మహబూబ్‌నగర్ వ్యవసాయం : వరుణుడు కరుణించాడు. రైతు మోహంలో ఆశలు చిగురించాయి. నైరుతి రుతుపవనాలు రావడం కాస్త ఆలస్యమైనా రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు రో జులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగు కోసం ఇప్పటికే దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలను విత్తేందుకు ముందుకు కదిలారు. సోమవారం ఏరువాక పున్నమిని రైతులు ఎంతో వైభవంగా నిర్వహించారు. జిల్లాలో జూన్ మాసం సగటు వర్షపాతం 71.2మీ.మీ కాగా ఇప్పటి వరకు 90.6మీ.మీ నమోదైంది. వాతావరణ శాస్త్రవేత్తలు సూచించిన మాదిరిగా ఈ ఏటా వర్షాలు బాగానే కురుస్తాయనే నమ్మకం రైతుల్లో మొద లైంది.
ఘనంగా ఏరువాక పున్నమి వేడుకలు
అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే ఏరువాక పున్నమి పండగను సోమవారం రైతులు ఎంతో భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కాడెడ్లను అందంగా ముస్తాబు చేసి గ్రామంలో మంగళవాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహించారు. పొలాలకు తీసుకువెళ్లి భూమి దుక్కి దున్ని ఏరువాక ప్రారంభించారు. దేవరకద్ర, పోతులమడుగు, చిన్నచింతకుంట ప్రాంతాల్లో తాడుతెంపే కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతన్న ఆశలు
జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 7.67లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 1.19లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. జిల్లాలో 36వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32వేల హెక్టార్లలో కంది, 32వేల హెక్టార్లలో పత్తి పంట, 5700 హెక్టార్లలో పెసర, 6300హెక్టార్లలో కంది కంది పంటలు సాగు చేశారు. రెండు రోజుల్లో దాదాపు 55వేల హెక్టార్లలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ఏటా వర్షాలు ఇలాగే అనుకూలిస్తే సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువ పంటలు సాగయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రబీ నుంచి వ్యవసాయ బోర్లకు 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేయడంతో జిల్లాలో వరిసాగు పెరిగే అవకాశం ఉంది.
రికార్డు దాటిన వర్షపాతం
2008-09 వార్షిక ఏడాదినుంచిజూన్‌మాసం సగటు వర్షపాతం 71.2మీ.మీలుగా ఉండగా ఈ ఏడాది ఇదే నెలలో సోమవారం వరకు జిల్లాలో 90.6మీ.మీ వర్షపాతం నమోదైంది. జూన్ మాసం సగటుతో పోల్చితే 27.3మీ.మీ వర్షపాతం ఎక్కువ నమోదైంది. గతేడాది జూన్ మాసంలో ఇదే సమయానికి 47.5మీ.మీ వర్షపాతం నమోదైంది. 2008 జూన్ మాసంలో 44.5మీ.మీ, 2010లో 59.9మీ.మీ, 2011లో 40.8మీ,మీ, 2012లో 56.7మీ.మీ, 2013లో 80.0, 2014లో 54.3మీ,మీ, గతేడాది 70.0మీ.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో 50 మండలాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది.
మరో 12మండలాల్లో సగటు వర్షపాతం నమోదైంది. మరో 2 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. సోమవారం అత్యధికంగా ధన్వాడ మండలంలో 55.0మీ.మీ వర్షపాతం నమోదైంది. అలాగే నారాయణపేట మండలంలో 55మీ.మీ, మాగ నూర్ 49, దామరగిద్ద 40మీ.మీ, మద్దూర్ 35మీ.మీ, మక్తల్, దౌల్తాబాద్‌లో 30మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.
ఖరీఫ్ ఆశలు పదిలమే..
Published Tue, Jun 21 2016 2:46 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement