చిత్రాల దర్శకుడు ఆయన. ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’గా తొలి చిత్రంతో గుర్తింపు సాధించారు. ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మామయ్య’, ‘ముద్దుల మేనల్లుడు’లను తెలుగు తెరకు పరిచయం చేయడమే కాదు.. ‘శ్రీనివాస కల్యాణం’ను ‘పెళ్లి పందిరి’లో ‘భలేదంపతుల’ సాక్షిగా.. ఎలా జరిపించాలో కూడా తీసి చూపించారాయన. ‘మధురానగరి’లో ‘చిలకపచ్చ కాపురాలు’ ఉంటాయని చెప్పారు. ‘పెళ్లి’లో ‘తలంబ్రాలు’ విశిష్టతను వివరిస్తూ ‘పుట్టింటికి రా’ చెల్లి అని ఆహ్వానం పలకడమూ ఆయనకే చెల్లింది. ‘20వ శతాబ్దం’లో తనదైన మార్కు చూపించాలని ‘అంకుశం’తో అదరగొట్టి.. ‘ఆహుతి’తో ఆకట్టుకుంటూ దర్శకత్వంలో ఆయనకు ఉన్న పవర్ చూపారు. ‘దేవీ’ దీవెనలతో ‘అమ్మోరు’ ఆశీస్సులతో ‘అంజి’ అని ‘పిలిస్తే పలుకుతా’ అని అందరి హృదయాలోనూ ‘మా పల్లెల్లో గోపాలుడు’ అని అనిపించుకున్నారు. ‘స్టేషన్ మాస్టర్’లోనే కాదు.. ‘రిక్షావోడు’లోనూ సత్తా ఉంటుందని చెప్పగలిగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అని గట్టిగా చెప్పడమే కాదు..‘మా ఆవిడ కలెక్టర్’ అంటూ మహిళా ప్రేక్షకులకు దగ్గరైన ‘దేవీపుత్రుడు’ ఆయన. ‘దొంగాట’ను ఆడించడమే కాదు.. అజాత ‘శత్రువు’గాను సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవుళ్లు’ సాక్షిగా ‘అరుంధతి’ని తెరంగేట్రం చేసిన ఘనత ఆయనదే. ఆయనే ప్రముఖ శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. శుక్రవారం ఆయన మృతి చెందడం ‘తూర్పు’వాసులను కలచివేసింది. ఈనేపథ్యంలో జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం కల్చరల్: శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరన్న వార్త విన్న గోదావరి శోకసంద్రమైంది. తెలుగు సినీరంగంలో ఎన్నో వినూత్న చిత్రాలకు సారధ్యం వహించిన కోడి రామకృష్ణ అనేక హిట్ సినిమాలకు ఈ జిల్లాలో ప్రాణప్రతిష్ట చేశారు. గోదావరికి ‘అద్దరిన’ ఉన్న పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణకు చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉండేది. పాలకొల్లులో లలిత కళాంజలి సంస్థ ద్వారా నాటకాలను ప్రదర్శించేవారు.
దాసరి ప్రోత్సాహం
దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు కోడి రామకృష్ణలోని టాలెంట్‌ను గుర్తించారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రానికి కోడి రామకృష్ణను సహాయదర్శకుడిగా ఎంపిక చేశారు. స్వర్గం–నరకం చిత్రంలో ఒక పాత్రను పోషించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో అమ్మోరు, ఆలయ శిఖరం, జైలు పక్షి, దేవి, పెళ్లాం చెబితే వినాలి, పోలీస్ లాకప్, భారత్ బంద్, మంగమ్మగారి మనుమడు, మా పల్లె గోపాలుడు, ముద్దుల మామయ్య, శ్రీనివాస కల్యాణం మొదలైన సినిమాల షూటింగ్ కొంతభాగం జిల్లాలోనే జరిగింది. సందేశాత్మక చిత్రాలను వినోదంతో మేళవించి, జనరంజకం చేయడం ఆయన బాణీగా నిలిచిపోయింది. ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య పాత్రలో గొల్లపూడి మారుతీ రావుతో అద్భుతమైన శాడిస్టు పాత్రను కోడి రామకృష్ణ ధరింపజేశారు.
రాయవరంతో అనుబంధం
రాయవరం (మండపేట): ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణకు రాయవరంతో అనుబంధం ఉంది. కోడి రామకృష్ణ 1998 ఏప్రిల్ 27న రాయవరంలోని సాయితేజా విద్యానికేతన్ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో రామచంద్రపురం, కోటిపల్లిలో ‘పెళ్లికానుక’ సినిమా షూటింగ్‌ను నిర్వహించారు. షూటింగ్ నుంచి వార్షికోత్సవానికి వచ్చిన కోడి రామకృష్ణ రాయవరంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రముఖ సినీ రచయత పైడిపాలతో కలిసి కోడి రామకృష్ణ రాయవరం వచ్చారు. సినీ నటుడు జగపతిబాబుతో కలిసి కోడి రామకృష్ణ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. కోడి రామకృష్ణ మంచి స్నేహశీలి అని సాయితేజా విద్యానికేతన్ కరస్పాండెంట్ కర్రి సూర్యనారాయణరెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
1984లో సినిమా షూటింగ్ సందర్శంగా హీరో బాలకృష్ణ, నర్సరీ అధినేత పల్ల వెంకన్నలతో దర్శకుడు కోడి రామకృష్ణ
ఆయన మరణం తీరని లోటు
కాకినాడ రూరల్: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం అకాలమరణంతో కాకినాడకు చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత కోకా సాయిప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణతో ఆయనకున్న పరిచయాన్ని ఇలా వివరించారు. ‘‘1994లో మద్రాస్ రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మిం టెక్నాలజీ డైరెక్షన్ డిపార్టుమెంట్‌లో శిక్షణ తీసుకున్న అనంతరం నేను ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణను హెదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆశ బారెడు, ఆస్తిమూరెడు సినిమా షూటింగ్ సమయంలో రామకృష్ణను కలిశాను. మరుక్షణం నాకు దర్శకత్వంలో అన్నిశాఖల్లో తర్ఫీదు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అది ఆయన గొప్పతనం అనారోగ్యంగా ఉన్న కోడి రామకృష్ణను పలకరించేందుకు 2018లో హైదరాబాద్ ఫిల్మినగర్‌లో కోడిరామకృష్ణ స్వగృహంలో కలిశాను. 24 ఏళ్ల తరువాత కలిసి గతంలో జరిగిన పరిచయాన్ని గుర్తుచేస్తే అంతే ఆత్మీయంగా పలకరించడం నేను మరచిపోలేని మధురానుభూతిగా భావిస్తున్నా. ఎలాంటి వారినైనా ఎంతో ఆత్మీయం పలకరిస్తూ తనదైన శైలిలో మనసులో నిలుపుకొనేంత ప్రేమను పంచడం కోడి రామకృష్ణ కే దక్కుతుంది. అటువంటి మహోన్నత వ్యక్తి మనకుదూరం అవ్వడం సినీలోకానికి తీరని లోటు.’’ అని తెలిపారు.
గొప్ప దర్శకుడిని కోల్పోయాం :రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజ్‌కుమార్
కొత్తపేట: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతితో గొప్ప తెలుగు సినీ దర్శకుడిని కోల్పోయామని ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్ అన్నారు. ఆయనతో తనకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయని, అనేక సందర్భాల్లో, అనేక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నానని తెలిపారు. ఆయన మృతి ఒక్క తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమలకు తీరని లోటన్నారు. అతికొద్దిమంది దర్శక దిగ్గజాల్లో కోడి రామకృష్ణ ఒకరని, ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు సూపర్, డూపర్ హిట్ కాగా ఆయా సినిమాల్లో నటించిన ప్రధాన, సహాయ నటులకు సైతం మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. అలాగే ఎంతో మంది నూతన నటులకు ఆయన అవకాశాలు కల్పించి, ప్రోత్సహించారన్నారు. వారు నేడు గొప్ప నటులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారన్నారు. రామకృష్ణ తనకు మంచి వ్యక్తిగత మిత్రుడని, ఆయన లేరంటే ఎంతో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నామన్నారు.
కడియం నర్సరీలతో అనుబంధం
కడియం: శతచిత్రాల దర్శకుడిగా తనదైన శైలిలో కోడి రామకృష్ణ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సిని షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందిన కడియం పల్ల వెంకన్న నర్సరీలో 1984లో బాల కృష్ణ హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి మనవడు సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణతో స్థానిక నర్సరీ రైతులకు ఎంతో పరిచయం ఏర్పడింది. ఇక్కడి రైతులను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని స్థానిక రైతులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నర్సరీ అధినేత పల్లవెంకన్న తోపాటు పలువురు నర్సరీ రైతులు దర్శకుడు రామకృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, సినీ రంగానికి ఆయన లేని లోటు తీరనిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment