రేపు ఫాదర్స్ డే
ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.
‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.
మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.
వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.
‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్‌లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్‌లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.
మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.
నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.
ఎక్విప్‌మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్‌డేట్స్, 24/7 మేనేజ్‌మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్‌మెంట్ ΄్లాట్‌ఫామ్‌గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్‌ఫామ్‌ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.
టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్‌ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.
‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.
‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.
‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.
‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది.
నాన్న హృదయం ఆనందమయం
పిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment