మించుతున్న తరుణం
- 15 దాటితే ప్రత్యామ్నాయ పంటలే..
- వర్షాభావంతో 30 శాతమే పంటల సాగు
- 3400 హెక్టార్లలోనే వరి
- 45 శాతం తక్కువగా వర్షపాతం
అన్నదాతలతో వరుణుడు ఆటలాడుతున్నాడు. అదనుదాటిపోతోంది. ఖరీఫ్ తరుణం మించిపోతోంది. చినుకుపడక పంట భూములు బీడువారుతున్నాయి. మైదానంలోని గెడ్డలు, చెరువులు అడుగంటిపోతున్నాయి. కలిసిరాని కాలం రైతన్నకు గుండెకోతను మిగుల్చుతోంది. ఏజెన్సీ,జలాశయాల ఆయకట్టు ప్రాంతాల్లో మినహా ఎక్కడా పొలాల్లో ఏరువాక సాగడం లేదు. మబ్బుపట్టిన వాతావరణంపోయి రెండు రోజులుగా చుర్రుమంటోంది. వరినారు మళ్లు ఎండిపోతున్నాయి. ముదిరిపోతున్న నారును చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంటలపై ఆశలు వదులుకుంటున్నారు.
విశాఖ రూరల్/నక్కపల్లి రూరల్ : ప్రభుత్వం తప్పుడు హామీలతో రైతులను నిలువునా ముంచితే.. ప్రకృతి కూడా పగబట్టినట్టు కనిపిస్తోంది. ఖరీఫ్ రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. చెరువుల్లో చుక్క నీరు లేదు. నారు మడులు ఎండిపోతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోతున్నా పెద్దగా వర్షాలు లేవు. రెండు రోజులుగా ఎండలు మం డిపోతున్నాయి.
ఖరీఫ్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు అందకపోయినా..అప్పోసప్పో చేసి పంటలు వేద్దామనుకున్నా.. వర్షాభావ పరిస్థితులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో వరి కేవలం 3400 హెక్టార్లే. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ సమయానికి 3,771 హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయి.
గత వారం వరుసగా నాలుగు రోజులు వర్షాలు పడడంతో ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సాధారణ వర్షపాతం కంటే 45 శాతం తక్కువ వర్షం జిల్లాలో కురిసింది. ఆగస్టు 15 వరకు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే స్వల్పకాలిక పంటలు చేపట్టాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ పేర్కొంటున్నారు. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. ఇందులో లక్షా 10 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో చెరకు, 25 వేల హెక్టార్లలో రాగులు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32,400 హెక్టార్లలో ఇతర పంటల సాగుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పటి వరకు వరి 3400 హెక్టార్లలోను, చెరకు 30,450 హెక్టార్లలోను, రాగులు 5415 హెక్టార్లలోను, మొక్కజొన్న 3100 హెక్టార్లలో మొత్తంగా అన్నీ కలిపి 30 శాతంతో 56,500 హెక్టార్లలో సాగు చేశారు.
విత్తనాలకూ కొరత
రైతులను విత్తనాల కొరత వేధిస్తోంది. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో విత్తనాలు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రధానంగా అధిక కాలపరిమితి విత్తనాలు ఆర్‌జీఎల్ 2537, 1001 విత్తనాలపైనే రైతులు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వాటి నిల్వలు నిండుకున్నాయి. అలాగే రైతులు ప్రధానంగా వినియోగించే బీపీటీ 3291(సోనామసూరి) విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఖరీఫ్ అదను దాటుతుండడంతో స్వల్పకాల విత్తనాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 తరువాత కూడా పరిస్థితి ఇలానే ఉంటే ప్రత్యామ్నాయంపై దృష్టి పెడతామని అధికారులు చెబుతున్నారు. స్వల్పకాల విత్తనాలనైనా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.