చిరుతో సినిమా నా కల: అనిల్‌ రావిపూడి | Director Anil Ravipudi Says My Dream Is Work With Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరుతో సినిమా నా కల: అనిల్‌ రావిపూడి

Published Sat, May 2 2020 1:51 PM | Last Updated on Sat, May 2 2020 3:49 PM

Director Anil Ravipudi Says My Dream Is Work With Chiranjeevi - Sakshi

సూపర్ ‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సాధించిన విజయంతో దర్శకుడు అనిల్ రావిపూడి దూసుకుపోతున్నారు. కామెడీ పండిస్తూ, కమర్షియల్‌గా కాసుల పంట పండించే చిత్రాలను తెరకెక్కించే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అనిల్‌ తీసే అన్ని సినిమాల్లో తన మార్క్‌​ హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. గతేడాది విక్టరీ వెంకష్‌, మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటించిన ఎఫ్‌2 మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా అనిల్‌ ఓ ఇంటర్వ్యులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయటం నా కల. చిరు కోసం ఓ కథకు సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నా త్వరలో ఆయనకు వినిపిస్తాను. ప్రస్తుతం నేను ఎఫ్‌3 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాను. గతేడాది వచ్చిన ఎఫ్‌2 సినిమా కంటే రెట్టింపు స్థాయిలో ప్రేక్షకులకు వినోదం అందిస్తుంది. అదే విధంగా లెజెండ్‌ బాలకృష్ణ స్థాయికి తగిన ఓ కథ కూడా నా దగ్గర ఉంది త్వరలో ఆయన ముందుకు తీసుకువెళతాను. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు ప్రస్తుతం వారు చేస్తున్న చిత్రాల్లో బిజీగా ఉండాల్సింది. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం వారి సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి.

నేను సిద్ధం చేస్తున్న కథల విషయంలో చిరంజీవి, బాలకృష్ణ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని నమ్ముతున్నా’ అని అనిల్‌ రావిపూడి తన మనసులోని మాట చెప్పుకొచ్చారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం డైరెక్టర్‌ బాబీ కథను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా తీయాలన్న ఎఫ్‌2 దర్శకుడు అనిల్‌ రావిపూడి కల నెరవేరుతుందో చూడాలి మరీ. 
        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement