Varuna
-
Muthuswami Dikshitar: ఒక్కసారయినా అక్కడ పాడాలి
ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగే మాం పాహి... అంటూ కీర్తన చేస్తూ... గంగ వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించారు. నీళ్ళబిందె తలమీద పెట్టుకుని ఆడుతుంటే ఎలా ఉంటుందో శివుడు తన జటాజూటంలో గంగను బంధించి తాండవం చేస్తుంటే ఆ దృశ్యం అలా ఉంటుందంటుంది రావణ కృత స్తోత్రం. భగీరథుడు ప్రార్థన చేస్తే వదిలిపెట్టాడు శివుడు గంగను. శంకరుడి శిరస్సు నుండి పాదాల వరకు తగిలి కిందకు ప్రవహించింది. ఆ గంగను ...ఆ నీళ్ళను తలమీద చల్లుకుంటే.. దేవతాస్థానాలనుంచి పడిపోతున్న వాళ్లుకూడా మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని పొందుతారట.. అటువంటి శక్తి ఆ గంగమ్మది. గంగే మాం పాహి గిరీశ శిరస్థితే/గంభీరకాయే గీత వాద్య ప్రియే/అంగజతాత ముదే అసి వరుణా మధ్యే....’’. అంటారు దీక్షితార్ వారు తమ కీర్తనలో. ఆమె ప్రవాహ తీరును గంభీర కాయే.. అన్నారు.. ఆమె శరీరం అలా ఉంటుందట.‘...శేషాహే రనుకారిణీ ...’ అంటారు శంకరులు. ఆది శేషుడు భూమి మీద పాకి వెడుతుంటే ఎలా ఉంటుందో గంగా ప్రవాహం అలా ఉంటుందంటారు ఆయన. శేషుడు ఉత్తర దిక్కున ఉంటాడు. ఆయనను స్మరిస్తే మనకున్న ఆపద లు తొలగుతాయని ఒక నమ్మకం. కాశీలో గంగకున్న విశేష లక్షణం ఏమిటంటే... అప్పటివరకు దక్షిణానికి ప్రవహించిన గంగానది అక్కడ ఉత్తర దిక్కుకు మళ్ళుతుంది. దానిని కాశీగంగ అంటారు. అక్కడ గంభీర శబ్దంతో ప్రవహించే గంగను సంగీత వాద్య ప్రియే ... అని కూడా అన్నారు. ఎందుకలా!!! గంగమ్మకు గీతమన్నా, సంగీతమన్నా ఇష్టమట. గంగ ఒడ్డున కూర్చుని పాట పాడినా, వాద్యం మోగించినా, ఆలాపన చేసినా, నృత్యం చేసినా ఆమె సంతోష పడి పోతుందట. అంటే రాజోపచారాలన్నింటినీ అంత ప్రీతితో స్వీకరించగలిగిన భగవత్ స్వరూపం ఆమెది. అంటే నిజమయిన కళాకారుడు నిజజీవితంలో కోరుకోవలసింది ఏమిటంటే – ఒక్కసారయినా గంగ ఒడ్డున కూర్చుని తన ప్రదర్శన ఇచ్చి ఆమెను సంతోష పరచాలి, అని. కాశీలో ఇప్పటికీ ఒక ఏర్పాటు ఉంది. అక్కడ కొన్ని పడవలు అద్దెకిస్తారు. వాటితోపాటూ సంగీత విద్వాంసులు వస్తారు మనతో. వాద్యగోష్ఠి చేస్తారు. కొంతమంది తబలా, వయోలిన్, వీణ వాయిస్తే మరికొంతమంది పాడతారు. సూర్యోదయానికి ముందు తెల్లవారు ఝామున ... అసి, వరుణ – ఈ రెండింటి మధ్యలో అలా సంగీతం వింటూ పడవమీద వెడుతూ ఉంటే గంగమ్మ ప్రసన్నరాలవుతుందని అక్కడి వారి నమ్మకం. గీత వాద్య ప్రియే... అంగజ తాత ముదే... అసి వరుణా మధ్యే...దీక్షితార్ వారి కీర్తనలో కూడా ఇదే వ్యక్తమవుతుంది. అంగజ తాత ముదే... గంగమ్మ ఎవరు? అంగజుడు అంటే మన్మథుని తండ్రి.. మహావిష్ణువు. గంగమ్మ ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుందట. తన స్పర్శను పొంది గంగ పునీతమయింది. తిరిగి గంగ ఆ ప్రభావంతో సర్వ జనుల పాపాలను నశింప చేసి ధర్మరక్షణకు కారణమవుతున్నందువల్ల విష్ణువుకు ప్రీతిపాత్రమవుతున్నది అన్నారు ముత్తుస్వామి దీక్షితార్. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా?
వరుణ గ్రహం... ఇంగ్లీషులో యురేనస్ అంటారు. ఈ గ్రహం పేరు మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ గ్రహాన్ని గ్యాస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టి, రాయికి బదులుగా గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పరిమాణంలో చాలా పెద్దది. ఇటువంటి విచిత్ర వాతావరణం కలిగిన గ్రహంలో మనిషి కనీసం ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సౌర వ్యవస్థలో టెలిస్కోప్ సాయంతో కనుగొన్న మొదటి గ్రహం యురేనస్. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో సూర్యుని నుండి దూరం పరంగా చూస్తే ఏడవ సుదూర గ్రహం. యురేనస్ తన అక్షం మీద ఒక పరిభ్రమణాన్ని దాదాపు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే యురేనస్‌పై ఒక రోజుకు 17 గంటలు మాత్రమే ఉంటుందని అర్థం. అంటే ఇక్కడ ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం. యురేనస్‌పై రాత్రి 42 సంవత్సరాలు, పగలు 42 సంవత్సరాలు అని తెలిస్తే ఎవరైరా ఆశ్చర్యపోవాల్సిందే. యురేనస్‌పై రెండు ధృవాలలో ఒకటి సూర్యునికి అభిముఖంగా ఉండడం, మరొకటి 42 ఏళ్లు చీకటిలో ఉండడమే ఇందుకు కారణం. యురేనస్.. సూర్యుని నుండి సుమారు మూడు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం చాలా చల్లగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -197 డిగ్రీల సెల్సియస్. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, యురేనస్‌పై కనిష్ట ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. ఇక భూమికి ఒకే చంద్రుడు ఉండగా, యురేనస్‌కు మొత్తం 27 సహజ ఉపగ్రహాలు అంటే చంద్రులు ఉన్నారు. అయితే ఈ చంద్రులు చాలా చిన్నవిగా, అసమతుల్యంగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువ. యురేనస్ దాని అక్షం మీద 98 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే ఇక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ తుఫాను లాంటి వాతావరణం ఉంటుంది. గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటాయి. యురేనస్ గ్రహంపై మేఘాల అనేక పొరలతో కూడి ఉంటాయి. పైభాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. యురేనస్ గ్రహంపై మీథేన్ వాయువు, ఉష్ణోగ్రత, గాలి సమృద్ధిగా ఉండటం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యకిరణాలు ఈ గ్రహాన్ని చేరుకోవడానికి రెండు గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ భూమి కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. మరి ఈ గ్రహం గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాక.. మనిషి ఈ గ్రహంపై ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమవుతుందనేది ఇప్పటికే మీకు సమగ్రంగా అర్థమై ఉండాలి. ఇది కూడా చదవండి: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం -
సిద్ధరామయ్య మా దేవుడు అంటున్న వరుణ ప్రజలు
-
సిద్దరామయ్యపై యడ్డీ కుమారుడు పోటీ?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు సిద్దరామయ్య మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్న వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బి.ఎస్. యడియూరప్ప కుమారుడు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు బి.వై. విజయేంద్ర వరుణ నియోజకవర్గం నుంచి పోటీ పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యడియూరప్ప చెప్పడంతో రాజకీయంగా ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. మైసూరు జిల్లాలో ముఖ్య నియోజకవర్గాల్లో ఒకటైన వరుణకి ప్రస్తుతం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వరుణ నుంచి సిద్ధరామయ్య పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. సిద్దరామయ్యపై మీ కుమారుడు విజయేంద్ర పోటీ పడతారా అని గురువారం యడియూరప్పని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై చర్చలైతే సాగుతున్నాయి. వరుణలో నెగ్గడం సిద్దరామయ్యకు అంత సులభం కాదు. మేము మంచి అభ్యర్థినే నిలబెట్టి గట్టి పోటీ ఇస్తాం. చూద్దాం ఏమవుతుందో’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ తనపై ఎవరు పోటీకి దిగినా పట్టించుకోనని అన్నారు. యడియూరప్ప పోటీకి దిగినా స్వా గతిస్తామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ పేర్కొనడం విశేషం. -
వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్‌కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు. ఇంతో ఎన్ఎన్ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్ దివస్‌లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు. -
మైక్ లాక్కునే క్రమంలోనే అనుకోకుండా జరిగింది
-
మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన మాజీ సీఎం
-
మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సమావేశంలో పాల్గొన్న సిద్ద రామయ్య తన సమస్యలు చెప్పుకుంటున్న మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ద రామయ్య ఆమె చేతిలోని మైక్‌ను లాగేయగా.. చున్నీ కూడా జారిపోయింది. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య తన కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ద రామయ్య ఎదుట ఓ మహిళ సమస్యలను ఏకరువు పెట్టింది. పదే పదే ఓ విషయంపై ప్రశ్నిస్తున్న ఆమెపై సిద్ద రామయ్య తెగ చిరాకుపడ్డారు. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయిన సిద్ద రామయ్య ఆమె లేచిన ప్రతిసారి కూర్చో, కూర్చో అంటూ కసురుకున్నారు. అయినా ఆ మహిళ ఏదో చెబుతుండగా.. ఆమె మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చున్నీ కూడా జారీపోయింది. నిండు సభలో ఈ ఘటన జరిగిన కూడా సిద్ద రామయ్య శాంతించలేదు. ఆ తర్వాత కూడా మహిళపై ఆగ్రహంతో ఊగిపోయారు. సిద్దరామయ్య ఓ మహిళతో ఇలా ప్రవర్తించడాన్ని చూసిన అక్కడున్న అధికారులు, ప్రజానీకంతోపాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా నివ్వెరపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సిద్ద రామయ్య ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా సిద్ద రామయ్య పలు వివాదాలకు కేంద్రంగా నిలిచారు. మైక్ లాక్కునే క్రమంలోనే అనుకోకుండా జరిగింది: దినేశ్ గుండురావు ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు.. కొన్ని సందర్భాల్లో ప్రజలు చాలా కఠినంగా ప్రశ్నలు అడుగుతారని.. వాటిని నేతలు విన్నప్పటికీ.. వారు మళ్లీ అదే అడుగుతూ ఉంటారని.. ఆ సమయంలో మైక్ లాక్కోవాల్సి వస్తుందని చెప్పారు. సిద్ద రామయ్య మహిళ చేతిలో నుంచి మైకును లాక్కునే క్రమంలో అనుకోకుండా ఆమె దుప్పట్ట జారీపోయిందని.. ఇది కావాలని చేసింది కాదని అన్నారు. రాహుల్ ఏం సమాధానం చెప్తారు: ప్రకాశ్ జవడేకర్ సిద్ద రామయ్య మహిళతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మహిళతో సిద్ద రామయ్య ప్రవర్తన చూస్తుంటే.. వారు మహిళలను ఏ రకంగా గౌరవిస్తారో తెలుస్తుందన్నారు. ఇది తీవ్రమైన నేరం అని తెలిపారు. వారు ఒక కుటుంబానికి చెందిన మహిళలను మాత్రమే గౌరవిస్తారని జవడేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
నా కుమారుడిని ఆశీర్వదించండి
మైసూరు : తాను పోటీ చేస్తున్న చాముండేశ్వరి నియోజకవర్గంలో మూడుసార్లు ప్రచారం నిర్వహించిన సీఎం సిద్దరామయ్య మంగళవారం తన కుమారుడు డాక్టర్ యతీంద్ర పోటీ చేస్తున్న వరుణ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి యతీంద్ర పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి బీ.ఎస్.యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర పోటీలోఉన్నారు. దీంతో ఎలాగైనా∙ఈ ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించడం కోసం ప్రచారంలో వేగం పెంచారు. ఈ ప్రచారంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ... రాజకీయంగా తనకు జన్మనిచ్చింది వరుణ నియోజకవర్గం అయితే పునర్ జన్మనిచ్చింది చాముండేశ్వరి నియోజకవర్గమని సీఎం సిద్దరామయ్య భావోద్వేగానికి లోనయ్యారు. నంజనగూడు తాలూకాలోని కోణనూరు గ్రామం నుంచి ప్రారంభించి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. వరుణ నియోజక వర్గం తనకు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి స్థానం కల్పించిందని, వరుణ, చాముండేశ్వరి రెండు నియోజకవర్గాలు నాకు రెండు కళ్లు అని అన్నారు. ఇక్కడి నుంచి తనను ఆశీర్వదించిన ప్రజలు ఈసారి తన కుమారుడిని ఆశీర్వదించాలన్నారు. రాకేష్‌ను గుర్తుకు చేసుకుని కన్నీళ్లు ప్రచారంలో మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య తన పెద్ద కుమారుడు రాకేష్‌ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గాలకు వస్తే తన పెద్దకుమారుడు తనకు గుర్తుకువస్తాడని అన్నారు. అతడే బతికి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదని, రాకేష్‌కున్న ప్రజలతో కలిసి తిరిగిన అనుభవం యతీంద్రకు లేదని అన్నారు. రాకేష్ ఉండి ఉంటే వరుణతోపాటు చాముండేశ్వరిలో సైతం తానే చూసుకుంటూ ప్రచారం చేసే వాడని కంటనీరు పెట్టుకున్నారు. -
కరువు మేఘం
ముఖం చాటేసిన వరుణుడు అరకొరగానే ప్రధాన పంటల సాగు ‘ప్రత్యామ్నాయం’ ఏర్పాట్లలో వెనుకంజ వర్షం వస్తే అందుబాటులో లేని విత్తనం కాలయాపన చేస్తున్న వ్యవసాయ శాఖ రైతుల్లో సన్నగిల్లుతున్న సాగు ఆశలు ఖరీఫ్ సాధారణ సాగు : 8.01 లక్షల హెక్టార్లు ఆగస్టు 7 నాటికి సాగు : 2.54 లక్షల హెక్టార్లు వేరుశనగ సాధారణ సాగు : 06.04 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకుచేపట్టిన సాగు : 02.08 లక్షల హెక్టార్లు ప్రత్యామ్నాయ పంటల సాగు అంచనా : 05.36 లక్షల హెక్టార్లు అవసరమైన ప్రత్యామ్నాయ విత్తనాలు : 48,942 క్వింటాళ్లు అనంతపురం అగ్రికల్చర్: కరువు మేఘం జిల్లాను కమ్మేస్తోంది. వర్షాలు విస్తారంగా కురవాల్సిన సమయంలో వరుణుడు ముఖం చాటేశాడు. నైరుతి రుతు పవనాల జాడలేకపోగా.. అల్పపీడనం కూడా కన్నెత్తి చూడని పరిస్థితి. ఫలితంగా చినుకు పడటం గగనమవుతోంది. కురిసిన అరకొర వర్షానికి అక్కడక్కడ విత్తు వేసినా.. 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు మొలకలు ఎండిపోతున్నాయి. రక్షకతడి పేరిట రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. నీళ్లు లేకపోవడంతో ఒక్క ఎకరాను కూడా కాపాడే పరిస్థితి లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఖరీఫ్‌లో ప్రధాన పంటల సాగు పడకేయగా.. ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించట్లేదు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంటోంది. 32 శాతం లోటు వర్షపాతం తొలకరి వర్షాలతో ఖరీఫ్ ఆశాజనకంగా ప్రారంభమైనా అది ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో ఖరీఫ్ సాగు కల్లోలంగా తయారైంది. జూన్ నెల సాధారణ వర్షాపాతం 63.9 మి.మీ., కాగా.. 59.2 మి.మీ వర్షం కురిసింది. అది కూడా నైరుతి రుతు పవనాలు రాకమునుపే. ఆ తర్వాత వర్షాలు మొహం చాటేశాయి. పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో 67.4 మి.మీ., గాను 54 శాతం తక్కువగా కేవలం 31 మి.మీ వర్షం పడింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా.. ఇప్పటి వరకు 11 మి.మీ మాత్రమే కురిసింది. మొత్తం మీద ఇప్పటివరకు 148 మి.మీ గానూ 102 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటి వరకు 32 శాతం లోటు వర్షపాతం ఉంది. 42 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా కాస్త ఎక్కువ వర్షం పడగా.. మిగతా 17 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. 2.54 లక్షల హెక్టార్లకు పరిమితం జూన్, జూలైలో కురిసిన అరకొర వర్షాలకు 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగులో ఇప్పటి వరకు 2.54 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో 6.04 లక్షల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 2.08 లక్షల హెక్టార్ల వద్ద నిలిచిపోయింది. కంది 12 వేల హెక్టార్లు, పత్తి 10వేల హెక్టార్లు, ఆముదం 6వేల హెక్టార్లు, మిగతా పంటలు మరో 15వేల హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. మిగతా 5.47 లక్షల హెక్టార్లు పంటలు వేయలేక బీళ్లుగా ఉండిపోయాయి. ఎక్కడ ప్రత్యామ్నాయ విత్తనాలు వరుణ దేవుడు దయతలచి వర్షం కురిపిస్తే ఇప్పటికిప్పుడు పంటలు సాగు చేయడానికి ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో లేవు. ఈ నెల ఒకటోతేదీ నుంచి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమల్లోకి వచ్చిందని స్వయంగా వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరిజవహర్‌లాల్ సెలవిచ్చినా... ఆచరణలో విఫలమయ్యారు. 5.36 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన 48,942 క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు 75 శాతం రాయితీతో ఇస్తామని చెప్పినా.. ఒక క్వింటా కూడా జిల్లాకు సరఫరా కాలేదు. కనీసం వాటి ధరలు, రాయితీలు కూడా ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వర్షం వస్తే ప్రత్యామ్నాయం కూడా ముందుకు సాగే పరిస్థితి లేదనేది స్పష్టమవుతోంది. అందుబాటులో కందులు - పీవీ శ్రీరామమూర్తి, వ్యవసాయశాఖ జేడీ ప్రస్తుతం కందులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన విత్తనాలు రెండు మూడు రోజుల్లో సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఘనంగా వరుణ యాగం
వాన కురవాలి.. సిరులు పొంగాలి పాదగయ జలంలో కుక్కుటేశ్వరునికి అభిషేకం వెయ్యి కలశాల నీటితో గర్భగుడి దిగ్బంధం పిఠాపురం : రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరునికి సహస్రఘటాభిషేకం నిర్వహించారు. వేయి కలశాల నీటితో స్వామివారి గర్భాలయాన్ని నింపివేసి స్వామిని జలదిగ్బంధం చేశారు. కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, విశ్వేశ్వరస్వామి ఆలయాలలో సహస్రఘటాభిషేకాలు నిర్వహించారు. తొలుత వేదపండితులు మట్టికలశాలకు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. పాదగయ పుష్కరిణి చుట్టూ వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కుక్కుటేశ్వరస్వామికి పాలాభిషేకం, అనంతరం జలాభిషేకం నిర్వహించారు. గర్భగుడిని పాదగయ జలంతో నింపివేసి శివలింగం పూర్తిగా మునిగేలా జలదిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈఓ చందక దారబాబు పర్యవేక్షించారు. కాగా సామర్లకోట, ద్రాక్షారామ, అయినవిల్లి, తలుపులమ్మలోవ వంటి పుణ్యక్షేత్రాల్లోను వరుణయాగాలు జరిగాయి. పంపాలో ఋష్యశృంగుని విగ్రహం నిమజ్జనం అన్నవరం: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తూ రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని ప్రతిషి్ఠంచి గత మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపాలు ఆదివారం ముగిశాయి. ఉదయం 8 గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, ఋష్యశృంగమహర్షికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు వరుణ యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య దేవస్థానం పండితులు, ఈఓ నాగేశ్వరరావు హోమద్రవ్యాలను సమర్పించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్లు, ఋష్యశృంగమహర్షికి పండితులు వేదాశీస్సులందచేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మూడు రోజులు పూజలందుకున్న ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని వేదమంత్రాలు, మేళతాళాల మధ్య కొండదిగువన పంపా నదిలో నిమజ్జనం చేశారు. తొలుత రత్నగిరిపై పండితులు ఆ విగ్రహాన్ని శిరసున ధరించి ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు. ప్రధాన వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి అన్నవరంలో వాతావరణం మేఘావృతమై వర్షం కురిసింది. ఇదంతా వరుణ యాగ మహిమేనని పండితులు చెప్పారు. -
వరుణుడు కరుణించాలని..
వరణుడి కరుణించాలని ఆస్పరి మండలం బిణిగేరి గ్రామస్తులు గ్రామ దేవతకు జలాభిషేకం చేసేందుకు తుంగభద్ర నీటిని యాత్రగా తీసుకెళ్తున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాలు లేక వాడు ముఖం పట్టడంతో శుక్రవారం తుంగ భద్రనదీ జలం కోసం వెళ్లారు. శనివారం తిరుగు ప్రయాణంలో ఆదోని మీదుగా వెళ్తున్నారు. మారణాయుధాలు, కర్రలకు పూలు అలంకరించడం.. కళశాలతో నీళ్లు తీసుకెళ్తూ ప్రత్యేకంగా కనిపించారు. – ఆదోని టౌన్ -
చినుకు రాలదు.. చింత తీరదు!
- ముఖం చాటేసిన వరుణుడు - మొలకదశలోనే ఎండుతున్న పంటలు - గతం కంటే తక్కువ వర్షపాతం నమోదు - కమ్ముకుంటున్న కరువుఛాయలు జిల్లాను కరువుచాయ కమ్ముకుంటోంది.. బోరుబావుల్లో నీరింకిపోయింది. చినుకు రాలకపోవడంతో మట్టిలో పోసిన విత్తనం మాడిపోయింది. రెక్కలుముక్కలు చేసుకున్న అన్నదాత కష్టమంతా మట్టిపాలైంది. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసి.. ఎదురుచూసి ఆశ ఆవిరైంది. వాడుపట్టిన మొలకలు చూసి రైతుగుండె తరుక్కుపోతోంది. అచ్చంపేట జిల్లాలో వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చినుకు కురవకపోవడంతో మెట్టపంటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గంలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, వంగూరు మండలాల పరిధిలో 50శాతం మంది రైతులు విత్తనాలు విత్తారు. నీటి వనరులు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో భూమిని తడిపి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెట్టరైతులు మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఎకరా పత్తిసాగుకు రూ.15వేల పెట్టుబడి అవుతుంది. వర్షాలు కురవకపోతే మళ్లీ ైరె తులు దుక్కిదున్ని సాగుచేయాలంటే రెట్టింపు ఖర్చవుతోంది. అచ్చంపేట వ్యవసాయశాఖ సబ్‌డివిజన్ పరిధిలోఖరీఫ్సాగు విస్తీర్ణం 25,890 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 13,450 హెక్టార్లు సాగుచేశారు. పత్తి పంటలు మొలకెత్తకుండా భూమిలోనే వాడిపోయాయి. బిందెలతో పంటలకు నీళ్లు కొత్తూరు: ఈ ఏడాది సరైన వర్షాలు కురియక రైతులు సాగుచేసిన పంటలను రక్షించుకోవడానికి నానాఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డి రెండెకరాల్లో టమాట తోటను సాగుచేశాడు. వర్షాలు ముఖం చాటేయడంతో పంట ఎండుతుంది. దీంతో ఎలాగైన పంటను రక్షించుకోవాలనే తపనతో కూలీల సాయంతో పంటకు బిందెలతో నీళ్లు పోయిస్తున్నాడు. తక్కువ వర్షపాతం న మోదు బాలానగర్: మండలంలో 787 హెక్టార్లలో వరిని సాగుచేశారు. 7835 హెక్టార్లలో మక్కజొన్నసాగు చేశారు.5042 హెక్టార్లలో పత్తిసాగుచేశారు. అదేవిధంగా 404 హెక్టార్లలో కందిసాగుచేశారు. అయితే విత్తనం విత్తిన నాటినుంచి వర్షాలు కురవకపోవడంతో మొలకలు వాడిపోతున్నాయి. ఇప్పటికే మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ, రాజాపూర్, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న మొక్కలు పూర్తిగా ఎండిపోయేదశలో ఉన్నాయి. జూన్‌లో 84 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. మండలంలో కేవలం 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే అన్నదాతలు అప్పుచేసి విత్తనాలు కొనుగోలుచేస్తే మట్టిపాలయ్యాయని లబోదిబోమంటున్నారు. ఎండిపోతున్న మొలకలు జడ్చర్ల: నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్‌పేట, బాలానగర్ మండలాల్లో దాదాపుగా 40వేల హెక్టార్లలో పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేశారు. పంటసాగు కోసం ఎకరాకు రూ.ఐదు నుంచి ఏడువేల వరకు ఖర్చుచేశారు. ఈలెక్కన నియోజకవర్గంలో దాదాపుగా రూ.8కోట్లకు పైగానే విత్తనాల సాగుకు వెచ్చించారు. తీరా వర్షం కురవకపోవడంతో విత్తనాలు భూమిలోనే ఇంకిపోయాయి. బోరు వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా మొలకలను కాపాడుకుంటున్నారు. దిక్కుతోచడం లేదు కురిసిన అరకొరవర్షానికి విత్తనాలు సాగుచేశాం. 9 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేశాను. వర్షం కురువకపోవడంతో సగం విత్తనాలు మొలకెత్తలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. - ఆండ్ర వెంకట్‌రెడ్డి, మున్ననూర్, మిడ్జిల్ మండలం వర్షంలేక మొలకలు చనిపోతున్నాయి వర్షం లేక పత్తి, మొక్కజొన్న మొలకలు చచ్చిపోతున్నాయి. ఐదెకరాలు పత్తి విత్తనాలు నాటితే ఏ ఫలితం లేకుండా ఉంది. సకాలంలో వర్షాలు లేని ఎగుడు దిగుడు కాలంతో ఏటా అప్పే మిగులుతుంది. - పెద్దశ్రీనయ్య, రైతు, మర్రిపల్లి, ఉప్పునుంతల మండలం -
మించుతున్న తరుణం
15 దాటితే ప్రత్యామ్నాయ పంటలే.. వర్షాభావంతో 30 శాతమే పంటల సాగు 3400 హెక్టార్లలోనే వరి 45 శాతం తక్కువగా వర్షపాతం అన్నదాతలతో వరుణుడు ఆటలాడుతున్నాడు. అదనుదాటిపోతోంది. ఖరీఫ్ తరుణం మించిపోతోంది. చినుకుపడక పంట భూములు బీడువారుతున్నాయి. మైదానంలోని గెడ్డలు, చెరువులు అడుగంటిపోతున్నాయి. కలిసిరాని కాలం రైతన్నకు గుండెకోతను మిగుల్చుతోంది. ఏజెన్సీ,జలాశయాల ఆయకట్టు ప్రాంతాల్లో మినహా ఎక్కడా పొలాల్లో ఏరువాక సాగడం లేదు. మబ్బుపట్టిన వాతావరణంపోయి రెండు రోజులుగా చుర్రుమంటోంది. వరినారు మళ్లు ఎండిపోతున్నాయి. ముదిరిపోతున్న నారును చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. విశాఖ రూరల్/నక్కపల్లి రూరల్ : ప్రభుత్వం తప్పుడు హామీలతో రైతులను నిలువునా ముంచితే.. ప్రకృతి కూడా పగబట్టినట్టు కనిపిస్తోంది. ఖరీఫ్ రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. చెరువుల్లో చుక్క నీరు లేదు. నారు మడులు ఎండిపోతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోతున్నా పెద్దగా వర్షాలు లేవు. రెండు రోజులుగా ఎండలు మం డిపోతున్నాయి. ఖరీఫ్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు అందకపోయినా..అప్పోసప్పో చేసి పంటలు వేద్దామనుకున్నా.. వర్షాభావ పరిస్థితులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో వరి కేవలం 3400 హెక్టార్లే. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ సమయానికి 3,771 హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయి. గత వారం వరుసగా నాలుగు రోజులు వర్షాలు పడడంతో ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సాధారణ వర్షపాతం కంటే 45 శాతం తక్కువ వర్షం జిల్లాలో కురిసింది. ఆగస్టు 15 వరకు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే స్వల్పకాలిక పంటలు చేపట్టాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ పేర్కొంటున్నారు. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. ఇందులో లక్షా 10 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో చెరకు, 25 వేల హెక్టార్లలో రాగులు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32,400 హెక్టార్లలో ఇతర పంటల సాగుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పటి వరకు వరి 3400 హెక్టార్లలోను, చెరకు 30,450 హెక్టార్లలోను, రాగులు 5415 హెక్టార్లలోను, మొక్కజొన్న 3100 హెక్టార్లలో మొత్తంగా అన్నీ కలిపి 30 శాతంతో 56,500 హెక్టార్లలో సాగు చేశారు. విత్తనాలకూ కొరత రైతులను విత్తనాల కొరత వేధిస్తోంది. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో విత్తనాలు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రధానంగా అధిక కాలపరిమితి విత్తనాలు ఆర్జీఎల్ 2537, 1001 విత్తనాలపైనే రైతులు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వాటి నిల్వలు నిండుకున్నాయి. అలాగే రైతులు ప్రధానంగా వినియోగించే బీపీటీ 3291(సోనామసూరి) విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఖరీఫ్ అదను దాటుతుండడంతో స్వల్పకాల విత్తనాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 తరువాత కూడా పరిస్థితి ఇలానే ఉంటే ప్రత్యామ్నాయంపై దృష్టి పెడతామని అధికారులు చెబుతున్నారు. స్వల్పకాల విత్తనాలనైనా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.