Ex-Deputy Laxman Savadi Has Joined Congress Party at Karnataka - Sakshi
Sakshi News home page

కర్నాటక: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీనియర్‌ నేత.. ఎన్నికలపై ఎఫెక్ట్‌?

Published Fri, Apr 14 2023 2:41 PM | Last Updated on Thu, Apr 20 2023 5:22 PM

Laxman Savadi Has Joined Congress Party At Karnataka - Sakshi

బెంగళూరు: కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ సీనియర్‌ నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను టార్గెట్‌ చేస్తూ వారికే టికెట్స్‌ ఇస్తున్నాయి. ఇక, బీజేపీ ఇప్పటికే పలువురు సీనియర్లను కాదని కొత్తగా 52 మందిని బరిలోకి దింపింది. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్‌లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. దీంతో, బీజేపీ సీనియర్లు.. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. 

ఇదిలా ఉండగా, కర్నాటకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాదీ.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య, సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా సమక్షంలో సవాదీ.. హస్తం పార్టీలో చేరారు. ఇక, కాంగ్రెస్‌లో చేరిక అనంతరం.. కాంగ్రెస్‌ అతడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపనున్నట్టు తెలిపింది. దీంతో, ఆయన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 

ఇదిలా ఉండగా.. లక్ష్మణ్‌ సవాదీ అథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మహేష్‌ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్‌ నేతల్లో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది.  2019లో జేడీఎస్‌-కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్‌ కీలక పాత్ర పోషించారు.

మరోవైపు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ రఘు అచర్‌.. జేడీఎస్‌లో చేరారు. జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆధర్యంలో ఆయన జేడీఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, కర్నాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement