జోరువాక | Normal rainfall in the district | Sakshi
Sakshi News home page

జోరువాక

Published Thu, Jul 7 2016 9:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Normal rainfall in the district

జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు
 పంటల సాగుకు అనుకూలంగా వాతావరణం
1.57 లక్షల హెక్టార్లకు చేరిన పంటల సాగు
తగ్గిన ఎరువుల భారం.. పొలాల్లో రైతులు బిజీ..
కరీంనగర్ అగ్రికల్చర్

 జిల్లాలో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు పడుతుండటంతో రైతుల్లో అనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కురిసింది. ఈవర్షాలు సాగుకు అనుకూలమేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 1.57 లక్షల హెక్టార్ల వరకు వివిధ పంటలు వేశారు.

 ఖరీఫ్ ఆరంభమైన జూన్ 1 నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 184 మిల్లీమీటర్లు కాగా 180 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని కమలాపూర్, జమ్మికుంట, ఎల్కతుర్తి, వీణవంక, హుజురాబాద్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, ఓదెల, పెద్దపల్లి, మంథని, కమాన్‌పూర్, కాటారం మండలాల్లో అధిక వర్షాలు కురిసాయి.

 

రామడుగు మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యింది. భీమదేవరపల్లి, కరీంనగర్, బెజ్జంకి, కోహెడ, కేశవపట్నం, మానకొండూర్, సారంగాపూర్, జగిత్యాల, కథలాపూర్, కోరుట్ల, రాయికల్, చందుర్తి, గంభీరావుపేట, బోయినపల్లి, సిరిసిల్ల, ముస్తాబాద్,  వేములవాడ, రామగుండం, సుల్తానాబాద్, ధర్మారం, శ్రీరాంపూర్, జూలపల్లి, మల్హర్‌రావు, మంథని ముత్తారం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. మిగతా మండలాల్లో లోటు వర్షం నమోదయ్యింది. కరీంనగర్, మంథని డివిజన్‌లోనే సాధారణం కంటే అధికంగా వర్షాలు నమోదయ్యాయి.


 పొలం పనుల్లో రైతులు
 జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసిన మండలాల్లో రైతులు పొలం పనుల్లో బిజీగా మారారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గత నెలలో 50 వేల హెక్టార్లలో పంటలు సాగు కాగా సోమవారం నాటికి సాగు విస్తీర్ణం 1.57,206 హెక్టార్లకు చేరింది. 5.15 హెక్టార్లలో సాధారణ సాగు కాగా ఇప్పటివరకు 30 శాతం పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 1,25,529 హెక్టార్లలో పత్తి పంట సాగుచేయగా... 3557 హెక్టార్లలో వరి నార్లు పోసుకున్నారు. పలుచోట్ల మబ్బులు దోబూచులాడుతుండడంతో విత్తనాలు వేసుకున్న రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


 తగ్గిన ఎరువుల భారం..
 కేంద్ర ప్రభుత్వం యూరియేతర ఎరువుల ధరలను తగ్గించడంతో జిల్లా రైతులకు ఊరట లభించింది. ఖరీఫ్ సీజన్‌లో 5,15 లక్షల హెక్టార్ల పంటల విస్తీర్ణానికి యూరియా 1,37,670 మెట్రిక్ టన్నులు, 38,670 టన్నుల డీఏపీ, 16,953 టన్నుల ఎంవోపీ, 51,130 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం 98,650 టన్నుల యూరియా, 21,415 టన్నుల డీఏపీ, 85,105 టన్నుల కాంప్లెక్స్, 13,436 టన్నుల ఎంవోపీ మార్క్‌ఫెడ్, పీఏసీఎస్, ప్రైవేట్ గోదాముల్లో అందుబాటులో ఉన్నాయి. అవసరం మేరకు ఎరువులు తెప్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. తగ్గిన ధరల వల్ల జిల్లా రైతులకు రూ.25 లక్షల మేర ప్రయోజనం చేకూరనుంది. తాజా ధరల ప్రకారం డీఏపీ బస్తా రూ.1220 నుంచి రూ.1070కి చేరింది. పొటాష్ రూ.840 నుంచి రూ.590కి తగ్గింది. కాంప్లెక్స్ ఎరువులు రూ.1140 నుంచి రూ.1040కి తగ్గింది.


 దక్కని రుణాలు
 రైతులకు బ్యాంకులు పంటరుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీవ్యాపారుల ను ఆశ్రయిస్తున్నారు. సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినప్పటికీ 84,413 మంది రైతులకు రూ.387 కోట్లు మాత్రమే పంట రుణాలిచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో రూ.2700 కోట్ల పంట రుణాలివ్వడానికి లక్ష్యం పెట్టుకోగా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. రుణమాఫీలో మూడవ విడుతగా రూ.415 కోట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం రూ.207.50 కోట్లు విడుదల చేసింది. రుణమాఫీ సొమ్ము విడుదల కాలేదని, పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ఇప్పటి వరకు రెన్యువల్ చేసుకున్న వారికి కేవలం రూ.387.03 కోట్ల రుణాలు ఇచ్చారు. ఖరీప్ సీజన్ ప్రారంభమైన  రుణమాఫీ సొమ్ము విడుదల కాలేదని చాలా మంది రైతులు పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. మూడవ విడతలో సగం గ్రాంటు విడుదల చేసినా వడ్డీలకే సరిపోతోంది.


 అందుబాటులో విత్తనాలు..
 జిల్లా రైతులకు సరిపడా విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 50 శాతానికిపైగా విత్తనాలు అమ్ముడుపోయాయి. రైతులు ఎక్కువగా పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో పత్తి విత్తన ప్యాకెట్లు 9,54,655 కావాలని ప్రతిపాదించగా 3,26,316 వచ్చాయి. 17,933 క్వింటాళ్ల జీలుగ విత్తనాలకు 14వేల క్వింటాళ్లు, 11,287 క్వింటాళ్ల జనుము విత్తనాలకు 4,300 క్వింటాళ్లు సరఫరా చేసారు. 11,764 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలకు ప్రతిపాదిస్తే 3300 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. మొక్కజొన్న 12,563 క్వింటాళ్లు ప్రతిపాదిస్తే 14వేల క్వింటాళ్లు కేటాయించారు. పెసర్లు 963 క్వింటాళ్లకు రెండు వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. కందులు 535 క్వింటాళ్లు ప్రతిపాదిస్తే రెండువేల క్వింటాళ్లు వచ్చాయి. వరి విత్తనాలు 42వేల క్వింటాళ్లకు ప్రతిపాదిస్తే పూర్తిగా వచ్చాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement