లెవీ పోటు
- నిబంధనలు మార్చిన ఎఫ్‌సీఐ
- కొత్త విధానంలో 25 శాతం బియ్యమే స్వీకరణ
- ధాన్యాన్ని నిల్వ చేయలేమంటున్న మిల్లర్లు
- రైతులకు గిట్టుబాటు ధర దక్కదన్న ఆందోళన
- పట్టించుకోని ప్రభుత్వం
నెల్లూరు (హరనాథపురం) : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తీసుకున్న నిర్ణయం అన్నదాతను పరోక్షంగా దెబ్బతీయనుంది. ఎఫ్‌సీఐ 25 శాతానికి లెవీ కుదిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఖరీఫ్‌లో పండించిన ధాన్యం మార్కెట్‌లోకి వచ్చింది. ఎఫ్‌సీఐ తాజాగా మార్చిన లెవీ నిబంధనలతో మిల్లర్లకూ ఇబ్బంది పరిస్థితులున్నా.. రైతులకు మాత్రం పెను శాపంగా మారనుంది. కొత్త లెవీ నిబంధనలతో ఈ సీజన్‌లో ధాన్యం కొనే నాథుడు లేక ఆరుగాలం కష్టించిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించని పరిస్థితి నెలకొనేటట్లు ఉంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది.
లెవీ 25 శాతమే అయితే..
మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో గత సెప్టెం బర్ వరకు 75 శాతం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యం రూపే ణా సేకరించేది. మిగిలిన 25 శాతంలో రెండొంతులు ఇతర రాష్ట్రాల్లోనూ మూడో వంతు రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్‌లో మిల్లర్లు స్వేచ్ఛగా అమ్ముకునే వీలుండేది. ఎఫ్‌సీఐ నిర్ణయంతో లెవీ విధానం తారుమారైంది. మిల్లర్ల నుంచి కేవలం 25 శాతం మాత్రమే లెవీ తీసుకుంటామని ఎఫ్‌సీఐ గత ఆగస్టులో ప్రకటించింది.
ఈ విధానం అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చింది. ఎఫ్‌సీఐ తీసుకున్న నిర్ణయం మిల్లర్లు, రైతులపై పెనుప్రభావం చూపనుంది. లెవీ 75 శాతం ఉంటేనే మిగిలిన 25 శాతం బియ్యం అమ్ముకునేందుకు మిల్లర్లు నానా పాట్లు పడేవారు. ఇది పరోక్షంగా రైతులపై ప్రభావం చూపి మద్దతు ధరకన్నా క్వింటాలు ధాన్యాన్ని రూ.100 నుంచి రూ.200 వరకు తక్కువ ధరకు కొనేవారు. మారిన పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో 75 శాతం బియ్యం అమ్ముకునేందుకు స్వేచ్ఛ ఇవ్వకుండా పర్మిట్ల నిబంధన విధించడంతో బియ్యం కొనుగోలు చేసే నాథుడే లేడని మిల్లర్లు చెబుతున్నారు. నూతన విధానంలో ఇప్పటికే బాయిల్డ్ రైస్ ధర క్వింటాల్‌కు రూ.2,400 నుంచి రూ.2,200, రారైస్ రూ.2,200 నుంచి రూ.2 వేలకు పడిపోయినట్లు మిల్లర్లు వాపోతున్నారు.
ఖరీఫ్ సీజన్ ధాన్యం పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి వస్తే ఈ ధరలు మరింత దిగజారుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత నెల నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాలి. గతంలో మిల్లర్లు ఇబ్బడిముబ్బడిగా కొనేవారు. మారిన పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడంలేదు. లెవీ కుదింపుతో ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునేందుకు, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు అనేక సమస్యలు ఉన్నాయని మిల్లర్లు అంటున్నారు.
ప్రభుత్వ ఉదాసీనత
రైతు సంక్షేమానికి ప్రమాదం ముంచుకువస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ నిర్ణయంపై ఏ మాత్రం స్పందించలేదు. లెవీ 50 శాతానికి పెంచాలని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం నిర్మోహమాటంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను రంగంలోకి దించుతారని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అసలే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ డబ్బులు సకాలంలో చెల్లిస్తుందనే గ్యారెంటీ లేదనే భయం మిల్లర్లను వెంటాడుతుంది. ఎఫ్‌సీఐ నిర్ణయంతో అంతిమంగా నష్టపోయేది రైతులేనని మిల్లర్లే చెబుతున్నారు.
అమ్ముకునే స్వేచ్ఛను ఇవ్వాలి :
ఎఫ్‌సీఐ లెవీ బియ్యం సేకరణ నిబంధన మార్చడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం 25 శాతం లెవీ తీసుకున్నప్పటికి మిగిలిన 75 శాతం మిల్లర్లు అమ్ముకునేందుకు స్వేచ్ఛ కల్పించాలి. పర్మిట్ విధానం పెట్టడం వల్ల రాజకీయ నాయకులు, అధికారులు లాభపడుతున్నారు. జిల్లాకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ ఉంచేందుకు గిడ్డంగుల సౌకర్యం ఉంది.
- రంగయ్యనాయుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్
జిల్లా నాయకుడు