Sharecroppers
-
కౌలు రైతులకూ ‘భరోసా’
సాక్షి, అమరావతి: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకూ ప్రయోజనం చేకూర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, బ్యాంకుల నుంచి రుణం అందేలా కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల కొత్త చట్టానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదింపచేసి చట్టబద్ధత కల్పిస్తారు. తద్వారా రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన వ్యవసాయ కార్మికులు భూములను కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారని, పంటల సాగు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో పేర్కొంది. కౌలు రైతులు పంట రుణం, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా మొదలైన వాటిని పొందలేకపోతున్నారని అందులో స్పష్టం చేసింది. ఇలాంటి అడ్డంకులను నివారించేందుకు భూ యజమానులకు గల హక్కులపై వారిలో విశ్వాసం కలిగించేందుకు, మరోవైపు కౌలు రైతులను ఆదుకునేందుకు కొత్త చట్టం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. బిల్లులోని ముఖ్యాంశాలివీ - భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా కౌలుదారులకు హక్కుల కార్డు జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా కౌలుదారు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందటానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా పంటల బీమా, పంట నష్టపరిహారంతోపాటు రైతులకు కలిగే ఇతరత్రా ప్రయోజనాలు కౌలు రైతులూ పొందవచ్చు. - ప్రధానంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులు సైతం పెట్టుబడి సాయం పొందేందుకు కొత్త చట్టం దోహదం చేస్తుంది. భూ యజమాని హక్కులు - ఒప్పంద కాల వ్యవధి ముగిసిన తరువాత ఏ విధమైన తాకట్టు భారం లేకుండా భూమిని తిరిగి యజమానికి వెనక్కి ఇవ్వాలి. ఒప్పందం చేసుకున్న మొదటి రోజునే సాగుదారుకు వ్యవసాయ భూమి అప్పగించాలి. సాగుదారు షరతులు పాటించినంత కాలం ఆ భూమి స్వాధీనం/అనుభవించుటలో యజమాని జోక్యం చేసుకోకూడదు. - షరతులను పాటించడంలో సాగుదారు విఫలమైతే అతనికి రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వడం ద్వారా కౌలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు భూ యజమానికి ఉంటుంది. అయితే, ఇది కౌలు ఒప్పంద వ్యవధి సమయంలో సాగుదారు హక్కుకు భంగం కలిగించకూడదు. సదరు భూమిపై పంట రుణం తప్ప ఏవిధమైన ఇతర రుణాలు పొందటానికి కౌలుదారుకు అర్హత ఉండదు. గ్రామ సచివాలయ విధులు - గ్రామ సచివాలయంలో ప్రాధీకృత అధికారి పంట సాగుదారు హక్కుల కార్డుపై ధ్రువీకరణ సంతకం చేయాలి. దాని నకలును సాగుదారు ఉద్దేశాన్ని తెలియజేసిన తేదీ నుంచి మూడు రోజుల్లో భూ యజమానికి అందజేయాలి. - దీనికి సంబంధించి స్వీకరించిన అన్నిరకాల ఖరారు ఒప్పందాలను నిర్దేశించిన రిజిస్టర్‌ను నిర్వహిస్తూ అందులో నమోదు చేయాలి. అన్ని ప్రయోజనాలను అంటే ఇన్పుట్ సబ్సిడీ, అర్హత కలిగి ఉన్నట్లయితే వైఎస్సార్ రైతు భరోసా, తీసుకున్న భూమికి పంట రుణం మొదలైన వాటిని సాగుదారులకు వర్తింపచేసేలా చూడాలి. ఇబ్బందులు ఏవైనా ఉంటే విచారణ జరిపి ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. - షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించిన చోట ఎస్టీ సాగుదారులకు మాత్రమే ఈ బిల్లులోని ప్రయోజనాలను వర్తింపజేస్తారు. ఇతర సాగుదారులకు ఎటువంటి ప్రయోజనాలు వర్తించవు. - గ్రామ సచివాలయం నిర్ణయంతో ఎవరైనా విభేదిస్తే.. తొలుత సంబంధిత తహసీల్దార్‌కు అప్పీల్ చేసుకోవాలి. దానిపై విచారణ జరిపి తహసీల్దార్ ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. తహసీల్దార్ నిర్ణయంపై విభేదిస్తే రెండో దశలో రెవెన్యూ డివిజినల్ అధికారి లేదా సబ్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్‌ను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. రెండో అప్పీల్ నిర్ణయాన్ని విభేదిస్తే జాయింట్ కలెక్టర్‌కు రివిజన్ దాఖలు చేసుకోవచ్చు. రివిజన్ అప్పీల్‌ను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ పంట సంవత్సరం ప్రారంభంలో ముందుగా సాగుదారుల ప్రతినిధులు, బ్యాంకర్లు, భూ యజమానులు జిల్లాకు చెందిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించాలి. ఆ వివరాల నివేదికను నోడల్ ఏజెన్సీకి పంపాలి. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నోడల్ ఏజెన్సీగా ఉంటారు. చట్టంలోని నియమ నిబంధనలు అమలు చేసేందుకు, చట్టం లక్ష్యాన్ని సాధించేందుకు నోడల్ ఏజెన్సీ అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తుంది. - ఈ చట్టంలోని నియమాలు సద్భావంతో చేసిన దృష్ట్యా వీటిపై ఏ వ్యక్తిగాని, అధికారి లేదా ప్రాధికారిపై ఎటువంటి దావా, అభియోగం, ఇతర శాసనిక ప్రొసీడింగ్స్ ఉండవు. ఈ చట్టం కింద అధికారి, ప్రాధికార సంస్థ, ప్రభుత్వం చేసిన నిర్ణయం లేదా జారీ చేసిన ఉత్తర్వులపై ఏదేని దావా, దరఖాస్తు లేదా ఇతర ప్రొసీడింగ్స్ ద్వారా సివిల్ న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదు. అలాగే ఏదైనా న్యాయస్థానం నిషేధ ఉత్తర్వులను మంజూరు చేయకూడదు. - కొత్త చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో గతంలో చేసిన ఆంధ్రప్రదేశ్ భూమి లైసెన్స్‌ను పొందిన వ్యవసాయదారుల చట్టం–2011 రద్దు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంత) కౌలు చట్టం–1956ను రద్దు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. కౌలు కార్డు జారీ ఇలా భూ యజమాని కౌలు రైతు మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా కౌలు రైతులకు సాగుదారు రైతు హక్కుల కార్డులను జారీ చేస్తారు. గ్రామ సచివాలయంలోని ప్రాధీకృత అధికారి పంట సాగుదారు హక్కుల కార్డుపై ధ్రువీకరణ సంతకం చేస్తారు. దీని నకలును సాగుదారు ఉద్దేశాన్ని తెలియజేసిన తేదీ నుంచి మూడు రోజుల్లోగా భూ యజమానికి అందజేయాలని చట్టంలో ఉంది. భూ యజమాని, సాగుదారు మధ్య కుదిరిన కౌలు ఖరారు పత్రంలో భూ యజమానితో పాటు, సాగుదారు పేర్లు ఉండాలి. భూమి సర్వే నంబర్, సరిహద్దులు, భూమి ఉన్న ప్రదేశాన్ని అందులో పొందుపరుస్తారు. కౌలు ఒప్పందం కాల వ్యవధి 11 నెలలు ఉంటుంది. సాగుదారు హక్కులు - ఒప్పంద కాల వ్యవధిలో భూ యాజమాన్యంలోని ఏ మార్పుతో సంబంధం లేకుండా పూర్తి కాలానికి కౌలురైతు హక్కుదారుగా ఉంటారు. - రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర ప్రభుత్వం/సహకార సంఘం/షెడ్యూల్ బ్యాంక్/కేంద్ర ప్రభుత్వంచే యాజమాన్యం వహించే లేదా నిర్వహించే ఏదైనా ఇతర ఆర్థిక సంస్థ నుంచి ఒప్పంద ఖరారు భూమిపై పంట రుణం పొందటానికి కౌలు రైతు హక్కు కలిగి ఉంటాడు. - పంట నష్టాలకు అర్హత ఉన్నట్లైతే వైఎస్సార్ రైతు భరోసాతోపాటు పంటల బీమా లేదా ప్రభుత్వంచే సాగుదారులకు కల్పించిన ఏవైనా ఇతర ప్రయోజనాలు/సదుపాయాలను పొందేందుకు కౌలుదారుకు హక్కు ఉంటుంది. - ఎలాంటి తాకట్టు భారం లేకుండా ఒప్పంద గడువు పూర్తి కాగానే వ్యవసాయ భూమిని ఖాళీ చేయాలి. సాగుదారు ఒప్పంద కాల వ్యవధిలో చార్జి లేదా వడ్డీ భారాన్ని భూ యజమానిపై వేయకూడదు. - భూ యజమానికి ఒప్పంద సమయంలోగా ఖరారు చేసుకున్న కౌలు మొత్తాన్ని చెల్లించాలి. వ్యవసాయ ప్రయోజనాలకు మాత్రమే భూమిని వినియోగించాలి. అందులోని ఇతర స్థిరాస్తులకు ఎలాంటి నష్టాన్ని కలిగించకూడదు. ఇతర చట్టంలో ఏమున్నా ఒప్పంద ఖరారు (కౌలు) భూమిపై ఏ విధమైన హక్కును కౌలు రైతు కలిగి ఉండకూడదు. - పంట కోత తరువాత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న పంట రుణాన్ని పూర్తిగా చెల్లించాలి. - భూమి యాజమాన్యానికి సంబంధించి భూ రికార్డులలో ఇప్పటికే నమోదై ఉన్న వివరాల్లో ఏ అధికారితోనూ ఎలాంటి మార్పులు చేయకూడదు. - సాగుదారు నుంచి ఏదైనా బకాయిని రాబట్టేందుకు బ్యాంకులు షెడ్యూల్డు భూమిని జప్తు చేయకూడదు. -
కౌలు రైతులకు ప్రత్యేక పథకాలు రూపొందించాలి
ఒంగోలు టౌన్: కౌలు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఆచార్య రావూరి వీరరాఘవయ్య సూచించారు. సామాజిక పరిణామ పరిశోధన సంస్థ(రైజ్) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మల్లయ్య లింగం భవనంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చినా అవి వారికి ఉపయోగపడటం లేదన్నారు. రైజ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. ప్రసాదరావు మాట్లాడుతూ ఫ్రామ్ పేరుతో డీఎంఆర్ శేఖర్ కనిపెట్టిన ఎరువు డీఏపీ కంటే చౌకగా ఉంటుందన్నారు. దీనిని రైతులకు చేరవేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. రైతు నాయకుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పాలకులు పనిచేస్తున్నారని విమర్శించారు. ఇఫ్కో సంస్థకు వ్యవసాయ భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో భూసేకరణ ద్వారా ప్రభుత్వం పేద నిర్వాసితుల పొట్టను కొడుతుందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ద్రోహపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం గౌరవాధ్యక్షుడు షంషీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాలుగా ఉండాల్సిన ప్రభుత్వాలు భక్షకులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సులో రైజ్ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు, సభ్యులు యూఆర్ ఆనంద్ పాల్గొన్నారు. ఆచార్య రావూరి వీరరాఘవయ్యకు డీటీ మోజస్ అవార్డుతోపాటు రూ.25వేల నగదును ఇందిరా శేఖర్ ట్రస్ట్ తరఫున డీఎంఆర్ శేఖర్, ఇందిరాశేఖర్ సంయుక్తంగా అందజేశారు. -
కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సీపీఎం విజ్ఞప్తి చేసింది. రాష్ర్టంలో దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులున్నారని, ‘కౌలుదారుల చట్టం-2011’ ప్రకారం వీరికి రెవెన్యూ యంత్రాంగం గ్రామసభలు నిర్వహించి గత మే 15 లోగా గుర్తింపు కార్డులివ్వాల్సి ఉండగా అది సరిగ్గా అమలు కావడం లేదని తెలిపింది. కౌలురైతులకు రుణ అర్హత కార్డులివ్వాలని 2015 జూన్ 22న ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు రైతులకు కార్డులు అందలేదని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రభుత్వం 2015-16లో 231 కరువు మండలాలను ప్రకటించిందని, ఈ మండలాల్లో పంటనష్టపోయిన కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్రం రూ.791 కోట్ల పరిహారాన్ని రాష్ట్రానికి ఇచ్చినా, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదన్నారు. కౌలు రైతులకు యుద్ధప్రాతిపదికన రుణ అర్హత కార్డులివ్వాలని, బ్యాంకుల ద్వారా రుణాలిచ్చి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను నియంత్రించాలని, రుణమాఫీ వర్తింపజేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. -
కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- 13న కలెక్టరేట్ వద్ద ధర్నా - ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ టెక్కలి రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ అన్నారు. ఆదివారం టెక్కలి అంబేడ్కర్ భవన్లో కౌలు రైతుల సంఘం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలతోనే కౌలు రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. రుణాల మంజూరులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను వ్యవసాయ రుణాలతో ముడిపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, మిగిలిన వ్యవసాయ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయాల వద్ద జరగనున్న ధర్నాలో కౌలు రైతులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభలో రాష్ట్ర కన్వీనర్ సిహెచ్.కేశవశెట్టి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అప్పలనాయుడు, కె.రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక కౌలు రైతుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా కె.రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శిగా జి.శివకుమార్, సభ్యులుగా బి.తిరుమలరావు, డి.అప్పన్న, జి.దశరథ, ఆర్.మల్లేష్, బి.లక్షు్మనాయుడు, బి.అప్పలనాయుడు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
‘కౌలు’ కోలేని దెబ్బ..
జోగిపేట: కౌలు రైతుకు వ్యవసాయ రుణం అందని ద్రాక్షగా మారుతోంది. ఏటా ఖరీఫ్ ప్రారంభంలో రుణాలిస్తామని..గుర్తింపు కార్డులు పొందాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. దీంతో కౌలు రైతులు అర్హత పత్రాలు తీసుకొని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు రుణాలు ఇవ్వడం లేదు. రుణం కోసం కౌలు రైతులు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంటోంది. మరోసారి కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం... అందోలు నియోజకవర్గం పరిధిలో అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాలున్నాయి. ఈ మండలాల్లో సుమారు 4 లక్షల హెక్టార్లలో పంటల సాగవుతున్నాయి. ఇందులో 40 వేల హెక్టార్లలలో కౌలు రైతులు పత్తి, మిర్చి పంటలను సాగు చేశారు. కనీసం 10 శాతం మంది కౌలు రైతులకు కూడా బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నారు. దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. పుస్తెలు తాకట్టు పెట్టి... బ్యాంకర్లు కౌలు రైతులకు రుణం ఇచ్చేందుకు సుముఖత చూపకపోవడంతో అధిక శాతం మంది పుస్తెలను తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు తాకట్టు పెట్టేందుకు బంగారం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గతంలో తాకట్టు పెట్టిన బంగారు అభరణాలను విడిపించుకోలేక సతమతమవుతున్నారు. ఏటా తగ్గుతున్న దరఖాస్తులు సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో కౌలు రైతుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులకు రుణాలు అందకపోవడంతో వాటిని తీసుకునేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్ల కొర్రీలు భరించలేక వారి చుట్టూ రుణం కోసం చెప్పులరిగేలా తిరగలేక చాలా మంది రైతులు రుణ అర్హత పత్రం తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డు పొందాలంటే కౌలుకు ఇచ్చిన రైతు అంగీకారపత్రంతో పాటు అసలు యజమాని భూమిపై రుణం పొందకుండా ఉండాలి. అర్హత ఉన్న కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి భూమిపై పట్టాదారు ఎటువంటి రుణం తీసుకోకుండా ఉండి ఆ భూమిని సాగు చేస్తున్న కౌలుదారులకు తప్పనిసరిగా బ్యాంకులు రుణం ఇవ్వాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న కౌలుదారులందరికీ రుణ అర్హత పత్రాలు అందిస్తాం. మీ సేవ ద్వారా అర్హత పత్రాలు పొందాల్సి ఉంటుంది. అర్హత ఉన్నా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా ఇబ్బందిపెడితే మా దృష్టికి తీసుకురావాలి. - నాగేశ్వర్రావు, తహసీలుదార్, అందోలు -
మంత్రి పత్తిపాటి నివాసం ముట్టడి
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని మంత్రి పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కౌలు రైతులు శనివారం ముట్టడించారు. వందలాదిగా వచ్చిన రైతులు మంత్రి నివాసం ముందు బైఠాయించారు. కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు. మంత్రి తన నివాసంలో లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఆయన ఆందోళన చేస్తున్న రైతులతో ఫోన్లో మాట్లాడారు. సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. -
గుర్తింపే ప్రామాణికం!
కౌలు రైతులకూ రుణాలు సంఘాల సభ్యుల గుర్తింపు పనిలో డీసీసీబీ మార్చినెలాఖరు గడువు గరిష్టంగా రూ.2 లక్షల రుణం శ్రీకాకుళం : జిల్లాలో సుమారు 15 వేల మంది కౌలురైతులున్నారు. వీరికి ప్రభుత్వం పట్టా ఆధారంగా గుర్తింపుకార్డులు జారీ చేసింది. కార్డుల్లేని వారికీ మార్చిలోపు గుర్తింపు అందించాలని చాలాచోట్ల డిమాండ్ ఉంది. ఈ నేపథ్యం లో ఐదు నుంచి పది మంది వరకు సభ్యులు గా ఉండి డీసీసీబీ నుంచి గరిష్టంగా రూ.2 లక్షలు రుణం తీసుకోవచ్చు. ఇప్పటికే జిల్లా లో 277 మందికి రూ.27 లక్షల రుణాలిచ్చేం దుకు డీసీసీబీ నిశ్చయించింది. మిగ తా రైతులకూ మార్చిలోపు ప్రక్రియ పూర్తిచేయాలని భావి స్తోంది. ఇతర రైతుల మాదిరి వ్యవసాయ రుణాల ప్రకారమే ఐదేళ్లలోపు రుణం తీర్చేలా నామమాత్రపు వడ్డీకే రుణం అందజేస్తామని బ్యాంకరు చెబుతున్నారు. స్థానిక తహశీల్దార్ అందజేసే కౌలు అర్హత పత్రం ఆధారంగా ఒక్కో గ్రూపులో ఉండే ఐదుగురు సభ్యులకు రూ.2 లక్షల రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యాపారానికీ రుణం వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారం చేస్తున్న రైతులకూ రుణం ఇచ్చేందుకు డీసీసీబీ నిర్ణయించింది. రైతులు తమ భూమిని తాకట్టు పెట్టడం ద్వారా స్వగ్రామంలో ఉన్న సంఘాల్లో రూ. 5 లక్షలు, జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ ద్వారా రూ.10 లక్షల వరకూ రుణం పొందొచ్చు. షార్ట్‌టర్మ్ లోన్‌గా పేర్కొనే ఈ రుణానికి రైతులు కనీసం మూడెకరాల భూమి కలిగి ఉండాలి. ఐదేళ్లలోపు రుణం తీర్చేందుకు 12 నుంచి 13 శాతం వడ్డీగా నిర్ణయించారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా గత జనవరి నుంచే ఇతర వ్యాపారాలకూ రైతులకు రుణాలందించే కార్యక్రమంలో డీసీసీబీలోనే ప్రారంభమైంది. మార్చిలోపు రూ.25 కోట్ల బడ్జెట్ నిల్వ చేస్తే అందులో ఇప్పటికే రూ.5.5 కోట్లు రుణాలిచ్చేశారు. జిల్లాలో సుమారు 2 లక్షల 20 వేల మంది రైతులు డీసీసీబీలో సభ్యత్వం పొందారు. వీరిలో 1.5 లక్షల మంది వివిధ రూపాల్లో బ్యాంకు నుంచి రుణం పొందారు. రిజర్వుబ్యాంకు అనుమతులకు లోబడే ఈ రుణాలిస్తున్నట్టు బ్యాంకు నిర్వహకులు చెబుతున్నారు. రైతులు తమ సొంత ఇంటిపైనా గతంలో రూ.5 లక్షల రుణం పొందే సౌకర్యం ఉంటే ఇప్పుడు దానిని రూ.8 లక్షలు చేశారు. అయితే ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమిత ం చేశారు. వీటిపైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చెల్లింపులన్నీ ఇకపై ఆన్లైన్లోనే జరగనున్నాయి. రైతుల సౌలభ్యం కోసం మార్చి నెలాఖరుకు జిల్లాలో మూడు ఏటీఎం సెంటర్లు తెరవనున్నారు. నగదు డిపాజిట్లపైనా 9.2 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. ఇప్పటివరకూ జిల్లాలోని 49 సంఘాల ద్వారా సుమారు రూ.200 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేశారు. సొసైటీల నుంచి సుమారు రూ.14 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మెన్స్ ఎసెట్స్)ల్నీ 5శాతం లోపుండేలా డీసీసీబీ జాగ్రత్తపడుతోంది. ఏటా సుమారు రూ.440 కోట్లు లావాదేవీలున్న డీసీసీబీ ఇతర ఇబ్బందులనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోందని, త్వరలో రైతులందరికీ ఉపయోగపడేలా రూపే కార్డులూ మంజూరు చేస్తామని బ్యాంకు సీఈవో దత్తి. సత్యనారాయణ స్పష్టం చేశారు. -
కౌలురైతుల సమస్యలపై మాటతప్పిన ప్రభుత్వం
- సెప్టెంబరు 1, 2 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళన - కౌలురైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య తెనాలి : కౌలురైతుల రుణాల మాఫీతో సహాపలు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు సెప్టెంబరు ఒకటో తేదీన రాష్ట్రంలోని తహశీల్దారు కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నట్టు కౌలురైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య చెప్పారు. ఆ మర్నాడు 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులను బంద్ చేయించనున్నట్టు తెలిపారు. మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలోని సీపీఎం కార్యాలయంలో కౌలురైతు సంఘం ముఖ్యుల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమలయ్య మాట్లాడుతూ, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతుమిత్ర గ్రూపులు, రుణఅర్హత గుర్తింపు కలిగిన కౌలురైతుల రుణాలు రూ.574 కోట్లను మాఫీ చేస్తామని హామీనిచ్చిన చంద్రబాబు, 60 శాతం మాత్రమే మాఫీ చేసినట్టు చెప్పారు. ఆధార్ లేదనీ, పంట లేదనీ, రకరకాల కారణాలతో మిగిలిన కౌలురైతులకు మాఫీ చేయటం లేదని, బ్యాంకులకు వెళితే రుణంపై వడ్డీ చెల్లించమని వత్తిడి చేస్తున్నట్టు చెప్పారు. హామీనిచ్చిన విధంగా చిత్తశుద్ధితో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 70 శాతం భూములను సాగుచేస్తోంది కౌలురైతులేనని గుర్తుచేస్తూ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించిన రూ.65 వేల కోట్ల రుణాల్లో ఆ ప్రకారం కౌలురైతులకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకు భిన్నంగా బ్యాంకులు భూమి యజమానులకే రుణాలను కట్టబెడుతున్నట్టు విమర్శించారు. ఖరీఫ్ సీజను ఆరంభమైనా ఇప్పటికి ఒక్క కౌలురైతుకూ రుణం ఇవ్వలేదన్నారు. పట్టిసీమ నుంచి ఇప్పటికీ నీరు రావటం లేదని, పులిచింతల సంగతీ అంతేనని చెబుతూ, ప్రాజెక్టులు చిత్తశుద్ధితో పూర్తిచేయనందునే రైతులకు ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు ఎదరయ్యాయని ఆరోపించారు. 15 వేల ఎకరాల భూమి బ్యాంకుకు ప్రభుత్వం సన్నాహాలు చేయటం ఆహారభద్రత చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు కాగలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సమావేశంలో రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి, కౌలురైతులు ఎం.శివసాంబిరెడ్డి, ఎం.థామస్, దేవరపల్లి ఇమ్మానుయేలు, కుర్రి వెంకటరెడ్డి, వల్లభనేని సుబ్బారావు, చిలకా ప్రకాశం, మొవ్వా శ్రీనివాసరావు, బూదాటి సాంబశివరావు, ఎం.రాంబాబు పాల్గొన్నారు. -
‘ఉరి’మిన కష్టాలు
అచ్యుతాపురం: భూమిని నమ్ముకున్న కౌలురైతుని నష్టాలే కడతేర్చాయి. ప్రభుత్వ సాయం నామమాత్రం కావడం, అప్పులు తీరే మార్గంలేకపోవడంతో మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన శీరం అప్పారావు(58)అనే కౌలురైతు ఆదివారం తెల్లవారుజామున ఇంటిపైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్ఐ అప్పారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పారావు ఆరు ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. పంటపోయినా క్రమం తప్పకుండా కౌలు చెల్లించేవాడు. వరుస తుఫాన్లతో పంట కలిసిరాలేదు. ఏటా పెట్టుబడులకు బెల్లం మార్కెట్ షావుకార్ల వద్ద అప్పులు చేశాడు. కుటుంబ అవసరాలు, కొడుకు చదువు, కుమార్తె పెళ్లికి అధికవడ్డీకి బయట మరికొందరి వద్ద అప్పులు చేశాడు. ఉన్న నగలు బ్యాంకులో తాకట్టుపెట్టాడు. పాస్‌పుస్తకం ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం, రుణమాఫీ భూమి యజమానికే దక్కింది. పాస్‌పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులో అప్పు పుట్టలేదు. బంగారు నగలపై తీసుకున్న రుణానికి మాఫీ వర్తించలేదు. ఇలా అన్ని విధాలా నష్టపోయిన అప్పారావు మదుపులు లేక కౌలు సాగు మానేశాడు. పరవాడ పార్మాసిటీలోని ఒక పరిశ్రమలో పనికి కుదిరాడు. అక్కడి రసాయనాల తాకిడికి నెల రోజులకే చర్మవ్యాధికి గురయ్యాడు. దానిని నయం చేసుకోవడానికి రూ.లక్షపైనే ఖర్చయింది. పరిశ్రమ యాజమాన్యం కేవలం రూ.25వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. చేబదులుగా తీసుకున్నవి, బయట ఫైనాన్స్ దారులనుంచి పొందినవి మొత్తంగా రూ.3.5లక్షలు వరకూ అప్పులు ఉన్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. వాటిని తీర్చలేకపోగా తాను కుటుంబానికి భారమయ్యానంటూ తరచూ వాపోయేవాడు. తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేశారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అందరితో ఫోన్లో మాట్లాడాడు..... శనివారం రాత్రి భోజనం చేశాక విశాఖలో ఉన్న కొడుకు రమేష్, రాంబిల్లి మండలం అప్పన్నపాలెంలోని అత్తవారింట ఉన్న కుమార్తె సంజీవిలకు ఫోన్‌చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. భార్య ఆదిలక్ష్మి గదిలో పడుకుంది. అప్పారావు మేడపైన నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున భార్య మేడపైకి వెళ్లి చూసేసరికి పక్కపై అప్పారావు లేడు. పరిశీలించగా ఇంటిస్లాబ్కు పొరుగింటి స్లాబ్‌కు మధ్య ఖాళీలో చీర వేలాడుతూ ఉంది. దానికి ఉరివేసుకుని కనిపించాడు. దానిని చూసి ఆమె పెద్ద పెట్టున రోదించడంతో పరిసరాల్లోని వారు వచ్చి కిందికి దించి పరిశీలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. -
బ్యాంకర్లతో ప్రత్యక్ష పోరు
కౌలురైతులకు మద్దతుగా చరిత్రలో తొలిసారిగా రెవెన్యూ యంత్రాంగం ఆందోళన బాటపట్టింది. రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ జిల్లా యంత్రాంగం శుక్రవారం ప్రత్యక్ష పోరుకు దిగింది. ఏజెన్సీ పరిధిలోని బ్యాంకుల ఎదుట సాక్షాత్తు తహశీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూయంత్రాంగం రైతుల తరపున ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సంచలనం రేపుతోంది. బ్యాంకర్ల మెడలు వంచేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ ఆందోళనలు చేపట్టినట్టుగా క్షేత్ర స్థాయి సిబ్బంది చెప్పడం గమనార్హం.. విశాఖపట్నం: బ్యాంకర్ల శల్యసారథ్యం, కౌలు రైతులకు రుణాలివ్వడంలో శాఖల మధ్య సమన్వయ లోపం మరోసారి బయటపడింది. బ్యాంకర్లను ఒప్పించి కౌలురైతులకు రుణాలిప్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే. అలాంటి రెవెన్యూ యంత్రాంగమే చేష్టలుడిగి ప్రత్యక్ష ఆందోళనకు దిగడం కొత్త ఒరవడికి నాంది పలికింది. ఏటా కష్టం ఒకరిది..ఫలితం మరొకరిది అన్నట్టుగా రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించే కౌలురైతులకు అప్పులు మిగలడం పరిపాటి. వీరికి జారీ చేస్తున్న రుణఅర్హత కార్డులు(ఎల్ఈసీ)అలంకార ప్రాయంగా మిగిలి పోతున్నాయి. ఏటా వీరికి ఎల్ఈసీ కార్డులు జారీ చేయడం..రుణాల మంజూరులో బ్యాంకర్లు చుక్కలు చూపించడం ఆనవాయితీగా వస్తోంది. కనీసం ఈ ఏడాదైనా ఉదారంగా వీరికి రుణాలివ్వాలన్న కలెక్టర్ యువరాజ్ ప్రయత్నాలకు బ్యాంకర్లు మోకాలొడ్డుతున్నారు. ఈ ఏడాది 40వేల మందికి ఎల్‌ఈసీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం 16,500 మందికి జారీ చేయగలిగారు. వీరికైనా రుణాలు మంజూరు చేశారా అంటే అదీ లేదు. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 800 మందికి కేవలం రూ.1.5కోట్ల రుణాలు జారీ చేయగలిగారు. ఎల్ఈసీ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని ఎలాంటి హామీ లేకుండా రుణాలివ్వాలని కలెక్టర్ పదేపదే ఆదేశించినా బ్యాంకర్లు పెడచెవిన పెట్టారు. అడంగళ్, వన్‌బీ కాపీలు, భూమి యజమానితో చేసుకున్న ఒప్పంద పత్రాలు. వారి నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు, ఆ భూమిపై గతంలో ఎలాంటి అప్పుల్లేవని తెలిపే ధ్రువీకరణ పత్రాలు ఇలా సవాలక్ష సమర్పిస్తే కానీ రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఇవన్నీ సమర్పించినా ఏదో విధంగా కొర్రీలు వేస్తూ మోకాలొడ్డుతూనే ఉన్నారు. ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.850 కోట్లు కాగా..ఇప్పటి వరకు రూ.250కోట్ల వరకు రుణాలిచ్చారు. ఈమొత్తంలో కౌలురైతులకు ఇచ్చింది కేవలం రూ.1.5కోట్లు మాత్రమే. దీంతోబ్యాంకర్లపై ఒత్తిడి పెంచేందుకు జిల్లా కలెక్టర్ యువరాజ్ రంగంలోకి దిగారు. కౌలు రైతుల తరపున రెవెన్యూ యంత్రాంగం బ్యాంకుల ఎదుట ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఏకంగా మండల తహశీల్దార్ల ఆధ్వర్యంలోనే ఈ ఆందోళనలు జరగడం గమనార్హం. ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో శుక్రవారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో బ్యాంకుల ఎదుట ధర్నాలు.. రాస్తారోకోలు జరిగాయి. కౌలురైతులతో పాటు మండల స్థాయిలోని ఆర్ఐలు, వీఆర్వోలు, వీఆర్ఏలతో సహా ఇతర రెవెన్యూ యంత్రాంగమంతా పాల్గొన్నారు. ఆంధ్రబ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో పాటు ఏజెన్సీ పరిధిలోని గ్రామీణ బ్యాంకులకు చెందిన బ్రాంచ్‌ల ఎదుట ఈ ఆందోళనలు జరిగాయి. ఎల్ఈసీ కార్డుల్లో సర్వే నంబర్, అదే నంబర్‌పై ఎలాంటి రుణ బకాయిలు లేకుండా ఉంటే చాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలి వ్వాలని జిల్లా బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ బ్యాంకర్లు పెడచెవినపెట్టడం వల్లే తాము ఆందోళన బాటపట్టామని పాడేరు డిప్యూటీ తహశీల్దార్ సాక్షికి తెలిపారు. -
ఏదీ భరోసా..
- కౌలు రైతులకు అందని చేయూత - రుణఅర్హత కార్డుల లక్ష్యం 40వేలు - జారీచేసినవి 15,700 - గతేడాది 32 మందికే రుణం సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయం భారంగా మారడంతో అన్నదాతలు కాడిని వదిలేస్తున్నారు. పుడమిని మాత్రమే నమ్ముకున్న కౌలు రైతులు మాత్రం విధిలేని పరిస్థితుల్లో కాలం కలిసొస్తుందనే ఆశతో సాగు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల మోస పూరిత మాటలకు ఏటా వీరు సమిధలవుతున్నారు. జిల్లాలో 2,79,481 హెక్టార్ల సాగుభూమి ఉంది. దీనిపై ఆధారపడి 4,29,773 మంది సన్న, చిన్నకారు రెతులున్నారు. మరో 44,965 మంది పెద్ద రైతులున్నారు. సన్న, చిన్నకారు రైతుల్లో మూడొంతుల మంది అంటే సుమారు మూడులక్షల మంది కౌలురైతులే. ఎంత ఎక్కువ సాగువిస్తీర్ణం చేపడితే రైతు అంత ఎక్కువ నష్టపోతున్నాడు. ఒకసారి కాకపోతే మరొక సారైనా పంట కలిసొస్తుందన్న ఆశతో ఏటా కాడినెత్తు కుంటున్నారు. అటువంటి వీరికి బ్యాంకు రుణాలు, రాయితీపై యంత్ర పరికరాలుఅందజేయాలి. బీమా సౌకర్యం కల్పించాలి. కానీ ఆ దిశగా వీరిని ఆదుకునే చర్యలు కానరావడం లేదు. కౌలురైతులకు భరోసా కల్పిస్తూ ఏడాది పాటు వినియోగంలో ఉండేలా రుణ అర్హత కార్డులు (ఎల్ఏసీ) జారీ 2011లో అమలులోకి వచ్చింది. ఎటువంటి హామీ లేకుండా ఈ కార్డులపై బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి. సాగు ప్రారంభమయ్యే నాటికి కార్డుల జారీ పూర్తి చేసి, ఆ వెంటనే ఈ రుణాలు మంజూరుచేయాలి. ఏటా సాగు సగం పూర్తయ్యే వరకు కార్డులు జారీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ కారణంగా పంట ఆఖరి దశలో రుణాలివ్వడానికి బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. ఒక వేళ ముందుగానే దరఖాస్తు చేసుకున్నా.. సవాలక్ష ఆంక్షలతో మోకాలడ్డుతున్నారు. ఏదో ఇచ్చామంటూ కొద్దిమందికిరుణాలు మంజూరు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఈ కార్డులు నిరుపయోగంగా మారుతున్నాయి. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మేనాటికే జారీచేసి, జూన్ నుంచి కొత్త రుణాలిచ్చేలా చూడాలి. జూన్ నెల పూర్తవుతున్నా జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడనకన సాగుతుంది. జిల్లాలో గతేడాది 10,432 మంది కౌలురైతులకు రుణ అర్హతకార్డులు (ఎల్ఏసీ) జారీ చేయగా వీరిలో 32 మందికి మాత్రమే కేవలం రూ.8లక్షల రుణం మంజూరు చేయడం వీరి దుస్థితికి అద్దం పడుతోంది. ఈ ఏడాది 40వేల మందికి ఎల్ఏసీలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 15,700 మందికి మాత్రమే జారీ చేశారు. గతేడాది ఎల్ఏసీలు తీసు కున్న వారిలో 3868 మంది మాత్రమే రెన్యువల్ కోసం దరఖాస్తుచేసుకున్నారు. గతేడాది తీసుకున్న వారిలో మూడొంతుల మంది కనీసం దరఖాస్తు కు కూడా ఆసక్తి చూపలేదు. రుణ భరోసా లేక పోవడంతో కార్డులు తీసుకున్న ప్రయోజనం లేదన్న భావనతో కౌలురైతులు అటువైపు కన్నెత్తయినా చూడడంలేదు. తమ సాగు అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. -
నేడు వైఎస్సార్సీఎల్పీ పర్యటన
సాక్షి, గుంటూరు/గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైసీపీ శాసనసభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనుంది. అక్కడి రైతులు, కౌలురైతులు, కూలీలు, వ్యవసాయాధారిత కుటుంబాల సాధకబాధకాలు తెలుసుకోనుంది. పార్టీ నేతలు జరీబు పొలాల్లో తిరిగి, పచ్చని పంట పొలాలను పరిశీలించి, రైతుల ఆందోళనకు ఆలంబనగా నిలువనున్నారు. అనంతరం రాజధాని గ్రామాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుంటారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తారు. -
కౌలు రైతు అనాథే
* అరకొరగానైనా రుణ మాఫీ పొందిన కౌలు రైతు అరుదే * కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చిందే అతి తక్కువ * తొలుత కౌలు రైతుల రుణాలే మాఫీ అంటూ చంద్రబాబు ఆర్భాటం * కానీ కౌలు రైతుకు రూపాయి కూడా మాఫీ అయిన దాఖలాలే లేవు * నిలువునా మోసపోయామంటున్న కౌలురైతులు * బ్యాంకు నోటీసులు, ప్రయివేటు అప్పులతో కుదేలు * కాడి కింద పడవేయక తప్పదంటున్న కౌలు రైతులు * సాక్షి నెట్వర్క్ క్షేత్రస్థాయిలో నిర్వహించిన కేస్ స్టడీస్‌లో వాస్తవాలు చంద్రబాబు సర్కారు రుణ మాఫీ మాయాజాలంలో ఇది మరో కోణం! అరకొరగా విదిల్చిన రుణ మాఫీ సొమ్ము.. రైతులు తమ సొంత భూములపై తీసుకున్న అప్పులకు ఇప్పటివరకూ అయిన వడ్డీకి కూడా ఏ మూలకూ రాలేదు. వ్యవసాయం కోసం తాకట్టు పెట్టిన పుస్తెలు, తాళిబొట్లు విడిపించి తెస్తానన్న మాట.. నీటి మూటగానే మిగిలిపోయింది. ఒక్కటంటే ఒక్క పుస్తెల తాడు కూడా విడిపించలేదు. ఇక.. ‘ఒక పొలంపై భూ యజమాని, కౌలు రైతు ఇద్దరూ రుణం పొంది ఉంటే మాఫీ కౌలురైతుకే వర్తిస్తుంద’ని చంద్రబాబు ప్రభుత్వం గంభీరమైన ప్రకటనలు చేసింది. ఆచరణలో చూస్తే.. కౌలురైతు అనాథగానే మిగిలిపోయాడు. వారు తీసుకున్న రుణాల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల్లో ఊరూ వాడా హామీలు గుప్పించిన చంద్రబాబు అందలం ఎక్కాక ఇంత మోసం చేస్తాడనుకోలేదంటూ కౌలు రైతులు బిక్కమొహం వేస్తున్నారు. ‘‘మాకు బ్యాంకులు రుణాలు ఇవ్వడమే తక్కువ.. ఆ తక్కువ రుణాలను కూడా మాఫీ చేయకుండా మమ్మల్ని బ్యాంకులు, రెవెన్యూ ఆఫీసులు, జిరాక్సు సెంటర్ల చుట్టూ చంద్రబాబు తిప్పుతున్నాడు’’ అని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ అమలులో కౌలు రైతుల స్థితిగతులను ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. రుణమాఫీ వల్ల సంతృప్తి చెందిన ఒక్క కౌలు రైతు కుటుంబమూ కనిపించలేదు. కనీసం పేద కౌలు రైతులకున్న రూ. 10 వేలు, రూ. 15 వేలు రుణాలు కూడా మాఫీకి నోచుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతు కార్డులు, ఆధార్ కార్డులు వంటి అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా రుణ మాఫీ ఎందుకు కాలేదని వారు అడిగితే.. సమాధానం చెప్పే వారే కరువయ్యారు. అదేమంటే ఆ ఆఫీసుకు వెళ్లు, ఈ ఆఫీసుకు వెళ్లు అని వాళ్లు కాళ్లరిగేలా తిప్పుతున్నారు. రెండు మూడేళ్లుగా అధిక వర్షాలు, తుపానుల తాకిడికి, వర్షాభావ పరిస్థితుల్లో పంటలు చేతికందక అప్పుల్లో మిగిలిన కౌలు రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. భూ యజమానులకు ముందస్తు కౌలు చెల్లించలేక, బయట ప్రైవేటు అప్పులు పుట్టక, బ్యాంకులు జారీ చేసే నోటీసులతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటను నమ్మి నిలువునా మోసపోయామని వాపోతున్నారు. - సాక్షి నెట్వర్క్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. బ్యాంకుల నిరాదరణ... ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యాంకుల నిరాదరణ కారణంగా కౌలు రైతులు చాలా కాలంగా వ్యవస్థాగత రుణాలకు (బ్యాంకు) దూరంగానే ఉన్నారు. ఉదాహరణకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో 14.55 లక్షల మంది కౌలురైతులకు ‘ఎల్ఈసీ’ల (రుణ ఆర్హత కార్డులు) జారీ లక్ష్యంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే చివరకు జారీ చేసింది మాత్రం 4.39 లక్షల మందికే. పోనీ వీరికైనా బ్యాంకు రుణాలు అందాయా అంటే అదీలేదు. వీరిలో కేవలం 1.14 లక్షల మందికి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. 2013-14 ఖరీఫ్‌లో రూ. 31,996 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, అందులో రూ. 26,609 కోట్లు (83 శాతం) పంట రుణాలిచ్చారు. ఇందులో కౌలురైతులకు ఇచ్చిన రుణ మొత్తం రూ. 231.70 కోట్లు మాత్రమే. 2013-14 ఖరీఫ్‌లో బ్యాంకులు ఇచ్చిన మొత్తం పంటరుణాల్లో కౌలు రైతులకు దక్కింది కేవలం 0.87 శాతం మాత్రమే. ఈ కొద్దిపాటి రుణాలను మాఫీ చేయడానికి కూడా చంద్రబాబుకు చేతులు రావడంలేదు. ఇదమిత్థమైన కారణాలు ఏమీ తెలపకుండానే వీరు మాఫీ మాఫీకి అర్హులు కాదంటున్నారు. మేం ఎందుకు అర్హులం కాదన్న కౌలు రైతుల ప్రశ్నకు అటు బ్యాంకులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ సమాధానం చెప్పడం లేదు. రైతుల ఆగ్రహాన్ని బ్యాంకులపైకి మళ్లించే ఎత్తుగడ... కౌలు రైతులకు రుణమాఫీ వర్తింప చేయడంలో ఇన్ని అవకతవకలు చోటుచేసుకుంటుంటే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. బ్యాం కులపై తిరగబడమంటూ రైతులకు సలహాలిస్తోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రే ‘రుణాలు మాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ఆందోళనలు చేయండి. పోలీసు కేసులు లేకుండా మేం చూసుకుంటాం’ అనడంలోని పరమార్థం ఇప్పుడిప్పుడే రైతులకు అర్థమవుతోంది.రుణమాఫీలోని డొల్లతనం కారణంగా వ్యక్తమయ్యే ఆగ్రహావేశాలను ప్రభుత్వం వైపు కాకుండా బ్యాంకుల వైపు మళ్లించే చౌకబారు ఎత్తుగడే ఇది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణమాఫీ వర్తించక, బ్యాంకుల్లో కొత్త రుణాలు పుట్టకపోతే కాడి కిందపడేయాల్సిందే అని కౌలు రైతు అంటున్నాడు. పేరు: శేఖన్న ఊరు: కర్నూలు జిల్లా బేవినహాల్ కౌలు పొలం: 5 ఎకరాలు రుణం: రూ. 10,000, మాఫీ: ఒక్క పైసా కూడా కాలేదు కారణం: తెలీదు బాబు వచ్చాక అప్పుపోతుందనుకున్నా.. ‘‘మూడేళ్ల కిందట.. నాతో సహా ఐదుగురు కౌలు రైతులను గ్రూపుగా చేసి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున హాలహర్వి ఇండియన్ బ్యాంకు వారు రూ. 50,000 అప్పు ఇచ్చారు. మూడేళ్లుగా చెల్లిస్తూ వచ్చాం. చంద్రబాబు వచ్చాక అప్పు పోతుందని కట్టలేదు. అన్ని పత్రాలను బ్యాంకుకు ఇచ్చాను. అయినా అప్పు పోలేదు. ఇప్పుడేమో అసలు,వడ్డీ కూడా కట్టమంటున్నారు. .’’ పేరు: యనమదల సత్యనారాయణ ఊరు: తూ.గో. జిల్లా మామిడికుదురు, కౌలు భూమి: 70 సెంట్లు రుణం: రూ. 10,000 మాఫీ: పైసా కూడా కాలేదు కారణం: ఎవరూ చెప్పటం లేదు మాఫీ హామీని నమ్మి మోసపోయా ‘‘నేను 70 సెంట్లు భూమి కౌలుకు తీసుకుని వరి వేశాను. మా ఉళ్లో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకులో రూ. 10 వేలు రుణం తీసుకున్నాను. మాఫీ అయిపోతుందన్న నమ్మకంతో రుణం చెల్లించలేదు. అన్ని పత్రాలిచ్చినా మాఫీ కాలేదు. ఇప్పుడు కొత్తగా రుణం పొందే అవకాశం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రుణ మాఫీ హామీని నమ్మి మోసపోయాను. కొత్తగా అప్పు తీసుకుని వ్యవసాయం చేసుకునే వాడిని.’’ పేరు: బెలగాపు చిన పండయ్య ఊరు: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం మరువాడ కౌలు రుణం: రూ. 50,000 (మరో నలుగురు రైతులతో కలిసి) వడ్డీ: రూ. 10,000, మాఫీ: కాలేదు అన్నిపత్రాలిచ్చినా.. పైసా మాఫీ కాలేదు! ‘‘నాతోపాటు మాగ్రామానికి చెందిన బెలగాం సోములు, రాములు, మండంగి నర్శింహులు, పారయ్య తదితరులంతా కలిపి ఉమ్మడి కౌలు కార్డుతో జియ్యమ్మవలస వికాస్ గ్రామీణ బ్యాంకులో 2012-13లో రూ. 50,000 వ్యవసాయ రుణం తీసుకున్నాం. రూ. 10,000 వడ్డీ అయ్యింది. చంద్రబాబు ప్రకటనతో అప్పు తీరిపోతుందని ఆశించి ఓటేశాం. పత్రాలన్నీ ఇచ్చాం. అయితే మాకు పైసా కూడా రుణ మాఫీ కాలేదు. ’’ పేరు: పల్లంరెడ్డి సాయిమోహన్‌రెడ్డి ఊరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం కౌలు పొలం: 7 ఎకరాలు రుణం: రూ. 50వేలు, మాఫీ: కాలేదు, కారణం:తెలియదు విముక్తి పత్రం ఇచ్చి.. మాఫీ కాలేదన్నారు! ‘‘ఏడెకరాల పొలం కౌలు తీసుకున్నాను. నాలుగెకరాల కు రూ.50 వేల రుణం తీసుకొని వరి పంట వేశాను. ఇటీవల రుణవిముక్తి పత్రమిచ్చారు. కానీ గతనెల 25న నోటీసు పంపారు. ఆధార్ వివరాలు సక్రమంగా లేవని.. మాఫీ వర్తించలేదని బ్యాంకు అధికారులు చెప్పారు. కానీ వివరాలు సక్రమంగానే ఉ న్నాయి. అప్పు చెల్లించకపోతే కోర్టుకు వేస్తామంటున్నారు.’’ పేరు: కలిగినీడి దుర్గాదత్ ఊరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రుణం: రూ. 15,000 మాఫీ: రూపాయి కూడా కాలేదు కారణం: తెలియదు ఎంత తిరిగినా.. ప్రయోజనం లేదు ‘‘2012 సెప్టెంబర్‌లో నరసాపురం సహకార వ్యవసాయ పరపతి సంఘంలో రూ. 15,000 అప్పు తీసుకున్నాను. మాఫీ అవుతుందని ఆశగా ఎదురు చూసాను. అయితే పైసా కూడా రుణ మాఫీ జరగలేదు. ఆరా తీస్తే.. పాస్‌బుక్ నెంబర్ తప్పుగా ఉందన్నారు. ఏదోరకంగా రుణ మాఫీ చేయకూడదనే ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రుణ మాఫీ పేరుతో మమ్మల్ని మోసం చేసారు. పేరు: శనివాడ అప్పారావు. ఊరు: విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట కౌలు పొలం: 2.5 ఎకరాలు రుణం: రూ. 40,000 వడ్డీ: రూ. 12,000 మాఫీ: రూపాయి కూడా కాలేదు ఎంతో ఆశపడ్డాను.. ఏమీ తీరలేదు... ‘‘నా సొంత పొలం అర ఎకరాతో పాటు, రెండున్నర ఎకరాల మెరక భూమిని ఆరేళ్లుగా కౌలు చేస్తున్నాను. కౌలు రైతు కార్డు మీద బంగారాన్ని తాకట్టుపెట్టి 2013లో రూ. 40,000 పంట రుణం తీసుకున్నాను. చెరకే పంట వేస్తే వర్షాలు, తుపాను దెబ్బతీశాయి. ఇప్పుడు వడ్డీతో కలిసి రూ. 52,000 కట్టాలని, లేకపోతే బంగారం వేలం వేత్తామంటున్నారు బ్యాంకోళ్లు.’’ పేరు: పెరుమాళ్ల కోటయ్య ఊరు: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు ఎస్సీ కాలనీ కౌలు భూమి: 1.99 ఎకరాలు రుణం: రూ. 35వేలు, వడ్డీ: రూ. 5,347, మాఫీ: కాలేదు అప్పు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు ‘‘నేను 1.99 ఎకరాల కౌలు భూమిలో మిర్చి సాగుచేసా ను. నేను ఆదర్శరైతుగా కూడా పనిచేసాను. 2012 ఆగస్టులో బంగారం తాకట్టు పెట్టి రూ. 35,000 వ్యవసాయ రుణం తీసుకున్నా. వడ్డీతో రూ. 40,347 అయింది. రుణమాఫీ జాబితాల్లో నాకు మాఫీ కాలే దని వచ్చింది. దీంతో బంగారం బయటకు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేట్, బ్యాంకు అప్పు ఎలా తీరుదుందో ఏమో.’’ పేరు: ఈరమ్మ ఊరు: కర్నూలు జిల్లా తుంబళబీడు కౌలు పొలం: 6 ఎకరాలు రుణం: రూ. 15,000 మాఫీ: రూపాయి కూడా కాలేదు కారణం: ఎందుకో తెలియదు మాఫీ కాలేదు.. పంట రాలేదు.. ‘‘పదేళ్లుగా గ్రామంలో మా బంధువులకు చెందిన ఆరు ఎకరాల భూమిని నా భర్త, కుటుంబ సభ్యులతో కలిసి కౌలుకు చేస్తున్నాం. 2012-13లో ఆలూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 15,000 వేలు అప్పు ఇచ్చారు. ఆ అప్పును తిరిగి వడ్డీతో సహా ప్రతి ఏటా చెల్లిస్తున్నాం. రుణమాఫీ అవుతుందని ఈ యేడాది కట్టలేదు. కానీ బాకీ మాఫీ కింద పోలేదు. ఇప్పుడేం చేయాలో ఏమో’’ -
మాఫీ బురిడీ
ఇదిగో ఇచ్చేస్తున్నా..అదిగా ఇచ్చేస్తున్నా.. లక్షన్నర వరకు మీ రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నా.. అంటూ బురిడి మాటలతో ఆర్నెళ్లుగా కాలం గడిపిన సీఎం చంద్రబాబు నాయుడు చివరకు తుస్సుమనిపించారు. మసిపూసిమారేడుకాయ చందంగా మాఫీ ప్రకటన జిల్లా రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. కనీసం 10 శాతం మంది బాధిత రైతులకు కూడా లబ్ధి చేకూరని దుస్థితి నెలకొనడంతో పాలుపోక అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మాయ మాటలకు మళ్లీ మోసపోయాం అంటూ గగ్గోలు పెడుతున్నారు. ⇒మెజారిటీ రైతులకు మొండిచేయి ⇒10 శాతం మందికే లబ్ధి ⇒లబోదిబోమంటున్న అన్నదాతలు ⇒బంగారు రుణాలకు కొర్రి ⇒ కౌలుదారులకు జెల్ల సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో రెండున్నరలక్షల మంది రైతులకు చెందిన 3.87లక్షల ఖాతాల పరిధిలో పంట, బంగారు రుణాలు కలిపి సుమారు రూ.3,800కోట్ల వరకు ఉన్నాయని అంచనా. వీటిలో పంట రుణాలే రూ.1500కోట్లు, టెర్మ్ లోన్స్, కన్వర్టడ్ క్రాప్ లోన్స్ కలిపి మరో వెయ్యి కోట్ల వరకు ఉంటాయని అంచనా. రుణమాఫీ పరిధిలోకి వచ్చే పంట, బంగారు రుణాలలో ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర లోపు రుణాల వరకు చూసుకున్నా కనీసం రూ.2,200 వేల కోట్ల వరకు వరకు మాఫీ కావాల్సి ఉంది. వీటిలో పంట రుణాలు ఎంతతక్కువ లెక్కేసుకున్నా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటాయని అంచనా. 10 శాతం మంది రైతులకే లబ్ధి: ప్రస్తుతం 50 వేల లోపుపంట రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారం జిల్లాలో 3.87లక్షల అకౌంట్లలో 70వేల అకౌంట్ల పరిధిలోని 25వేల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదీ కూడా వడ్డీతో సహా అని మెలిక పెట్టడంతో రూ.30వేల లోపు రుణం తీసుకున్న వారికి వడ్డీతో సహా వారి అప్పు ప్రస్తుతం రూ.50వేల లోపు ఉంటుంది కాబట్టి వారికి పూర్తి స్థాయిలో మాఫీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 25వేల మంది రైతులకు సంబంధించి రూ.400కోట్ల వరకు మాఫీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన వారికి 20 శాతం మేర రుణమాఫీ మొత్తం జమచేస్తామని చెబుతుండడంతో ఆ మొత్తం ఎంతనేది తేలాలంటే జాబితా వెల్లడిస్తే కా నీ ఎంతమందికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో తేలే అవకాశాలు కన్పించడం లేదు. బంగారురుణాలకు కొర్రే..: ముఖ్యంగా బంగారుఆభరణాలపై తీసుకున్న రుణాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలో లక్షమందికి పైగా సుమారు 2,500కోట్ల వరకు బంగారు ఆభరణాలపై రుణాలు పొంది ఉంటారని అంచ నా. వీరిలో పూర్తిగా పంటలకోసమే రుణా లు తీసుకున్న వారు సంఖ్య ఎంతతక్కువ లెక్కేసుకున్నా 70వేలమందికి పైగానే ఉంటారని భావిస్తున్నారు. వీరు పొందిన రుణాలు కూడా రూ.1,500కోట్లకు పైగానే ఉంటాయని లెక్కలేస్తున్నారు. ఈ బంగారు రుణాలల్లో ఏ మేరకు మాఫీ అవుతాయో లెక్కతేలడం లేదు. కౌలు రైతుకు జెల్ల జిల్లాలో ఉన్న రెండున్నర లక్షల మంది రైతుల్లో కౌలురైతులు లక్షన్నరకు పైగానే ఉంటారు. రుణఅర్హత కార్డులున్న వారు గతేడాది 35వేల వరకు ఉండేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య 10వేల లోపు మాత్రమే ఉన్నారు. గతేడాది పంటరుణాలు పొందిన వారిసంఖ్య కేవలం వెయ్యిలోపే ఉన్నారు. వీరి పొందిన రుణం కూడా లక్షల్లోనే ఉన్నాయి. అయితే బంగారు ఆభరణాలు కుదవపెట్టి అప్పులు చేసి సాగుచేసిన వారే ఎక్కువ. ఎల్ఈసీ కార్డులుండి బంగారు ఆభరణాలు పొందిన వారు మాత్రమే రుణమాఫీ వల్ల కొద్దొగొప్పో లబ్ధి పొందే అవకాశం ఉంది. మిగిలిన 95 శాతం మంది కౌలురైతుల రుణమాఫీ వల్ల ఎలాంటి లబ్ధి పొందే అవకాశం లేదు.దీంతో ఇప్పటికే వేలాదిమంది కౌలురైతులు కుదవపెట్టిన బంగారు ఆభరణాలను వేలం వేసేందుకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ విధంగా జిల్లాలో కనీసం ఐదారువందల కోట్ల రుణాలకు చెందిన బంగారు ఆభరణాలను వేలం వేసేందుకు ఏరా్పాట్లు చేశారు. బీమా సొమ్ము అప్పుల పాలు: పం టల బీమా, ఇతర పరిహారాల కింద వచ్చిన సొమ్మును బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది సంభవించిన నీలం తుఫాన్ ఇన్‌పుట్‌సబ్సిడీని జమ చేసుకోవ డానికి వీల్లేదని ప్రభుత్వం తెగేసి చెప్పినా జిల్లాలో మెజార్టీ బ్యాంకర్లు తమ అప్పుల కింద ఈ మొత్తాన్ని జమ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలు, జల్ తుఫాన్‌కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రూ.12కోట్లు ఇటీవలే విడుదలయ్యాయని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా మాఫీఖాతాలకు మళ్లించేస్తున్నారని చెబుతున్నారు. -
7 లక్షల మంది రైతులకు రుణం హుళక్కే
రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. ఖరీఫ్ సాగుకు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నా భూమిని ఖాళీగా ఉంచలేక...రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాక, బయట అప్పు పుట్టక అల్లాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసినా రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తుండటంతో బ్యాంకుర్లు అదే ఆయుధంగా చూపించి రైతుకు రుణాలు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. కనీసం ఖరీఫ్ ముగిసి ర బీకైనా రుణాలు బ్యాంకులు ఇస్తాయన్న ఆశతో బయటనుంచి రుణాలు తెచ్చి వ్యవసాయ పనులకు ఉపక్రమిస్తున్నారు. - మార్టూరు జిల్లాలో రైతుల సంఖ్య 7 లక్షలు కౌలు రైతులు 1.50 లక్షల మంది కష్టాలు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఇప్పటికే 4 లక్షల ఎకరాల్లో పత్తి,వరి,మిర్చి పంటలు సాగయ్యాయి. వేల ఎకరాల్లో రైతులు కూరగాయల పంటలను సాగు చేశారు. పత్తి, మిరప పొలాల్లో ఇప్పటికే కలుపు తీసి ఎరువు చల్లే పనులు కూడా మొదలయ్యాయి. వీటికి చేతిలో సొమ్ము లేక బ్యాంకర్ల సాయం కోరుతున్నారు. అయితే రుణ మంజూరుకు బ్యాంకర్లు పలు కొర్రీలు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీలో చిక్కుముడి వీడితేనే అప్పు ఇచ్చేదని బ్యాంకర్లు కరాఖండిగా చెబుతుండడంతో అయోమయ పరిస్థితి నెలకుంది. రుణ ప్రణాళిక రూపొందించని బ్యాంకర్లు ఈ ఏడాది 7 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నా, కనీసం ప్రభుత్వం ఈ ఏడాది రుణ ప్రణాళిక కూడా రూపొందించలేదని రైతులు వాపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైతులకు వ్యవసాయ రుణాలకు రుణ ప్రణాళిక రూపొందించకపోవటం ఇదే ప్రథమం అని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. రబీకి కూడా కరుణించరా ఖరీఫ్ సీజన్ అయిపోయింది. రైతులు అప్పోసొప్పో చేసి సాగు చేశారు. రబీ సగంలో పడింది. కనీసం ఇప్పుడన్నా బ్యాంకులు అప్పు ఇస్తుందనుకుంటే అది కూడా హుళక్కేలా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకూ మొండి చేయేనా... జిల్లాలో 1.50 లక్షల మంది కౌలు రైతులుండగా అందులో కేవలం 25 వేల మందికే రుణ అర్హత కార్డులు ఇచ్చారు. మిగిలిన రైతులకు రుణ అర్హత కార్డులు కూడా ఇవ్వలేదు. కనీసం కొత్తగా కార్డు తీసుకుని బ్యాంకులో రుణం లేని రైతులకు కూడా మొండి చేయి చూపుతున్నాయి. రుణమాఫీ జాబితాలంటూ తిప్పుతున్న వైనం అసలే సాగు చేసి రుణాలు రాక.. రైతులు ఇక్కట్లు పడుతుంటే రుణమాఫీకి ఆధార్ ఇవ్వలేదు? పొలం ఎక్కువుంది, వివరాలు సరిపోలేదు.. జాబితాలో పేరు లేదంటూ యక్షప్రశ్నలేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ చేయకపోగా కొత్తగా రుణాలు బ్యాంకులు ఇవ్వకుండా వేధిస్తున్నాయని రైతన్నలు కతల చెందుతున్నారు. రుణ ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటు: జిల్లా రైతు సంఘం కార్యదర్శి,దుగ్గినేని గోపీనాథ్ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటానికి ఈ ఏడాది రుణప్రణాళిక కూడా రూపొందించలేదు. జిల్లాలో 7 లక్షల మంది రైతులు న్నారు. రుణమాఫీ సాకుతో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు బయటి వడ్డీకి తెచ్చి అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా కాలయాపనచేస్తోంది. -
బ్యాంకు ముట్టడించిన కౌలు రైతులు
అచ్చంపేట :కౌలు రైతులు సోమవారం స్థానిక చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకును ముట్టడిం చారు. తక్షణమే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు లోపల భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్న భోజనాలు కూడా అక్కడే కానిచ్చారు. ఇన్చార్జి మేనేజర్హామీతో సాయంత్రం ఆరు గంటల తరువాత ఆందోళన విరమించారు. బ్యాంకు జిల్లా మేనేజరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా కొత్తవారికి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కౌలు రైతుల సంఘ ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు ఆధ్వర్యంలో రైతులు ఉదయం బ్యాంకును ముట్టడించారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కనీసం 25 మందికైనా రుణాలు ఇవ్వనిదే ఇక్కడి నుంచి కదలబోమని పట్టుపట్టారు. మధ్యాహ్న భోజనాలు కూడా బ్యాంకులోనే చేశారు. నాగబోయిన రంగారావు మాట్లాడుతూ కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు విముఖత చూపుతున్నార న్నారు. రుణాల కోసం ఈనెల 12న బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టామని, 15న జిల్లా మేనేజరు కౌలు రైతులను గుంటూరు పిలిపించుకుని ప్రస్తుతానికి 25మంది రైతులకు రుణాలిచ్చేందుకు ఒప్పుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆ తరువాత మిగిలిన కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారన్నారు. ఆ హామీ మేరకు కౌలు రైతులు ఇక్కడి మేనేజరును రుణాలు కోరడం జరిగిందని, అయితే ఆయన తిరస్కరించడమే కాకుండా కౌలు రైతులను గొర్రెలతో పోల్చారని ఆరోపించారు. దాంతో బ్యాంకుని ముట్టడించాల్సి వచ్చిందన్నారు. తక్షణమే కౌలు రైతులకు పాత బకాయిలతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ బ్యాంకు ఇన్చార్జి మేనేజర్ రామారావు రోజుకు ఒక గ్రూపు వంతున 25 మందికి రుణాలు ఇస్తానని హామీ ఇవ్వడంతో కౌలు రైతులు సాయంత్రం 6.30 గంటలకు ధర్నా విరమించారు.+ ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు రైతుల సంఘ కార్యదర్శి బొట్లా రామకృష్ణ, సత్తెనపల్లి డివిజన్ రైతు సంఘ కార్యదర్శి ఆవుల ఆంజనేయులు, మండల కౌలు రైతు సంఘ అధ్యక్షుడు చినగాని రాజేష్, సీపీఎం నాయకుడు షేక్ హుస్సేన్, తాళ్లచెరువు, అచ్చంపేట, గ్రంధశిరి గ్రామాల కౌలు రైతులు పాల్గొన్నారు. -
కౌలు రైతుల మైండ్ బ్లాక్
►రుణమాఫీకి బాబు సర్కారు భారీ మెలిక ►పాస్ పుస్తకాలు కావాలంటూ కొర్రీలు ►అదెలా సాధ్యమని ప్రశ్నిస్తూగొట్టిపాడులో ఆందోళన ►పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీ... ►ఆ తరువాత ఒరిజినల్ తప్పనిసరి : సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ప్రత్తిపాడు: పంట రుణాలు మాఫీ అవుతాయని ఆశల పల్లకిలో విహరిస్తున్న కౌలు రైతులకు బాబు సర్కా రు దిమ్మ తిరిగే మార్గదర్శకాలతో షాక్ ఇచ్చింది. ఒకే సర్వే నంబరులో ఉన్న పంట పొలానికి భూ యజమానితో పాటు కౌలు రైతు బంగారు రుణం తీసుకున్నట్లయితే కౌలు రైతుకే లబ్ధిచేకూర్చాలని తాజాగా బ్యాంకర్లకు విడుదల చేసిన మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అయితే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు మాఫీ కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం తప్పనిసరిగా తీసుకురావాలంటూ మెలిక పెట్టారని కౌలు రైతులు వాపోతున్నారు. ►ఈ నిబంధనను నిరసిస్తూ గురువారం ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట కౌలు రైతులు ఆందోళన చేశారు. ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ రుణమాఫీ అంటూ ఓటర్లను ఆకర్షించిన చంద్రబాబు ఇప్పుడు ఇలా కొర్రీలు పెట్టడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ►బ్యాంకర్లు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు కాపీ అడుగుతున్నారని, రుణమాఫీ నాటికి ఒరిజనల్ పట్టాదారు పాస్ పుస్తకం కావాలని, లేకుంటే రుణమాఫీ వర్తించదని బ్యాంకర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు భూ యజమా ని పొలం కౌలుకు ఇవ్వడమే కష్టంగా మారిందని, అలాంటపుడు పాస్ పుస్తకాలు అందు లోనూ ఒరిజినల్స్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ►ఇదిలా ఉంటే బ్యాంకర్లు మరో అడుగు ముందుకు వేసి కౌలు రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా జిరాక్సు కాపీ తీసుకువచ్చేటప్పుడు దానిపై పట్టాదారు సంతకం (రుణమాఫీకి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని) కూడా తీసుకోవాలంటూ చెబుతుండటంతో కౌలు రైతులు డోలాయమానంలో పడుతున్నారు. పాస్ పుస్తకాలు కావాలంటున్నారు ... గత ఏడాది ఎకరన్నర పొలం కౌలుకు సాగు చేశాను. బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ. 80 వేల రుణం తీసుకున్నాను. ఇప్పుడు ఆ రుణం మాఫీ కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకాలు కావాలంటున్నారు. లేకుంటే రుణమాఫీ వర్తించదని చెబుతున్నారు. భూ యజమానులు పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారు. అంతా గందరగోళంగా ఉంది. - మేడా కోటేశ్వరి, గొట్టిపాడు పుస్తెలు తాకట్టు పెట్టాం... పుస్తెలు తాకట్టు పెట్టి మరీ కౌలుకు పొలం చేశాం. మొన్నటిదాకా బంగారంపై రుణాలు పోతాయని ఆశపడ్డాం. ఇప్పుడు పాస్ పుస్తకాలు కావాలంటూ కొర్రీ పెట్టారు. సొంత పొలాల్లేని మాకు పాస్ పుస్తకాలు ఎక్కడ నుంచి వస్తాయి. రైతులకు రుణాలు ఉన్నప్పుడు, మాకు పాస్ పుస్తకాలెందుకు ఇస్తారు. - కుంభా వీరరాఘవమ్మ, మారెల సుబ్బాయమ్మ, గొట్టిపాడు. పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి ... కౌలు రైతులు బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే ఇప్పుడు పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీలు ఇవ్వమంటున్నాం. మాఫీ నాటికి ఒరిజినల్ పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకువస్తే అందులో రుణమాఫీ అయినట్లు నమోదు చేస్తాం. ఏదిఏమైనా పట్టాదారు పాసు పుస్తకాలు తప్పనిసరి. ఒకే సర్వే నంబరులో కౌలు, రైతు భూ యజమాని బంగారంపై రుణం పొంది ఉంటే అందులో కౌలు రైతుకే మాఫీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. - అమిత్‌కుమార్, మేనేజర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గొట్టిపాడు. -
కౌలు బాట.. కష్టాల మేట!
రుణాలు అందక కౌలు రైతు దిగాలు ► సర్కారు ఆదుకోదు.. బ్యాంకులకు పట్టదు ► ఈ ఏడాది రుణ అర్హత కార్డులు ఇవ్వలేదు ► కనీసం పాతవి కూడా పునరుద్ధరించలేదు ► అధీకృత సాగుదార్ల చట్టానికి దిక్కులేదు..\ ► హామీ లేకుండా రూ.50 వేల రుణం ఇచ్చే అవకాశం ఉన్నా ఎగ్గొడుతున్న బ్యాంకులు ► పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఒత్తిడి ► వడ్డీ వ్యాపారులనే ఆశ్రరుుస్తున్న నిరుపేదలు ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సెంటు భూమి లేనివారు - 30% . భూమి ఉన్నా.. సాగు చేయకుండా కౌలుకు ఇస్తున్నవారు - 40% (హెక్టారు)సుమారు రెండున్నర ఎకరాలలోపే ఉన్నవారు - 30% రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య - 25,00,000 హైదరాబాద్ కరువు కాటేస్తున్నా, తుపాన్లు పంటను మింగేస్తున్నా సాగే జీవనాధారంగా బతుకులీడ్చే కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్‌లో కనీస పెట్టుబడులు లేకపోవడంతో వారు పంటలు వేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అచ్చంగా భూమినే నమ్ముకున్న ఈ కౌలు రైతుల కోసం ప్రభుత్వం మూడేళ్ల కిందట ఓ చట్టం తెచ్చినా వారికి ఏవైపు నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి రుణ అర్హత కార్డులూ జారీ చేయని ప్రభుత్వం, పాత కార్డులను కూడా పునరుద్ధరించలేదు. దీంతో కీలక సమయంలో పెట్టుబడికి అవసరమైన రుణాలు లభించక కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనధికార అంచనా ప్రకారం.. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 లక్షల మంది కౌలు రైతులున్నారు. సాగు చేసుకోవడం మినహా ఆయూభూములపై ఎటువంటి హక్కుభుక్తాలు లేని కౌలుదారుల దుస్థితిని గుర్తించి 2011లో ఆనాటి ప్రభుత్వం అధీకృత సాగుదార్ల చట్టం తీసుకువచ్చింది. వాస్తవ కౌలుదారులను గుర్తించి వారిని ఆదుకునేందుకు రుణాల మంజూరు వంటి చర్యలు చేపట్టడం దీని ప్రధానోద్దేశం. ఈ మేరకు వాస్తవ కౌలుదారులను గుర్తించే ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా కౌలుదారులు ఉన్నట్టు అంచనా వేసింది. అయితే ఈ సంఖ్యపై రైతు సంఘాలు, వివిధ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారుు. ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షలకు పైగా కౌలుదారులున్నారని గణాంకాలతో సహా వివరించాయి. ఈ నేపథ్యంలో కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. వీటితో పాటు రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీలు) కూడా ఇవ్వడం ప్రారంభించింది. 2011లో 5,76,147 మందికి కార్డులిచ్చి 1,97,725 మందికి రూ.393.45 కోట్ల మేరకు రుణాలు లభించేలా చూసింది. 2012లో 2,44,082 మంది కార్డులను పునరుద్ధరించడంతో పాటు మరో 1,79,082 మందికి కొత్త కార్డులు ఇచ్చింది. వీరిలో 1,31,975 మందికి రూ.312 కోట్ల రుణాలు మంజూరయ్యూరుు. ఇక 2013-14 ఆర్ధిక సంవత్సరంలో పాతకార్డుల్లో 2,79,673 మంది కార్డులను పునరుద్ధరించి 1,66,462 మందికి కొత్తగా కార్డులు ఇచ్చింది. ఆ సంవత్సరంలో వారికి రూ.330.51 కోట్ల మేరకు రుణం మంజూరరుు్యంది. అరుుతే రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొత్త కార్డులు ఇవ్వలేదు. పాత వాటిని పునరుద్ధరించలేదు. జూలైలో గ్రామసభలు పెట్టి కౌలు రైతులకు కార్డులిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. రూ.1,000 కోట్లతో ప్రత్యేక నిధికి డిమాండ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 30 శాతం మందికి సెంటు భూమి కూడా లేదు. మరో 30 శాతం మందికి హెక్టార్ (సుమారు రెండున్నర ఎకరాలు) లోపే ఉంది. మిగతా 40 శాతం మందికి ఎక్కువ భూమి ఉన్నా వాళ్లు సాగు చేయకుండా కౌలుకు ఇస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం 46 లక్షల హెక్టార్ల సాగుభూమిలో 80 శాతం కౌలుదారులపైనే ఆధారపడి ఉంది. వీరి కోసం తెచ్చిన అధీకృత చట్టం ఆచరణలో ఎందుకూ కొరగాకుండా ఉంది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతుకు ఎటువంటి హామీ లేకుండా రూ.50 వేల రుణం ఇచ్చే అవకాశం ఉన్నా బ్యాంకులు ఇవ్వడం లేదు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో కౌలు రైతులకు బ్యాంకుల్లో అప్పు పుట్టడం లేదు. గుర్తింపు, రుణ అర్హత కార్డులున్నా ఫలితం లేకుండా ఉంది. భూ యజమానుల నుంచి పాస్ పుస్తకాలు తెచ్చుకుంటేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడుల కోసం వీరు అనివార్యంగా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సింది వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఇంతవరకు ఎల్‌ఈసీలు పునరుద్ధరించడం కానీ, కొత్త కార్డులు ఇవ్వడం కానీ జరగకపోవడంతో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సైతం సదరు భూమిపై యజమాని రుణం తీసుకోని పక్షంలో మాత్రమే కౌలుదారులకు వర్తించనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అధీకృత చట్టాన్ని మార్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కౌలు రైతుల కోసం వేయి కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నాయి. వేర్వేరు కారణాలతో భూస్వాములు పట్నాలు, నగరాలకు తరలిపోతున్న నేపథ్యంలో వారి భూముల్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పేదల్ని ఆదుకోకుంటే మున్ముందు తిండి గింజలకు కూడా కటకటలాడాల్సిందేనని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.