ఎన్నాళ్లీ వర్ష విరామం!
రెండు వారాలైనా జాడ లేని చినుకు..
► మరో 15 రోజులపాటు వర్షాభావ పరిస్థితులు: స్కైమెట్ అంచనా
► అదే జరిగితే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం
► సీజన్‌లో వరుసగా నెలపాటు వర్షాల్లేకపోవడం చాలా అరుదు: శాస్త్రవేత్తలు
► ఆగస్టు 15 తర్వాత వర్షాలకు అనుకూల వాతావరణమని వెల్లడి
సాక్షి నాలెడ్జ్ సెంటర్
వారమైంది.. రెండు వారాలైంది.. చినుకమ్మ జాడే లేదు.. విత్తు వేసిన రైతు ఆశగా నింగివైపు చూస్తున్నా వరుణుడు కనికరించడం లేదు! జూలై రెండో వారం వరకు మురిపించిన వర్షాలు ఆ తర్వాత నుంచి ముఖం చాటేశాయి. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రుతుపవనాల సీజన్ మధ్యలో కొంత విరామం రావడం సహజమే అయినా ఇప్పటివరకూ అది గరిష్టంగా ఏడెనిమిది రోజులు మాత్రమే ఉండేదని.. దాదాపు నెలరోజులపాటు వర్షాల్లేకపోవడం చాలా అరుదని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌కు చెందిన శాస్త్రవేత్త మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మరో రెండు వారాలపాటు.. అంటే ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశముందని ఆయన తెలిపారు. ‘‘2009లో రుతుపవనాలకు కొంత విరామం వచ్చి.. ఆ తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదు.
ఆగస్టు 15 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం వంటి వాతావరణ వ్యవస్థలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాలయ పర్వత సానువుల వద్ద స్తంభించిపోయిన రుతుపవన మేఘాలకు పశ్చిమ దిక్కు నుంచి వీచే గాలుల మద్దతు లభిస్తున్నా బంగాళాఖాతం నుంచి తేమను మోసుకొచ్చే వ్యవస్థలు లేక వెనక్కు మళ్లలేకపోతున్నాయి. అయితే స్థానిక పరిస్థితులను బట్టి అక్కడక్కడా చెదురుమదురుగా జల్లులు పడేందుకు అవకాశం ఉంది’’అని మహేశ్ వివరించారు. గతేడాది ఎల్‌నినో పరిస్థితి కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులేవీ ఉండవని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 1న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉండిపోయాయి. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా దేశమంతా విస్తరించాయి. తొలి నెలలో చెప్పుకోదగ్గ వర్షాలే కురిశాయి. జూలై రెండో వారం వరకూ ఈ అనుకూల వాతావరణం కొనసాగినా.. ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. 15 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విత్తునాటిన రైతులు, నాట్లకు సిద్ధమైన రైతులు ఆందోళనలో మునిగిపోయారు.