కొడుకు వెంటే తండ్రి | father and son suicide in husnabad | Sakshi
Sakshi News home page

కొడుకు వెంటే తండ్రి

Published Tue, Feb 27 2018 11:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

father and son suicide in husnabad - Sakshi

శంకరయ్య, రాజమౌళి మృతదేహాలు

సాగుకు చేసిన అప్పులు యమపాశాలయ్యాయి. వ్యవసాయాన్నే నమ్ముకుని బతికిన రైతు కుటుంబం చితికిపోయింది.  పంటలకు చేసిన అప్పులే ఆ కుటుంబాన్ని రోడ్డునపడేలా చేశాయి. భూమిని నమ్ముకొని పంటకు పెట్టుబడిగా పెట్టిన అప్పులు కుప్పలుగా మారడంతో మనోవేదనతో పత్తి రైతు రాజమౌళి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి శంకరయ్య సైతం ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ ఘటన సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌లో విషాదం నింపింది.    

సైదాపూర్‌(హుస్నాబాద్‌): అప్పుల బాధతో పత్తి రైతు రాజమౌళి ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు చనిపోయాడనే బెంగతో అతని తండ్రి శంకరయ్య ప్రాణాలు తీసుకున్న హృదయ విదారకర ఘటన మండలంలోని బొమ్మకల్‌లో జరిగింది. ఒకేరోజు తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబం రోడ్డునపడింది. మండలంలోని బొమ్మకల్‌కు చెందిన  గొల్లప ల్లి రాజమౌళి(42) తనకున్న రెండెకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. సాగునీటి కోసం బావి తవ్వినా, బోర్‌ వేసినా సాగునీరు లేక ఆశించినస్థాయిలో పంట ది గుబడి రాక అప్పులు పెరిగాయి. గతేడాది కూతురు వివాహం చేశాడు. దీంతో అప్పులు రూ.5లక్షలకు చే రాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం తో కొద్ది రోజులుగా మనోవేదనకు గురవుతున్నా డు. సోమవారం వేకువజామున వ్యవసాయబావి వద్దకు వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తెల్లవారి బావి వద్దకు వెళ్లగా ఉరివేసుకుని కనిపించాడు.

కొడుకు మృతిని తట్టుకోలేక..
సాగుకు చేసిన అప్పులు మీదపడడంతో మనోవేదనకు గురై కొడుకు ప్రాణాలు తీసుకుంటే.. అది భరించలేని తండ్రి సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తండ్రి గొల్లపల్లి శంకరయ్య(75) ఇంటి ఎదు రుగా చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. శంకరయ్య(75)కు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు బ్రహ్మచారి, రెండో కొడుకు శ్రీనివాసాచారి మంచిర్యాల జిల్లా మందమర్రిలో కార్పెంటర్‌లుగా పనిచేస్తున్నారు. చిన్నకుమారుడు రాజమౌళి బొమ్మకల్‌లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. శంకరయ్య భార్య ఐదేళ్ల క్రితం మృతిచెందింది. శంకరయ్యకు చూపు సరిగ్గా లేదు. కొడుకు రాజమౌళి మృతితో తనను సాదేవారు లేదనే మనోవేదనకు గురైన శంకరయ్య సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే రోజు తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఉదయం కొడుకు, సాయంత్రం తండ్రి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.  రైతు రాజమౌళి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement