ఆశల సాగుకు.. పెట్టుబడి కష్టాలు
► పంట పెట్టుబడి కోసం రైతన్నకు తప్పని తిప్పలు
► బ్యాంకు ద్వారా అందని రుణాలు
► వడ్డీ వ్యాపారుల వద్ద దొరకని అప్పులు
వేరుశనగ సీజన్ వచ్చేసింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ దఫా పంటకు పెట్టుబడి ఎట్టా అనే దిగులు రైతన్నను పట్టుకుంది. పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీవ్యాపారులను ఆశ్రయించినా ఫలితం శూన్యం. రైతు రుణమాఫీ నిధులు అంద క బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పెద్దనోట్ల రద్దుతో వడ్డీవ్యాపారులు అప్పులివ్వడం మానేశారు. దీంతో ఇళ్లలోని బంగారును తాకట్టు పెట్టి ఆశల సాగుకు రైతన్న సిద్ధం అవుతున్నాడు.
పలమనేరు: పలమనేరు మండలం పి.వడ్డూరుకు చెందిన ఈశ్వరయ్య అనే రైతు గతసీజన్‌లో ఎకరాపొలంలో వేరుశనగ సాగు చేశాడు. పంటసాగుకు రూ.20వేలు ఖర్చు అ యింది. పంట ఒబ్బిడి చేయగా ఎకరాపొలానికి ఐదు బస్తాలు పండింది. కాయలను ఎండబెడితే ఒకటిన్నర క్వింటాలయింది. వాటిని క్వింటాలుకు రూ.4 వేల ప్రకారం అమ్మగా రూ. 6 వేలు వచ్చింది. దీంతో రూ.16 వేలు నష్టం వచ్చి రైతు కష్టం నేలపాలైంది. జిల్లాలో ఏటా 1.36 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవుతుంది.
ఇందుకోసం లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల అవసరముంది. 30 వేల క్వింటాళ్ల విత్తనాలు ఉన్నా మిగిలిన 70 వేల క్వింటాళ్లను రైతులు కొనాల్సిందే. ప్రస్తుతం క్వింటాలు విత్తనాల ధరబహిరంగ మార్కెట్‌లో రూ. 6500 నుంచి 7 వేల దాకా ఉంది. ఈదఫా వేరుశనగ సాగుకోసం దాదాపు రూ. 400 కోట్ల పెట్టుబడి కావాల్సి ఉంది.
ఎకరా సాగు ఖర్చు రూ.20 వేలు..
ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు రైతులకయ్యే ఖర్చు రూ.20 వేలు. రెండుసార్లు పొలం దున్నేందుకు ట్రాక్టర్ అద్దె రూ.2 వేలు, విత్తనాలకు రూ.3 వేలు, విత్తడానికి మడక, నలుగురు కూలీలకు రూ.2 వేలు, కలుపుతీసేందుకు పది మంది కూలీలకు రోజుకు 200 లెక్కన రూ. 2000, ఒబ్బిళ్లకు మరో రూ.3 వేలు, ఎరువులకు రూ.4 వేలు మొత్తం ఖర్చులతో కలుపుకుని ఎకరాకు రూ.20 వేల దాకా రైతు పెట్టుబడి పెట్టాల్సిందే.
ఎకరాకు రూ.10 వేలు కూడా మిగలదు..
వర్షాలు బాగా కురిస్తే ఎకరాకు 15 బస్తాల(బస్తా 40 కిలోలు)తో ఆరు క్వింటాళ్ల పంట పండుతుంది. కానీ గత సీజన్‌లో ఎకరాకు 6 బస్తాలు(అంటే 240 కిలోలు, 2.4 క్వింటాళ్లు) మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు అప్పటి ధర ప్రకారం క్వింటాలు రూ.4 వేలతో ఎకరాకుS రూ. 10 వేలు వచ్చింది. పంట పెట్టుబడి రూ.20 వేలు అయితే చేతికి వచ్చింది మాత్రం రూ.10 వేలు కాగా పెట్టుబడిలోనే పదివేల నష్టం వచ్చింది.
అందని బ్యాంకు రుణాలు..
జిల్లాకు సంబంధించి గత ఖరీఫ్‌లో రూ.2,900 కోట్ల రుణాలను బ్యాంకు లక్ష్యంగా పెట్టుకోగా రైతులకు పంపిణీ చేసిన రుణాలు రూ.2,350 కోట్లు మాత్రమే. ఈ రబీకి రూ.1,885 కోట్ల రుణాల లక్ష్యం కాగా ఇంతవరకు రూ. 400 కోట్లను మాత్రమే పంపిణీ చేశారు. ఇవ్వాల్సిన రుణాలను సక్రమంగా బ్యాంకులు ఇవ్వడంలేదు. దీనికి ప్రధాన కారణం రైతు రుణమాఫీనే. చంద్రబాబు హామీతో ఇచ్చినా బ్యాంకులకు రైతు రుణమాఫీ నిధులు అందక రైతులకు కొత్త రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది.
అప్పులివ్వని వడ్డీ వ్యాపారులు..
పెద్దనోట్ల రద్దుతో రైతులకు వడ్డీ వ్యాపారులు అప్పులివ్వడం లేదు. నూటికి ఐదు రూపాయల వడ్డీ ఇస్తామన్నా అప్పులు పుట్టడం లేదు. దీంతో కొందరు రైతులు బంగారు నగలను తాకట్టు పెట్టి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాగుకు డబ్బుల్లేక ఇబ్బంది..
వేరుశనగ సాగు చేయాలంటే ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి కావాలి. మాకు ఐదెకరాల పొలం ఉంది. లక్ష రూపాయల పెట్టుబడి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకుల్లో రుణాలు రావడం లేదు. బయట వ్యాపారులు వడ్డీకి అప్పు ఇవ్వడం లేదు. అందుకే కొంతమేర సాగుచేసి మిగతా పోలం బీడు పెట్టాలనుకున్నా. -వెంకట్రామిరెడ్డి, రైతు, పలమనేరు