వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న సాధారణ వర్షాలు
ఈనెల మూడో వారం నుంచి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెల 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా వ్యాప్తి చెందుతూ వారం రోజుల వ్యవధిలో రాష్ట్రమంతటా వేగంగా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రుతుపవనాల వ్యాప్తి సమయంలోనే రాష్ట్రంలో తొలకరి వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో గత పదిరోజుల్లో సంతృప్తికర స్థాయిలో వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఈనెల 12 నాటికి 3.81 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..6.01 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 55% అధికంగా నమోదైంది.
ప్రస్తుతం మోస్తరు వర్షాలే కురవగా..ఈనెల మూడో వారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావర ణ శాఖ నిపుణులు అంచనా వేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సంతృప్తికరంగా, 4 జిల్లాల్లో మధ్యస్థంగా, 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా... ఆదిలాబాద్, మంచిర్యా ల. నిర్మల్, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
రెండ్రోజులు పలుచోట్ల మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావ రణ శాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈక్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి.
బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఖమ్మంలో 37.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం జనగామ జిల్లా జఫర్‌గడ్‌లో అత్యధికంగా 4.06 సెం.మీ., సూర్యాపేట జిల్లా మునగాల, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment