ఒకప్పుడు అవే వినోదం.. కానీ వీటి రాకతో ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్‌.. | Special Story on Media Entertainment Industry in Telugu | Sakshi
Sakshi News home page

Entertainment: సినిమా క్రేజే వేరప్పా.. కానీ డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, సభ్యత లైన్‌ చెరిపేయడం.. ఓటీటీలో అయితే..

Published Sun, Sep 10 2023 10:42 AM | Last Updated on Sun, Sep 10 2023 3:51 PM

Special Story on Media Entertainment Industry in Telugu - Sakshi

ఎంటర్‌టైన్‌మెంట్‌.. అరచేతిలో అలరిస్తోంది. నడక.. నడతను మార్చుకున్న కంటెంట్‌ కనికట్టుతో వీక్షకుడిని కట్టుబానిసను చేస్తోంది! శ్వాస ఆగినా ధ్యాస లేదు.. కానీ కాలక్షేపంలో క్షణం మిస్‌ అయితే మాత్రం ఆగమాగమే! అంతలా తన సేవనంలో తరించేలా చేస్తున్న ఆ వినోదం తీరుతెన్నుల కబుర్లను  అందించాలనే సరదా ప్రయత్నం.. 

అప్పట్లో నాటకాలు, రేడియోలు
మన దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే వినోద పరిశ్రమ మంచి బూమ్‌లో ఉంది. కొన్నేళ్లలోనే అది వంద బిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరనున్నట్టు అంచనా! అంతా సాంకేతిక మార్పుల చలవ.. అందులో భాగమైన సోషల్‌ మీడియా పుణ్యం! వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌.. సీన్‌ రివర్స్‌లో ఉండేది. అంటే అప్పటి ఎంటర్‌టైన్‌మెంట్‌ మీన్స్‌ అండ్‌ మోడ్స్‌ కూడా వేరు కదా! ఏదైనా బహు స్వల్పమే. అది యంత్ర యుగం కాదు కాబట్టి.. చేసేవాళ్లకు చేసుకున్నంత పని! అలసిన మనసు, శరీరాలకు నిద్రే వినోదం.. విలాసం! అక్షరం వచ్చిన వాళ్లకు పుస్తకం కాస్త రిలాక్సేషన్‌. పనులతో మరీ విసిగిపోయిన సామాన్యులకు మరో కాలక్షేపం.. నాటకాలు! రేడియో.. సినిమాలు వినిపించి.. కనిపించాక అవి ఊహించని వినోదాన్నే పంచాయి.

టీవీ అంటే లగ్జరీ..
అయినా ఆ సమయం.. దాకా ఎందుకు కొన్ని దశాబ్దాల కిందటి వరకూ సినిమాకు వెళ్లడం అంటే ఒక వేడుకే! అంతలోనే టెలివిజన్‌ ఎంటర్‌ అయింది. ఒకే ఒక ప్రసార చానల్‌ దూరదర్శన్‌గా! ఆ సీన్‌ని రూల్‌ చేసింది. సినిమాలను మించిన సీరియల్స్‌ని క్రియేట్‌ చేసింది. కామన్‌ మన్‌ కాలాన్ని కాస్త లాక్కుంది. అప్పటికీ రేడియోల ప్రాబల్యమేమీ తగ్గలేదు. అయితే రేడియో సామాన్యుల ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్న రోజుల్లో టీవీ కాస్త లగ్జరీనే. వార్తలు, ఇతర వినోదానికి ప్రధాన మాధ్యమం ఆ శ్రవణ యంత్రమే! ఇంట్లో పనంతా అయిపోయాక ఇంటిల్లిపాది రేడియో చుట్టూ చేరి కార్యక్రమాలు విన్న దృశ్యాలకు ప్రతి చూరూ సాక్ష్యమే! ఈ వరుసలో టేప్‌రికార్డర్లు.. క్యాసెట్స్‌ను మరవొద్దు.

టేప్‌ రికార్డర్‌.. దీన్నెలా మర్చిపోగలం
రేడియోలో కోరిన పాటల టైమ్‌ బ్యాండ్‌ను వెదకడం కన్నా నచ్చిన పాటల క్యాసెట్స్‌ను.. లేదా రికార్డ్‌ చేయించుకున్న క్యాసెట్స్‌ను తెచ్చుకుని నచ్చినన్నిసార్లు వినడమే అసలైన వినోదంగా భావించిన శ్రోతలు ఎంతోమంది! పాటలేనా..నచ్చిన సినిమాలు.. నాటకాలనూ (కచ్చితంగా.. రేడియో కూడా ఆ పని చేసింది.. కానీ టైమ్‌ బౌండ్‌తో) వినిపించింది. మనలోని సృజననూ కదిలించింది టేప్‌ రికార్డర్‌. ఏకాపాత్రాభినయాల డైలాగ్స్‌.. పాటలు.. కవితలు.. ఇంట్లో ముచ్చట్లనూ రికార్డ్‌ చేసుకుని మనకు మనమే విని ఆనందించుకునేలా! అంతేకాదు.. ఎస్‌టీడీ.. ఐఎస్‌డీ ఫోన్‌ సౌకర్యాలు లేని ఊళ్లల్లో.. వాటి ఖర్చును భరించలేని ఇళ్లల్లో.. టేప్‌రికార్డర్‌ క్యాసెట్స్‌ రూపంలో ఉత్తరాల బట్వాడా బాధ్యతనూ నిర్వహించింది.

టీవీ సీరియల్స్‌.. రియాలిటీ షోస్‌
జాబుల్లో రాయాలనుకున్న విషయాలను.. విశేషాలను క్యాసెట్‌లో రికార్డ్‌ చేసి  అందాల్సిన చిరునామాకు చేరవేసింది. లేఖల్లోని అక్షరాల్లో పట్టుకోలేని భావోద్వేగాలను ఈ క్యాసెట్స్‌లోని మాటలతో ఆస్వాదించిన ఆత్మీయులు అనేకులు! అందుకే అది ఆప్యాయతానురాగాల వినోదంగా విరాజిల్లింది. మళ్లీ టీవీ దగ్గరకు వద్దాం. ప్రైవేట్‌ చానళ్లకంటే ముందు.. వీసీపీలు.. వీసీఆర్‌లు తమ ఘనతను చాటాయి. ప్రైవేట్‌ చానళ్ల ఆగమనం తర్వాత 24 గంటలు వార్తలే కాదు.. ట్వంటీఫోర్‌ అవర్స్‌ ఎంటర్‌టైన్‌మెంటూ షురూ అయింది. డైలీ సోప్స్‌ మజా.. రియాలిటీ షోస్‌ రొదను ఆస్వాదించడం మొదలైంది. రేటింగ్‌ కోసం పరిమితి గీత కూడా కొంచెం తగ్గడం మొదలైంది.

పగ-ప్రతీకారాలతో సీరియల్స్‌
క్రైమ్‌ ఎలిమెంట్‌ ఇన్‌క్లూడ్‌ అయింది. డైలీ సోప్స్‌.. కుటుంబ గాథల్లోని బంధాలు.. అనుబంధాలూ పగ–ప్రతీకారాల చుట్టే అల్లుకోవడం అవసరం అని భావించాయి. ఇందులో అన్ని చానళ్ల మధ్య పోటీ పరాకాష్ఠకు చేరింది. ఇంతలోకే డీటీహెచ్‌ (డైరెక్ట్‌ టు హోమ్‌) ఇళ్ల తలుపులు తట్టింది. అప్పటిదాకా లోకల్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్స్‌ మొనోపలీలో మగ్గిన ప్రేక్షకులకు ఒక వినోదాత్మక వరం. చానళ్లను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది. వీక్షకుల ముందుకు ఆప్షన్స్‌ను తెచ్చింది. 

అయినా.. 
అవేవీ నియో ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా చూపిస్తున్నంత ప్రభావాన్ని చూపించలేదు. జీవితాలను మార్చలేదు. కొత్త మీడియా.. సంప్రదాయ వినోద మాధ్యమాల శ్రోతలు, ప్రేక్షకులు, వీక్షకుల పగ్గాలను తెంచేసింది. ఇందులో ప్రధాన పాత్ర టెక్నాలజీ. దాని విప్లవాత్మక మార్పే కదా వినోదానికున్న అర్థం విస్తృతమవడానికి కారణమైంది! 

బింజ్‌ వాచింగ్‌ ఎరా..
ఇదివరకైతే వారం వారం సినిమాలు విడుదలైనట్టే టీవీ సీరియళ్లూ వచ్చేవి. ప్రైవేట్‌ చానళ్లు డైలీ సోప్స్‌ను వెంటబెట్టుకొచ్చాయి. ఇంటర్నెట్‌.. ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌)కి జన్మనిచ్చాక అది డజన్ల కొద్దీ ఎపిసోడ్స్‌తో ఒక సిరీస్‌ను స్ట్రీమ్‌ చేస్తోంది. అలాంటివి కొన్ని  సీజన్లై కొనసాగుతున్నాయి. బింజ్‌ వాచ్‌.. ఏకబిగిన చూసే చాన్స్‌నిస్తున్నాయి. వాటికి విదేశీ సిరీస్‌ ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ నుంచి దేశీ సిరీస్‌ ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ దాకా ఎన్నో వాచింగ్‌ ఎగ్జాంపుల్స్‌! ఇలాంటి స్ట్రీమింగ్‌ జాబితాలో యూట్యూబ్‌ సెన్సేషన్స్‌ టీవీఎఫ్, ఏఐబీ వంటి చానళ్లూ ఉన్నాయి. అందుకే దీన్ని బింజ్‌ వాచింగ్‌ ఎరా అంటున్నారు. ఒకరకంగా ఇది జీవనశైలిలో భాగమైపోయింది.

టెక్నాలజీ ఏలుతోంది
అదీగాక వినోదం ఇప్పుడు ఒక్క టీవీకే పరిమితమై లేదు. లాప్‌టాప్స్‌.. టాబ్‌లెట్స్‌.. మొబైల్‌ ఫోన్స్‌ ఎట్‌సెట్రా డివైసెస్‌కీ చేరింది. ఇంటర్నెట్‌ బేస్‌గా మారి ఓటీటీ మొదలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌గా యూట్యూబ్‌.. ఫేస్‌బుక్‌.. ట్విటర్‌.. వాట్సాప్‌.. ఇన్‌స్టాగ్రామ్‌.. టిక్‌టాక్‌ (మన దగ్గర బ్యాన్‌ అయినప్పటికీ) వంటి ఎన్నో యాప్స్‌ ద్వారా వినోద కడలినే సృష్టించింది టెక్నాలజీ. తోడుకున్న వాళ్లకు తోడుకున్నంత! కాలక్షేపం కాదు కాలమే తెలియకుండా చేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఏలుతోంది. సమకాలీన దేశీ ప్రేక్షకుల, వీక్షకుల వినోద అభిరుచిని మారుస్తోంది. 

సినిమా క్రేజే వేరప్పా!
ఇంట్లోంచి కాలు బయటపెట్టనివ్వకుండా కూర్చున్నచోటే రంజింపచేసే వినోదాన్ని ఒక్క టచ్‌లోనో...స్వైప్‌లోనో దాచుకున్న లాప్‌టాప్‌.. టాబ్‌.. మొబైల్స్‌ ఎన్ని వచ్చినా సినిమా టాకీస్‌ కళను కోల్పోలేదు. ఇప్పటికీ సినిమాకు వెళ్లడం ఒక వేడుకే. ఇంకా చెప్పాలంటే మల్టీప్లెక్స్‌లో వాచింగ్‌ మూవీ అనేది మచ్‌ మోర్‌ ఫన్‌! ట్రాన్స్‌పోర్టేషన్, ట్రాఫిక్‌ నుంచి టికెట్స్, పాప్‌కార్న్‌ వరకు ప్రహసనం ప్లస్‌ ఖరీదైన వ్యవహారంగా అయినా.. టాకీస్‌లో సినిమా చూడ్డం సంబరమే! అంతేకాదు ఓటీటీ.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కనిపిస్తున్నా.. రిలీజ్‌ అయ్యే కొత్త సినిమా అంతే ఉత్సాహంగా ప్రేక్షకుడిని ఊరిస్తూనే ఉంది. కారణం.. నియో మీడియా క్రియేట్‌ చేస్తున్న కంటెంట్‌కి ప్రధాన ఆధారం సినిమానే! కొత్త వినోద మాధ్యమం సినిమాకు ప్రత్యామ్నాయం కాదనే అనిపిస్తోంది. 

అసలు గమనించాల్సిన సీన్‌.. 
అసలు గమనించాల్సిన సీన్‌ ఏంటంటే కంటెంట్‌! అదేంటీ సినిమా నుంచే ఎక్కువగా కంటెంట్‌ క్రియేట్‌ చేస్తున్నారు.. మరి మళ్లీ కంటెంట్‌ గురించిన మాటేంటీ? అంటే.. నిజమే! రీల్స్‌.. షార్ట్స్‌ వంటివాటికి చాలా వరకు సినిమా డైలాగ్స్‌.. పాటలు.. పేరడీ సీన్సే ముడి సరుకునూ.. మెయిన్‌ సరుకునూ అందిస్తున్నా.. ఒరిజినల్‌ కంటెంట్‌ కూడా ఫ్లో అవుతుంది కదా! దాని గురించే.. అదే మర్యాద గురించి! ఎంచుకునే అంశం.. వాడే భాష.. క్రియేట్‌ చేసే తీరు.. ఒక్కటేమిటి అన్నిటికీ సంబంధించిన మర్యాద! ముందు కంటెంట్‌ విషయానికి వస్తే.. ఓటీటీ ఒరిజినల్‌ కంటెంట్‌ నుంచి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ యాప్స్‌ వరకు అన్నింటి ఒరిజినల్‌ కంటెంట్‌ క్రైమ్‌ అండ్‌ సెక్స్‌ చుట్టే తిరుగుతోంది.

డబుల్‌ మీనింగ్‌ డైలాగులు..
సాహిత్యం.. సంప్రదాయ మాధ్యమాలు కాలక్షేపంగా ఉన్న తరంలోని వినోదమంతా మర్యాద మడికే ముడిపడి ఉందా? అంటే.. ప్చ్‌.. అని పెదవి విరవాల్సిందే! శృంగారం.. నేరాలు.. ఘోరాలు.. డబుల్‌ మీనింగ్‌ పాటలు.. డైలాగులతో సినిమాలు జనాల్లోకి వచ్చినా.. అవేవీ లేని మిగిలిన కేటగిరీకి సంబంధించినవీ బోలెడు ఉండేవి. ఎంచుకోవడానికి చాయిస్‌ ఉండేది. ఇప్పుడు ఆ చాయిస్‌ పరిధి కుదించుకుపోయింది. వాడుతున్న భాషనూ లెక్కలోకి తీసుకోవాలి. మంచి, చెడులు.. మర్యాదమన్ననలు మనిషి దృక్కోణానికి సంబంధించినవే అయినా.. నాగరిక సమాజం వాటి మధ్య స్పష్టమైన గీతనే గీసింది. చదువు.. అనుభవాల జ్ఞానంతో పరిణతి చెందుతూ కొన్నిటిని అమర్యాదగా భావించి డిలీట్‌ చేశాం.. చేస్తున్నాం!

సభ్యత లైన్‌ చెరిపేశారు
అలాంటివిప్పుడు రీసైక్లింగ్‌ బిన్‌లోంచి వచ్చి మాటలుగా మారి.. ఎకో ఎఫెక్ట్స్‌లో వినబడుతున్నాయి. విరగబడి వైరల్‌ అవుతున్నాయి. ఆ వైరాలిటీ కోసం పోటీ పెరిగిపోతోంది. స్త్రీలను కించపరచే తిట్ల నుంచి భర్త భార్యను.. భార్య భర్తను.. తల్లిదండ్రులను పిల్లలు.. పిల్లలను పెద్దలు.. స్నేహితులు.. ఆడను మగ.. మగను ఆడ.. అంతా కలసి ఎల్‌జీబీటీక్యూఏప్లస్‌ను గేలి చేయడం∙వరకు.. కాలక్షేప కంటెంట్‌ అంతా సభ్యత లైన్‌ను చెరిపేసుకుంది. డబుల్‌ మీనింగ్‌ పాటలకు మ్యాచ్‌ అయ్యే అభినయంతో ఉన్న డాన్స్‌ను పిల్లలతో చేయించి తీసిన వీడియోలు రీల్స్‌గా ఇన్‌స్టా తెరిస్తే చాలు కాళ్ల మీద పడుతున్నాయి. ఇవి శాంపుల్స్‌ మాత్రమే. కామెడీ అద్దిన ట్రోలింగ్స్‌కైతే లెక్కేలేదు.

ఫేక్‌ కంటెంట్‌ కూడా..
చాటు అనే మాటకు చోటే లేదు. విరహం.. శృంగారాలూ రీల్స్‌ అండ్‌ షాట్స్‌కి కంటెంటే! ఓటీటీ కంటెంట్‌కైతే బూతులు.. క్రైమ్‌.. సెక్సే ప్రధానంశాలు! ఫేక్‌ కంటెంట్‌కీ సోషల్‌ మీడియా మెయిన్‌ ప్లాట్‌ఫామ్‌ అయింది. మార్పు సహజం. దానికి వినోదం మినహాయింపు కాదు. అయితే ఆయా కాలాల్లో వచ్చిన కంటెంట్‌ పాపులర్‌ అవడం .. ఆయా కాలాలనాటి ప్రేక్షకుల.. వీక్షకుల అభిరుచి, సమ్మతిపై ఆధారపడి ఉంటుంది. అందులో ఆయా కాలాల్లో ఉన్న సాంకేతిక లభ్యత కూడా ఒక కారణం అవుతుంది.

అందరినీ అలరించే కామెడీ
అలా ఇప్పుడు ‘పచ్చి’ అనేదే వినోదం అయింది. అది కల్చర్‌గా మారే ప్రమాదమూ కనిపిస్తోంది. ఆ వినోదానికే  టైమ్‌తో ఊడిగం చేస్తున్నాం. ఓటీటీ.. సోషల్‌ మీడియా అంతా ఇంతే అనే నెగెటివిటీ ఏం నింపట్లేదు! అద్భుతమైన క్రియేటివిటీ కూడా కళ్లబడుతోంది. అది చిన్నాపెద్దను అలరిస్తోంది. కామెడీ అయితే హాయిగా నవ్విస్తోంది. సీరియస్‌ అయితే తప్పకుండా ఆలోచింపచేస్తోంది. సమాజంలో అవహేళనకు గురైన సమూహాల పట్ల సున్నితంగా మెదిలే తత్వాన్నీ అలవరుస్తోంది. సమానత్వాన్ని కాపాడే ప్రయత్నమూ చేస్తోంది.

సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా సెలబ్రిటీలు
ఆ వుడ్‌.. ఈ వుడ్‌.. అనే తేడా లేకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అందరూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫొటోలు.. పోస్ట్‌లతో కొందరు.. రీల్స్‌తో ఇంకొందరు.. సినిమా ప్రమోషన్స్‌తో అందరూ! దేశీ నటీనటుల విషయానికి వస్తే రవీనా టండన్, విద్యాబాలన్, జెనీలియా – రితేశ్‌ దేశ్‌ముఖ్‌ దంపతులు, జానీ లీవర్‌.. ఆయన పిల్లలు జెస్సీ లీవర్, జెమీ లీవర్, హిమానీ శివపురి అండ్‌  మెనీ మోర్‌.. రీల్స్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. స్ట్రీమ్‌లో ఉండడానికి సినిమాలు, సిరీస్‌లే అక్కర్లేదు రీల్స్, షార్ట్స్‌ అయినా సరే అన్నట్లుగా!

► నిత్యనూతనంగా  కనపడుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 2026 కల్లా మొత్తం 2.9 ట్రిలియన్‌ (2లక్షల 90 వేల కోట్లు) అమెరికన్‌  డాలర్ల ఆదాయాన్ని ఆర్జించనుందని అంచనా!

►  కరోనా టైమ్‌లో ప్రపంచంలోని మిగిలిన వ్యాపారాలు ఎలా ఉన్నా వినోద పరిశ్రమ మాత్రం లాభాల్లోనే గడిపింది. ముఖ్యంగా ఓటీటీ, వీఓడీ (వీడియో ఆన్‌ డిమాండ్‌), ఇతర సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత స్ట్రీమింగ్‌ సేవలన్నీ ప్రాఫిట్స్‌ని షేర్‌ చేసుకున్నాయి. 

► మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీని పునర్నిర్వచిస్తే.. సోషల్‌ మీడియా ముందు వరుసలో ఉంటుంది. జనాలను విపరీతంగా ఎంగేజ్‌ చేస్తోంది. సంగీతం, టెలివిజన్, ప్రచురణ రంగాల మీద దీని ప్రభావం నానాటికీ పెరుగుతోంది. అంతేకాదు సోషల్‌ మీడియా నెమ్మదిగా కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి ఇంటరాక్టివ్‌ టూల్స్‌గా మారుతోంది. కంటెంట్‌ను.. సమాచారాన్ని పంచుతూ! 

అనవసర మైందేదీ లేదు.. 
వినోదానికి అన్నీ అవసరమే అన్న ఫిలాసఫీతో సాగిపోతున్నట్టుంది సోషల్‌ మీడియా! అందుకే క్రియేటివిటీకే కాదు.. స్పిరుచ్యువాలిటీ.. ఫ్యాషన్‌.. హెల్త్‌.. ఫిట్‌నెస్‌.. కుకింగ్‌.. ఇంటీరియర్‌.. డ్రెస్‌ డిజైనింగ్‌.. మొదలు ఆ లిస్ట్‌లో లేనిది లేదు. అన్నిటికీ ప్రమోషన్‌ అండ్‌ బిజినెస్‌ సెంటర్‌గానూ యూజ్‌ అవుతోంది! అంటే ఇటు కంటెంట్‌కి.. అటు మార్కెటింగ్‌కి ఫెసిలిటేటర్‌గా ఉంటోందన్నమాట. సోషల్‌ మీడియా శక్తిని, ప్రభావాన్ని వాడుకోవడంలో స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ కూడా ముందంజలోనే ఉన్నాయి. సోషల్‌ మీడియా కీలకాంశాలలో వైరల్‌ ఎఫెక్ట్‌ ఒకటి. నేటి మార్కెట్‌లో దీని పాత్ర ఎనలేనిది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌లో వైరల్‌ అయ్యేదంతా సోషల్‌ మీడియా డ్రైవ్‌ చేస్తున్నదే.

బుక్‌టాక్‌ చాలెంజ్‌
సంగీతం, ప్రచురణల మీదా సోషల్‌ మీడియా ప్రభావం పెరుగుతోందనడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. వాటిలో # బుక్‌టాక్‌ చాలెంజ్‌ ఒకటి. అమెరికాలోని ఒక బుక్‌ ఔట్‌లెట్‌ టిక్‌టాక్‌తో ఒప్పందం చేసుకుని  మొన్నటి వేసవి (2022)లో #బుక్‌టాక్‌ చాలెంజ్‌ పేరుతో ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీనివల్ల అంతకుముందెన్నడూ ఆ బుక్‌ ఔట్‌లెట్‌ కనీవినీ ఎరుగని రీతిలో పుస్తకాలు అమ్ముడుపోయాయట. అది గ్రహించిన చాలా పుస్తకాలయాలు తమ స్టోర్స్‌లో.. ఆన్‌లైన్‌లో #బుక్‌టాక్‌ లేదా బుక్‌టాక్‌ కలెక్షన్స్‌ అని డిస్‌ప్లే పెట్టి మరీ పుస్తకాలను అమ్ముతున్నాయి. దీన్నిబట్టి టిక్‌టాక్‌ పబ్లిసిటీ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 

33 ట్రిలియన్‌ డాలర్లకు పెరగనున్న ఆదాయం
2020లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 2030కల్లా జెన్‌ జెడ్‌ ఆదాయం 33 ట్రిలియన్‌ అమెరికా డాలర్లకు పెరుగుతుందట. అందుకే మార్కెట్‌లో కొనుగోలుదారులుగా  వీళ్లకు ప్రత్యేకత ఉండబోతోంది. ఆ కొనుగోలు శక్తితో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు వచ్చే వీలూ ఉంది. ఒక మార్కెట్‌ సర్వే ప్రకారం జెన్‌ జెడ్‌ రోజులో సగటున 7.2 గంటల పాటు వీడియో కంటెంట్‌ను వీక్షిస్తోంది. ఈ తరంలోని అత్యధికులు రాజకీయ, సాంఘిక విషయాల పట్ల ప్రగతిశీల ఆలోచనలు, అభిప్రాయాలతో ఉన్నవారే.

భవిష్యత్‌లో రూపురేఖలే మార్చేయొచ్చు
క్లైమేట్‌ చేంజ్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాత తరం కంటే శ్రద్ధ.. నిబద్ధతతో ఉంటున్నారు. అందుకే పలు అంతర్జాతీయ కంపెనీలు ఈ తరంలోని ఆ లక్షణాల ఆసరాతో వాళ్లకు తగినట్లుగా తమ వ్యాపారాన్ని దిద్దుకుంటున్నాయట. కొత్త కొనుగోలుదారులుగా వాళ్లకు ఎనలేని ప్రాధాన్యాన్నిస్తున్నాయి. ఈ లెక్కన పెరుగుతున్న సోషల్‌ మీడియా ప్రభావం, జెన్‌ జెడ్‌ కొనుగోలు శక్తి .. ఈ రెండూ భవిష్యత్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల రూపురేఖలనే మార్చేయొచ్చంటున్నారు నిపుణులు.  

అన్నింటినీ ప్రభావితం చేస్తున్న సోషల్‌ మీడియా
ఏ సిరీస్‌ను ఏకబిగిన చూస్తున్నాం.. ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నాం.. ఏ పుస్తకాలను చదువుతున్నాం.. ఎటువంటి సంగీతాన్ని వింటున్నాం.. మన ఆలోచనలు.. అభిరుచులు.. ప్రవర్తన.. నిర్ణయాత్మక శక్తి.. అన్నిటినీ సోషల్‌ మీడియా ప్రభావితం చేస్తోంది. అంతేకాదు కన్జూమర్స్‌ ఫీడ్‌బ్యాక్‌ను.. ఆ ఫీడ్‌బ్యాక్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ స్పందననూ సోషల్‌ మీడియా ప్రభావితం చేస్తోంది. అయితే షోలు.. సినిమాలు.. పుస్తకాలు.. పాటలు పాపులర్‌ అవడంలో కంటెంట్‌ క్రియేటర్స్‌దే ప్రధాన పాత్ర. మనం చూస్తున్న తాజా కంటెంట్‌లోంచే ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తారు. వాటి మీదే వీక్షకులు తమ అభిప్రాయాలను.. సిఫారసులను.. సమీక్షలను వెలిబుచ్చుతున్నారు.

ఫోన్‌ యాప్స్‌ మీదే ఆధారం
మన దేశంలో 82 శాతం సమయాన్ని మొబైల్‌ ఫోన్‌ యాప్స్‌లోని వినోదం మీదే వెచ్చిస్తున్నారట. 2025 కల్లా మన మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 34.62 (దాదాపు రూ. 2,863.10 కోట్లు) బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరనుందని పలు అధ్యయనాల సారాంశం. ఆ వినోదంలో లైవ్‌ ఈవెంట్స్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముందు వరుసలో ప్లే అవనున్నాయి. 

ఎట్‌ ది ఎండ్‌ ..
హద్దు ఆకాశం దాకే కాదు.. అధఃపాతాళానికీ చేరుతుంది. నియో ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకి నియంత్రణ చట్టం లేకపోవచ్చు. వినోదం పండిస్తున్న లాభాలు దాన్ని అడ్డుకోవచ్చు. కానీ సృజనకు ఓ గుణం ఉంటుంది.. విచక్షణ! వినోదం చుట్టూ నేమ్‌.. ఫేమ్‌.. పాపులారిటీ.. పబ్లిసిటీ 360 డిగ్రీల్లో తిరుగుతుంటే మనిషి మైమరచిపోవచ్చు. కాని మనిషిని నడిపించే విచక్షణ మాత్రం ఉనికి కోల్పోవద్దు!

చదవండి: మంచు విష్ణుకు నా కృతజ్ఞతలు: అల్లు అర్జున్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement