మీ బాల్యంలోని కొన్ని తీపి గుర్తులు పంచుకుంటారా?
కోడి రామకృష్ణ: మాది పాలకొల్లు. నాన్న కోడి నరసింహమూర్తి, అమ్మ చిట్టెమ్మ. మా వీధిలో అందరూ నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే... నేను పుట్టాకే మా వీధిలో అందరికీ పిల్లలు పుట్టారట. దాంతో నేనంటే అందరికీ ఎంత సెంటిమెంట్ అంటే.. నెల పొడుపు రోజున చంద్రుడు కనిపించగానే.. చూసినవారందరూ కళ్లు మూసుకొని.. ‘పెద్దబాబూ.. రాముడూ..’ అని పెద్దగా అరిచేవారు. నేనెళ్లి.. ఒక్కొక్కర్నీ తాకేవాణ్ణి. అప్పుడు కళ్లు తెరిచి నా వైపు చూసేవారు. అంత సెంటిమెంట్! అలాగే మా వీధిలో ఓ బ్రాహ్మలావిడ ఉండేది. వారి ఎదురింట్లో శిరోమణి అనే ఆవిడ ఉండేది. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఈవిడ శిరోమణిని తెగ తిడుతుండేది. ఓరోజు అనుకోకుండా శిరోమణి చనిపోయింది.
ఆమె చావు తర్వాత కూడా ఈవిడ శిరోమణి పిల్లల్ని కూడా చీటికిమాటికీ తిట్టేది. ఓ రోజు ఉన్నట్లుండి బ్రాహ్మలావిడ వింతగా కోడిమాంసం కావాలని గోల గోల. బ్రాహ్మణ స్త్రీ చికెన్ అడగడమేంటని వీధంతా వింతగా చెప్పుకోవడం మొదలెట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, శిరోమణి దెయ్యమై.. ఆ బ్రాహ్మలావిడను పట్టిందట. ఆ శిరోమణి అమ్మకు బాగా పరిచయం. దాంతో అమ్మ వెళ్లి.. ‘శిరోమణి.. ఏంటే ఇదంతా..’ అంది. ‘ఇది నా పిల్లల్ని తిట్టిందక్కా.. దీంతో కోడిమాంసం తినిపించేదాకా వదల్ను’ అంది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో చెప్పి చూశారు. కానీ శిరోమణి ఆత్మ మాత్రం శాంతించడంలా. ‘మాంసం తేవాల్సిందే. దీంతో తినిపించాల్సిందే.. లేకపోతే నా పిల్లల్ని తిడుతుందా’ అని ఊగిపోతోంది.
అప్పుడొచ్చాడు నాన్న. ‘ఏంటి?’ అనడిగితే.. విషయం చెప్పారు. సరాసరి ఆమె ముందుకెళ్లాడు. నాన్నను చూడగానే.. ఆమె కర్టెన్ చాటున దాక్కుంది. ‘ఏంటే ఇదంతా.. బ్రాహ్మలు కదా.. అలా చేయొచ్చా?’ అన్నాడు నాన్న. ‘ఏంటి బావగారూ మీరూ అలా మాట్లాడతారు. ఇది నన్ను తిట్టిందండీ... ఇప్పుడు నా పిల్లల మీద పడింది. అందుకే.. చికెన్ తినిపించేదాకా వదల్ను’ అంది ఏడుస్తూ... ‘తప్పే.. అలా చేయడం పాపమే. వెళ్లిపో.. నీ పిల్లల్ని నేను చూసుకుంటా. నాపై నమ్మకం ఉంటే వెళ్లిపో’ అని నాన్న అన్నారు. ఎట్టకేలకు శాంతించిందామె. చూస్తున్న నాకు ఇదంతా వింతగా అనిపించింది. చనిపోయాక కూడా నాన్నపై గౌరవం తగ్గకపోవడం గ్రేట్ అనిపించింది. దెయ్యాలు, భూతాలు నిజమని చెప్పను కానీ, మా వీధి సెంటిమెంట్లు అలా ఉండేవి.
అమ్మానాన్నలతో మీ అనుబంధం?
కోడి రామకృష్ణ: మా అమ్మానాన్నలకు నేను తొలిసంతానం. నా లైఫ్‌లో నేను చూసిన తొలి హీరో నాన్న. ఆయన రిటైర్డ్ మేజర్. మా నాన్న ఎంత చండశాసనుడో అంత అమాయకుడు కూడా. అప్పట్లోనే సినిమాల్లో వేషాలిప్పిస్తాం, సినిమాలు తీస్తాం అంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్‌లు మా ఊళ్లో తిరుగుతుండేవి. వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, వాళ్లందరితో కూల్‌డ్రింకులు తాగించి, నా ఫొటోలు చూపిస్తుండేవారు నాన్న. నేను స్కూల్‌నుంచి వచ్చేసరికి వారందరూ వరండాలో కూర్చొని ఉండేవారు. వాళ్లను చూసి సైలెంట్‌గా ఇంట్లోకెళ్లేవాణ్ణి. నా వెనకే నాన్న వచ్చేవాడు. ‘వాళ్లు సినిమా తీస్తారంటరా. నీ గురించి చెప్పాను. నీ ఫొటోలు కూడా చూపించాను’ అని గుసగుసగా చెప్పేవారు. ‘అయ్యో నాన్నా, వాళ్లు దొంగలు. వృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావ్. వాళ్లను పంపించేయ్’ అని మందలింపుగా చెప్పేవాణ్ణి. నిజం తెలుసుకొని వాళ్లను తరిమేసేవారు.
‘మనింట్లో డిగ్రీ చదివిన వాళ్లు లేరు. నువ్వు చదవాలి’ అని ఒకరోజు నాన్న నాతో అన్నారు. ‘మీ కోసం డిగ్రీ చదువుతాను. అయితే.. మధ్యలో ఎక్కడైనా తప్పితే మాత్రం అక్కడే ఆపేస్తా’ అని ఫిటింగ్ పెట్టాను. ‘నువ్వు తప్పవ్. నీపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు నాన్న. మేం నాటకం రిహార్సల్స్‌లో ఉండగా పీయూసీ రిజల్ట్స్ వచ్చాయి. నా నంబర్ పేపర్‌లో లేదు. తప్పాను. ఇక చదవనవసరం లేదు. నిర్ణయం తీసేసుకొని, ఇంటికెళ్లాను. అక్కడి పరిస్థితి చూడగానే షాక్. ఇరుగుపొరుగు వాళ్లకు నాన్న స్వీట్స్ పంచుతున్నారు. ‘ఓరి నాయనో.. ఈయన పేపర్ చూడలేదులా ఉంది..’ అనుకుంటూ ఆయన ముందుకెళ్లాను. నన్ను చూడగానే, ‘ఏయ్.. డిగ్రీ కూడా ఇలాగే పాసవ్వాలి. లేకపోతే చంపేస్తా’ అన్నారు ప్రౌడ్‌గా. నాకేమో అయోమయం! ఇంతలో మా తమ్ముడొచ్చి ‘నువ్వు సెకండ్‌క్లాస్‌లో పాసయ్యావ్రా’ అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను థర్డ్ క్లాస్‌లో మాత్రమే చూశానని, సెకండ్ క్లాస్‌లో చూడలేదని.
కాలేజ్ టైమ్‌లో ప్రేమకథ ఏమైనా నడిపారా?
కోడి రామకృష్ణ: మీరు అడిగారు కాబట్టి గుర్తున్న ఓ సంఘటన చెబుతాను. కాలేజ్ టైమ్‌లో నాకు ఓ స్టడీరూమ్ ఉండేది. నేను బొమ్మలు బాగా వేసేవాణ్ణి. అందుకే... సైన్స్ రికార్డ్స్‌లో బొమ్మలు గీయించుకోవడానికి అమ్మాయిలు నా రూమ్‌కొచ్చేవారు. అందరూ లవ్‌లీగా ఉండేవారు. ఆ అమ్మాయిల్లో ‘5 నంబర్ గోల్డ్’ అనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తన రోల్ నంబర్ 5. ఇంటి పేరేమో ‘బంగారు’. అందుకే ‘5 నంబర్ గోల్డ్’ అని పిలిచేవాళ్లం. అసలు పేరు గుర్తులేదు. నాతో బొమ్మలు గీయించుకోవడానికి తనూ వచ్చేది. ఇంతమంది ఆడపిల్లలు నా దగ్గరకొస్తుంటే.. జెలసీగా ఫీలయ్యేవారు కూడా ఉంటారు కదా.
ఎవడో వెళ్లి ‘5 నంబర్ గోల్డ్’ వాళ్ల అన్నయ్యకు చెప్పాడు ‘మీ చెల్లెలు రామకృష్ణతో క్లోజ్‌గా ఉంటోంది’ అని. నేను కాలేజ్‌కి వెళ్లే దారిలో వాళ్లన్నయ్య కాపు కాశాడు. నన్ను ఆపాడు. ‘జాగ్రత్త ఏమనుకున్నావో! ఏంటి? మా చెల్లితో మాట్లాడుతున్నావంట’ అన్నాడు సీరియస్‌గా. ‘మాట్లాడితే ఏమైంది’ అన్నాను. ‘మీ ఇద్దరూ దగ్గరగా ఉంటున్నారట’ అని సణిగాడు. ‘దగ్గరగా ఉంటే ఏమైందిరా?’ అని నేను దీటుగా ప్రశ్నించా. ‘సరేలే... నీ నాటకంలో నాకూ వేషం ఇస్తావా?’ అని అడిగాడు నింపాదిగా. ‘ఇస్తాలే’ అని మాటిచ్చాను. నా కాలేజ్ రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో.
సినిమాపై మీ తొలి అడుగులు ఎలా పడ్డాయి?
కోడి రామకృష్ణ: చిన్నప్పట్నుంచీ పెయింటింగ్ అంటే ఇష్టం. అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్లో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను. గోడల మీద వాటర్ పెయింటింగ్ బోర్డ్స్ రాసేవాణ్ణి. అలాగే.. ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా. సినిమా హాళ్లకు ‘పొగత్రాగరాదు’, ‘నిశ్శబ్దం’, ‘ముందు సీట్లపై కాళ్లు పెట్టరాదు’.. ఇలా రకరకాల స్లయిడ్స్ ఫ్రీగా చేసిచ్చేవాణ్ణి. ఆ స్లయిడ్స్‌కి ఓ మూల ‘కోడి రామకృష్ణ’ అని నా పేరు రాసుకునేవాణ్ణి. తెరపై నా పేరు చూసుకోడానికే థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడే. అలాగే.. చిన్నప్పట్నుంచీ నాటకాల పిచ్చి. ట్రూప్ నాటకాల స్థాయికి చేరా. పరిషత్తులకు కూడా వెళ్లేవాళ్లం. దాదాపు వందకు పైగానే నాటకాలు రాసి, ప్రదర్శించాను.
అల్లు రామలింగయ్యగార్కి అప్పట్లో నాటకం ట్రూప్ ఉండేది. ‘ఆడది’ అనే కమర్షియల్ నాటకం ఆడుతూ ఉండేవారు. ఆ నాటకంలో నేనే హీరో. లింగయ్యగారు దర్శకుడు. ఇదిలావుంటే.. టి.నాగేశ్వరరావుగారనీ... పెయింటింగ్‌లో నా గురువు. ఆయన దగ్గర నేను లితోలకు వర్క్ చేసేవాణ్ణి. ఆయనకు ఓ ఫొటో స్టూడియో కూడా ఉంది. అక్కడ నా ఫొటోలు తీసి... ‘కొత్త హీరో కావాలి’ అనే ప్రకటన పేపర్లలో కనిపిస్తే పంపించేరు. ఆ టైమ్‌లోనే మా ఊళ్లో ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా దర్శకుడికి అదే తొలిసినిమా. ఏ వీధిలో చూసినా ఆ సినిమా డిస్కషనే. ఆ సినిమా చూశాక అనిపించింది... ‘యాక్టర్ అయితే... ఒక్క పాత్రనే చెప్పచ్చు. అదే డైరెక్టరయితే.. ఎన్నో పాత్రల్ని చెప్పొచ్చు’ అని. నాలో డైరెక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన ఆ సినిమానే ‘తాతా మనవడు’. ఆ డైరెక్టరే మా గురువుగారు దాసరి నారాయణరావు.
ఆ తర్వాత దాసరి గారి దగ్గరే అసిస్టెంట్‌గా చేరారు? ఆయన్ను ఎలా కలిశారు?
కోడి రామకృష్ణ: ఆయన చదివిన స్కూల్లోనే నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఫారం.. ఆయనేమో ఇంటర్ సెకండియర్. ‘నేను నా స్కూల్’ అనే నాటికను గురువుగారు స్వయంగా రాసి మా స్కూల్లో ప్రదర్శించారు. గ్రీన్‌రూమ్‌లో వాళ్లు మేకప్‌లు చేసుకుంటుంటే... మేమందరం కిటికీల్లోంచి చూసేవాళ్లం. ఆ రోజుల్లో సుబ్బరాయశాస్త్రిగారని మా స్కౌట్ మాస్టారు ‘పంచవర్ష ప్రణాళికలు’ అనే నాటికను రాశారు. దాన్ని గురువుగారు డైరెక్ట్ చేసి నటించారు. ఢిల్లీలో ఆ నాటికను ప్రదర్శిస్తే.. నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా గురువుగారినీ ఆయన ట్రూప్‌ని పాలకొల్లులో లారీపై ఊరేగించారు. ‘తాతా మనవడు’ సూపర్‌హిట్ అయినప్పుడు ఆ సినిమా యాభైరోజుల పండగ సందర్భంగా గురువుగారు నేరుగా పాలకొల్లు వస్తున్నారనే సంగతి తెలిసింది. అప్పట్లో స్టూడెంట్ లీడర్‌ని నేనే. నాకేమో.. ఎలాగైనా గురువుగారిని కలిసి అవకాశం అడగాలనుంది.
గురువుగారు, కె.రాఘవగారు, ఎస్వీ రంగారావుగారు ఇలా... అందరూ వచ్చారు. నేనెళ్లి ధైర్యంగా గురువుగార్ని కలిశాను. ‘మీ దగ్గర సహాయకునిగా చేరాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వండి సార్’ అని ప్రాధేయపడ్డాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ‘బీకాం చదువుతున్నాను సార్’ అని చెప్పాను. అయితే.. ‘పూర్తి చేసి రా’ అన్నారు. గురువుగారి మాట ప్రకారం బీకాం పూర్తి చేసి చెన్నయ్ రైలెక్కాను. నిజానికి నేను పాలకొల్లులో ఉన్నప్పుడే.. కాకినాడలో ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్ జరిగింది. గురువుగారు వచ్చారని తెలిసి... కాకినాడ వెళ్లాను. నన్ను చూడగానే.. ఓ కేరక్టర్ ఇచ్చేశారు గురువుగారు. శారదగారికి అందులో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరిలో నేనొకణ్ణి. మా కాంబినేషన్ సీన్స్ తీసేసి, మద్రాస్ వెళ్లిపోయారు.
ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ మాత్రం మిగిలి ఉంది. దాన్ని మద్రాస్‌లోని శివాజీ గార్డెన్స్‌లో తీస్తున్నారు. నేను చేసిన పాత్రకు ఓ డూప్‌ని ఏర్పాటు చేశారు. కానీ అతగాడు సెట్ కావడం లేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో నేను మద్రాసు వెళ్లి, గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్‌లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే.. ఆ యూనిట్‌కి ఆనందం ఆగలేదు. భలే వచ్చావయ్యా... అంటూ గబగబా.. కాస్ట్యూమ్స్ తొడిగేశారు. మేకప్ వేసేశారు. నాపై క్లాప్ కొడుతుండగా గురువుగారొచ్చారు. ‘అరే... ఎప్పుడొచ్చావ్. నీక్యారెక్టర్ పెద్దటెన్షనే పెట్టింది. భలే వచ్చావే. ఇక్కడకు రాగానే.. మొహానికి రంగేయించుకున్నావ్. క్లాప్ కొట్టించుకున్నావ్. అదృష్టవంతుడవయ్యా. ఇకనుంచి నువ్వు నాతోనే ఉంటావ్’ అని మాటిచ్చేశారు. ఆ రోజే ఆయన కారెక్కాను. అప్పట్నుంచి కారుల్లో తిరుగుతూనే ఉన్నాను.
అవునూ.. తలకు గుడ్డ కట్టుకుంటారెందుకని?
కోడి రామకృష్ణ: ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ని మద్రాస్ కోవలం బీచ్‌లో చేస్తున్నాం. నాకు గుర్తు అది మే నెల. విపరీతమైన ఎండలు. ఆ టైమ్‌లో మోకా రామారావుగారని ఎన్టీఆర్‌గారి కాస్ట్యూమర్. ‘మా పల్లెలో గోపాలుడు’కి కూడా కాస్ట్యూమర్ ఆయనే. ఓ మధ్యాహ్నం ఆయన నా దగ్గరకొచ్చి ‘మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది. ఎండలో అది బాగా ఎక్స్‌పోజ్ అయిపోతోంది’ అని తన బాక్స్‌లోంచి ఓ జేబు రుమాల తీసి నా నుదుటికి కట్టాడు. ఆ రోజు మొత్తం ఆ రుమాల అలాగే ఉంది. రెండోరోజు ఆయనే వచ్చి, ‘నాకు తెలిసి చాలామంది ఇలా కట్టుకున్నారు కానీ... మీకు మ్యాచ్ అయినట్లు ఎవరికీ కాలేదు’ అని చెప్పి, ఓ టర్కీటవల్‌తో ప్రత్యేకంగా నా నుదురు కొలత ప్రకారం ఓ బ్యాండ్‌లా చేయించి, నాకిస్తే... కట్టుకున్నాను.
అది చూసిన ప్రతివారూ బాగుంది అన్నారు. చివరకు బాలచందర్‌గారు కూడా. ఓ సారి ఆయన మా సెట్‌కి వచ్చారు. నన్ను చూసి ‘ఓసారి అద్దంలో చూసుకో’ అన్నారు. చూసుకుంటే.. నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలి ఉంది. దాని కారణంగా అందంగా కనిపిస్తున్నాను. అప్పుడన్నాడాయన.. ‘ఇది ఈ జన్మది కాదయ్యా... కచ్చితంగా పూర్వజన్మదే. అందుకే నీకు అంత బాగా అతికింది’ అని. అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయిపోయింది. నిజంగా ఇది విచిత్రమే. మొదటినుంచి సెంటిమెంట్లను నేను బాగా నమ్ముతాను.
‘అంకుశం’కి పాతికేళ్లు నిండిన సందర్భంలో కోడి రామకృష్ణ చెప్పిన కొన్ని విశేషాలు...
‘అంకుశం’కి ముందు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి సంస్థలో ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ చేశా. రెండూ సూపర్‌హిట్లే. మా కాంబినేషన్‌లో మూడో సినిమా కాబట్టి, అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కథ చేయాలని ఒకటే ఆలోచన. చిన్నప్పటి నుంచీ పోలీసులంటే అభిమానం. అసలు ఆ వృత్తి అంటేనే నాకు గౌరవం. వారిపై నాటకాలు కూడా రాశా. అందుకే.. ఒక పోలీస్ కథను ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నా మస్తిష్కంలో మెదిలింది. ఆ ఆలోచనే రెడ్డి గారితో చెప్పాను. ఆయన ‘చూస్తారంటారా?’ అన్నారు. కచ్చితంగా చూస్తారని నమ్మకంగా చెప్పా. పోలీసు కథంటే సెన్సార్ సమస్యలొస్తాయేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ‘సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చాను.
అలా ‘అంకుశం’ కథ మొదలైంది. ఒక రాజకీయ నేత రోడ్ మీద ఆగితే... కూల్‌డ్రింక్ అందించేవారు కోకొల్లలు. కానీ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ, నిరంతరం ఎండలో నిలబడి వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్న ఒక పోలీస్‌కు మంచినీళ్ళివ్వడానికి ఒక్కడూ ముందుకు రాడు. మొదటి నుంచీ పోలీసంటే సమాజంలో చిన్న చూపు. దీన్ని ప్రశ్నిస్తూ, పోలీసు వ్యవస్థ గౌరవం పెంచాలనిపించింది. ఆ కసితోనే ముందు విజయ్ పాత్ర సృష్టించా. ఆ పాత్ర రాసుకున్న దగ్గర నుంచీ నా మనసులో మెదిలిన రూపం రాజశేఖరే. ఈ సినిమా గురించి చెప్పగానే... రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ప్రాణం పెట్టి చేస్తా సార్’ అన్నాడు. అన్నట్లుగానే సిన్సియర్‌గా చేశాడు.
►కథానాయకుని పాత్ర ఎలివేట్ అవ్వాలంటే, ప్రతినాయకుడు శక్తిమంతంగా ఉండాలి. రౌడీలను అతి సమీపంలో నుంచి చూసిన అనుభవం నాది. ఆ అనుభవాలను రంగరించే నీలకంఠం పాత్రను సృష్టించాను. ఆ పాత్రను ఎవరితో చేయించాలి? అన్వేషణ మొదలైంది. ఓ రోజు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి బంధువుల ఇంటికెళ్లాం. అక్కడ కనిపించాడు ఓ వ్యక్తి. రెడ్డిగారి బంధువు. అటూ ఇటూ తిరుగుతుంటే అతణ్ణే గమనిస్తూ కూర్చున్నా. వివరాలు తెలుసుకున్నా. పేరు రామిరెడ్డి. చదువుకుంటున్నాడు అని తెలిసింది. ఓ రోజు తనకు చెప్పకుండానే మేకప్ టెస్ట్ చేశాం. ‘ఏంటి ఇదంతా’ అని కంగారు పడ్డాడు. ఒప్పుకునేలా కనిపించలేదు. ఎమ్మెస్‌రెడ్డిగారితో చెప్పించాం. ‘చేయ్. విలన్ పాత్ర. బాగుంది. మంచి పేరొస్తుంది. సిగ్గెందుకు. నేను చేయడంలా?’ అని ఆయన గట్టిగా చెప్పడంతో ఒప్పుకున్నాడు.
►సంగీత దర్శకుడు సత్యం గారి చివరి సినిమా ‘అంకుశం’. ఓ పాట మిగిలుండగానే కన్నుమూశారాయన. నేపథ్యగీతం. ఎవరితో చేయించాలా అనుకుంటుండగా, రచయిత రాజశ్రీ ముందుకొచ్చారు.
►‘అంకుశం’ విడుదలయ్యాక ఓ రోజు నేను, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డిగారు ట్యాంక్‌బండ్ దగ్గర నిలబడ్డాం. అది నో పార్కింగ్ ప్లేస్. దాంతో ఇద్దరు పోలీసులు మా దగ్గరకొచ్చి, ‘ఫైన్ కట్టండి’ అన్నారు. దాంతో వారితో వాదన మొదలైంది. ఉన్నట్లుండి నాలుగు జీపులు వచ్చి అక్కడ ఆగాయి. అందులో నుంచి పోలీస్ ఉన్నతాధికారులు దిగారు. మమ్మల్ని చూసి పరుగుపరుగున మా వద్దకొచ్చారు. ‘ఆయన ఎవరనుకున్నారు? కోడి రామకృష్ణగారు. సెల్యూట్ కొట్టండి’ అని గద్దించారు. ‘మా పోలీసుల గౌరవాన్ని పెంచిన మనుషులు మీరు. మా వాళ్లు ఇలా ప్రవర్తించినందుకు సారీ సార్’ అన్నారు. తర్వాత ఓ ప్రభుత్వ వేడుకకు నన్ను అతిథిగా పిలిచి, పోలీస్ లాఠీ బహుమతిగా ఇచ్చారు. ఆ క్షణంలో ఎంత సంతృప్తి ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ ఆ లాఠీ నా దగ్గరే భద్రంగా ఉంది.
►‘అంకుశం’ 20 పైచిలుకు కేంద్రాల్లో వందరోజులాడింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో ఏడాది ఆడింది. ఆ రోజుల్లో బాగా వసూలు చేసిందా సినిమా. తమిళ, మలయాళాల్లోకి అనువదిస్తే, అక్కడ కూడా విజయం సాధించిందీ సినిమా. ఆ పాత్ర మీదున్న ప్రేమతో చిరంజీవి గారు హిందీలో ‘ప్రతిబం«ద్’గా చేసి, విజయం సాధించారు. నా కెరీర్‌లో ‘అంకుశం’ ఓ విలువైన రత్నం. ఇలాంటి మంచి సినిమాను నాతో చేయించిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్.
Comments
Please login to add a commentAdd a comment