వాటి ‘పంట’ పండింది
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకంలోకి 12 పంటలను తీసుకొస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. వరి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర, మినప, వేరుశనగ (సాగునీటి వసతి ఉన్నచోట), వేరుశనగ (సాగునీటి వసతి లేని చోట), సోయాబీన్, పసుపు, మిరప (సాగునీటి వసతి ఉన్న చోట), మిరప (సాగునీటి వసతి లేనిచోట) పంటలను తీసుకొచ్చింది. వచ్చే ఖరీఫ్‌లో ఈ పంటలకు పీఎంఎఫ్‌బీవై పథకం కింద బీమా వర్తిస్తుంది. అదే పథకంలో భాగంగా ఉన్న గ్రామ బీమాయూనిట్ పథకం(వీఐఎస్)లోకి మూడు పంటలను తీసుకొచ్చింది. జిల్లాల వారీగా పంటలను నిర్దారించింది.
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్‌కు, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వరి పంటలకు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొక్కజొన్న పంటకు గ్రామం యూనిట్‌గా బీమా వర్తింపచేస్తారు. ఇదిలావుంటే ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం(యూపీఐఎస్)ను నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఈ పథకంలో రైతుకు జరిగే నష్టానికి బీమా వర్తింపజేస్తారు. వ్యవసాయ యంత్రాలకు, జీవిత, ప్రమాద బీమా, ఇంటికి, విద్యార్థి భద్రతకు ఈ బీమా వర్తిస్తుంది. పీఎంఎఫ్‌బీవై పథకాన్ని అమలుచేసేందుకు రాష్ట్రా న్ని మూడు క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. తక్కువ, మధ్యమ, అధికంగా పంట ప్రమాదం ఉండే జిల్లాలను కలిపి ఈ క్లస్టర్లను ఏర్పాటు చేశారు.
ఒకటో క్లస్టర్‌లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. రెండో క్లస్టర్‌లో వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. మూడో క్లస్టర్‌లో నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ప్రభుత్వం ప్రతీ ఏడాది అమలుచేసే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(డబ్ల్యుబీసీఐఎస్)ను వచ్చే ఖరీఫ్‌లో పత్తి, మిరప, ఆయిల్‌ఫాం, బత్తాయిలకు వర్తింప చేయాలని నిర్ణయించారు. పత్తిని అన్ని జిల్లాల్లో అమలుచేస్తారు. మిరపను ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, ఆయిల్‌ఫాంను ఖమ్మం, బత్తాయిని నల్లగొండ జిల్లాల్లో అమలుచేస్తారు.
ప్రైవేటు బీమా కంపెనీల భాగస్వామ్యం
ఇప్పటివరకు దేశంలో వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) మాత్రమే పంటల బీమాను అమలుచేసేది. మొదటిసారిగా ప్రైవేటు బీమా కంపెనీలను పీఎంఎఫ్‌బీవై పథకంలోకి ప్రవేశపెడుతున్నారు. ఆ కంపెనీలు, ఇతర అధికారులతో సోమవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి ఆధ్వర్యంలో పంటల బీమా రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ (ఎస్‌ఎల్‌సీసీసీఐ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రైవేటు బీమా కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రభుత్వం ఆహ్వానించిన 10 కంపెనీల్లో ఐసీఐసీఐ లొంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ-ఈఆర్‌జీవో,ఇఫ్కో-టొకియో, చోలమండలం ఎంఎస్, బజాజ్ అలియెంజ్, రిలయెన్స్, ఫ్యూచ ర్ జనరల్ ఇండియా, టాటా-ఏఐజీ, ఎస్‌బీఐ, యూనివర్సల్ సొంపొ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. ఈ నెల ఏడో తేదీన ఆయా కంపెనీలు పీఎంఎఫ్‌బీవై పథకం కోసం బిడ్ దాఖలు చేస్తాయని అధికారులు వెల్లడించారు. 20వ తేదీ నాటికి బిడ్‌ను ఖరారు చేస్తారు. తెలంగాణలో పంటల బీమా పథకం వల్ల అధిక లాభాలుంటాయని... కాబట్టి దాదాపు అన్ని ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు.