గుర్తింపే ప్రామాణికం!
కౌలు రైతులకూ రుణాలు
సంఘాల సభ్యుల గుర్తింపు పనిలో డీసీసీబీ
మార్చినెలాఖరు గడువు
గరిష్టంగా రూ.2 లక్షల రుణం
శ్రీకాకుళం : జిల్లాలో సుమారు 15 వేల మంది కౌలురైతులున్నారు. వీరికి ప్రభుత్వం పట్టా ఆధారంగా గుర్తింపుకార్డులు జారీ చేసింది. కార్డుల్లేని వారికీ మార్చిలోపు గుర్తింపు అందించాలని చాలాచోట్ల డిమాండ్ ఉంది. ఈ నేపథ్యం లో ఐదు నుంచి పది మంది వరకు సభ్యులు గా ఉండి డీసీసీబీ నుంచి గరిష్టంగా రూ.2 లక్షలు రుణం తీసుకోవచ్చు. ఇప్పటికే జిల్లా లో 277 మందికి రూ.27 లక్షల రుణాలిచ్చేం దుకు డీసీసీబీ నిశ్చయించింది. మిగ తా రైతులకూ మార్చిలోపు ప్రక్రియ పూర్తిచేయాలని భావి స్తోంది. ఇతర రైతుల మాదిరి వ్యవసాయ
రుణాల ప్రకారమే ఐదేళ్లలోపు రుణం తీర్చేలా నామమాత్రపు వడ్డీకే రుణం అందజేస్తామని బ్యాంకరు చెబుతున్నారు. స్థానిక తహశీల్దార్ అందజేసే కౌలు అర్హత పత్రం ఆధారంగా ఒక్కో గ్రూపులో ఉండే ఐదుగురు సభ్యులకు రూ.2 లక్షల రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
వ్యాపారానికీ రుణం వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారం చేస్తున్న రైతులకూ రుణం ఇచ్చేందుకు డీసీసీబీ నిర్ణయించింది. రైతులు తమ భూమిని తాకట్టు పెట్టడం ద్వారా స్వగ్రామంలో ఉన్న సంఘాల్లో రూ. 5 లక్షలు, జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ ద్వారా రూ.10 లక్షల వరకూ రుణం పొందొచ్చు. షార్ట్‌టర్మ్ లోన్‌గా పేర్కొనే ఈ రుణానికి రైతులు కనీసం మూడెకరాల భూమి కలిగి ఉండాలి. ఐదేళ్లలోపు రుణం తీర్చేందుకు 12 నుంచి 13 శాతం వడ్డీగా నిర్ణయించారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా గత జనవరి నుంచే ఇతర వ్యాపారాలకూ రైతులకు రుణాలందించే కార్యక్రమంలో డీసీసీబీలోనే ప్రారంభమైంది. మార్చిలోపు రూ.25 కోట్ల బడ్జెట్ నిల్వ చేస్తే అందులో ఇప్పటికే రూ.5.5 కోట్లు రుణాలిచ్చేశారు. జిల్లాలో సుమారు 2 లక్షల 20 వేల మంది రైతులు డీసీసీబీలో సభ్యత్వం పొందారు. వీరిలో 1.5 లక్షల మంది వివిధ రూపాల్లో బ్యాంకు నుంచి రుణం పొందారు. రిజర్వుబ్యాంకు అనుమతులకు లోబడే ఈ రుణాలిస్తున్నట్టు బ్యాంకు నిర్వహకులు చెబుతున్నారు.
రైతులు తమ సొంత ఇంటిపైనా గతంలో రూ.5 లక్షల రుణం పొందే సౌకర్యం ఉంటే ఇప్పుడు దానిని రూ.8 లక్షలు చేశారు. అయితే ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమిత ం చేశారు. వీటిపైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చెల్లింపులన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. రైతుల సౌలభ్యం కోసం మార్చి నెలాఖరుకు జిల్లాలో మూడు ఏటీఎం సెంటర్లు తెరవనున్నారు. నగదు డిపాజిట్లపైనా 9.2 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. ఇప్పటివరకూ జిల్లాలోని 49 సంఘాల ద్వారా సుమారు రూ.200 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేశారు. సొసైటీల నుంచి సుమారు రూ.14 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎన్‌పీఏ (నాన్ పెర్‌ఫార్మెన్స్ ఎసెట్స్)ల్నీ 5శాతం లోపుండేలా డీసీసీబీ జాగ్రత్తపడుతోంది. ఏటా సుమారు రూ.440 కోట్లు లావాదేవీలున్న డీసీసీబీ ఇతర ఇబ్బందులనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోందని, త్వరలో రైతులందరికీ ఉపయోగపడేలా రూపే కార్డులూ మంజూరు చేస్తామని బ్యాంకు సీఈవో దత్తి. సత్యనారాయణ స్పష్టం చేశారు.