బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పంచాయితీ ఎటు తేలడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి స్పష్టమైన మెజార్టీ అందుకున్న హస్తం పార్టీకి.. ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం కష్టతరంగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
అయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కేసుల గండం చుట్టుముడుతోంది. డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసులు.. కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. డీకేను సీఎంగా నియమిస్తే సీబీఐ ఏమైనా ఇబ్బంది పెడుతుందా అన్న ఆలోచనలో పడింది హైకమాండ్. దీనికి తోడు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను సీబీఐ బాస్‌గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే.
కాగా 2020-23 మధ్య ఆయనపై 13 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ శివకుమార్ పై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013-18లో మంత్రిగా డీకే అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 30న డీకే అక్రమాస్తుల కేసు విచారణ కూడా ఉంది. అంతేగాక అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఓసారి అరెస్టై విడుదలయ్యారు శివకుమార్.
చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్
డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జి రణదీప్ సింగే సూర్జేవాలాతో డీకే సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు సుర్జేవాలా చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘కాంగ్రెస్ కోసం నేను ఎంతో పనిచేశాను. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేదంటే అసుల కేబినెట్‌లో స్థానం కూడా వద్దు’ సూర్జేవాలాకు డీకే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి సిద్ధరామయ్య
కాగా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ బృందం సమావేశం కానుంది. కేబీనెట్ కూర్పుపై కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.
అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేళ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిని సిద్దరామయ్యా అంగీకరించినా డీకే శివకుమార్ మాత్రం నో చెప్పినట్టు సమాచారం. ఇక నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 18న జరుగనుంది.
ఇదీ చదవండి: మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు
Comments
Please login to add a commentAdd a comment