సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మరోసారి తన తెలుగు ప్రావీణ్యంతో ఆయన వార్తల్లో నిలిచారు. గత శుక్రవారం ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయనికి నివాళులర్పించిన బాలయ్య.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. అయితే గతంలో తన అన్న నందమూరి హరికృష్ణ మరణంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యానన్న బాలయ్య.. ఇప్పుడు కోడిరామకృష్ణ మరణం ఏకంగా యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చరాల్లో ముంచెత్తిందని వ్యాఖ్యానించారు. అన్న మృతిపై చేసిన వ్యాఖలే సోషల్ మీడియాలో దుమారం సృష్టించగా.. తాజా వ్యాఖ్యలు బాలయ్యను మరింత అబాసుపాలు చేస్తున్నాయి. ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఏంటి బాలయ్య అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘లోకేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఇప్పుడు అర్థమైంది.. అన్ని మేనమామ పోలికలే’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. (చదవండి: బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్!)
ఇంతకీ బాలయ్య ఏమన్నాడంటే.. ‘కోడి రామకృష్ణ మనతో లేరనే సంగతి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. భూమి మీద చాలమంది పుడ్తారు గిడ్తారు. మరణాణంతరం శాశ్వతంగా అందరి గుండెల్లో నిలిచిపోతారో.. అటువంటి జన్మకు ఓ పరిపక్వత.. ఓ సార్థకం. ఆ కోవకు చెందిన వారే కోడి రామకృష్ణ. ఆయన లేరన్నది నమ్మలేక పోతున్నాం. ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమలో తీర్చనది.’ అని భావోద్వేగానికి గురయ్యారు.