
మన దేశంలో ఇంటి పేరు, ఇంటి వాకిలి పేరు నాన్నదే ఉంటుంది. అమ్మ పేరు దాదాపుగా ఉండదు. కూతురి పేరు అసలే కనిపించదు. కూతురూ ఇంటి సభ్యురాలే అనే భావన ఆమెకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అబ్బాయిల వైఖరిలో మార్పు తెస్తుంది. అందుకే నార్త్‌లో చాలాచోట్ల కుమార్తె నేమ్‌ప్లేట్ పెట్టే ఆనవాయితీ మొదలైంది. ఇటీవల నాగ్‌పూర్ చుట్టుపక్క పల్లెల్లో 2100 ఇళ్లకు అమ్మాయిల పేర్లు సగౌరవంగా అమర్చారు. ఇంకా ఈ ఆనవాయితీ దక్షణాదికి రాలేదు. వివరాలు
మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఉన్నారో లేరో అన్నట్టుగా ఎందుకు ఉండాలి... వారు తమ అస్తిత్వంతో ఎందుకు ఉండకూడదు.. ఆత్మవిశ్వాసంతో ఎందుకు ఉండకూడదు... గుర్తింపుతో ఎందుకు ఉండకూడదు... ఈ ప్రశ్నలు‘మేజిక్ బస్ ఫౌండేషన్’ బా«ధ్యురాలు ధనశ్రీ బ్రహ్మేకు వచ్చాయి. ఐక్యరాజ్య సమితిలో చాలా కాలం పని చేశాక భారతదేశంలో పారిశ్రామికప్రాంతాల్లోని బస్తీల్లో, వెనుకబడిన పల్లెల్లో లైంగిక వివక్షను రూపుమాపి టీనేజ్ ఆడపిల్లల వికాసానికి కృషి చేయాలని ధనశ్రీ ‘మేజిక్ బస్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఆడపిల్ల తను ఎదిగే వయసులో వెనుకబడితే జీవితాంతం వెనుకబడుతుందని ఆమెకు ఆత్మవిశ్వాసం అవసరమని భావించారు. అందుకే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆడపిల్ల గురించి ఆలోచించరు
మన దేశంలో ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటేప్రాముఖ్యత అంతా అబ్బాయికే ఉంటుంది. అమ్మాయిని మామూలు బడిలో... అబ్బాయిని మంచి బడిలో వేయడం, సౌకర్యాలు, చదువు కొనసాగింపు... ఇవన్నీ అమ్మాయి పట్ల వివక్షను చూపుతాయి. బడి మాన్పించి పెళ్లి చేసే బెడద ఎలాగూ ఉంటుంది. ఆస్తిలో భాగం గురించిన ఆలోచన ఉండదు. వీటన్నింటి దృష్ట్యా పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోవడం తప్ప ఆడపిల్ల వికాసం సంపూర్ణం కాదు. ‘నేనూ ఇంటిలో సమాజంలో భాగమే. నాకంటూ ఒక స్థానం ఉంది. నా బాధ్యతలు నాకున్నా నాకంటూ కొన్ని కలలు ఉంటాయి అని అమ్మాయిలకు అనిపించాలి’ అంటారు ధనశ్రీ. ‘ఇంటికి అమ్మాయి నేమ్‌ప్లేట్ పెడితే కొద్ది మార్పు సాధ్యమే’ అనుకున్నారామె.
ఎందుకు పెట్టాలి?
మహారాష్ట్రలోని నాగపూర్ శివార్లలో ఉన్న కలమేశ్వర్ పారిశ్రామిక వాడను ఆనుకుని 108 గ్రామాలు ఉన్నాయి. వాటన్నింటిలో రోజు కూలీలు, కార్మికులే ఉంటారు. వీరికి ఆదాయం చాలా తక్కువ. అందువల్ల ఆర్థిక దృష్టికోణంలో అబ్బాయికి ఇచ్చేప్రాధాన్యం అమ్మాయికి ఇవ్వరు. అందుకే అమ్మాయిలు తెర వెనుకే ఉండిపోతారు. వారికి ఆత్మవిశ్వాసం కల్పించేందుకు 12 నుంచి 16 ఏళ్లు వయసున్న అందరు అమ్మాయిల డేటా తీసుకుని వారి ఇళ్లకు వెళ్లి మీ అమ్మాయి నేమ్‌ప్లేట్ ఇంటికి పెట్టండి అని ఫౌండేషన్ కార్యకర్తలు అడిగితే అందరి నుంచి ఎదురైన ప్రశ్న ‘ఎందుకు పెట్టాలి’ అని. ఎందుకంటే ఇంటికి నేమ్‌ప్లేట్ తండ్రిదే ఉంటుంది. లేదంటే కొడుకుది. కూతురిది ఉండదు. ‘అయితే ఇంటికి కూతురు కూడా హక్కుదారని... ఆమె పెరిగే ఇంటికి ఆమె పేరు పెట్టుకునే హక్కు ఉంటుందని కార్యకర్తలు గట్టిగా చెప్తారు’ అని తెలిపారు ధనశ్రీ. అంతేకాదు ఊరి పెద్దలతో, పంచాయితీ పెద్దలతో, స్కూలు టీచర్లతో చెప్పించి ఒప్పించారు.
పెనుమార్పు
కలమేశ్వర్ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లో 12 నుంచి 16 ఏళ్లు ఉన్న ప్రతి అమ్మాయి ఇంటికి ఆ అమ్మాయి పేరుతో నేమ్‌ప్లేట్ తయారు చేయించి వాటిని ఇంటి వాకిలికి అమర్చే ఏర్పాటు చేశాక ఆడపిల్లల్లో వచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇదో కొత్త గుర్తింపు గౌరవం అయ్యింది. ‘మా అన్నయ్య నాతో నీ పేరు ఎందుకు పెట్టాలి అనడిగాడు... నీ పేరు నువ్వు పెద్దయ్యాక నీ ఇంటికి ఎలాగూ పెట్టుకుంటావు... ఇప్పుడు నా పేరు పెట్టకపోతే ఎక్కడా ఎప్పుడూ పెట్టరు అని సమాధానం ఇచ్చాను’ అని 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అంది. ఈ 18 పల్లెల్లో 2100 గడపలకు అమ్మాయిల నేమ్‌ప్లేట్లు ఇవాళ కళకళలాడుతూ కనపడుతున్నాయి. ‘ఈ నేమ్‌ప్లేట్లు పెట్టాక తల్లిదండ్రులు మమ్మల్ని చదివించాలని, మా మాటకు విలువ ఇవ్వాలని, మాకూ గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు’ అన్నారు అమ్మాయిలంతా. ‘చుట్టుపక్కల పల్లెల వాళ్లు ఈ పల్లెలకు వచ్చి నేమ్‌ప్లేట్లు చూసి మేమూ పెట్టిస్తాం అని వెళుతున్నారు’ అని వారు తెలిపారు.
అదే అమ్మాయి... కాని ఒక చిన్న గుర్తింపుతో అడుగున నిలబడే దశ నుంచి సమాన దశకు వచ్చి నిలబడేలా చేసింది ఈ నేమ్‌ప్లేట్.
దక్షిణాదిలో ఇవాళ్టికీ జరుగుతున్న కొన్ని వివక్షలను గమనిస్తే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ ఎక్కువ అవసరం అని భావించడంలో తప్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment