బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు సిద్దరామయ్య మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్న వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బి.ఎస్. యడియూరప్ప కుమారుడు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు బి.వై. విజయేంద్ర వరుణ నియోజకవర్గం నుంచి పోటీ పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యడియూరప్ప చెప్పడంతో రాజకీయంగా ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. మైసూరు జిల్లాలో ముఖ్య నియోజకవర్గాల్లో ఒకటైన వరుణకి ప్రస్తుతం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో వరుణ నుంచి సిద్ధరామయ్య పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. సిద్దరామయ్యపై మీ కుమారుడు విజయేంద్ర పోటీ పడతారా అని గురువారం యడియూరప్పని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై చర్చలైతే సాగుతున్నాయి. వరుణలో నెగ్గడం సిద్దరామయ్యకు అంత సులభం కాదు. మేము మంచి అభ్యర్థినే నిలబెట్టి గట్టి పోటీ ఇస్తాం. చూద్దాం ఏమవుతుందో’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ తనపై ఎవరు పోటీకి దిగినా పట్టించుకోనని అన్నారు. యడియూరప్ప పోటీకి దిగినా స్వా గతిస్తామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ పేర్కొనడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment