హాలాహలం | Anndata hunger cry | Sakshi
Sakshi News home page

హాలాహలం

Published Mon, Nov 3 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

హాలాహలం

హాలాహలం

  • రైతన్నకు కన్నీటిని మిగిల్చిన ఖరీఫ్.. అదే దారిలో రబీ
  •  జిల్లాలో కరువు కోరలు..
  •  అన్నదాతల ఆకలి కేకలు
  •  నిండా ముంచిన చీ‘కట్’లు..  
  •  కష్టాల సాగులో చితికిన రైతులు
  •  అరకొరగా సర్కారు సాయం..  
  •  నిర్వేదంలో బలవన్మరణాలు
  • కోటి ఆశల నవ తెలంగాణ ప్రయాణంలోని తొలి ఖరీఫ్.. హలధారి కంట జలధారను తెప్పించింది. వర్షాభావ పరిస్థితులతో ప్రారంభమైన సీజన్... రైతు స్వేదాన్ని, రక్తాన్ని పీల్చేసింది. నీటివనరులు అందుబాటులో లేని కర్షకుడిని సాగుకు దూరం చేసిం ది. భూములను బీళ్లుగా మార్చి కష్టజీవి నోట్లో మట్టికొట్టింది. మొండి ధైర్యంతో నాగలిపట్టిన రైతును నట్టేటముంచింది. అన్నదాతను అప్పుల ఊబిలోకి దింపి అచేతనావస్థకు చేర్చింది. రైతన్న కళ్లను నీళ్లు లేని ఎడారిగా మార్చింది. తుదకు బలవంతంగా బలిపీఠమెక్కించింది.
     -  వరంగల్
     
    42 మండలాల్లో వర్షాభావం

    జిల్లాలోని 51 మండలాలకు గాను 42 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం కంటే అదనంగా ఒకే ఒక్క మండలంలో మాత్రమే అదనంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 993.6 మి.మీ కాగా ఇప్పటి వరకు జిల్లాలో 589.7 మి.మీ మాత్రమే  నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 29 శాతం లోటు. ఒక మండలంలో మైనస్ 60శాతం నుంచి మైనస్ 99 శాతం, 41 మండలాల్లో మైనస్ 20శాతం నుంచి మైనస్ 59శాతం, 8 మండలాల్లో మైనస్ 19శాతం నుంచి అదనంగా 19శాతం, ఒకే మండలంలో అదనంగా 20 శాతం వర్షపాతం నమోదైంది.
     
    దెబ్బమీద దెబ్బ

    వర్షాలు లేక, కరెంటు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు తెగుళ్ల రూపంలో మరో కష్టం వచ్చిపడింది. కాస్తోకూస్తో చేతికొస్తుందనుకున్న పంటలు చీడపీడల బారిన పడడంతో రైతన్న మరింత కుంగిపోయాడు.  పంట ఎదిగే సమయంలో మిరపకు, గొలుసు పెట్టే సమయంలో వరికి ఈ రోగాలు పట్టి పీడించాయి.
     
    పత్తి పంటకు దెబ్బ

    ఈ సీజన్‌లో జిల్లాలో 2,29,000 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు. ఏపుగా పెరిగిన పత్తికి ఆకుముడత, తెల్లదోమ, పూత, కాత రాలిపోవడం, పచ్చదోమ కాటు, రసం పీల్చే పురుగుల దాడితో పంటలు దెబ్బతింటున్నాయి. ధర్మసాగర్, ఘనపురం, నెల్లికుదురు, చేర్యాల, చిట్యాల, శాయంపేట, నల్లబెల్లి ప్రాంతాల్లో పత్తి,  మహబూబాబాద్, కురవి, మరిపెడ మండలాల్లో మిరప పంటకు ఆకు, చిగుళ్ల ముడత తెగులు వ్యాపించాయి. ఆలస్యంగా సాగుచేసిన వరిపంటకు పేనుబంక, దోమకాటు, కాండం తొలుచు పురుగులు వెంటాడుతున్నాయి.
     
    అప్పుల పెట్టుబడి.. తగ్గుతున్న దిగుబడి


    అప్పుల పెట్టుబడితో అన్నదాతలు ఆగమవుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న దిగుబడితో అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, అడ్తిదారులు, పురుగుమందు వ్యాపారుల నుంచి ఏడాదికి 45శాతానికిపైగా వడ్డీతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఒక్కో రైతు రూ.రెండు నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పు చేస్తుండడంతో ఆ ఊబి నుంచి కోలుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 5,03,605 హెక్టార్లు కాగా ప్రస్తుతం 4,14,084 హెక్టార్లలో(83శాతం) పంటలు సాగుచేశారు. ఇందులో ఎక్కువగా పత్తి,  మొక్కజొన్న, వరి ఉన్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.  
     
    రూ.25వేలు.. 25 క్వింటాళ్లు

    తొలి వర్షానికి భూమి దున్నడం, ట్రాక్టర్ కూలీ, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. దీనికి అదనంగా ఇంటిల్లిపాదీ శ్రమ. మధ్యలో అకాల వర్షాలు, చీడపీడలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వరి సాగుకు ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి పెడితే సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర లభిస్తే రూ. 33 వేలు రైతుకు వచ్చే అవకాశం ఉంది. ఇక కౌలు రైతులకు అదనంగా భూమి కౌలు, పెట్టుబడి వడ్డీ కలిపి రూ.10వేల భారం పడే పరిస్థితి నెలకొంది.  పత్తి సాగుకు ఎకరానికి రూ. 30వేలు పెట్టుబడి పెడితే దిగుబడి ఆరు క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. పత్తి అమ్మకం ద్వారా రూ. 25వేలు వస్తాయని అంచనా. మొక్కజొన్న ఎకరానికి రూ.20 వేలు పెడితే దిగుబడి 30 క్వింటాళ్లు వస్తుంది. మద్దతు ధర లభిస్తే రూ. 34వేలు వస్తుంది.  
     
    రుణం కోసం అరిగోస


    రుణం కోసం రైతులు గోసపడుతున్నారు. రుణం అందకుండానే ఖరీఫ్ ముగియడంతో కనీసం రబీలో అయినా అందుతుందో లేదోననే మీమాంశ లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చి న రుణమాఫీ హామీ అమలులో జాప్యం కావడంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. సెప్టెంబర్ నెలాఖరులో రుణమాఫీకి సంబంధించి ఆమోదం తెలియజేస్తూ  ప్రభుత్వం 25శాతం నిధులు విడుదల చేసింది. కొత్త రుణాలివ్వాలని బ్యాంకులను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అందలేదని క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో రూ.లక్షలోపు రుణమాఫీ కింద రూ.1915 కోట్ల మేరకు ఉన్నాయని, జిల్లాకు రూ. 472 కోట్లు  విడుదలయ్యాయని లీడ్‌బ్యాంక్ అధికారులు తెలిపారు. రుణాల రెన్యువల్‌కు సంబంధించి కసరత్తు సాగుతున్నట్టు పేర్కొన్నారు. నిజానికి జిల్లాలో నాలుగు లక్షలమంది రైతులు పంట రుణాలపై ఆధారపడి సాగుచేస్తున్నారు. వర్షాభావంతో ఈసారి ఆ సంఖ్య మూడు లక్షలకు తగ్గింది.  ఈ ఏడాది పంట రుణాల కింద రూ.2,100 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఖరీఫ్ లక్ష్యం రూ.1,400 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రుణాలిచ్చిన జాడలేదు. రబీలో పంట రుణాల లక్ష్యం రూ.700 కోట్లుగా ప్రకటించారు. ఈ మేరకు రైతులకు రుణాలందించి ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement