జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో శ్రీ సత్యసాయిబాబ సినిమా చిత్రీకరణలో భాగంగా నటీనటులకు సీన్ వివరిస్తున్న దర్శకుడు కోడి రామకృష్ణ (ఫైల్ ఫొటో)
పశ్చిమగోదావరి, పాలకొల్లు టౌన్/పాలకొల్లు అర్బన్: కళామతల్లి ముద్దు బిడ్డ, క్షీరపురి ఆణిముత్యం, ప్రముఖ సినీ డైరెక్టర్ కోడి రామకృష్ణ శుక్రవారం తుది శ్వాస విడిచారు. దీంతో జిల్లా శోకసంద్రమైంది. పేదరికంలో పుట్టిన కోడి రామృష్ణ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. పట్టణంలోని ఎంఎంకేఎన్ మునిసిపల్ హైస్కూల్ సెకండరీ ఫోరం చదివి, ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి కుంచె చేత పట్టి బ్యానర్లు రాసేవారు. బాల్యంలోనే ముఖానికి రంగు పూసుకుని ఎన్నో నాటకాలు స్వయంగా రచించి, ప్రదర్శించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద శిష్యరికం చేసి వంద సినిమాలకు దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు కోడి నరసింహులు–చిట్టెమ్మ దంపతులకు రామకృష్ణ మొదటి సంతానం. ఆయన సోదరులు లక్ష్మణరావు సినీ కెమెరామెన్‌గానూ మరో సోదరుడు వెంకన్న ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసి ఇటీవల మృతిచెందారు.
సినీ రంగ ప్రవేశం
కోడి రామకృష్ణ 1975లో ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. అప్పట్లో అతని మిత్రబృందంతో కలిసి నాటికలు ప్రదర్శిస్తూ లలిత కళాంజలి నాటక సమాజాన్ని స్థాపించారు. ఆ బ్యానర్‌పై అనేక పరిషత్‌ల్లో నాటకాలు ప్రదర్శించి బహుమతులు అందుకున్నారు. ‘రథచక్రాలు, రేపు సెలవు’ తదితర నాటకాలు ఆయన స్వీయ రచనలు కాగా, ‘సుడిగుండాలు’లో ఏకపాత్ర ద్వారా ప్రజల్ని మెప్పించారు. సినీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య ‘పల్లెపడుచు’ నాటకాన్ని కమర్షియల్ నాటకంగా ప్రదర్శించేవారు. ఈ నాటకంలో కోడి రామకృష్ణ బాల నటుడిగా రంగస్థలం ప్రవేశం చేసి గోపి పాత్రలో నటించారు. సినిమారంగంపై మమకారంతో మద్రాసు వెళ్లి పాలకొల్లుకి చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. 1983లో ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య సినిమాకి దర్శకత్వం వహించి బంపర్ హిట్ కొట్టారు. వందకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
లలిత కళాంజలి వ్యవస్థాపకుడిగా..
పుట్టిన గడ్డపై మమకారం, కళలపై తనకున్న అభిరుచి కారణంగా 1983లో లలిత కళాంజలి నాటక అకాడమీని స్థాపించారు. దక్షిణ భారత స్థాయిలో నాటక పోటీలు ఏకధాటిగా 33 సంవత్సరాలు నిర్వహించారు. సినీ ప్రముఖులను పాలకొల్లు తీసుకువచ్చి ఏటా సత్కరించేవారు. ఇలా సత్కారం పొందిన వారిలో దాసరి నారాయణరావు, డి రామానాయుడు, కృష్ణ, జయసుధ, జయప్రద, డా.మోహన్‌బాబు తదితరులున్నారు.
ఎంత ఎదిగినా..
లలిత కళాంజలి నాటక అకాడమీ ఆధ్వర్యంలో దర్శకుడు కోడి రామకృష్ణ, అతని స్నేహితులు, ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘మా ఇంటికి రండి’ సినిమాను సుమారు 20 ఏళ్ల క్రితం పాలకొల్లు, పోడూరు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ సినిమా నిర్మాతగా వాకాడ అప్పారావు, సినీ హీరోగా కోడి రామకృష్ణ నటించారు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన గాదిరాజు సుబ్బారావు, తాళాబత్తుల వసంతరావు, లక్కింశెట్టి నాగేశ్వరరావు, సారిక రామచంద్రరావు, హనుమాన్‌రెడ్డిలకు ఆ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య, చిలక పచ్చకాపురం, పుట్టింటికి రా చెల్లీ తదితర సినిమాలను పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.
జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని..
కోడి రామకృష్ణ కళాశాలలో చదివే రోజుల్లో కల్చరల్ డిపార్టుమెంట్‌కి సెక్రటరీగా పనిచేశారు. ఆ రోజుల్లో జై ఆంధ్ర ఉద్యమం జోరుగా సాగింది. ఆ సమయంలో కోడి రామకృష్ణ జై ఆంధ్ర ఉద్యమంలో పాలు పంచుకుని జైలు జీవితం గడిపారు.
రామకృష్ణ మృతి.. తీరని లోటు
దెందులూరు: శత చిత్రాల దర్శకుడు, జిల్లా వాసి కోడి రామకృష్ణ ఆకస్మిక మరణం బాధించిందని ఉషా సంస్థల అధినేత డాక్టర్ వీవీ బాలకృష్ణారావు, అన్నపూర్ణ సినీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎంపీపీ కొడాలి ఆంజనేయ చౌదరి తెలిపారు. కొవ్వలిలో ఆయన మాట్లాడుతూ అందరితో నవ్వుతూ మంచిగా ఉండే రామకృష్ణ ఆకస్మిక మరణం వ్యక్తిగతంగా తమకు, చిత్రపరిశ్రమకు తీరని నష్టమన్నారు. అనేక సాంఘిక, పౌరాణిక, రాజకీయ, విభిన్న చిత్రాలతో రామకృష్ణ తనదైన శైలిలో ముద్రవేశారన్నారు.
సత్యసాయిబాబా సినిమా పూర్తికాకుండానే..
జంగారెడ్డిగూడెం రూరల్: కోడి రామకృష్ణ మృతి జంగారెడ్డిగూడెం మండల ప్రాంత ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో కరాటం రాంబాబు నిర్మిస్తోన్న శ్రీ సత్యసాయిబాబా సినిమాకు సంబంధించి అనేక సన్నివేశాల చిత్రీకరణ 2012లో జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని 150 సంవత్సరాల పురాతన లోగిలిలో జరిపారు. ఈ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఆయన ఆ సినిమాలో నటించే అవకాశం కూడా ఇచ్చారు. వారంతా ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు.
కోడి రామకృష్ణతో కలిసి నటించా
ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నాటక పరిషత్‌లు నిర్వహించే వాడిని. ఆ సమయంలో కోడి రామకృష్ణతో కలిసి నాటకం ఆడా. అలాగే దాసరి నారాయణరావుకి రామకృష్ణను పరిచయం చేసినవారిలో నేను ఒకర్ని. సినిమా రంగంలో బిజీ జీవితాన్ని గడుపుతూ కూడా రామకృష్ణ ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఆ సమయంలో రామకృష్ణతో ఎక్కువ అనుబంధం ఉండేది.– వంగా నరసింహరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
నా షెడ్డుకు వచ్చి టీ తాగేవారు
పాలకొల్లు పట్టణంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌కి ఎదురుగా నా కారు మెకానిక్ షెడ్డు ఉంది. లలిల కళాంజలి నాటకోత్సవాల్లో భాగంగా ఏటా నా కారు షెడ్డు వద్దకు వచ్చి కూర్చునేవారు. ఓ టీ తాగి సేద తీరేవారు. అదే పరిచయంతో మద్రాసు వెళ్తే ఎంతో ఆప్యాయంగా సకల మర్యాదలు చేసేవారు. ఆయనతో ఉన్న స్నేహంతో నా కుమారుడ్ని సినిమా రంగానికి పంపించా. రామకృష్ణ మృతి చాలా బాధ కలిగించింది.
– ఏకుల బాబూ రాజేంద్రప్రసాద్, స్నేహితుడు
అరమరికలు లేకుండా ఆదరించేవారు
పుట్టింటికి రా చెల్లీ సినిమాకి కోడిరామకృష్ణ గారితో కలిసి 22 రోజులు పనిచేశాను. పాలకొల్లు అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆ అభిమానంతో మమ్మల్ని చాలా బాగా ఆదరించేవారు. చిన్న, పెద్ద తేడా లేకుండాఅందర్నీ ఆప్యాయంగా, కలుపుగోలుతనంగా పలకరించేవారు. ఆయన మృతి ఎంతో బాధ కలిగించింది.– వంటపాటి నాగరాజు, జూనియర్ ఆర్టిస్ట్ సఫ్లై దారుడు
సత్య సాయిబాబా సినిమా ఆగిపోయింది
శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటు. శ్రీ సత్యసాయిబాబా జీవిత చరిత్ర నేను నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ప్రారంభించాను. దాదాపు 60 శాతం చిత్ర నిర్మాణం పూర్తయ్యింది. కొద్ది నెలలుగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. రామకృష్ణ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.– కరాటం రాంబాబు, సినీ నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment