‘‘నాన్నగారికి వివక్ష ఉండేది కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అనేవారు. అందుకే తన ఇద్దరి కూతుళ్లకు లేనిపోని ఆంక్షలు పెట్టలేదు. ‘మీరెలా ఉండాలను కుంటున్నారో అలా ఉండండి. అయితే ఏ పని చేసినా నిజాయతీగా చేయండి. పద్ధతిగా ఉండండి’ అనేవారు. నాన్నగారు వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆయన లేని లోటు మాకు ఎప్పటికీ తెలుస్తుంది’’ అన్నారు దివ్య దీప్తి. కోడి రామకృష్ణ, పద్మశ్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి దివ్య దీప్తి, రెండో కుమార్తె ప్రవల్లిక. ‘సాక్షి’తో దివ్య దీప్తి ప్రత్యేకంగా మాట్లాడారు.
మీ నాన్నగారిని ఆస్పత్రిలో ఎప్పుడు చేర్చారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉండేది?
రెండు మూడు రోజుల క్రితం చేర్చాం. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ‘ఇట్స్ ఓకే. ట్రీట్‌మెంట్ అయ్యాక ఇంటికి వెళ్లిపోవచ్చు’ అంటుండేవారు. నాన్నగారికి విల్ పవర్ చాలా ఎక్కువ. అందుకే ఫస్ట్ టైమ్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా త్వరగా కోలుకున్నారు.
ఏ ఇయర్‌లో హార్ట్ ఎటాక్ వచ్చింది?
2012లో. అప్పుడు బైపాస్ చేశారు. అయితే తనకో పెద్ద ఆపరేషన్ జరిగిందనే ఫీలింగ్ ఉండేది కాదు. చాలా కూల్‌గా త్వరగా కోలుకున్నారు. కొంత కాలంగా çసరిగ్గా నడవలేకపోతున్నారు పెరాలసిస్ అని ఇండస్ట్రీలో కొందరు అంటుంటారు... పెరాలసిస్ (పక్షవాతం) లాంటిది ఏమీ లేదండి. నాన్న కాళ్ళకి చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. కర్ర సాయంతో నడవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఎవరో ఒకరిని సాయంగా పట్టుకొని నడిచేవారు.
ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారు?
అమ్మ, చెల్లి నాతోనే మాట్లాడారు. మాతో మాట్లాడిన తర్వాతే వెంటిలేటర్‌లోకి వెళ్లారు.
ఇలా జరుగుతుందనే డౌట్ లాంటిదేమైనా మీ నాన్నగారికి?
అస్సలు లేదు. ఏం ఫర్వాలేదు.. ఇంటికెళ్లిపోతాం అని ధైర్యం చెప్పారు.
మీరు ఎదిగే టైమ్‌లో మీ నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. మీరు బాగా మిస్సయ్యేవారేమో?
నాకు బాగా గుర్తు. సాయంత్రం ఫ్లైట్‌కి వచ్చి మమ్మల్ని చూసి, కాసేపు టైమ్ స్పెండ్ చేసి మళ్లీ నైట్ ఫ్లైట్‌కి వెళ్ళిపోయేవారు. ఎప్పుడూ నాలుగైదు సినిమాలతో బిజీ. సినిమాలంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. వేరే వ్యాపకం ఏమీ ఉండేది కాదు. పిల్లలకు ఏం కావాలో చూసుకో అని అమ్మతో అనేవారు. మాకు మాత్రం ‘ఎవరితో ఒక్క మాట అనిపించుకోకుండా ఉండాలి. హ్యాపీగా ఉండండి. సాదాసీదాగా ఉండాలి. పెద్దవాళ్లను గౌరవించాలి. చిన్నవాళ్లతో చక్కగా మాట్లాడాలి’ అని చెప్పేవారు.
షూటింగ్ లొకేషన్స్‌కి మిమ్మల్ని, మీ చెల్లెల్ని తీసుకువెళ్లేవారా? అప్పట్లో ఇండస్ట్రీ చెన్నైలో ఉండేదా? మీ ఇద్దరూ అక్కడే పుట్టారా?
మేం అక్కడే పుట్టాం. కొన్నేళ్లు అక్కడే చదువుకున్నాం కూడా. షూటింగ్స్ అన్నీ కూడా చెన్నైలో ఎక్కువగా జరిగేవి. మేం స్కూల్ అయిపోయిన వెంటనే షూటింగ్ స్పాట్‌కి వెళ్లిపోయేవాళ్లం. హాలిడే అయితే సెట్లోనే గడిపేవాళ్లం.
ఎప్పటివరకూ చెన్నైలో ఉన్నారు?
2001 వరకూ చెన్నైలోనే ఉండేవాళ్లం. ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాన్నగారు ఇక్కడ ఉండేవారు. ఆయన్ను చాలా మిస్ అయిపోతున్నాం అని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పుడు కూడా మమ్మల్ని షిఫ్ట్ అవ్వొద్దన్నారు. ఎందుకంటే ఆయనకు చెన్నై అంటే చాలా ఇష్టం.
100 సినిమాలకు పైగా చేశాను. ఇంక రెస్ట్ తీసుకుంటా అని అనేవారా?
నెవ్వర్. ఆయన కోరిక ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా ‘యాక్షన్ అని చెబుతూ చచ్చిపోవాలి’ అని. ఆ విషయాన్ని మాతో చాలాసార్లు చెప్పేవారు. లాస్ట్ టు ఇయర్స్ కూడా సినిమాలు చేయడం లేదని ఫీల్ అయ్యేవాళ్లు. స్ట్రెయిన్ అవ్వకూడదు డాడీ అని చెప్పేవాళ్లం. అయినా వినేవారు కాదు. సినిమాలు చేయకుండా ఇంట్లో ఉండటం ఆయనకు నచ్చేది కాదు.
మీ నాన్నగారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. దర్శకుడిగా ఆయన ఎలా ఫీల్ అయేవారు?
నాన్నగారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. తనకేం అయినా ఫర్వాలేదు. చెడ్డ పేరొచ్చినా ఏం ఫర్వాలేదు.. నిర్మాతకు మాత్రం నష్టం రాకూడనుకునేవారు. ఆ ఫిలాసఫీ చాలా గొప్పది. నాన్నగారిలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. ఎవరొచ్చినా... స్థాయితో సంబంధం లేకుండా లేచి నిలబడి రిసీవ్ చేసుకునేవారు. ఇక తన గురువు (దాసరి నారాయణరావు) గారి ముందు కూర్చునే విధానంలో చాలా వినయం కనిపించేది.
‘అంజి’ సినిమాకి ఎక్కువ టైమ్ పట్టినప్పుడు ఆయన బాధపడేవారా?
ఆయనకు ఆ టెన్షన్ ఎప్పుడూ లేదు. నిర్మాతకు నష్టం రాకూడదు. లాభాల్లోనే ఉండాలని మాత్రం అనుకునేవారు.
కూతుళ్ల పెళ్లి గురించి ఆయనకు కలలేమైనా ఉండేదా?
ఆయనకు అవేం తెలియదు. ఇంటి బాధ్యతలన్నీ అమ్మకు అప్పజెప్పారు. ఆయనకు సినిమా తప్ప వేరే లోకం ఏమీ లేదు. ఇంట్లో ఏం జరుగుతుంది? అని అడిగేవారు కాదు. అన్నీ మా ఇష్టం అనేవారు. పిల్లలకు ఏది ఇష్టమైతే అదే చెయ్యమని అమ్మతో అనేవారు. అలాగని ఆయనకు కుటుంబం అంటే నిర్లక్ష్యం కాదు. మా అమ్మగారి మీద ఆయనకు భరోసా ఎక్కువ.
మీరు మీ నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉందా? ఆయన మీకిచ్చిన గిఫ్ట్?
ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్. ఎవరితోనూ ఒక్క మాట కూడా అనిపించుకోకుండా ఉండండి అనేవారు. మేం అలా ఉండడమే ఆయనకు మేం ఇచ్చే గిఫ్ట్. నేను సినిమా డైరెక్ట్ చేయాలని ఆయనకు ఉండేది.
నాన్నగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారా?
2002 నుంచి 2007 వరకూ నాన్నగారి సినిమాలకు వర్క్ చేశాను. ఆ టైమ్‌లో డైరెక్షన్ గురించి చాలా నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత బిజీ అవ్వడంతో కుదర్లేదు.
దర్శకురాలిగా ఇండస్ట్రీకి ఎప్పుడు రావాలనుకుంటున్నారు?
వచ్చే ఏడాదిలో రావాలనుకుంటున్నా. ఈ మధ్యనే ఓ కంపెనీ స్టార్ట్ చేశాం. అలాగే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇప్పుడు ఇలా జరిగింది. త్వరలోనే కచ్చితంగా వస్తాను.
కొత్త సినిమాల కోసం కోడి రామకృష్ణగారు కథలేమైనా రాశారా? వాటిని మీరు సినిమాగా మలిచే అవకాశం ఉందా?
ఈ రెండు మూడేళ్లలో చేయాలని 3 స్క్రిప్ట్‌లు రెడీ చేశారు. అయితే నాన్నగారు ఈ కథలకు ఇచ్చినంత ట్రీట్‌మెంట్ నేనివ్వగలుగుతానో? లేదో? ఆ కథలకు న్యాయం చెయ్యగలననే నమ్మకం కుదిరితే సినిమా చేస్తాను. లేకపోతే టచ్ చేయను.
నాన్నగారికి తీరని కోరిక ఏమైనా ఉందా?
కోరిక లాంటిది ఏం లేదు. కానీ రెండేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు. ఆ వెలితికి ఆయనకు ఉన్నట్లుగా అనిపించేది. మధ్యలో రెండు సినిమాలు ఆగిపోయినట్టున్నాయి ‘పుట్టపర్తి సాయి బాబా’ సినిమా మొత్తం అయిపోయింది. అది ప్రొడక్షన్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. ఇంకో సినిమా ఓపెనింగ్ జరిగింది. లక్ష్మీరాయ్‌తో ఆ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఓపెనింగ్ రోజే హార్ట్ ఎటాక్ రావడంతో ఆ సినిమా కొనసాగలేదు.
మీకు ఘనంగా పెళ్లి చేశారు. మీ చెల్లెలి పెళ్లి గురించి కూడా ఆలోచిస్తుండేవారా?
ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేసి, భారం తీర్చేసుకోవాలనే టైప్ కాదు. మంచి అబ్బాయి దొరకాలి, అతని మీద నమ్మకం కుదరాలి. అప్పుడే పెళ్లి. నాకు అలానే మంచి సంబంధం చూసి చేశారు. చెల్లెలికి కూడా అలా కుదిరితే చేయాలనుకున్నారు. కూతుళ్లను బరువనుకోలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు అని గర్వంగా చెప్పుకునేవారు. ఆయనకు నేనెప్పుడూ కనబడుతుండాలి. అందుకే డాడీ దగ్గరే ఉంటున్నాను.
నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు?
అన్నీ ఇష్టమే. ప్రతి సినిమా చూస్తాను.
ఫ్యామిలీని తీసుకు వెళ్లేవారా? సినిమాలకు
ఆయన సినిమాలు ఆయన చూడరు. మేమే చూసి ఎలా ఉందో చెప్పేవాళ్లం. ముఖ్యంగా ఎలా ఉంది? అని అమ్మను అడిగేవారు. మేం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లం.
డి.జి. భవాని
నా కోసం పాత్రనే మార్చారు
‘‘కోడి రామకృష్ణగారు చనిపోయారన్న వార్త విన్న వెంటనే షాక్ అయ్యాను. నమ్మలేకుండా ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యనే ఏదో ఇంటర్వ్యూలో కెరీర్ గురించి మాట్లాడుతూ కోడి రామకృష్ణగారి గురించి మాట్లాడాను. ‘మంగమ్మగారి మనవడు’ సినిమాలో ఆర్టిస్ట్‌గా నాకు చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆయన డైరెక్షన్‌లో చేసిన ‘మా పల్లెలో గోపాలుడు’లో చేసిన ‘పులుసు’ పాత్ర చాలా పాపులర్ అయింది. ఇప్పటికీ ఆ పాత్రను గుర్తు చేసేవాళ్లు ఉన్నారు. ఆ సినిమా 365 రోజులాడింది. అంతకుముందు తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేశాన. తెలుగులోనూ 15 సినిమాలు వరకూ చేశా. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘మంగమ్మగారి మనవడు’.
‘పులుసు’ పాత్రతో నా కెరీర్ పీక్‌కి వెళ్ళిపోయింది. వెయ్యి సినిమాల వరకూ చేశాను. కోడి రామకృష్ణగారితో చేసిన సినిమాలు ఎంతో తృప్తికరమైనవి. చక్కటి పాత్రలు ఇచ్చారు. తెలుగు భాషలో ఉన్న అన్ని యాసలు ఆయన సినిమాలో మాట్లాడాను. స్వతహాగా నేను తెలుగు అమ్మాయినే అయినప్పటికీ చిన్నప్పుడే చెన్నైలో సెటిల్ అవ్వడం వల్ల తెలుగులో ఇన్ని యాసలుంటాయా? అనుకున్నాను. గ్లామర్ పాత్రల నుంచి తల్లి పాత్ర వరకు అన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. చాలా బాధగా ఉంది (చెమర్చిన కళ్లతో కాసేపు మౌనం). మా అమ్మాయి, వాళ్ల అమ్మాయి కలసి చదువుకున్నారు. కొన్ని కమిట్‌మెంట్స్ వల్ల కోడి రామకృష్ణగారి భౌతిక కాయాన్ని సందర్శించలేకపోయాను.
ఇవి పూర్తి కాగానే వెంటనే వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలుస్తాను. ఆర్టిస్టులను బంగారం లాగా చూసుకుంటారు ఆయన. డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నా కెరీర్‌లో గుర్తుండిపోయే దర్శకుడు. ప్యాకప్ చెప్పేవరకూ భోజనం చేయరు ఆయన. మేం బ్రేక్‌లో తిన్నా కూడా ఆయన ప్యాకప్ చెప్పాకే తింటారు. పనిమీద శ్రద్ధ అలాంటిది. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ‘ఇంటి దొంగ’ సినిమాలో నా పాత్రను ప్రెగ్నెంట్‌గా మార్చారు. అలా ఎవరుంటారు? ఆర్టిస్ట్ మీద అభిమానంతో అలా చేశారు. నిజానికి నేను ‘అరుంధతి’ కూడా చేయాలి. కుదర్లేదు. మూడు నెలల క్రితం మాట్లాడాను. ఈ మధ్య కలవాలనుకున్నాను. మళ్లీ మేం కలిసి సినిమా చేస్తామనుకున్నాను. ఈ లోపే ఘోరం జరిగిపోయింది. చిత్రసీమ గొప్ప దర్శకుడుని కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment