- రెట్టింపుకన్నా ఎక్కువ వర్షపాతం
- అన్ని వర్గాల్లోనూ ఉత్సాహం
సాక్షి, విశాఖపట్నం : తొలకరి సీజను ఆరంభమే అదరగొట్టింది. మునుపటికి భిన్నంగా జూన్ నెలలో ఇప్పటిదాకా రెట్టింపుకు పైగా వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులుంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆందోళన చెందుతున్న వారికి ప్రస్తుత వానలు ఊరటనిస్తున్నాయి. జూన్ ఒకటో తేదీనే వాన పలకరించింది. ఇక అప్పట్నుంచి రెండు రోజులకోసారి జిల్లాలో కురుస్తూనే ఉంది. తొలివారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, వాటికి అల్పపీడన, ఉపరితల ద్రోణులు తోడై మంచి వర్షాలనే తెచ్చాయి.
ఆ తర్వాత మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, అది వాయుగుండంగా బలపడడంతో నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలను కురిపించాయి. జిల్లాలోని మొత్తం 43 మండలాల్లోనూ సాధారణంకంటే అత్యధిక వర్షపాతమే నమోదు కావడం విశేషం. ఇందులో గాజువాక మండలం అన్నిటికంటే అగ్రగామిగా నిలిచింది. అక్కడ 76.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 359.4 మిల్లీమీటర్లు అంటే 371 శాతం అధికంగా కురిసింది. ఆ తర్వాత స్థానంలో విశాఖపట్నం రూరల్ (96.6కి 397 మిల్లీమీటర్లు ) 312 శాతం, పద్మనాభం మండలం (156.4 మిల్లీమీటర్లకు 565 మిల్లీమీటర్లతో) 261 శాతం అధిక వర్షపాతంతో మూడో స్థానంలో నిలిచాయి.
అత్యల్పంగా హుకుంపేటలో 144.7 మిల్లీమీటర్లకు159.4 మిల్లీమీటర్లు (10 శాతం అధికం), 148.6 మిల్లీమీటర్లుకు 165.2 మిల్లీమీటర్లు కురిసి అరకువేలీ ఉన్నాయి. ఈ నెల 22 రోజుల్లోనూ 11 రోజులు వర్షాలు పడ్డాయి. మొత్తమ్మీద ఇప్పటిదాకా జిల్లాలో 128.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 129 శాతం అధికంగా 295 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. ఈ నెల 19వ తేదీ ఒక్కరోజే విశాఖలో 17 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఇంకా జిల్లాలోని మైదాన ప్రాంతాలు నక్కపల్లి, యలమంచిలి, చోడవరం తదితర ప్రాంతాల్లో 8-10 సెంటీమీటర్ల వ ర్షపాతం రికార్డయింది. ఏజెన్సీలోనూ కుండపోత వర్షాలతో అక్కడ వాగులు, వంకలు, గెడ్డలు పొంగి ప్రవహించాయి.
వీటన్నిటి ఫలితంగా ఇటు నగరంలోనూ, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అడుగంటిన భూగర్భ జలాలు ఊపందుకున్నాయి. చాలాచోట్ల చెరువులు నిండాయి. కొన్ని జలాశయాలూ ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతున్నాయి. మరోవైపు విశాఖ పరిధిలో నీటి నిల్వలకు భరోసా ఏర్పడింది. జిల్లాలో చెరువుల్లోకి ఆశాజనకంగా నీరు చేరడం, దుక్కులు, వరి విత్తనాలు చల్లుకోవడానికి వీలు చిక్కడంతో రైతులు ఆనందపరవశులవుతున్నారు. సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. మొత్తమ్మీద వానలకు శ్రీకారం చుట్టే జూన్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఆశాజనకంగా వానలు కురుస్తుండడంతో అన్ని వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.
ఆరంభం అదరహో
Published Tue, Jun 23 2015 2:20 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement