అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మెట్టలో నత్తనడకన సాగుతున్న ఖరీఫ్ వరి సాగుకు ఊతమిస్తున్నాయి. వాతావరణం మార్పులతో మెట్ట ప్రాంతంలో జగ్గంపేట, ఏజెన్సీలో రంపచోడవరం మినహా కోనసీమ, రాజమండ్రి, కాకినా డ, తుని, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఒక మోస్త రు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొంతకాలంగా వేసవిని తలపించే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వర్షాలతో సేద తీరారు. ఈ వర్షాలు వరితో పాటు అన్ని రకాల పంటలకు ఉపయోగకరమయ్యాయి. ముఖ్యంగా మెట్టలో సేద్యానికి ఎక్కువగా మేలు చేశాయి. సరైన వర్షాలు లేక తుని, జగ్గంపేట, కోరుకొండ సబ్‌డివిజన్లలో సాగు ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా వర్షాలు లేక, చెరువులు నిండక సాగే లేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందారు. వేసవి స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వరి నారుమడులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో జగ్గంపేట మినహా మిగిలిన ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు చెరువులు నిండడం, వాతావరణం సానుకూలంగా మారడంతో నాట్లు జోరందుకుంటున్నాయి.
తునిలో చెరువులు నిండడంతో తాండవ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను పూర్తిగా తగ్గించి వేశారు. ఈ ప్రాంతంలో తాండవతో పాటు, పంపా ఆయకట్టు పరిధిలో నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే కోరుకొండ సబ్ డివిజన్ పరిధిలో రాజానగరం పరిసర ప్రాంతాల్లో సైతం చెరువులు నిండుకున్నాయి. వరితోపాటు మిగిలిన పంటల సాగుకు సైతం వర్షాలు ఊతమిచ్చాయి. ముఖ్యంగా కూరగాయ పంటల సాగు జోరందుకోనుంది. మెట్టలోనే కాక డెల్టాలో రైతులకు సైతం వర్షాలు మేలు చేస్తున్నాయి. వరిని ఆశించిన సుడిదోమ, నల్లి, ఇతర తెగుళ్లు కొంత వరకు తగ్గుతాయని రైతులు ఆశిస్తున్నారు. కొబ్బరికి కూడా వర్షాలు మేలు చేశాయి. హెచ్చు ఉష్ణోగ్రతల వల్ల సఖినేటిపల్లి, మలికిపురం, ఆత్రేయపురం, తాళ్లరేవు, జగ్గంపేట మండలాల్లో కొబ్బరితోటల్లో ఆకుతేలు, నల్లముట్టి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ వర్షాల వల్ల అది కొంత వరకు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. అరటి, కంద వంటి వాణిజ్య పంటలకు సైతం వర్షం వల్ల మేలు జరుగుతుందంటున్నారు.
ఊరటనిచ్చిన వర్షం
Published Thu, Sep 12 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement