బ్యాంకు ముట్టడించిన కౌలు రైతులు
అచ్చంపేట :కౌలు రైతులు సోమవారం స్థానిక చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకును ముట్టడిం చారు. తక్షణమే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు లోపల భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్న భోజనాలు కూడా అక్కడే కానిచ్చారు. ఇన్‌చార్జి మేనేజర్‌హామీతో సాయంత్రం ఆరు గంటల తరువాత ఆందోళన విరమించారు.
బ్యాంకు జిల్లా మేనేజరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా కొత్తవారికి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కౌలు రైతుల సంఘ ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు ఆధ్వర్యంలో రైతులు ఉదయం బ్యాంకును ముట్టడించారు.
ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కనీసం 25 మందికైనా రుణాలు ఇవ్వనిదే ఇక్కడి నుంచి కదలబోమని పట్టుపట్టారు. మధ్యాహ్న భోజనాలు కూడా బ్యాంకులోనే చేశారు.
నాగబోయిన రంగారావు మాట్లాడుతూ కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు విముఖత చూపుతున్నార న్నారు. రుణాల కోసం ఈనెల 12న బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టామని, 15న జిల్లా మేనేజరు కౌలు రైతులను గుంటూరు పిలిపించుకుని ప్రస్తుతానికి 25మంది రైతులకు రుణాలిచ్చేందుకు ఒప్పుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆ తరువాత మిగిలిన కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారన్నారు.
ఆ హామీ మేరకు కౌలు రైతులు ఇక్కడి మేనేజరును రుణాలు కోరడం జరిగిందని, అయితే ఆయన తిరస్కరించడమే కాకుండా కౌలు రైతులను గొర్రెలతో పోల్చారని ఆరోపించారు. దాంతో బ్యాంకుని ముట్టడించాల్సి వచ్చిందన్నారు.
తక్షణమే కౌలు రైతులకు పాత బకాయిలతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామీణ బ్యాంకు ఇన్‌చార్జి మేనేజర్ రామారావు రోజుకు ఒక గ్రూపు వంతున 25 మందికి రుణాలు ఇస్తానని హామీ ఇవ్వడంతో కౌలు రైతులు సాయంత్రం 6.30 గంటలకు ధర్నా విరమించారు.+
ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు రైతుల సంఘ కార్యదర్శి బొట్లా రామకృష్ణ, సత్తెనపల్లి డివిజన్ రైతు సంఘ కార్యదర్శి ఆవుల ఆంజనేయులు, మండల కౌలు రైతు సంఘ అధ్యక్షుడు చినగాని రాజేష్, సీపీఎం నాయకుడు షేక్ హుస్సేన్, తాళ్లచెరువు, అచ్చంపేట, గ్రంధశిరి గ్రామాల కౌలు రైతులు పాల్గొన్నారు.