కర్నూలు(అగ్రికల్చర్): రుతు పవనాలు చురుగ్గా ఉండటంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 24వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ వరకు సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా సగటున 90.1 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఐదు రోజుల్లోనే 90 మి.మీ., వర్షపాతం నమోదు కావడంతో పలు మండలాల్లో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
గురువారం సాయంత్రం కూడా కర్నూలు, మంత్రాలయం, డోన్, ప్యాపిలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాభావంతో వాడుముఖం పట్టిన మెట్ట భూముల్లోని పైర్లు మళ్లీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. లోతట్టు భూముల్లో పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు నీట మునిగాయి. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన రైతులు ఇప్పుడు ఇలాగే వర్షాలు కొనసాగితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 120 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. బేతంచెర్లలో 50 హెక్టార్లలో పత్తి, కొర్ర, కర్నూలు మండలం ఎదురూరు ఫారంలో 20 హెక్టార్లలో కంది, 5 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. బనగానపల్లె మండలంలో వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఏఓ, ఏడీఏలను ఆదేశించినట్లు వివరించారు.
విస్తారంగా వర్షాలు
Published Fri, Aug 29 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement