skymet
-
మండు వేసవిలో చల్లని కబురు.. గుడ్ న్యూస్ చెప్పిన ‘స్కైమెట్’
న్యూఢిల్లీ: వేసవిలో ఎండలు దంచి కొడుతున్న వేళ చల్లని కబురు అందింది. ‘స్కైమెట్’ సంస్థ ఈ చల్లని కబురు మోసుకువచ్చింది. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు సమయానికి వస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం వర్షపాతం(102శాతం) నమోదవుతుందని వెల్లడించింది. అయితే ఈ అంచనాకు 5శాతం అటూ ఇటు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. సాధారణంగా రుతపవనాల సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు లాంగర్ పీరియడ్ సగటు(ఎల్పీఏ) వర్షపాతం 868.6మిల్లీమీటర్లు. దీనిలో 96 శాతం నుంచి 104శాతం వరకు వర్షం పడే అవకాశాలుంటే దీనిని సాధారణ వర్షపాతంగా పిలుస్తారు. జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనాల్లోనూ ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ తెలిపింది. తాజా అంచనాలపై స్కైమెట్ ఎండీ జతిన్‌సింగ్ మాట్లాడుతూ‘ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు వేగంగా లానినాగా మారుతున్నాయి. సాధారణంగా ఎల్‌నినో, లానినాగా మారుతున్నపుడు రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. గతంలో లానినా వల్ల కురిసిన వర్షపాతమే ఇందుకు నిదర్శనం. అయితే ఎల్‌నినో ముగింపు దశలో ఉన్నందున రుతుపవనాల ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అయితే రుతుపవనాల రెండో దశలో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయి. లానినాతో పాటు ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐఓడీ) పరిస్థితులు కూడా ఈసారి సమయానికి రుతుపవనాలు రావడానికి, దేశమంతా వాటి విస్తరణకు దోహదం చేయనుంది. రుతుపవనాల వల్ల దక్షిణ భారతంతో పాటు దేశంలోని పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సరిపడా వర్షాలు పడతాయి. బిహార్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల్లో మాత్రం జులై, ఆగస్టు నెలల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్సుంది. ఇక ఈశాన్య భారతంలోనూ జూన్, జులై, ఆగస్టుల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి’అని తెలిపారు. ‘స్కైమెట్’ ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం అంచనాలు.. సాధారణం వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 10 శాతం అవకాశాలున్నాయి(లాంగర్ పీరియడ్ సగటు(ఎల్పీఏ) దాటి 110 శాతం వర్షపాతం ) సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయి(ఎల్పీఏ దాటి 105 శాతం నుంచి 110శాతం మధ్య వర్షపాతం) సాధారణ వర్షపాతం కురిసేందుకు 45 శాతం చాన్స్( సరిగ్గా ఎల్పీ సగటు 96 శాతం నుంచి 104 శాతం వర్షాలు) సాధారణ కంటే తక్కువ వర్షపాతానికి 15 శాతం చాన్స్(ఎల్పీ సగటు 104 శాతానికి దిగువ 90 నుంచి 95 శాతం వర్షాలు) కరువుకు 10 శాతం చాన్స్(ఎల్పీ సగటులో 90 శాతం వర్షాలు మాత్రమే) ఈ సీజన్లో ‘స్కైమెట్’ నెల వారి వర్షపాత అంచనాలు.. జూన్-ఎల్పీఏలో 95 శాతం వర్షపాతం (165.3 మిల్లీమీటర్లు) జులై-ఎల్పీఏలో 105 శాతం వర్షపాతం(280.5మిల్లీమీటర్లు) ఆగస్టు-ఎల్పీఏలో 98 శాతం వర్షపాతం(254.9మిల్లీమీటర్లు) సెప్టెంబర్-ఎల్పీఏలో 110 శాతం వర్షపాతం(167.9మిల్లీమీటర్లు) ‘స్కైమెట్’ ఏం చేస్తుంది..? భారత్‌లో వాతావరణ ముందస్తు అంచనాలు వెల్లడించే ఒకే ఒక ప్రైవేట్ సంస్థ స్కైమెట్. వ్యవసాయ రంగానికి స్కైమెట్ వెల్లడించే వాతావరణ అంచనాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. సమీప భవిష్యత్తులో వాతావరణాన్ని బట్టి పంటలు నిర్ణయించుకునే వెసులుబాటు స్కైమెట్ ద్వారా రైతులకు లభిస్తోంది. సాటిలైట్లు, మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడి రుతుపవనాల రాకకు సంబంధించి ముందస్తు అంచనాలు వెల్లడించడంలో స్కైమెట్ పేరుగాంచింది. -
వేడికొద్దీ వానలు
ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం మామూలు కన్నా తక్కువగా ఉంటుందని సూచనలు వచ్చాయి. ఈ సూచనలు మొత్తం దేశానికి వర్తిస్తాయని చెప్పుకోవాలి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వారి వాతావరణ శాఖ మాత్రమే కాక స్కైమెట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా వాతావరణం గురించి పరిశోధనలు చేసి సూచనలు అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థవారు నిజానికి ఈ సంవత్సరం వర్షపాతం దేశం మొత్తం మీద మామూలుగా 94 శాతం మాత్రమే ఉంటుందని ప్రకటించారు. మళ్లీ ఈ అవకాశం 40 శాతం ఉంటుందని కూడా అన్నారు. వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పలేము అన్న మాట ఇక్కడ బహుశా గుర్తు చేసుకోవాలేమో? ఉత్తర భారత దేశం, దేశంలోని మధ్య ప్రాంతాలలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. మామూలు గానే ప్రపంచమంతటా వాతావరణం వేడెక్కుతోంది. హిందూ మహాసముద్రంలో డైపోల్ అనే పరిస్థితి ఒక పక్కన, అనుకున్న దానికన్నా ముందే వచ్చిన ఎల్ నినోలు మరోపక్కన ఇందుకు కారణం అని చెబుతున్నారు. తూర్పు ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న శాంతి మహా సముద్రం అనే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత సగటు కన్నా అర డిగ్రీ ఎక్కువయినందుకు ఎల్ నినో వస్తుంది. అన్నట్టు ఈ మాటలోనే చివరి అక్షరానికి ‘య’ ఒత్తు ఇచ్చినట్టు పలకాలట. మాటకు చిన్న బాబు అని అర్థం. ఈ పరిస్థితి ముందు అనుకున్న దానికన్నా రెండు నెలలు ముందే వచ్చేసింది. అంతకుముందు మూడు సంవత్సరాల పాటు లా మీనా అనే పరిస్థితి. అంటే ఇందుకు వ్యతిరేకమైన పరిస్థితి ఉండేది. సముద్రం పైభాగంలో నీళ్లు వేడెక్కడం, చల్లబడడం అనే ఈ రెండు పరిస్థితులు మూడు నుంచి ఏడేళ్లకు ఒకసారి మారుతుంటాయి. ఒక పక్కన మానవ కార్యక్రమాల వల్ల వాతావరణం వేడెక్కుతున్నది. దానికి తోడుగా ఈ పరిస్థితులు కూడా వచ్చేసరికి మొత్తం ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పగడపు కొండలన్నీ పాడై పోతాయి. అనుకోని పద్ధతిలో వరదలు వస్తాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగే పరిస్థితులు వస్తాయి. ఎల్ నినో లేకుండానే వాతావరణ పరిస్థితి దారుణంగా ఉంది, ఇక ఇది కూడా తోడైతే ఏమవుతుందో అంటున్నారు పరి శోధకులు పెడ్రో డి నేజియో. 2015 – 16 ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి బలంగా వచ్చింది. పసిఫిక్ సముద్రంలో పెద్ద ఎత్తున వేడి చేరుకున్నది. ఇందులో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కూడా కొంత ఉంది. ఇప్పుడిక సముద్రం మీద మూత తీసివేసినట్లే అంటారు యూఎస్ సంస్థ ‘ఎన్ఓఏఏ’ పరిశోధకులు మైఖేల్. సముద్రోపరితలంలో చేరిన వేడి ప్రభావం ఇప్పటికే ప్రపంచం మీద ప్రభావం చూపు తున్నది. 2024 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీలు ఎక్కువయ్యే అవకాశం నిండుగా ఉంటుంది అంటున్నారు ఈయన. సాధారణంగా ఈ వేడి కారణంగా తూర్పు వ్యాపార పవనాల మీద ప్రభావం ఉంటుంది. కనుక వేడి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు ఆ గాలుల వేగంలో అంతగా మార్పు కనిపించలేదు అని పరిశీలకులు గమనించారు. ప్రస్తుతం వచ్చిన పరిస్థితి వచ్చే ఫిబ్రవరి దాకా బలంగా కొనసాగుతుంది. కనుక సముద్రం మీద నుంచి వచ్చే వ్యాపార పవనాలను అక్కడి వేడి ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్ కల్లా ఈ పరిస్థితి గురించి మరింత మంచి అవగాహన అందుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎల్ నినో బలంగా ఉన్నా లేకున్నా వరదలు, ఉత్పాతాలు మాత్రం తప్పవు. ఎల్ నినో వల్ల మంచి కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఆఫ్రికా లోని కరవు ప్రాంతాలలో వర్షాలు వస్తాయి. అక్కడి ఆకలిగా ఉన్న జనాలకు తిండి దొరుకుతుంది. మొత్తం మీద మాత్రం ప్రభావాలు వ్యతి రేకంగా మాత్రమే ఉంటాయనీ, ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉండక తప్పదనీ పరిశోధకులు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తులలో ఐదు శాతం తగ్గింపు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ తెలివి తెచ్చుకుని, వాతావరణం వేడెక్కకుండా ఉండే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాలి. డా‘‘ కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత, అనువాదకుడు మొబైల్: 98490 62055 -
చల్లని కబురు.. 5 రోజులు ఎండల నుంచి ఉపశమనం: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వారం రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న అయిదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, యూపీ, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వాన కురుస్తుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. (మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్ శుభ్రం.. వీడియో వైరల్.. అరెస్ట్) -
Monsoon 2021: ఈ ఏడాది సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో కురిసే 75 శాతంపైగా వర్షపాతానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది సాధారణంగా ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల సరాసరి వర్షపాతం 103 శాతంగా ఉంటుందని, ఈ అంచనాకు అటూఇటూగా 5 శాతం మాత్రమే తేడా ఉండే అవకాశముందని స్కైమెట్ వాతావరణ విభాగం ప్రెసిడెంట్ జీపీ శర్మ తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన సాధారణ పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు. రుతు పవనాలు సాధారణంగా ఉండేందుకు 65%, సాధారణంగా కంటే ఎక్కువగా ఉండేందుకు 15%వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 96–104 మధ్యలో వర్షపాతం ఉంటే సాధారణంగా, 103 ఉంటే సాధారణంగా కంటే ఎక్కువగా పరిగణిస్తారు. నెలల వారీగా చూస్తే, జూన్‌లో సరాసరి వర్షపాతం 106%, జూలైలో 97%, ఆగస్టు, సెప్టెంబర్లలో 99%, 116 శాతం కురిసే అవకాశాలున్నాయని స్కైమెట్ తెలిపింది. వరసగా మూడో ఏడాది 2021లో కూడా రుతుపవనాలు సానుకూలంగా ఉన్నాయని జీపీ శర్మ తెలిపారు. గడిచిన రెండేళ్లలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైందన్నారు. భౌగోళిక పరంగా చూస్తే ఉత్తర భారత మైదాన ప్రాంతం, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే ప్రమాదముందని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతున్న లానినా ప్రభావం నెమ్మదించడంతోపాటు ఈ సీజన్లో స్థిరంగా ఉండే అవకాశముందని స్కైమెట్ సీఈవో యోగేశ్ పాటిల్ చెప్పారు. కాగా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారిక అంచనాలను ఈ వారంలోనే విడుదల చేయనుంది. ఇక్కడ చదవండి: గుడ్‌న్యూస్: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు టైమ్ మెషీన్స్: ఏయే పనికి ఎంత టైం కేటాయిస్తున్నామంటే! -
ఈ ఏడాది సాధారణ వర్షపాతమే
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని ప్రైవేట్ రంగ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. పసిఫిక్ సముద్రంలో చల్లదనం, లా నినో పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో జూన్–సెప్టెంబర్ నెలల్లో వానలు సాధారణంగానే ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం గడ్డు పరిస్థితులే కొనసాగుతాయని ఆదివారం తన వెబ్సైట్లో వివరించింది.2021 వర్షాకాలం ఘనంగా ప్రారంభమయినా తర్వాతి సగం కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతం 96%–104% మధ్య అంటే 88 సెంటీమీటర్ల మేర నమోదవుతుందని పేర్కొంది. మన దేశానికి జూన్‌లో మొదలయ్యే 4 నెలల వర్షాకాలం చాలా కీలకమైంది. ఖరీఫ్‌లో వర్షాధార పంటలకే కాదు, జలాశయాలు నిండితే రబీలో కూడా పంటలు పండేందుకు వర్ష రుతువే ఆధారం. కోట్లాది మందికి వర్షాలే జీవనాధారం. ఆహార ధరలను కూడా ఈ కాలం ప్రభావితం చేస్తుంది. వరి, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌లో వానలు సరిగ్గా కురియకుంటే పంటల దిగుబడి పడిపోతుంది. మంచినీటికి కూడా కొరత ఏర్పడుతుంది. తమిళనాడు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఏడాదిలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో నాలుగు నెలల కాలంలోనే 60 శాతం నుంచి 90 శాతం వరకు నమోదవుతుంది. కాగా, 2012 నుంచి స్కైమెట్ సంస్థ వాతావరణ అంచనా నివేదికలను ప్రకటిస్తోంది. త్వరలోనే 2021కి సంబంధించిన అంచనాలను వెలువరించనుంది. -
ఎన్నాళ్లీ వర్ష విరామం!
రెండు వారాలైనా జాడ లేని చినుకు.. ► మరో 15 రోజులపాటు వర్షాభావ పరిస్థితులు: స్కైమెట్ అంచనా ► అదే జరిగితే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం ► సీజన్లో వరుసగా నెలపాటు వర్షాల్లేకపోవడం చాలా అరుదు: శాస్త్రవేత్తలు ► ఆగస్టు 15 తర్వాత వర్షాలకు అనుకూల వాతావరణమని వెల్లడి సాక్షి నాలెడ్జ్ సెంటర్ వారమైంది.. రెండు వారాలైంది.. చినుకమ్మ జాడే లేదు.. విత్తు వేసిన రైతు ఆశగా నింగివైపు చూస్తున్నా వరుణుడు కనికరించడం లేదు! జూలై రెండో వారం వరకు మురిపించిన వర్షాలు ఆ తర్వాత నుంచి ముఖం చాటేశాయి. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రుతుపవనాల సీజన్ మధ్యలో కొంత విరామం రావడం సహజమే అయినా ఇప్పటివరకూ అది గరిష్టంగా ఏడెనిమిది రోజులు మాత్రమే ఉండేదని.. దాదాపు నెలరోజులపాటు వర్షాల్లేకపోవడం చాలా అరుదని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌కు చెందిన శాస్త్రవేత్త మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మరో రెండు వారాలపాటు.. అంటే ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశముందని ఆయన తెలిపారు. ‘‘2009లో రుతుపవనాలకు కొంత విరామం వచ్చి.. ఆ తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదు. ఆగస్టు 15 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం వంటి వాతావరణ వ్యవస్థలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాలయ పర్వత సానువుల వద్ద స్తంభించిపోయిన రుతుపవన మేఘాలకు పశ్చిమ దిక్కు నుంచి వీచే గాలుల మద్దతు లభిస్తున్నా బంగాళాఖాతం నుంచి తేమను మోసుకొచ్చే వ్యవస్థలు లేక వెనక్కు మళ్లలేకపోతున్నాయి. అయితే స్థానిక పరిస్థితులను బట్టి అక్కడక్కడా చెదురుమదురుగా జల్లులు పడేందుకు అవకాశం ఉంది’’అని మహేశ్ వివరించారు. గతేడాది ఎల్‌నినో పరిస్థితి కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులేవీ ఉండవని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 1న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉండిపోయాయి. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా దేశమంతా విస్తరించాయి. తొలి నెలలో చెప్పుకోదగ్గ వర్షాలే కురిశాయి. జూలై రెండో వారం వరకూ ఈ అనుకూల వాతావరణం కొనసాగినా.. ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. 15 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విత్తునాటిన రైతులు, నాట్లకు సిద్ధమైన రైతులు ఆందోళనలో మునిగిపోయారు. -
ఈ ఏడాది మెరుగైన వర్షపాతం
రుతుపవనాల అంచనాలను స్వల్పంగా పెంచిన ఐఎండీ సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకు ముందు వేసిన అంచనాల కన్నా ఈ ఏడాది వర్షపాతం మెరుగ్గా నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతు పవనాలపై సవరించిన అంచనాలను మంగళ వారం విడుదల చేసింది. ఈసారి సాధారణ వర్షపాతం కురుస్తుందని మరోసారి పేర్కొం ది. 96% వర్షాలు ఉంటాయని ఏప్రిల్ 18న ప్రకటించిన ఐఎండీ, దీర్ఘకాలిక సగటు వర్షపా తం(ఎల్పీఏ) 98% ఉంటుందని తాజా అంచనాల్లో తెలిపింది. అయితే ఈ అంచనా 4% అటు ఇటుగా ఉండొచ్చని పేర్కొంది. దీర్ఘ కాలిక సగటు వర్షపాతం 96% నుంచి 104 % మధ్య ఉంటే దాన్ని సాధారణమైనదిగా భావిస్తారు. ‘ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వానలు కురుస్తాయని ఆశిస్తున్నాం. జూలైలో 96%, ఆగస్టులో 99% వర్షాలు పడే అవకాశాలున్నాయి’ అని ఐఎండీ డెరెక్టర్ జనర ల్ కేజే రమేశ్ అన్నారు. రుతుపవనాల కదలి కలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ...అవి జూన్ 8న గోవా, జూన్ 13–14 నాటికి ముంబై, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్లలోకి ప్రవేశిం చొచ్చని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక సగటు వర్షపాతం వాయువ్యభారతంలో 96%, మధ్య భారత దేశంలో 100%, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో 99%, ఈశాన్య భారతంలో 96% ఉంటుందని ఐఎండీ ప్రకటనలో తెలిపింది. సాధారణం కన్నా తక్కువే: స్కైమెట్ స్కైమెట్ వెదర్ అనే ప్రైవేట్ వాతావరణ సంస్థ మాత్రం సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతుపవన కాలంలో ద్వితీ యార్థంలో ఎల్‌నినో వృద్ధి చెందేందుకు 60% అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ కేంద్రాలు అంచనా వేస్తున్నాయని తెలిపింది. -
ఈ ఏడాది సాధారణ వర్షాలే
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని స్కైమేట్ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందని ఇదే సంస్థ గతంలో ఇచ్చిన నివేదికను సవరిస్తూ.. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తాజాగా ప్రకటించింది. ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు ఎల్‌నినోను తటస్థ దశలో ఉంచగలిగాయంది. వర్షాకాల సీజన్ ప్రారంభమైప్పటి నుంచి ఉష్ణ మండల వాతావరణం అనుకూలించడంతో మంచి వర్షాలు పడ్డాయని, ఇప్పుడా పరిస్థితిలేదని తెలిపింది. మహారాష్ట్రతో పాటు దక్షిణ ద్వీపకల్పం మీదుగా రుతుపవనాలు అంత చురుగ్గాలేవని తెలిపింది. ఇక ఉత్తర బంగాళాఖాతానికి వస్తే తూర్పు, మధ్య భారతం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. మిగిలిన ప్రాంతం విషయానికొస్తే దేశవ్యాప్తంగా రుతుపవనాలు తేలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని, రోజువారీ వర్షపాతం గణాంకాలతో వాస్తవ వర్షపాతం గణాంకాలు సరిపోలడం లేదని పేర్కొంది. -
రైతుల ఆత్మహత్యలతో ఏం సంబంధం?
న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ పడదు? పడితే ఎన్ని మిల్లీ మీటర్లు పడుతుంది, ఎన్ని సెంటీమీటర్లు పడుతుందీ.. అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)కన్నా కచ్చితంగా లెక్కేసి చెప్పగలమని చెప్పుకుంటున్న భారత వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేసే కంపెనీ 'స్కైమెట్' తాజాగా తీసిన వీడియో యాడ్‌పై వివాదం రాజుకుంటోంది. కంపెనీ వాణిజ్య ప్రకటన కోసం రైతుల ఆత్మహత్య సంఘటనలను సందర్భ శుద్ధిలేకుండా వాడుకుందన్నది ప్రధాన విమర్శ. అందులో బడికెళ్లే ఓ పాప ప్రతి రోజు తండ్రి వెనకాలే ఆయనకు తెలియకుండా పొలందాక వెళ్లి తండ్రి పొలం పనులు చేసుకుంటున్నాడా లేక ఉరేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా? అన్న విషయాన్ని గమనిస్తుంటుంది. తండ్రి పొలం పనుల్లో నిమగ్నమయ్యాక అమ్మయ్యా, ఈ రోజుకు ఏంకాదులే అనుకొని బడికి వెళ్తుంది. ఇంట్లో తాడు కనిపిస్తే తండ్రి ఎక్కడ ఉరేసుకుంటాడేమోనని దాన్ని తీసి దాచి పెడుతుంది. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా తాను దాచి పెట్టిన తాడు కనిపించదు. అనుమానంతో పొలానికి పరుగెత్తుకెళుతోంది. అక్కడ చెట్టుకు తాడు కడుతూ తండ్రి కనిపిస్తాడు. ఆపుకోలేని దు:ఖంతో పరుగెత్తి తండ్రి ఒల్లో వాలుతుంది. చివరకు ఆ తాడును తనకోసం కట్టిన ఊయలగా గ్రహించి ఊపిరి పీల్చుకుంటుంది. దేశంలో గత 20 ఏళ్ల కాలంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే లెక్కలతో ఆ యాడ్ ముగుస్తుంది. ఆ యాడ్‌లో తన తండ్రి ఏ రోజున ఆత్మహత్య చేసుకుంటాడో అన్న భయాందోళనల మధ్య ఆ పాప ప్రతి రోజు బతుకుతుందన్నదే ప్రధానాంశంగా కనిపిస్తుంది. ఏ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని ఈ యాడ్ రూపొందించారన్న విషయం అర్థం కాదు. వర్షాలు పడక, పంటలు ఎండిపోతే, అకాల వర్షాల వల్ల పంటనష్టం జరిగితే.. అందుకు ఎవరు బాధ్యులు? వాతావరణ పరిస్థితులను తెలుసుకోకపోవడం వల్లనే ఈ నష్టం జరిగిందా? అకాల వర్షాలు పడతాయన్నది ముందే తెలిస్తే రైతులు సరైన ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఈ దేశంలో ఉందా? ఈ 20 ఏళ్ల కాలంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయకపోవడమే కారణమా ? -
ఎంతకాలమీ గాలివాటు సాగు?
వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులకు మేలు చేసే దేశవ్యాప్త పంటల బీమా పథకాన్ని రూపొందించాలి. దీన్ని కచ్చితంగా కరువుతో అనుసంధానం చేయాలి. అంటే వర్షాలు పడక రైతు పంటను పండించలేకపోతే ఈ బీమా పథకం కింద పరిహారం చెల్లించాలి. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు వాడిగా వేడిగా సాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం తీవ్ర పదజాలంతో వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అన్ని లక్ష్మణరేఖలూ చెరిగిపోతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించడం సర్వసాధారణమే అయ్యింది. ఇవి ఒక రకంగా చెడు వార్తలే. ఇంతకన్నా ప్రజలకు సంబంధించిన దుర్వార్త ఒకటుంది. అయితే అది వచ్చే ఎన్నికల ఫలితాల్లో త్రిశంకు సభ ఏర్పడే అవకాశం గురించి కాదు. భవిష్యత్తులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొననున్నాయి. వ్యవసాయ రంగం కరు వు కోరల్లో చిక్కుకోనుండడం ఒక ముందస్తు హెచ్చరికగా భావించాలి. కరువు పరిస్థితులు ఏర్పడేందుకు 25 శాతం అవకాశం ఉందని, దేశంలోని వాయవ్య, సెంట్రల్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున కరువు బారినపడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో పసిఫిక్ సముద్రంలోని కెరటాల గుండా ఎల్‌నినో ప్రభావం అవకాశాలు ఉండవని భారతీయ వాతావరణ శాఖ(ఐఎండీ) తోసిపుచ్చినప్పటికీ వచ్చే సీజన్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని ఒక ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేసింది. భారత్‌లోని కమోడిటీ మార్కెట్లను దెబ్బతీయడానికే అమెరికా, ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఐఎండీ డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ ఇటీవలే హెచ్చరించారు. ‘‘అమెరికా, ఆస్ట్రేలియా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ప్రచారం చేసే ఇలాంటి వదంతులకు వ్యవసాయ కమోడిటీ, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఆహారధాన్యాలను అక్రమంగా దాచిపెట్టి వాటికి కృత్రిమ కొరత సృష్టిస్తారు. వారి సలహా వినొద్దు.’’ అని ఆయన అన్నారు. వర్షాభావ పరిస్థితుల గురించి వచ్చిన అంచనాలపై ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ధీమాగా చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏమంటే..... గతంలో ‘స్కైమెట్’ విడుదల చేసిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. 2012లో ఈ సంస్థ 94 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తే 93 శాతం వర్షాలు కురిశాయి. గత ఏడాది కూడా కచ్చితమైన అంచనాలే ఇచ్చింది. ఈ ఏడాదిలో మొత్తానికి 94 శాతం వర్షపాతం నమోదవుతుందని చెప్పడమంటే వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన తగ్గుదల ఉండకపోవచ్చు. అయితే గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సెంట్రల్ మహారాష్ట్ర, గోవా, కొంకణ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. 2009లో 96 శాతం వర్షపాతం దీర్ఘకాలిక సగటుగా నమోదు కావచ్చని భారతీయ వాతావరణ శాఖ అంచనా కట్టింది. కానీ ఇటీవల కాలంలో తీవ్ర క్షామపరిస్థితులను ఆ సంవత్సరంలో చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి కురవాల్సిన దానికన్నా వర్షాలు 23 శాతం తక్కువ కురిశాయి. దీన్ని భారీ లోటుగా గుర్తించాలి. దీని ఫలితంగా వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ముఖ్యంగా వరి ఉత్పత్తి 12 శాతం పడిపోయింది. 2012లో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనాలు వెలువడ్డాయి. సాగయ్యే ప్రాంతాల్లోని 70 శాతం విస్తీర్ణంలో వర్షాలు ఆలస్యంగా పడ్డాయి. కానీ 2009 నాటి పరిస్థితితో పోల్చితే అంతటి తీవ్ర దుర్భర పరిస్థితులు మాత్రం లేవు. ఈ ఏడాది 94 శాతం వర్షపాతం నమోదవుతుందని ‘స్కైమెట్’ అంచనాలు వేయడం మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది. రైతులకు కడగండ్లు వాతావరణం కూడా కలిసిరాకపోతే సెంట్రల్ ఇండియాలో ఇది రైతులను రెండు రకాలుగా దెబ్బతీస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో మార్చిలో వచ్చిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 24 లక్షల ఎకరాలు, మహా రాష్ట్రలో 18 లక్షల ఎకరాల పంట ధ్వంసమయ్యింది. హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,351 కోట్లతో ఒక సహాయ ప్యాకేజీ ప్రకటించింది. వాతావరణ శాఖ నుంచి పెద్దగా వర్షాలు పడవని హెచ్చరిక వచ్చిదంటే అది కోట్లాది రైతుల నెత్తిన పిడుగు పడినట్టే. ఇప్పటికే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రక్షామ పరిస్థితులతో గ్రామీణరంగంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. రైతులు జీవనాధారం లేక కుంగిపోతారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం రైతులకు ఉపశమనం కలిగించదు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులను ఆదుకునే పంటల బీమా పథకం లేకపోతే ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు.... కరువుకోరల్లో చిక్కుకున్నప్పుడు దారుణంగా బలయ్యేది దేశానికి తిండిపెట్టే అన్నదాతే. ద్విముఖ వ్యూహం కావాలి 2002, 2004లో కూడా వర్షాలకు కరువే. సాధారణ స్థాయి కన్నా 2002లో వర్షపాతం 22 శాతం తక్కువగానూ, 2004లో వర్షపాతం 17 శాతం తక్కువగానూ నమోదయ్యింది. అయితే 2012 ఆగస్టు వరకూ మహా రాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్‌లో పడకపోయేసరికి ఈ నాలుగు రాష్ట్రాలను కరువు రాష్ట్రాలుగా ప్రకటిం చారు. అయితే ఆగస్టు చివర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడంతో వరదలు కూడా వచ్చాయి. భూగోళ తాపం వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నదో అన్నదానికి ఇదొక ఉదాహరణ. ఈ పరిస్థితులను నివారించడానికి ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. పర్యావరణానికి హాని కలిగించని విధంగా సహజవనరులను ఉపయోగించుకుంటూనే ఆర్థికాభివృద్ధిని సాధించే విధంగా పెట్టుబడులు పెట్టాలి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులకు మేలు చేసే దేశవ్యాప్త పంటల బీమా పథకాన్ని రూపొందించాలి. దీన్ని కచ్చితంగా కరువుతో లింక్ చేయాలి. అంటే తగిన స్థాయిలో వర్షాలు పడక రైతు పంటను పండించలేకపోతే పంటల బీమా పథకం కింద అతనికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నా దీనికి రావాల్సిన ప్రాధాన్యత రావడం లేదు. ఈ దేశ ఆర్థికాభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు ప డక వ్యవసాయోత్పత్తి తగ్గినా, ఇతర కారణాల ప్రభావా న్ని ప్రభుత్వం తగ్గించలేకపోయినా ఆర్థిక వ్యవస్థపై ప్రతి కూల ప్రభావం పడక తప్పదు. ఒకవేళ దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 14 శాతానికి పడిపోయినా అది మ రీ తక్కువగా ఉందని భావించనక్కర్లేదు. సాగు రంగం ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని చెప్పవచ్చు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) విశ్లేషణ దేవీందర్ శర్మ