
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఇప్పుడు డైరెక్ట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌కు రానుంది. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 20న విడుదల అయింది. ఈ సినిమాని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వర్చువల్ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేదు. సుమారు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 47 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది.
యూఐ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఉపేంద్ర ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘యూఐ’ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారైనట్లు ఒక ప్రకటన చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో ‘యూఐ’ టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. టాలీవుడ్ హీట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మాదిరి యూఐ చిత్రం కూడా జీ5 ఓటీటీలో ఉగాది నాడే రావచ్చని చెబుతున్నారు. ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ రెండూ కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.
కథేంటి?
ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.