ఈ ఏడాది సాధారణ వర్షాలే
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని స్కైమేట్ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందని ఇదే సంస్థ గతంలో ఇచ్చిన నివేదికను సవరిస్తూ.. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తాజాగా ప్రకటించింది. ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు ఎల్‌నినోను తటస్థ దశలో ఉంచగలిగాయంది.
వర్షాకాల సీజన్ ప్రారంభమైప్పటి నుంచి ఉష్ణ మండల వాతావరణం అనుకూలించడంతో మంచి వర్షాలు పడ్డాయని, ఇప్పుడా పరిస్థితిలేదని తెలిపింది. మహారాష్ట్రతో పాటు దక్షిణ ద్వీపకల్పం మీదుగా రుతుపవనాలు అంత చురుగ్గాలేవని తెలిపింది. ఇక ఉత్తర బంగాళాఖాతానికి వస్తే తూర్పు, మధ్య భారతం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
మిగిలిన ప్రాంతం విషయానికొస్తే దేశవ్యాప్తంగా రుతుపవనాలు తేలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని, రోజువారీ వర్షపాతం గణాంకాలతో వాస్తవ వర్షపాతం గణాంకాలు సరిపోలడం లేదని పేర్కొంది.