రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. ఖరీఫ్ సాగుకు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నా భూమిని ఖాళీగా ఉంచలేక...రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాక, బయట అప్పు పుట్టక అల్లాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసినా రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తుండటంతో బ్యాంకుర్లు అదే ఆయుధంగా చూపించి రైతుకు రుణాలు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. కనీసం ఖరీఫ్ ముగిసి ర బీకైనా రుణాలు బ్యాంకులు ఇస్తాయన్న ఆశతో బయటనుంచి రుణాలు తెచ్చి వ్యవసాయ పనులకు ఉపక్రమిస్తున్నారు.
- మార్టూరు
జిల్లాలో రైతుల సంఖ్య 7 లక్షలు
కౌలు రైతులు 1.50 లక్షల మంది
కష్టాలు
నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఇప్పటికే 4 లక్షల ఎకరాల్లో పత్తి,వరి,మిర్చి పంటలు సాగయ్యాయి. వేల ఎకరాల్లో రైతులు కూరగాయల పంటలను సాగు చేశారు. పత్తి, మిరప పొలాల్లో ఇప్పటికే కలుపు తీసి ఎరువు చల్లే పనులు కూడా మొదలయ్యాయి. వీటికి చేతిలో సొమ్ము లేక బ్యాంకర్ల సాయం కోరుతున్నారు. అయితే రుణ మంజూరుకు బ్యాంకర్లు పలు కొర్రీలు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీలో చిక్కుముడి వీడితేనే అప్పు ఇచ్చేదని బ్యాంకర్లు కరాఖండిగా చెబుతుండడంతో అయోమయ పరిస్థితి నెలకుంది.
రుణ ప్రణాళిక రూపొందించని బ్యాంకర్లు
ఈ ఏడాది 7 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నా, కనీసం ప్రభుత్వం ఈ ఏడాది రుణ ప్రణాళిక కూడా రూపొందించలేదని రైతులు వాపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైతులకు వ్యవసాయ రుణాలకు రుణ ప్రణాళిక రూపొందించకపోవటం ఇదే ప్రథమం అని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
రబీకి కూడా కరుణించరా
ఖరీఫ్ సీజన్ అయిపోయింది. రైతులు అప్పోసొప్పో చేసి సాగు చేశారు. రబీ సగంలో పడింది. కనీసం ఇప్పుడన్నా బ్యాంకులు అప్పు ఇస్తుందనుకుంటే అది కూడా హుళక్కేలా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతులకూ మొండి చేయేనా...
జిల్లాలో 1.50 లక్షల మంది కౌలు రైతులుండగా అందులో కేవలం 25 వేల మందికే రుణ అర్హత కార్డులు ఇచ్చారు. మిగిలిన రైతులకు రుణ అర్హత కార్డులు కూడా ఇవ్వలేదు. కనీసం కొత్తగా కార్డు తీసుకుని బ్యాంకులో రుణం లేని రైతులకు కూడా మొండి చేయి చూపుతున్నాయి.
రుణమాఫీ జాబితాలంటూ తిప్పుతున్న వైనం
అసలే సాగు చేసి రుణాలు రాక.. రైతులు ఇక్కట్లు పడుతుంటే రుణమాఫీకి ఆధార్ ఇవ్వలేదు? పొలం ఎక్కువుంది, వివరాలు సరిపోలేదు.. జాబితాలో పేరు లేదంటూ యక్షప్రశ్నలేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ చేయకపోగా కొత్తగా రుణాలు బ్యాంకులు ఇవ్వకుండా వేధిస్తున్నాయని రైతన్నలు కతల చెందుతున్నారు.
రుణ ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటు: జిల్లా రైతు సంఘం
కార్యదర్శి,దుగ్గినేని గోపీనాథ్
బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటానికి ఈ ఏడాది రుణప్రణాళిక కూడా రూపొందించలేదు. జిల్లాలో 7 లక్షల మంది రైతులు న్నారు. రుణమాఫీ సాకుతో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు బయటి వడ్డీకి తెచ్చి అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా కాలయాపనచేస్తోంది.
7 లక్షల మంది రైతులకు రుణం హుళక్కే
Published Sat, Nov 29 2014 2:17 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement