రైతులకు అందని రుణాలు | no loans in khareef season | Sakshi
Sakshi News home page

రైతులకు అందని రుణాలు

Published Wed, Jun 22 2016 8:06 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

రైతులకు అందని రుణాలు - Sakshi

రైతులకు అందని రుణాలు

ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.1,950 కోట్లు
ఇప్పటి వరకు ఇచ్చింది రూ .126 కోట్లు మాత్రమే
ఈసారైనా లక్ష్యం మేరకు అందేనా
బ్యాంకర్ల లక్ష్య సాధనపై ప్రగతిభవన్‌లో సమీక్ష
రుణాల పంపిణీలో బ్యాంకర్లు ఉదారంగా ఆలోచించాలి :  జేసీ రవీందర్ రెడ్డి

సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. కాలం నెత్తిమీదకు వచ్చినా పంటరుణాల పంపిణీ నేటికి 6.50 శాతం దాటలేదు. రైతులతో పాటు నిరుద్యోగ యువత, చేతి వృత్తులు, కుల వృత్తులకు చెల్లించే రుణ లక్ష్యం అందనంత దూరంగా ఉంది. ప్రభుత్వం, లీడ్ బ్యాంకు, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల పర్యవేక్షకులు  ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశిస్తున్నా. నిరుద్యోగ యువతకు, రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్ల వైఖరి పాత పద్ధతిలోనే సాగుతోంది.

ఈ ఏడాది వ్యవసాయరంగానికి సంబంధించి రైతులకు ఖరీఫ్ సీజన్‌కు గాను వివిధ 34 బ్యాంకుల ద్వారా రూ.1,950 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మంగళవారం బ్యాంకర్లతో ఉన్నతాధికారుల (డీసీసీ సమావేశం ) సమావేశం జరిగేటప్పటికీ కేవలం రూ.126 కోట్లు మాత్రమే పంటరుణాలుగా అందజేశారు. అంటే నిర్దేశించిన లక్ష్యంలో రుణాల పంపిణీ 6.50 శాతం మాత్రమే కావడం గమనార్హం. వ్యవసాయరంగంతో పాటు ఇతర రంగాలకు యూనిట్ల మంజూరు, రుణాల అందజేత లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి.

ఇతర రంగాలకు భారంగా...
2016-17 సంవత్సరానికి బ్యాంకర్లు తమ రుణ లక్ష్యాలను నిర్ణయించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో బ్యాంకర్లు డీసీసీ సమావేశం ఏర్పాటు చేసి తమ లక్ష్యాలను వెల్లడించారు. ఖరీఫ్ రుణాలకు సంబంధించి రూ. 1,950 కోట్లు లక్ష్యంగా కాగా ఇప్పటికి 6.50 శాతంతో  రూ. 126 కోట్లు మాత్రమే మంజూరు చేయగా, ఫామ్ మేకనైజేషన్ కింద రైతులకు 450 యూనిట్లు మంజూరు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో యూనిట్ ధర రూ.10 లక్షలు కాగా, 50 శాతం సబ్సిడీ అందజేస్తారు. ఈ పథకం కింద సబ్సిడీకై ఇప్పటికే 9 కోట్ల రూపాయలు జిల్లాకు మంజూరు చేసినా.. బ్యాంకర్లు రుణమంజూరులో జాప్యం చేయడం కారణంగా ఆలస్యం జరుగుతోంది. కాగా మహిళా రుణాలు మే చివరి నాటికి 34.30 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికి 88.92 శాతంతో రూ. 30.50 కోట్లు మంజూరు చేశారు.

అదే విధంగా పట్టణ పేదరిక నిర్మూలన కింద మహిళ సంఘాలకు 2.91 కోట్ల రూపాయలు మంజూరు చేశారని బ్యాంకర్లు సమావేశంలో పేర్కొన్నారు. వెనుకబడిన మండలాల టీఆర్‌ఐజీపీ కింద ఎన్‌సీఎస్‌పీ పథకం కింద 343 యూనిట్ల లక్ష్యంతో 166.50 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నామన్నారు. అదే విధంగా ఆర్‌కేవీవై కింద 110 యూనిట్లకు రూ. 49.50 లక్షలు మంజూరు చేయవలసి ఉంది. ఇదిలా ఉండగా 2016-17 సంవత్సరానికి డీఆర్‌డీఏలోని మహిళ సంఘాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోలేదు. 33,735 సంఘాలకుగాను రూ. 631.16 కోట్లు అందించవల్సి ఉండగా 1155 మహిళ సంఘాలకు రూ. 30.50 కోట్లు మాత్రమే అందించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయారు. కాగా బ్యాంకర్ల రుణ ప్రణాళిక, రుణాల మంజూరు వివరాలను ఎప్పటికప్పుడు లీడ్ బ్యాంకు మేనేజర్ అందజేయాల్సి ఉంది. అయితే వారు నేరుగా అందజేయకుండా తను ఫోన్ చేసినా వివరాలు ఇవ్వడం లేదని, కొందరైతే సెల్‌ఫోన్‌లు ఎత్తడం లేదని ఎల్‌డీఎం వెంకటేశ్వర్లు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదారంగా వ్యవహరించాలి - జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి
డీసీసీ సమావేశంలో బ్యాంకర్ల ప్రగతి నివేదికలు చూసిన తర్వాత  జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ  నిరుద్యోగ యువతకు, రైతులకు రుణాలు అందించడానికి బ్యాంకు అధికారులు ఉదారంగా ఆలోచించి, వారు ఆర్థికంగా ఎదగడానికి సహకరించాలని సూచించారు. రైతులకు, నిరుద్యోగ యువతకు మెరుగైన సేవలు అందించాలని, వారికి పెద్ద ఎత్తున రుణాలు అందించినప్పుడే అటు బ్యాంకులు, ఇటు లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని అన్నారు. జిల్లా ఎక్కువగా వ్యవసాయంపైననే ఆధారపడినందున రైతులకు రుణాలు ఇచ్చి ఆదుకున్నప్పుడే వారు ఆర్థికంగా నిలబడడానికి వీలు ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి కోసం రుణాలు మంజూరు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు లబ్ధిదారుల నుండి అన్ని వివరాలను సేకరించి బ్యాంకులకు అందించాలన్నారు.

రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకర్ల నుంచి కాన్సెంట్ తీసుకురావాలని అధికారులకు సూచించారు. తద్వారా దరఖాస్తుదారులు అవగాహనలోపంతో బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. బ్యాంకర్లు కూడా వారికి ఏం కావాలో అధికారులను అడిగి ఆ పత్రాలు పొందాలని, అర్హులందరికీ రుణాలు అందించడంతో పాటు అనర్హులను గుర్తించి ఆ విషయాలను తెలియజేయాలన్నారు. ఒకసారి సమ్మతి ఇస్తే ఆలస్యం చేయకుండా వెంటనే రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ నిబంధనల ప్రకారం రుణాలు తగ్గించడానికి, పెంచడానికి  బ్యాంకర్లకు విస్తృత అధికారాలు ఉన్నందున అర్హులందరికి వీలైనంత ఎక్కువ మొత్తం రుణాలు అందించాలన్నారు.

రుణాల కోసం వచ్చిన దరఖాస్తులో అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలిపి అభ్యంతరాలను నివృత్తి చేసుకోవాలన్నారు. దానితో పాటు నకిలీ పాసుపుస్తకాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమావేశంలో  ఎల్‌డీఎం వెంకటేశ్వర్లు, ఐకేపీ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, నాబార్డు ఏజీఎం రమేష్‌చంద్ర, ఆర్‌బీఐ ఏజీఎం హరికృష్ణ, వ్యవసాయ బీమా కార్పొరేషన్ డీజీఎం రాజేశ్వరి, సంక్షేమ, అభివృద్ధి శాఖల సీఈవోలు, జేడీలు, ఈడీలు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement