‘కౌలు’ కోలేని దెబ్బ..
జోగిపేట: కౌలు రైతుకు వ్యవసాయ రుణం అందని ద్రాక్షగా మారుతోంది. ఏటా ఖరీఫ్ ప్రారంభంలో రుణాలిస్తామని..గుర్తింపు కార్డులు పొందాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. దీంతో కౌలు రైతులు అర్హత పత్రాలు తీసుకొని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు రుణాలు ఇవ్వడం లేదు. రుణం కోసం కౌలు రైతులు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంటోంది. మరోసారి కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం...
అందోలు నియోజకవర్గం పరిధిలో అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాలున్నాయి. ఈ మండలాల్లో సుమారు 4 లక్షల హెక్టార్లలో పంటల సాగవుతున్నాయి. ఇందులో 40 వేల హెక్టార్లలలో కౌలు రైతులు పత్తి, మిర్చి పంటలను సాగు చేశారు. కనీసం 10 శాతం మంది కౌలు రైతులకు కూడా బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నారు. దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు.
పుస్తెలు తాకట్టు పెట్టి...
బ్యాంకర్లు కౌలు రైతులకు రుణం ఇచ్చేందుకు సుముఖత చూపకపోవడంతో అధిక శాతం మంది పుస్తెలను తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు తాకట్టు పెట్టేందుకు బంగారం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గతంలో తాకట్టు పెట్టిన బంగారు అభరణాలను విడిపించుకోలేక సతమతమవుతున్నారు.
ఏటా తగ్గుతున్న దరఖాస్తులు
సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో కౌలు రైతుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులకు రుణాలు అందకపోవడంతో వాటిని తీసుకునేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్ల కొర్రీలు భరించలేక వారి చుట్టూ రుణం కోసం చెప్పులరిగేలా తిరగలేక చాలా మంది రైతులు రుణ అర్హత పత్రం తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డు పొందాలంటే కౌలుకు ఇచ్చిన రైతు అంగీకారపత్రంతో పాటు అసలు యజమాని భూమిపై రుణం పొందకుండా ఉండాలి.
అర్హత ఉన్న కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి
భూమిపై పట్టాదారు ఎటువంటి రుణం తీసుకోకుండా ఉండి ఆ భూమిని సాగు చేస్తున్న కౌలుదారులకు తప్పనిసరిగా బ్యాంకులు రుణం ఇవ్వాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న కౌలుదారులందరికీ రుణ అర్హత పత్రాలు అందిస్తాం. మీ సేవ ద్వారా అర్హత పత్రాలు పొందాల్సి ఉంటుంది. అర్హత ఉన్నా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా ఇబ్బందిపెడితే మా దృష్టికి తీసుకురావాలి.
- నాగేశ్వర్‌రావు, తహసీలుదార్, అందోలు