కోడిరామకృష్ణ.. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించారు.
లెజండరీ దర్శకుడు కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను అందజేశారు. హీరో సుమన్‌కు కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు
నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. 'మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు. అయితే అయన లేకున్నా ఆయనతో ఏ విధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియజేయాలని అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తున్న రామ సత్యనారాయణ గ్రేట్' అని పేర్కొన్నారు. నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమయ్యాను.
మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చిదిద్దారు. యం.యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment