శ్రీకాకుళం పాతబస్టాండ్ :ఖరీఫ్‌లో రైతులు రుణం తీసుకునేందుకు అవస్థలు ఎదుర్కొనాల్సి వస్తోంది. తన భూమికి సంబంధించిన అడంగళ్ల మ్యూటేషన్ అందివ్వడంలో రోజుకో కొత్తవిధానం ప్రవేశపెడుతుండటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతవరకు తహశీల్దారు ప్రోసీడింగ్‌తో వెబ్ ల్యాండ్ (ఆన్‌లైన్-మన భూమి)లో మ్యూటేషన్ జరిగేది, నాలుగు రోజులుగా ఈ ప్రొసీడింగ్‌లను నిలిపివేశారు, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రొసీడింగ్‌తో ఉండాలని నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా భూముల మార్పులు చేర్పులు నిలిచిపోయాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ పరిస్థితి ఇలానే ఉండటంతో సుమారుగా 10వేల మ్యూటేషన్లు నిలిచిపోయాయి.
ఈ విధానం వల్ల పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెపుతున్నా, వీటి వెనుక చేయాల్సిన పనులు సకాలంలో రెవెన్యూ ఉద్యోగులు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయని తెలుస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న సర్వే నంబర్లు, విస్తీర్ణానికి... వెబ్ ల్యాండ్(మనభూమి పోర్డల్)లో ఉన్న వివరాలకు పొంతన కుదరడంలేదు. వీటిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల్లో ఉన్నా వారేమీ పట్టించుకోవడంలేదు. మ్యూటేషన్లు చేయడంలో పలు మండలాల్లో వీఆర్‌ఓ నుంచి తహశీల్దారు వరకు అవినీతికి పాల్పడటంతో ఏ రికార్డులూ సకాలంలో అప్‌డేట్ కావడంలేదు. ఇప్పుడు జేసీ ప్రొసీడింగ్స్ అంటే ఎప్పటికి జరుగుతాయోనని రైతులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రైతులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలుకాకపోవడం... పాత అప్పులు తీరకపోవడంతో బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా ముద్రపడటంతో వాటినుంచి తప్పించుకునేందుకు రుణాలు రెన్యూవల్ చేయించుకునేందుకు బ్యాంకులకు వెళ్తున్నారు. మీసేవలో వచ్చిన అడంగళ్, లేదా ఆర్‌ఓఆర్, కొన్ని బ్యాంకులు రెండూ తప్పని సరిగా ఉండాలని నిబంధన పెట్టారు. మీసేవ లో అడంగళ్లు సరిగా లేకపోవడం, మరికొన్ని తహశీల్దారు కార్యాలయాల్లో మ్యూటేషన్లకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని చెపుతున్నారు. మీసేవలో దరఖాస్తు చేస్తే కనీసం 45 రోజుల నుంచి రెండు నెలలు పడుతుంది. ఆది కూడా రిజక్టు అయితే మళ్లీసమస్య మొదటికి వస్తుంది. మీసేవలో మ్యూటేషన్‌కు పెడితే ఈ ఖరీఫ్ రుణాల పరిమితి దాటిపోతుందని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ వ్యవహారాన్ని సులభతరం చేయాలని రైతులు కోరుతున్నారు.
రుణాలు ఇవ్వడం లేదు.
మీసేవా కేంద్రాల ద్వారా రైతులకు అడంగళ్లు రాకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. మ్యూటేషన్లు జరగకపోవడంతో మీసేవా కేంద్రాల్లో అడంగళ్లు రావడం లేదు. దాని కోసం రైతులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రతీ రోజూ తిరగాల్సి వస్తోంది.ఇప్పుడు జేసీ ప్రొసీడింగ్‌ఉంటేనే మ్యూటేషన్ చేస్తామని చెబుతున్నారు. రోజు కొక విధంగా మ్యూటేషన్లు కోసం నిబంధనలు రైతులను ఇబ్బంది పెట్టడమే.
- దేశెట్టి తిరుపతిరావు, రైతు, రావివలస గ్రామం, లావేరు మండలం.
రైతన్నకు మ్యూటేన్‌షన్
Published Sun, Jul 5 2015 1:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement