సాగులో రెండంకెల వృద్ధికి ప్రణాళికలు - జేడీఏ కృపాదాసు
కొరిటెపాడు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో రెండంకెల వృద్ధి సాధించేందుకు లక్ష్యాలను నిర్ధేశించిందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు వి.డి.వి.కృపాదాసు పేర్కొన్నారు. స్థానిక కృషీ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండంకెల వృద్ధి సాధించలేకపోయూమని తెలిపారు. రాబోయే ఖరీఫ్, రబీలలో పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులు, పురుగుమందులు వాడుకోవాలని రైతులకు సూచించారు. ఈ ఏడాది 83 వేల మట్టినమూనాలు సేకరించి జూన్ నాటికి రైతులకు భూసార పరీక్షా ఫలితాలను అందిస్తామన్నారు. అలాగే ఈ ఏడాది 3 లక్షల మందికి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా భూమిలో సూక్ష్మధాతు లోపాలను గుర్తించి 50 శాతం రాయితీతో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు అపరాలు, నూనెగింజలు, తృణధాన్యాలు వంటి పంటలను సాగు చేసుకోగలిగితే రైతులకు కొంత ఆదాయం చేకూరుతుందని తెలిపారు. జిల్లాలో లక్ష నీటి గుంతలు తవ్వించడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. కస్టమ్స్ హైరింగ్ సెంటర్లు మాదిరిగానే రెయిన్ గన్స్‌ను రైతులకు ఇప్పించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో జీరో బడ్జెట్ సేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే అంశంపై ఎంపీఈవోలు, వ్యవసాయ విస్తరణ అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పంట ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులను (500మంది) గ్రూపుగా ఏర్పాటు చేసి, ఆ గ్రూపును రిజిస్ట్రేషన్ చేసి వారికి అవసరమైన వనరులను నేరుగా మ్యాన్‌ఫ్యాక్చర్, ఎగుమతిదారుల ద్వారా మెరుగైన ధర లభించే ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డెరైక్టర్ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.