కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సీపీఎం విజ్ఞప్తి చేసింది. రాష్ర్టంలో దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులున్నారని, ‘కౌలుదారుల చట్టం-2011’ ప్రకారం వీరికి రెవెన్యూ యంత్రాంగం గ్రామసభలు నిర్వహించి గత మే 15 లోగా గుర్తింపు కార్డులివ్వాల్సి ఉండగా అది సరిగ్గా అమలు కావడం లేదని తెలిపింది. కౌలురైతులకు రుణ అర్హత కార్డులివ్వాలని 2015 జూన్ 22న ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు రైతులకు కార్డులు అందలేదని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
ప్రభుత్వం 2015-16లో 231 కరువు మండలాలను ప్రకటించిందని, ఈ మండలాల్లో పంటనష్టపోయిన కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్రం రూ.791 కోట్ల పరిహారాన్ని రాష్ట్రానికి ఇచ్చినా, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వలేదన్నారు. కౌలు రైతులకు యుద్ధప్రాతిపదికన రుణ అర్హత కార్డులివ్వాలని, బ్యాంకుల ద్వారా రుణాలిచ్చి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను నియంత్రించాలని, రుణమాఫీ వర్తింపజేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు.