమెంట్ల పుట్ట అయిన సినిమా ఇండస్ట్రీలో ఇంతకు మించి దుశ్శకునం లేదు. యూనిట్‌లో అందరూ కోడి రామకృష్ణను జాలిగా చూశారు. ఇంకొకరైతే అప్పుడే కుదేలయ్యేవారేగాని కోడి రామకృష్ణ ధైర్యంగా నిలబడి మరుసటి రోజూ సినిమాను మొదలెట్టాడు. అంతేనా? చివరి ఊపిరి విడిచే వరకూ కెమెరాను రన్‌ చేస్తూనే ఉన్నాడు.

అచ్చొచ్చిన నెల్లూరు జిల్లా
కోడి రామకృష్ణది పాలకొల్లు అని అందరికీ తెలుసు. కాని ఆయనకు అచ్చొచ్చిన జిల్లా మాత్రం నెల్లూరు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు నిర్మాతలు కోడి రామకృష్ణ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. వారు ఒకరు ఎస్‌.గోపాల్‌రెడ్డి. మరొకరు మల్లెమాల (ఎమ్మెస్‌ రెడ్డి) లేదా వారి అబ్బాయి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి. ‘భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌’ ప్రారంభించి మొదట డబ్బింగ్‌ సినిమాలు చేసి ఆ తర్వాత నేరుగా సినిమాలు తీయడానికి సిద్ధపడిన ఎస్‌.గోపాల్‌రెడ్డి కోడి రామకృష్ణకు ‘ముక్కుపుడక’ తీసే అవకాశం ఇచ్చారు. ఇది తమిళ రీమేక్‌. తమిళంలో దర్శకుడు మణివణ్ణన్‌ తీసిన ఆ సినిమాను తెలుగులో కోడి రామకృష్ణ ఇక్కడి నేటివిటీకి తగ్గ మార్పులు చేసి తమిళంలో కంటే తెలుగులోనే బాగుంది అన్నట్టు తీశాడు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఆడవాళ్లు క్యూ కట్టి మరీ ఆ సినిమా చూశారు. భార్య భౌతిక సౌందర్యం కంటే ఆత్మిక సౌందర్యం చూడటం ముఖ్యం అని చెప్పిన ఆ సినిమాతో కోడి రామకృష్ణ తన స్థానం స్థిరపరుచుకున్నాడు. ఆ తర్వాత భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌ కింద ‘మంగమ్మగారి మనవడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మన్నెంలో మొనగాడు’, ‘మువ్వ గోపాలుడు’, ‘మురళీ కృష్ణుడు’, ‘మధురానగరిలో’, ‘అల్లరి పిల్ల’ తదితర సినిమాలు తీసి దానిని హిట్‌ బేనర్‌గా నిలిపి తాను హిట్‌ డైరెక్టర్‌గా కొనసాగాడు.

కలెక్షన్లకు ‘స్పాట్‌’ పెట్టిన అంకుశం
కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రయాణంలో మరో ముఖ్య మజిలీ ఎం.ఎస్‌.ఆర్ట్‌ మూవీస్‌ బేనర్‌ కింద శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డితో కలిసి సినిమాలు తీయడం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ పెద్ద హిట్‌ అయ్యాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘అంకుశం’ చరిత్ర సృష్టించడమే కాదు రాజశేఖర్‌కు ఒక జీవితకాల స్థిరత్వం సినిమా ఇండస్ట్రీలో తెచ్చి పెట్టింది. గమనించి చూస్తే ‘అంకుశం’ హిందీ క్లాసిక్‌ ‘జంజీర్‌’ కథతో పోలి ఉన్నప్పటికీ ‘జంజీర్‌’లో నల్ల బజారు బ్యాక్‌గ్రౌండ్‌ను ‘అంకుశం’లో రాజకీయాల బ్యాక్‌గ్రౌండ్‌గా మార్చడంలో కోడి రామకృష్ణ ప్రతిభ కనిపిస్తుంది. అధికార పక్షం, ప్రతిపక్షం రాజకీయాలు, కుట్రలు, అందుకు రౌడీయిజాన్ని వాడుకోవడం ఇవన్నీ అప్పటి సమకాలీన రాజకీయాలతో ప్రేక్షకులు పోల్చుకునేలా కోడి రామకృష్ణ సినిమా తీయడంతో ప్రేక్షకులు పదే పదే ఈ సినిమాను చూశారు. ఇందులోనే విలన్‌ రామిరెడ్డి ఇంట్రడ్యూస్‌ అయ్యారు. ఆయన చెప్పిన ‘స్పాట్‌ పెడ్తా’ డైలాగ్‌ ఇప్పటికీ సగటు ప్రేక్షకుడి నోట్లో నానుతూనే ఉంది. నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి ఈ సినిమాలో డౌన్‌ టు ఎర్త్‌గా ఉండే ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించడం కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అంటే మెగాస్టార్‌ చిరంజీవి హిందీలో దీని రీమేక్‌లో నటించాడు. ఆ తర్వాత కోడి రామకృష్ణ–శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కలిసి ‘అమ్మోరు’, ‘అంజి’, ‘అరుంధతి’ సినిమాలు చేశారు.

చిన్న సినిమాల పెద్ద దర్శకుడు

కోడి రామకృష్ణ కెరీర్‌ ఊపు మీద ఉన్నప్పుడు ఆయనతో సమాంతరంగా సినిమాలు తీస్తున్న మరో దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి. అయితే కోదండరామిరెడ్డి కమర్షియల్‌ కథాంశాలను ఎక్కువగా ఎంచుకుంటుంటే ఏదో ఒక మెసేజ్‌ ఉండే కుటుంబ కథలు, చిన్న సినిమాలు కోడి రామకృష్ణ ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఆర్టిస్ట్‌లను బట్టి, నిర్మాతను బట్టి, బడ్జెట్‌ను బట్టి కథలు సిద్ధం చేసుకుని సినిమాలు అప్పటికప్పుడు వేగంగా తీయడంలో ఆయన సిద్ధహస్తం సాధించాడు. ‘మా ఇంటికి రండి’, ‘మూ డిళ్ల ముచ్చట’, ‘ఇంటి దొంగ’, ‘స్టేషన్‌ మాస్టర్‌’, ‘పెళ్లాం చెబితే వినాలి’, ‘మా ఊరి మహారాజు’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘పెళ్లి’, ‘ఆవిడే శ్యామల’, ‘పుట్టింటికి రా చెల్లి’... ఇవన్నీ కోడి రామకృష్ణ పండించిన ఫ్యామిలీ డ్రామాలు. హిట్‌ కోసం ఎదురు చూస్తున్న జయభేరి ఆర్ట్స్‌కు ‘పెళ్లాం చెబితే వినాలి’ వంటి భారీ హిట్‌ ఇచ్చి డబ్బులు వచ్చేలా చేశాడాయన. రామ్‌ ప్రసాద్‌ ఆర్ట్స్‌ నిర్మాత ఎన్‌.రామలింగేశ్వరరావుకు ‘పెళ్లి’ సినిమా ఘన విజయం మంచి లాభాలు తెచ్చి పెట్టింది. స్త్రీ, కుటుంబమూ లేనిదే సమాజము లేదు. కనుక కథలో ఆ రెండు అంశాలు ఉంటే దానితో ఐడెంటిఫై అయ్యే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది అని గ్రహించిన దర్శకుడాయన. అందుకే మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ నుంచి ‘అరుంధతి’ దాకా ఆయన స్త్రీ అంశ ఉండేలా చూసుకుంటూనే సినిమాలు తీశాడు.

ఎం.ఎస్‌. రాజుతో శత్రువు
తెలుగులో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఇచ్చిన సంస్థ సుమంత్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ నిలదొక్కుకోవడానికి కోడి రామకృష్ణ ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. నిర్మాత ఎం.ఎస్‌.రాజు సుమంత్‌ ప్రొడక్షన్‌ బేనర్‌ మీద కోడి రామకృష్ణ దర్శకత్వంలో తీసిన తొలి సినిమా ‘శత్రువు’ భారీ విజయం నమోదు చేసింది. వెంకటేశ్, విజయశాంతి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. అప్పటికే విజయశాంతికి ‘లేడీ అమితాబ్‌’ ఇమేజ్‌ రావడంతో ఆమెను డ్యూయల్‌ రోల్‌గా పెట్టి కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే ‘పోలీస్‌ లాకప్‌’ తీశాడు ఎం.ఎస్‌.రాజు. అది కూడా భారీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత బి.గోపాల్‌ దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్‌గా ఎం.ఎస్‌.రాజు తీసిన ‘స్ట్రీట్‌ ఫైటర్‌’ ఘోర పరాజయం పొందింది.  ఎం.ఎస్‌.రాజుకు తీవ్ర నష్టాలు తెచ్చి పెట్టింది. ఆ బేనర్‌ను తిరిగి ‘దేవి’ హిట్‌తో కోలుకునేలా చేశాడు కోడి రామకృష్ణ. అదే బేనర్‌పై వెంకటేశ్‌తో ‘దేవీపుత్రుడు’ తీశాడాయన.

పొలిటికల్‌ సినిమాల పండితుడు
కోడి రామకృష్ణకు రాజకీయాలపై ఆసక్తి మెండు. రాజకీయ నాయకులే కాదు నిజజీవిత రౌడీలు కూడా ఆయనకు పరిచయం. వారి పాత్రలను సినిమాల్లో వాడేవాడాయన. ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘20వ శతాబ్దం’, ‘భారత్‌బంద్‌’, ‘రాజధాని’... ఇవన్నీ రాజకీయ కథాంశంతో ఆయన తీసిన సినిమాలు. వీటిలో ‘భారత్‌బంద్‌’ సంచలనం సృష్టించింది. 1990లలో దేశవ్యాప్తంగా బంద్‌లు విపరీతంగా నడిచేవి. వీటిని విమర్శిస్తూ రాజకీయ నాయకుల స్వార్థానికి ఈ బంద్‌లు ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ సినిమాలో చూపించాడాయన. 

స్పెషల్‌ ఎఫెక్ట్స్‌కు ఆద్యుడు
తెలుగు సినిమాల్లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తీయడం ‘అమ్మోరు’ సినిమాతో మొదలైంది. 1995 నాటికి సాంకేతికంగా పెద్ద ఏర్పాట్లు లేకపోయినా ‘అమ్మోరు’లో నిర్మాత శ్యాం ప్రసాద్‌ రెడ్డి సహకారం వల్ల అవసరమైన స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సృష్టించి ప్రేక్షకులను థ్రిల్‌ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఆ తర్వాత ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’ సినిమాల్లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ప్రాముఖ్యం పెంచుకుంటూ వెళ్లాడు. ‘అరుంధతి’లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ఆ సినిమా కలెక్షన్లే చెప్పాయి.

అలుపెరుగని యాత్రికుడు
ఇవాళ్టి దర్శకులు సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారు. పది సినిమాలకే కెరీర్‌ ముగిసిపోయే స్థితికి చేరుకుంటున్నారు. అలాంటిది కోడి రామకృష్ణ 100కు పైగా సినిమాలు తీయడమంటే ఎప్పటికప్పుడు కథలను, కథాంశాలను మెరుగు పరుచుకుంటూ వెళ్లడమే కారణం. ఆయన కామెడీలు తీశాడు. ఫ్యామిలీ డ్రామా తీశాడు. సోషియో ఫ్యాంటసీ తీశాడు. జేమ్స్‌బాండ్‌ ఫిల్మ్స్‌ తీశాడు. పొలిటికల్‌ సబ్జెక్ట్స్‌ తీశాడు. ఏది తీసినా ప్రేక్షకుడు సీట్‌లో కూచోగలిగేలా తీశాడు. కోడి రామకృష్ణ సక్సెస్‌ రేట్‌ ఎక్కువ. ఆయన ఇచ్చిన సూపర్‌ హిట్స్, హిట్స్, యావరేజ్‌ సినిమాలతో పోల్చితే ఫెయిల్యూర్‌గా నిలిచిన సినిమాల సంఖ్య పరిగణనలోకి రాదు. సినిమా విద్యను అభ్యసించకపోయినా, హాలీవుడ్‌ సినిమాల వంటి వాటి ప్రభావం ఏమీ లేకపోయినా కేవలం దేశీయమైన తెలివితేటలతో, సృజనతో, కామన్‌సెన్స్‌తో ఆయన సినిమాలు తీసి ప్రేక్షకుల అభిమానం పొందాడు.  ఆయన స్ఫూర్తి తప్పక కొనసాగుతుంది.ఆయన ప్రభావం రాబోవు తరాల మీద తప్పక ఉంటుంది.

బాలకృష్ణ కెరీర్‌కు  మలుపు ‘మంగమ్మ గారి మనవడు’
బాలకృష్ణ సోలో హీరోగా 1983లో ‘సాహసమే జీవితం’ సినిమాతో ప్రేక్షకుల మధ్యకు వచ్చాడు. కాని ఆ సినిమా విజయవంతం కాలేదు. ‘డిస్కో డాన్సర్‌’ ఆధారంగా తీసిన ‘డిస్కో కింగ్‌’ కూడా బాక్సాఫీస్‌ దగ్గర వీగిపోయింది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలోని ‘జననీ జన్మభూమి’ పరిస్థితి కూడా అంతే. కెరీర్‌ మంచి హిట్‌ను డిమాండ్‌ చేస్తున్నప్పుడు ఆ హిట్‌ ఇచ్చి బాలకృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు కోడి రామకృష్ణ. ‘మంగమ్మగారి మనవడు’ (1994) బాలకృష్ణ తొలి సూపర్‌ హిట్‌గా నిలిచింది. నిజానికి ఇది తమిళంలో భారతీరాజా తీసిన సినిమా. కాని యథాతథంగా చూస్తే తెలుగు ప్రేక్షకులు చూడరని కోడి రామకృష్ణ మార్పులు చేశారు. పల్లె పదాలు, సామెతలు దట్టించారు. వై.విజయ వంటి వ్యాంప్‌ పాత్రలు కల్పించారు. దాంతో సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత కూడా మళ్లీ బాలకృష్ణకు సరైన హిట్‌ పడలేదు. ‘కత్తుల కొండయ్య’, ‘భలే తమ్ముడు’, ‘నిప్పులాంటి మనిషి’, ‘పట్టాభిషేకం’ వంటి సినిమాల తర్వాత బాలకృష్ణకు ‘ముద్దుల కృష్ణయ్య’తో తిరిగి మరో పెద్ద హిట్‌ ఇచ్చాడు కోడి రామకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతి పెద్ద హిట్‌ ‘ముద్దుల మావయ్య’. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ఎస్‌.గోపాల్‌రెడ్డి ప్రారంభించిన జానపద చిత్రం కొన్ని షెడ్యూల్స్‌ తర్వాత ఆగిపోయింది. ఆ సినిమా ప్రభావం నిర్మాత ఎస్‌.గోపాల్‌ రెడ్డి మీద పడిందని అంటారు.

విమర్శ ఎదుర్కొన్న పల్లె శృంగారం
కోడి రామకృష్ణ సినిమాల్లో ఒక దశలో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ‘మంగమ్మ గారి మనవడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘ముద్దుల కృష్ణయ్య’ సినిమాల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు శ్రుతిమించాయనే విమర్శ వచ్చింది. ‘ముద్దుల కృష్ణయ్య’ను బూతుల కృష్ణయ్య అని విమర్శకులు వాత వేశారు. ఆ సంగతి ఎలా ఉన్నా కొత్త కొత్త ఊతపదాలు పాత్రలకు పెట్టి హిట్‌ కొట్టడంలో కోడి రామకృష్ణ నేర్పరి. ‘తలంబ్రాలు’ సినిమాలో రాజశేఖర్‌ చెప్పిన ‘మటాష్‌’ డైలాగ్‌ ఇప్పటికీ వాడుకలో ఉంది. ‘శత్రువు’లో కోట శ్రీనివాసరావు చీటికి మాటికి ‘థ్యాంక్స్‌’ అంటూ ఉండటం కొత్త మేనరిజమ్‌. ‘అరుంధతి’లో ‘వదల బొమ్మాళీ వదల’ కూడా చాలా పెద్ద హిట్టే.

తిరిగి పని చేయని మేజిక్‌
కోడి రామకృష్ణ– చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’ సూపర్‌ డూపర్‌ హిట్‌. అయితే ఆ మేజిక్‌ రిపీట్‌ కాలేదనే చెప్పాలి. వారి కాంబినేషన్‌లో ఆ తర్వాత ‘సింహపురి సింహం’, ‘గూఢచారి నం.1’, ‘రిక్షావోడు’, ‘అంజి’ వచ్చాయి. అయితే అన్నీ కూడా ఆ స్థాయి కలెక్షన్లు సాధించలేదు. మెగా కాంపౌండ్‌ నుంచి ఇతర హీరోలు కూడా ఆయనతో పని చేయలేదు.

ఎందరో నటులకు కెరీర్‌ ప్రదాత
కోడి రామకృష్ణకు నాటక రంగంతో పరిచయం ఉంది. అందువల్ల ఎవరు డైలాగ్‌ బాగా చెప్పగలరో ఎవరు ఎలా డైలాగ్‌ చెప్తే హిట్‌ అవుతారో ఆయనకు తెలుసు. కోడి రామకృష్ణ తన కెరీర్‌లో ఎందరో నటులకు బ్రేక్‌ ఇచ్చారు. చాలామందిని పరిచయం చేశారు. రాజశేఖర్‌కు యాంగ్రీ యంగ్‌ హీరో ఇమేజ్‌ను ‘అంకుశం’తో ఇచ్చారాయన. వై.విజయను ‘పులుసు’ పాత్రతో ప్రేక్షకులకు ఫెమిలియర్‌ చేశారు. హాస్యనటుడు బాబూమోహన్‌కు ‘అంకుశం’లో ‘పాయే’ డైలాగ్‌ ఇచ్చి హిట్‌ చేసింది ఆయనే. విలన్‌ రామిరెడ్డిని ఇంట్రడ్యూస్‌ చేసింది ఆయనే. కాస్ట్యూమ్స్‌ రంగంలో బిజీగా ఉన్న కృష్ణను ‘భారత్‌బంద్‌’లో విలన్‌గా మార్చి నటుడుగా ఆయనను చాలా బిజీ స్థాయికి తీసుకెళ్లాడు కోడి రామకృష్ణ. నిర్మాత అశోక్‌ కుమార్‌ను నటుడుగా మార్చాడు. ఎన్‌.టి.ఆర్‌ సోదరుని కుమారుడైన కల్యాణ చక్రవర్తిని హీరోగా నిలబెట్టింది కోడి రామకృష్ణే. నటుడు అర్జున్‌ను ‘మా పల్లెలో గోపాలుడు’ హిట్‌తో తెలుగు రంగంలో స్థిరపడేలా చేశాడాయన. నటుడు గొల్లపూడి మారుతీరావును ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో సినిమా రంగానికి నటుడుగా పరిచయం చేశాడు. ఆహుతి ప్రసాద్‌ను ‘ఆహుతి’లో ఇంట్రడ్యూస్‌ చేశాడు. నటుడు చిన్నాకు ఉన్న సీరియస్‌ ఇమేజ్‌ను మార్చి అతడు కామెడీ చేయగలడని ‘మధురానగరిలో’, ‘అల్లరి పిల్ల’ సినిమాలతో నిరూపించాడాయన. వినోద్‌ కుమార్, భానుచందర్, సుమన్‌ల కెరీర్‌ కోడి రామకృష్ణ సినిమాల వల్ల స్థిరపడింది.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement