
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగానూ 87 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
తొలి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించే తొలి నెల జూన్‌లో వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడతాయని, జులై నుంచి క్రమంగా పుంజుకుంటాయని వెల్లడించింది. జూన్ మొదటి వారమంతా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది.
పెరగనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. గత రెండ్రోజులుగా పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుండగా... ఇకపై మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేనెల మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలే 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రానికి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలు లు వీస్తున్నట్లు సూచించింది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా దామెరచర్లలో 44.3 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 42.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment