సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ అదను దాటలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు భరోసా ఇచ్చింది. పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదని విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.రఘురామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు.
ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఈ నెల ఒకటిన కేరళను తాకవలసిన రుతుపవనాలు 8వ తేదీకి వచ్చాయని, ఈ సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన తుపాను వల్ల మన రాష్ట్రానికి రుతుపవనాల రాక ఆలస్యమైందని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడతాయన్న ఆయన.. పంటలవారీగా రైతులకు కొన్ని సలహాలు ఇచ్చారు.
ఏ పంట? ఎప్పటివరకు ?
వరి: ఇప్పుడు నార్లు పోసుకోవాలనుకునే రైతులు కేవలం స్వల్పకాలిక (125 రోజుల కన్నా తక్కువ) వరి రకాలను మాత్రమే విత్తుకోవాలి. నేరుగా విత్తే పద్ధతులపై (దమ్ముచేసి లేదా దమ్ము చేయకుండా) రైతాంగం శ్రద్ధ పెట్టాలి.
పత్తి: జూలై 20 వరకు విత్తుకోవచ్చు.ౖ తేలిక నేలల్లో 50–60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60–75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. పత్తిలో అంతరపంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది. కాబట్టి అంతర పంటగా కందిని సాగు చేపట్టాలి.
కంది పంట: సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగష్టు 15 వరకు కందిని విత్తుకోవచ్చు. పెసర, మినుము, వేరుశనగ, పత్తి, ఆముదం సహా ఇతర పంటలతో అంతర పంటగానూ విత్తుకోవచ్చు.
సోయాచిక్కుడు: జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే జూలై మొదటి వారంలో విత్తినా సోయాలో మంచి దిగుబడులు సాధించవచ్చు.
మొక్కజొన్న: జూలై 15 వరకు విత్తుకోవచ్చు. నీటి ఎద్దడిని మొక్కజొన్న తట్టుకోలేదు. కాబట్టి బోదె, సాళ్ళ పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంచవచ్చు.
పెసర, మినుము: ఈ పంటలనుౖ జూలై 15 వరకు విత్తుకోవచ్చు. సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఇతర ఆరుతడి పంటలైన ఆముదం, పొద్దు తిరుగుడు, ఉలువలను జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఆందోళన పడవలసిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment