సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా గత పది రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేశాయి. పది రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది.
ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధా రణం కంటే 22.11 సెంటీమీటర్లు (65 శాతం) అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత పదిరోజుల వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణం కంటే ఏకంగా నాలుగింతలు అధికంగా వర్షాలు కురిశాయి.
లోటు నుంచి అధికం వైపు
వాస్తవానికి ఏటా నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ప్రా రంభమవుతుంది. ఆ నెల తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వానలు మొదలవుతాయి. కానీ ఈసారి జూన్ నాలుగో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఒకట్రెండు రోజులు మోస్తరు వానలు పడ్డాయి. తర్వాత రుత పవనాల కదలికలు మందగించి వర్షాలు జాడ లే కుండాపోయాయి. దీనితో లోటు పెరుగుతూ వచ్చింది. ఈ నెల 18 నాటికి 19.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 54శాతం లోటు. కానీ 18వ తేదీ నుంచి వానలు మొదలయ్యాయి. తర్వాతి పది రోజులకుగాను 8రోజులు వానలు పడ్డాయి. దీనితో వర్షపాతం 54 శాతం లోటు నుంచి ఏకంగా 65 శాతం అధికానికి చేరింది.
అంతటా కుండపోత వానలతో..
గత పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతిభారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక తొమ్మిది జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్లపైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment