న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని ప్రైవేట్ రంగ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. పసిఫిక్ సముద్రంలో చల్లదనం, లా నినో పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో జూన్–సెప్టెంబర్ నెలల్లో వానలు సాధారణంగానే ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం గడ్డు పరిస్థితులే కొనసాగుతాయని ఆదివారం తన వెబ్‌సైట్‌లో వివరించింది.2021 వర్షాకాలం ఘనంగా ప్రారంభమయినా తర్వాతి సగం కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతం 96%–104% మధ్య అంటే 88 సెంటీమీటర్ల మేర నమోదవుతుందని పేర్కొంది. మన దేశానికి జూన్‌లో మొదలయ్యే 4 నెలల వర్షాకాలం చాలా కీలకమైంది.
ఖరీఫ్‌లో వర్షాధార పంటలకే కాదు, జలాశయాలు నిండితే రబీలో కూడా పంటలు పండేందుకు వర్ష రుతువే ఆధారం. కోట్లాది మందికి వర్షాలే జీవనాధారం. ఆహార ధరలను కూడా ఈ కాలం ప్రభావితం చేస్తుంది. వరి, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌లో వానలు సరిగ్గా కురియకుంటే పంటల దిగుబడి పడిపోతుంది. మంచినీటికి కూడా కొరత ఏర్పడుతుంది. తమిళనాడు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఏడాదిలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో నాలుగు నెలల కాలంలోనే 60 శాతం నుంచి 90 శాతం వరకు నమోదవుతుంది. కాగా, 2012 నుంచి స్కైమెట్ సంస్థ వాతావరణ అంచనా నివేదికలను ప్రకటిస్తోంది. త్వరలోనే 2021కి సంబంధించిన అంచనాలను వెలువరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment