వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి
10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ
57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ రెండు పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు.
ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి
ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను బుధవారం జమ చేయనుంది.
దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచింది. ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేసింది. బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి రూ.34,288 కోట్లు జమ చేసినట్టవుతుంది.
క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ
రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021–22, ఖరీఫ్–2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బుధవారం జమ చేయనున్నారు.
2014–15 నుంచి 2018–19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి.. 57 నెలల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం రూ.2,050.53 కోట్లు అవుతోంది. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల సాయం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment