సేద్యం ఎలా సాధ్యం
పలకరించిన తొలకరి ఏరువాకకు సాగిపొమ్మంటోంది... దుక్కి దున్ని విత్తునాటమని చినుకు చెబుతోంది. కానీ అన్నదాతకు ధైర్యం చాలడం లేదు. ప్రభుత్వ పోకడలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. కష్టనష్టాల పాలబడి సేద్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆరుగాలం చమటోడ్చినా కలిసి రావడం లేదు. సాగుఖర్చులు ఊహించనంతగా పెరిగి పెట్టుబడికి, ఆదాయానికి పొంతనలేని పరిస్థితుల్లో సేద్యమంటేనే జూదమన్న భావన వ్యక్తమవుతోంది. అయినా వ్యవసాయం తప్ప మరో విద్య తెలియని అన్నదాతలు నేల తల్లిని నమ్మి ఏరువాకకు సిద్ధమవుదామంటే విత్తనాల కొరత వెక్కిరిస్తోంది. గతేడాది కంటే 10 శాతం పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలతో కొత్త అప్పులు చేయాల్సివస్తోంది. మరోవైపు ‘ఎలినినో’ ముంచుకొస్తోందన్న ప్రభుత్వ ప్రకటన కలవరపరుస్తోంది. గతేడాది ఖరీఫ్‌లో చేతికందిన పంటను నాశనం చేసిన హుద్‌హుద్ రైతుల ఆశలను చిదేమిసిన వైనాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,08,988 హెక్టార్లలో సాగు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో 1,08,682 ఎకరాలకు సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. 1,00,306 ఎకరాలు పూర్తిగా వర్షాధారంగానే సాగు చేయాలి. 1.06లక్షల హెక్టార్లలో వరి, 35573 హెక్టార్లలో చెరకు, 23,764 హెక్టార్లలో రాగి, 13,817 హెక్టార్లలో చిరుధాన్యాలు చేపడుతున్నట్టు అధికారుల వివరాలు తెలుపుతున్నాయి.
విత్తు విపత్తు: ఈ ఖరీఫ్‌లో వరికి 72 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. వ్యవసాయ శాఖ వద్ద కేవలం 6 వేల క్వింటాళ్లే ఉన్నాయి. మరో 19 వేల కింటాళ్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సాధారణంగా 30 శాతం విత్తనాలకు వ్యవసాయశాఖ పంపిణీ చేస్తుంది. మిగతావి రైతులే సమకూర్చు కుటుంటారు. ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. పదేళ్లకు పైబడిన వంగడాలపై సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం కావడం, కొత్త వంగడాలు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచనను సవరించారు. గతంలో కిలోకు రూ.10 రాయితీ ఇచ్చేవారు. ఈ సీజన్‌లో రూ.5 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రైతులు అధిక ధరకు విత్తనాలు కొనాల్సిన దుస్థితి.
ఎరువు దరువు: యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులు 69,500 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు ప్రతిపాదించగా మార్క్‌ఫెడ్ వద్ద 1921 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 2023 మెట్రిక్స్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎరువుల కోసం అన్నదాతలు వెతుకులాట మొదలుపెట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్న కొద్దిపాటి విత్తనాలను జిల్లాలోని 39 పీఏసీఎస్‌ల్లో అందుబాటులో ఉంచాలనుకుంటున్నారు. సూక్ష్మ పోషకాలను 50శాతం సబ్సిడీతో అందించేందుకు జిప్సమ్ 3వేల మెట్రిక్ టన్నులు, జింక్ 1000 మెట్రిక్ టన్నులు, బోరాన్ 30 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నారు.
దా‘రుణ’యాతన
రుణమాఫీ పుణ్యమాని రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. 2014-15 సీజన్‌లో రూ.960 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. అతికష్టం మీద రూ.630కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.
ఈ ఏడాది 2,93,447 మంది రైతులకు రూ.1200కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో రెండున్నర లక్షలకు పైగా కౌలురైతులు ఉన్నారు. వీరిలో 10,783 మందికి మాత్రమే కౌలు అర్హత కార్డులిచ్చారు. వీరికి గత సీజన్‌లో కేవంల 8 లక్షల రుణాలు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది వీరికి రుణాలు అందే పరిస్థితి కానరావడం లేదు.
కానరాని ‘భూసారం’: మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసార పరీక్షల్లో భాగంగా 32వేల శాంపిళ్లు సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ 14వేల శాంపిళ్లు తీసుకున్నారు. 1679 శాంపిళ్లకే పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది 1250 హెక్టార్లలో 125 చంద్రన్న రైతన్న రైతు క్షేత్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం ఎకరాకు రూ.2 వేల విలువైన విత్తనాలు, ఎరువుల అందించనున్నారు.