లక్ష్యానికి దూరంగా.. | lakshyaniki dooramga | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి దూరంగా..

Published Wed, Jul 19 2017 12:05 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

లక్ష్యానికి దూరంగా.. - Sakshi

లక్ష్యానికి దూరంగా..

ఇదీ సర్కారు రుణ ప్రణాళిక
సగం ఖరీఫ్‌ ముగిసినా
అందని రుణాలు
లక్ష్యంలో 40 శాతమే పంపిణీ
వ్యవసాయ రుణప్రణాళిక 6,526 కోట్లు..
ఖరీఫ్‌కు ఇవ్వాల్సిన రుణాలు 3,263 కోట్లు
రైతులకు ఇచ్చామంటున్నది రూ. 1500 కోట్లు
   రీషెడ్యూల్‌ చేసింది సుమారు రూ. 900 కోట్లు
నికరంగా ఇచ్చింది  రూ. 600 కోట్లు
   కౌలు రైతులకు ఇచ్చామంటున్నది   150 కోట్లు
వాస్తవంగా ఇచ్చిందేమీ లేదు. బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ మాత్రమే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: 
రుణ ప్రణాళిక అమలు ఎంత వాస్తవ దూరంగా ఉందో ఈ లెక్కలే చెబుతాయి. ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవానికి పొంతన లేదన్నది వాస్తవం. ఇప్పటి వరకూ రూ. 1500 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నా అందులో 900 కోట్ల రూపాయలు బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ మాత్రమే. వాస్తవంగా రైతుల చేతికి ఇచ్చిన రుణం రూ. 600 కోట్లు మాత్రమే. ఈ ఖరీఫ్‌లో ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున చూసినా  కేవలం వరి కోసమే రెండువేల కోట్ల రూపాయలకు పైగా రైతులకు పెట్టుబడి అవసరం అవుతుంది.  అయితే బ్యాంకుల నుంచి ఇచ్చిన రుణాలకు.. అవసరానికి చాలా తేడా ఉంటోంది.  
జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులు సాగు చేస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మంది కౌలు రైతులు ఉంటే డెల్టాలోనే సుమారు రెండు లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. ఈ ఏడాది 6,526 కోట్ల రూపాయల రుణ లక్ష్యం కాగా అందులో 10 శాతం కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం రైతులకు అందాల్సింది 652 కోట్ల రూపాయలు. అయితే ఇప్పటి వరకూ అధికారులు ఇచ్చామని చెబుతున్నది రూ. 150 కోట్లు. ఈ మొత్తం కూడా బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ మాత్రమే. వాస్తవానికి కౌలు రైతులకు అందింది శూన్యం. ఈ ఏడాది 2,97,485 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 2,33,887 మందికి ఇచ్చారు. అంటే ఇంకా 63,599 మందికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ పూర్తి కాలేదు. రైతులకు ఇచ్చామని చెబుతున్న వాటిలో కూడా 30 శాతం ఇంకా అధికారుల వద్దే ఉన్నట్లు సమాచారం. 
బ్యాంకుల వద్దకు రుణాలకు వెళ్తుంటే ఒక సర్వే నెంబర్‌పై ఒకసారి మాత్రమే రుణం ఇస్తామని చెబుతున్నారు. భూ యజమానులు 98 శాతం ఇప్పటికే పంట రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ పాత రుణాలు రెన్యువల్‌. దీంతో కౌలు రైతులకు రుణాలు అందడం లేదు. జిల్లాలో 53 వేల మందికి రూ. 160 కోట్లు రుణమాఫీ చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో 40 కోట్లు మాత్రమే రుణమాఫీ కాగా ఇంకా 120 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాల్సి ఉంది. సర్వే నెంబర్లు లేవని, భూమి డాక్యుమెంట్లు లేవని సాకులు చూపిస్తూ వీరికి రుణమాఫీ వర్తింప చేయలేదు. రుణమాఫీ వస్తుందని వీరు రుణం చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా మారారు.  బ్యాంకుల్లో ఒకరిద్దరు రుణాలు పెండింగ్‌లో ఉన్నా మిగిలిన వారికి రుణాలు ఇవ్వడం లేదు. పాత రుణాలు రెన్యువల్‌ చేసి బుక్‌ అడ్జస్ట్‌మెంట్లు మాత్రమే చేస్తున్నారు. గత ఏడాది రుణ లక్ష్యం రూ. 5176 కోట్లు. జిల్లాలోని మూడు లక్షల 98 వేల మంది రైతులకు మంజూరు చేయగా,  వ్యక్తిగత, రైతు మిత్ర గ్రూపులు, జెఎల్‌జీ గ్రూపుల ద్వారా కౌలు రైతులకు దక్కింది కేవలం 21 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 0.4 శాతం కూడా కౌలు రైతులకు దక్కలేదు. బ్యాంకులకు రుణం విషయంలో ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఇవ్వలేకపోతోంది. ప్రభుత్వం నుంచి పత్రికా ప్రకటనలు మాత్రమే వస్తున్నాయని, తమకు ఎలాంటి ఆదేశాలు రాతపూర్వకంగా లేకపోవడంతో తాము ఏం చేయలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement