అల్లు అర్జున్.. పుష్ప2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్ప రాజ్‌గా తను నటించిన తీరుపై చాలామంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్దిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానిని అంటూ బిగ్ బీ పేర్కొన్నారు. అయితే, తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఓ కంటెస్టెంట్‌తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో కోల్‌కతాకు చెందిన రజనీ బార్నివాల్ అనే గృహణి కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దీనికి అమితాబ్ నవ్వుతూ ఇలా స్పందించారు. 'అల్లు అర్జున్‌కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. అతనికి వచ్చిన గుర్తింపునకు పూర్తి అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప2' విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగుంది. అతనితో నన్ను పోల్చొద్దు' అంటూ నవ్వుతూ చెప్పారు.
అయినప్పటికీ ఆ మహిళ మాత్రం బన్నీ టాపిక్ వదల్లేదు.. కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరూ కాలర్‌ను కొరుకుతూ, కళ్లు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బీ అడగడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. 'ఇక ఇద్దరి వాయిస్‌లోనూ ఓ రిచ్‌నెస్ ఉంటుంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒకరోజు అల్లు అర్జున్‌ను చూస్తే నా కల నెరవేరుతుంది' అని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment