వరద పోటు.. కరువు కాటు | Shrinking agriculture sector in the state | Sakshi
Sakshi News home page

వరద పోటు.. కరువు కాటు

Published Sun, Aug 11 2024 5:23 AM | Last Updated on Sun, Aug 11 2024 5:23 AM

Shrinking agriculture sector in the state

రాష్ట్రంలో కుదేలైపోతున్న వ్యవసాయ రంగం

ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల రైతులకు వరద పోటు

కోనసీమలో సాగు చేయలేక పొలాల్ని ఖాళీగా వదిలేస్తున్న రైతులు

పలు ప్రాంతాల్లో 50 రోజులకు పైగా తీవ్ర లోటు వర్షపాతం

సాగు మొదలై 70 రోజులవుతున్నా.. 49 శాతం దాటని పంటల సాగు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క అతివృష్టి, వర­దలు.. మరో ప్రాంతంలో అనావృష్టి. రెండూ రాష్ట్ర­వ్యా­ప్తంగా అన్నదాతను అతలాకుతలం చేస్తు­న్నాయి. ఖరీఫ్‌ మొదలై 70 రోజులు దాటినా ఆశించిన స్థాయిలో పంటల సాగు లేదు. వేసిన పంటలు కొన్ని చోట్ల నీట మునగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. ఈ విపత్కర సమయంలో రైతు­కు అండగా నిలవాల్సిన సమయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతాంగాన్ని మరింతగా ఊబిలోకి నెడుతోంది. ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం కుదేలైపోయింది.

రాష్ట్రంలో జూన్‌ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కురిసిన వర్షాన్ని పరిశీలిస్తే  286 మిలీమీటర్లు కుర­వాల్సి ఉండగా, ఇప్పటికే 370.4 మిల్లీమీటర్లు కురి­సింది. అంటే 29.5 శాతం అధికం. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండుగా ఉన్నాయి. ఉత్త­రాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగడం, వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. 

తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గుర­య్యాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం వాటిలింది. ఇదే సమయంలో రాయ­లసీమ జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో మాత్రం వర్షా­భావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జిల్లాల్లో చాలా చోట్ల గత 50 రోజులకు పైగా వర్షపు చుక్క లేకపో­వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాల్లో జూన్‌లో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ,  జూలై నుంచి ఈ నెల మొదటి వారం వరకు చుక్క వాన పడలేదు.

2 లక్షల ఎకరాల్లో పంటలు వరద పాలు
భారీ వర్షాలు, కృష్ణా, గోదావరి నదుల వరద ఉధృతికి ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎర్ర కాలువకు పోటెత్తిన వరద రైతు­ల ఆశలపై నీళ్లు చల్లింది. ఖమ్మం జిల్లాలో ప్రారంభమయ్యే ఈ కాలువ ఉమ్మడి పశ్చిమ గోదా­వరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, పెంట­పాడు, అత్తిలి మండలాల్లోని 1.49 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. 

ఇటీవలి భారీ వర్షాలకు ఈ జిల్లాలో 13 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వర్షాలు, వర­దలతో ముంపు నీరు దిగే దారి లేక గోదా­వరి డెల్టాలో సాగు చేయలేక వేలా­ది ఎకరాలను రైతులు ఖాళీగా వదిలేస్తు­న్నారు. ఇప్పటికే 25 వేల ఎకరాలను సాగు చేయలేక ఖాళీగా వదిలేశారు.

రాయలసీమలో 40 శాతానికి మించని సాగు
వర్షాభావ పరిస్థితుల వలన రాయల­సీమ, ప్రకాశం జిల్లాల్లో సగటున 40 శాతానికి మించి పంటలు సాగవని పరిíస్థితి నెలకొంది. తిరుపతి, కర్నూల్లో ఒకింత మెరుగ్గా ఉంది. ప్రకాశం జిల్లాలో 19 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగవగా, అన్నమయ్య జిల్లాలో 23 శాతం, వైఎస్సార్‌ జిల్లాలో 28 శాతం, చిత్తూరు జిల్లాలో 32 శాతం, అనంతపురంలో 40 శాతం, నంద్యాలలో 47 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 50 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 

రాయలసీమలో అత్యధికంగా సాగయ్యే వేరుశనగ పంట ఇప్పటి వరకు 40 శాతానికి మించలేదు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావంతో కనీస సాగు కూడా లేదు. అడపాదడపా వర్షాలు కురుస్తున్న­ప్ప­టికీ పత్తి, కంది, జొన్న పంటల్లో ఎదుగుదల కన్పించడంలేదు. ఎకరాకు వేరుశనగకు రూ. 20 వేలు, కందికి రూ.10 వేలు, పత్తికి రూ.15 వేల చొప్పున ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. 

పంటలు ఎదుగూ­బొదుగూ లేకపోవడంతో పెట్టుబడు­లు కూడా దక్కే పరిస్థితి కన్పించడంలేదు. ప్రత్యా­మ్నాయంగా ఉల­వ­లు, అలసంద, జొన్న, కొర్ర, పెసర నాటుకోవాలని శాస్త్ర­వేత్తలు సిఫార్సు చేస్తు­న్నారు. అదను దాటి­పో­వడంతో మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటలూ వేయడంలేదు. పొలాల్ని ఖాళీగా వదిలేస్తు­న్నా­రు.

ఆశనిపాతంలా ప్రభుత్వ నిర్ణయాలు
ఆపత్కాలంలో రైతులకు అండగా నిలవాల్సిన కూట­మి ప్రభుత్వం అన్నదాతను మరింత కుంగదీసే నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ అనా­లోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారు­తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కార్యక్రమాలకు బాబు కూటమి ప్రభు­త్వం తూట్లు పొడుస్తోంది. 

ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామంటూ సూపర్‌ సిక్స్‌­లో ఇచ్చిన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడంతో ఖరీఫ్‌–­2023 సీజన్‌కు సంబంధించి ప్రస్తుత సీజన్‌లో అందాల్సిన పంటల బీమా పరిహారమూ రైతులకు దక్కలేదు. మరొకపక్క పైసా భారం పడకుండా రైతులకు ఎంతో మేలు చేస్తున్న ఉచిత పంటల బీమాపైనా బాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. 

ఈ పథకాన్ని ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ వరకు మాత్రమే అమలు చేస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కౌలు రైతులకు అండగా నిలుస్తున్న పంట హక్కు సాగుదారుల చట్టాన్ని చాప చుట్టేయాలని బాబు సర్కారు నిర్ణయించింది.

ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా లేనట్టే..
గత ఐదేళ్లుగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతాంగానికి అన్ని విధాలుగా అండదండగా నిలిచాయి. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు అన్నీ గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా అందేవి. దీంతో రైతులు ట్రాక్టర్లు, ఆటోలకు ఖర్చు పెట్టుకొని మండల కేంద్రాలు లేదా పట్ట­ణా­లకు వెళ్లి వీటిని తెచ్చుకోవాల్సిన వ్యయప్ర­యా­సలు తప్పాయి. సమయానికి ఎరువులు, మందులు చల్లడంవల్ల పంటలకు మేలు కలిగేది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్బీకే వ్యవ­స్థను బాబు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. 

ఈ కష్టకాలంలో రైతులకు వెన్నంటి నిలవాల్సిన ఆర్బీకే సిబ్బందిని మరుగుదొడ్ల సర్వే వంటి వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తోంది. సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా నిలిపివేయాలని ప్రభు­త్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సీజన్‌ ప్రారంభమయ్యే సమయానికే 62 వేల టన్నుల ఎరువులను ఆర్బీకేలలో నిల్వ చేశారు. ఆ తర్వాత ఒక్క టన్ను కూడా కేటాయించబోమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇప్పుడు అనేక ఆర్బీ­కేల్లో ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 

ఆర్బీకేల్లో ఉన్న కొద్దిపాటి ఎరు­వులను స్థానిక టీడీపీ నేతలు వారు చెప్పినవారికే ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రైతులంతా గతంలోలా మండల కేంద్రాలు లేదా సమీపంలోని పట్టణాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్బీకేల ద్వారా నాన్‌ సబ్సిడీ విత్త­నాలు, పురుగు మందుల సరఫరాను కూడా బాబు ప్రభుత్వం నిలిపివేసింది. కనీసం రైతులు కోరుకున్న విత్తనాలను కూడా సరఫరా చేయడంలేదు. బీపీటీ 5204, జేఎల్‌జీ 384 వంటి విత్తన రకాలు బ్లాక్‌ మార్కెట్‌కి తరలిపోయాయి. 

దళారులు వీటిని ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతును దోపిడీ చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. సీజన్‌ ప్రారంభమై 70 రోజులైనా పూర్తి స్థాయిలో ఈ క్రాప్‌ నమోదు కాలేదు. సీసీఆర్సీ కార్డులు రెన్యువల్‌ చేసుకున్న కౌలు రైతులకు సరిపడిన మేరకు రుణ పరపతి కల్పించడంలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణా­ళి­కను మొక్కుబడి తంతుగా మార్చేశారు. కరువు­తో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో ప్రత్యా­మ్నాయ పంటలపై అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

» రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు లక్ష్యం 85.26 లక్షల ఎకరాలు
»  ఇప్పటి వరకు సాగైంది  40 లక్షల ఎకరాలు–49%
»  గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలోనే సాగైంది  39 లక్షల ఎకరాల్లో
»  2022 ఖరీఫ్‌లో ఇదే సమయానికి సాగయింది 48 లక్షల ఎకరాల్లో
»  ప్రధానంగా వరి 48% సాగవగా, వేరుశనగ 40, పత్తి 55, కంది 57%  విస్తీర్ణంలో సాగయ్యాయి.

ఇది ‘అనంత’ వేదన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. జూన్‌లో 142 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా, జూలైలో సాధారణం కంటే 61.8 శాతం, ఆగస్టులోæ 48.7 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. మొత్తంగా సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 31.5 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. కానీ ఏకంగా 52 రోజులు వర్షమే లేకపోవడం జిల్లాలో వ్యవసాయాన్ని దెబ్బ తీసేసింది. 

ఐదు మండలాల్లో రెండు డ్రై స్పెల్స్‌ నమోదయ్యాయి. ఈ జిల్లాలో 3,46,733 హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండగా, ఇప్పటి వరకు 1,43,332 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 1,97,884 హెక్టార్లు కాగా కేవలం 53,974 హెక్టార్లలో అంటే కేవలం 27.3 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. పత్తి 48,586 హెక్టార్లకు గాను 21,907 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ప్రకాశం జిల్లాలోనూ ఇదే దుస్థితి. ఈ జిల్లాల్లో 3.87 లక్షల ఎకరాల సాగు లక్ష్యం కాగా, కేవలం 66 వేల ఎకరాల్లోనే సాగయింది.

నారు వేసి వదిలేశాం
అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలోని నాకున్న 4 ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు విత్త­నాలు చల్లుకున్నాం. నారుమడి సిద్ధం చేసిన నాటి నుంచి నెలరోజులు వర్షం కురిసింది. ముంపునీరు దిగే పరిస్థితి కనిపించడంలేదు. భారీ వర్షాల కారణంగా రెల్లుగడ్డ గ్రామంల్లో సుమారు 200 ఎకరాల్లో ముంపు ఏర్పడి నారుమళ్లు పూర్తిగా కుళ్లిపోయాయి. 

ఖరీఫ్‌లో వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. భారీ వర్షాలతో పంట ముంపు బారిన పడుతుండడంతో కనీసం పెట్టుబడి కూడా దక్కడంలేదు. అల్లవరం మండలంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారం లేకపోతే వ్యవసాయం చేయడానికి ఏ రైతూ ముందుకు రాడు. – మొల్లేటి రామభద్రరావు,  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ఆదుకొనే పరిస్థితులుకనిపించడంలేదు
ఎర్రకాల్వ వర­దకు ఆరుగాలం శ్రమ వరదలో కొట్టుకు­పో­యింది. ఎకరాకు రూ.15 వేల  ఖర్చు చేసి ఊడ్పులు ఊడ్చిన తర్వాత ముంపు వచ్చింది. నాలుగు రోజుల తర్వాత వరద తగ్గితే మళ్లీ నారుమడులు వేశాం. దమ్ము చేయించాం. దీనికి మరో ఐదు వేల రూపాయలు ఖర్చయింది. మొత్తం ఎకరాకు రూ.20 వేలు ఖర్చయ్యింది. ఒక్క ఆరుళ్ల గ్రామంలోనే వెయ్యి ఎకరాలకు ముంపు వచ్చింది. ప్రభుత్వం ఆదుకుంటే గట్టెక్కుతాం. కానీ ఆదుకొనే పరిస్థితులే కనిపించడంలేదు. – సతీష్, రైతు, ఆరుళ్ళ, ప.గోదావరి జిల్లా

ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ?
ప్రస్తుత ఖరీఫ్‌లో 4 ఎకరాల్లో వేరుశనగ, 4 ఎకరాల్లో కంది సాగు చేసా. ఇప్పటివరకు వేరు­శనగ పంటకు రూ.60 వేలు, కందికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాల్లేకపో­వ­డంతో పంట ఎండి­పో­యింది. రూ.లక్ష పెట్టుబడి కోల్పో­యా­ను. ప్రత్యా­మ్నాయ పంటలు వేసేందుకు ప్రభు­త్వం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – నాగభూషణం, కదిరిదేవరపల్లి,  అనంతపురం జిల్లా

పెట్టుబడి సాయమైనా జమ చేయలేదు
ఖరీఫ్‌లో విచిత్ర­మైన పరిస్థితిని ఎదు­ర్కొ­­ం­టున్నాం. ఓ వైపు అధిక వర్షాలు, మరో వైపు వర్షాభావ పరిస్థి­తులు. ఇటువైపు పంటలు మునిగిపోతుంటే.. అటువైపు పంటలు ఎండిపోతున్నాయి. ప్రభు­త్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి­స్తోంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అ­మలు చేయడంలేదు. ప్రతి రైతుకు రూ.20 వే­లు పెట్టుబడి సాయం ఇస్తా­మన్న హామీ అమ­­లు చేయకపోవడం వల్ల ఇబ్బంది పడు­తు­న్నాం. – జి.ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement